WFTW Body: 

పరమగీతము 1:5లో "నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను" అని పెండ్లి కుమార్తె చెప్పుచున్నది. ఆమె ఆకర్షణీయముగా లేకున్నను వరుడు ఆమెను ఎంచుకొనెనని ఆమె అర్థము. దేవుడు బలవంతులను, గొప్ప ఇంటివారిని తెలివితేటలు గలవారిని ఏర్పరచుకోలేదు గాని ప్రధానంగా పేదవారిని, బుద్ధిహీనులను ఏర్పరచుకొనెనని బైబిలు చెప్పుచున్నది (1 కొరింథీ 1:26-29). మనలో కొంతమంది ఆవిధంగా అనుకోవచ్చు, నేను ఇతరుల వలే సామర్థ్యుడను కాను. నేను తెలివైన వాడనుకాను. నేను ఇతరుల వలే మాట్లాడలేను. నాకున్న శక్తిసామర్థ్యాలు పరిమితమైనవి. అయినప్పటికీ ప్రభువు మనలను ఏర్పరచుకొనెను. యెరూషలేములో అందగత్తెలుండిరి. కాని వరుడు ఈ నల్లనిదానిని ఎంచుకొనెను.

యేసు పైరూపమును, వరములను, సామర్థ్యములను చూడకుండా హృదయము యొక్క లక్షణాల కొరకు చూచును గనుక అలా చేయును. మనము ఇక్కడ ఒకటి నేర్చుకోవలెను. మనకున్న సహజ శక్తి సామర్థ్యాలు, కుటుంబ నేపథ్యము, మనము సాధించినవి దేవునికి నిజంగా విలువలేనివి. ఆయన భక్తిగల హృదయం కొరకు చూస్తున్నాడు. ఆయన దాసునిగా ఉండుటకు ఆయన ఎవరికొరకైనా వెదికినప్పుడు ఆయన వీటికొరకే చూచును.

ఆమె నల్లగా ఉండినను వరుని దృష్టిలో ఆమె సాందర్యవంతురాలని వధువు యెరిగియుండెను. వారి భర్తలు వారిని నిజంగా స్వీకరించారని వారిలో ఆనందించుచున్నారని భావించనందున అనేకమంది భార్యలు కష్టాలు పడతారు. నేను నా భార్యయందు ఆనందిస్తాను. మీలో భర్తలైన వారందరు అలా చేస్తారని నేనాశిస్తున్నాను. నీవు నీ భార్యయందు ఆనందిస్తున్నావని నీ భార్యకు తెలియుట చాలా ముఖ్యమైన విషయం. అదే విధముగా ప్రభువు వారియందు ఆనందించుచున్నాడని అనేకమంది విశ్వాసులకు తెలియదు. "నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును" అని జెఫన్యా 3:17 చెప్పుచున్నది. మనలను ఆయన పిల్లలుగా కలిగియుండటానికి దేవుడు ఆనందిస్తున్నాడు. మీకు ఆ విషయం తెలుసా? మనము మనుష్యుల దృష్టిలో అందవిహీనంగా ఉండవచ్చు కాని దేవుని దృష్టికి అందమైన వారిమిగా ఉన్నాము. మనము దీనిని స్పష్టంగా అర్థము చేసుకొనుట ప్రాముఖ్యము.

తెల్లని పట్టణపు స్త్రీలారా, నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకుడి (పరమగీతము 1:6). ఈమె సంస్కృతి లేని పల్లె అమ్మాయి. యెరూషలేముకు చెందిన పట్టణపు అమ్మాయిలు ఆమెను చిన్నచూపు చూచిరి. కాని వరుడు తెలివైన అందమైన పట్టణపు పిల్లలను పట్టించుకోకుండా ఆ గ్రామపు పిల్లను ఎంచుకొనెను. ప్రభువు మనలను కూడా అలాగే ఏర్పరచుకొనెను. దానిని బట్టి దేవునిని స్తుతించుడి. ఇతర విశ్వాసులు నిన్ను చిన్నచూపు చూస్తున్నారా? నిరుత్సాహపడకు ప్రభువు దృష్టిలో నీవు విలువైనవాడవు. మనము మురికిగా కుళ్లిపోయిన దశలో, రోడ్డుప్రక్కన నిస్సహాయముగా పడియున్న స్థితిలో దేవుడు మనలను ఎలా లేవనెత్తెనో యెహెజ్కేలు 16వ అధ్యాయము వర్ణిస్తుంది.

పరమగీతము 5:16లో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ఈ విధముగా వర్ణించుచున్నది, "అతడు అతికాంక్షణీయుడు. అతడే నా ప్రియుడు. అతడే నా స్నేహితుడు". యేసు నీ రక్షకుడే కాదు, నీ స్నేహితుడని కూడా నీవు చెప్పగలవా? ప్రభువైన యేసే అత్యంత సన్నిహిత మరియు ప్రియమైన స్నేహితునిగా ఉండనిమ్ము.