WFTW Body: 

పాత నిబంధనలో, "నీవు అబద్ధ ప్రమాణము చేయవద్దు, ప్రభువుకు నీవు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి", "నీ పొరుగువానికి వ్యతిరేకంగా అబద్ధ సాక్షం చెప్పవద్దు" అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఈనాటి కాలంలో చూస్తే ప్రమాణం అంటే ఏదో ఒక దాని మీద ఒట్టు పెట్టుకొని ప్రతిజ్ఞ చేయడం. ప్రజలు, బైబిలుపై చేయిపెట్టి నిజం చెప్తున్నామని అంటారు. నిజానికి వారు ఏం చెప్తున్నారంటే, "ఎక్కువ సమయం నేను అబద్ధాలే చెప్తాను కానీ ఇప్పుడు నేను నిజం చెప్పబోతున్నాను". బైబిలు మీద చేయి పెట్టి ఒట్టు పెట్టుకునే వ్యక్తి చేసే ప్రమాణానికి అర్థం ఇదే. అయితే అన్ని సమయాలలో కూడా నిజం మాట్లాడమని యాకోబు పత్రికలో మనకు చెప్పబడింది (యాకోబు 5:12). అదే విషయాన్ని యేసు ఇక్కడ చెప్పారు.

మత్తయి 5:33-37 యొక్క సారాంశం ఏమిటంటే మనం ఎప్పుడూ సత్యవంతులముగా ఉండాలి. మనం ఎప్పుడూ మాటలను చాతుర్యంగా, తెలివిగా, కపటంగా ఉపయోగించి, ఒక చట్టబద్ధమైన కోర్టులో చెప్తునట్లుగా నిజం మాట్లాడుతున్నామని చెప్పకూడదు. మనం సత్యవంతులముగా, దేనికోసమైనా అబద్ధం చెప్పని వారుగా తెలియబడాలి. మనం చెప్పే అవును ఖచ్చితంగా అవునుగా, కాదు ఖచ్చితంగా కాదుగా ఉండాలి. దీనికి మించినది ఏదైనా దుష్టత్వమే. నేను వక్రమైన మార్గంలో అవును అని చెప్పవలసి వస్తే, దానిలో ఏదో తప్పు ఉంది. అది చివరకు వేషధారణకు దారితీస్తుంది.

నిర్గమకాండం 20వ అధ్యాయంలోని పది ఆజ్ఞలను నీవు చదివినట్లయితే "అబద్దాలు చెప్పకూడదు" అనే ఆజ్ఞ లేదు. 9వ ఆజ్ఞ "నీవు నీ పొరుగు వాని మీద వ్యతిరేకంగా అబద్ధ సాక్షం చెప్పవద్దు" అని చెప్తుంది. అది చట్టబద్ధమైన కోర్టును సూచిస్తుంది, చట్టబద్ధమైన కోర్టులో నీవు అబద్ధం చెప్పకూడదు. ఇంకొక మాటలో చెప్పాలంటే నీవు ప్రమాణం చేసినట్లయితే నీవు ఖచ్చితంగా నిజం చెప్పాలి. అది పాత నిబంధనలోని ప్రామాణికం. ఎందుకంటే అబద్ధాలు చెప్పవద్దనే ఆజ్ఞను ఎవరూ కూడా నెరవేర్చలేరని దేవునికి తెలుసు. అదేవిధంగా పాత నిబంధనలో "కోపపడవద్దు" అనే ఆజ్ఞ కూడా లేదు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అటువంటి ఆజ్ఞను నెరవేర్చలేరని దేవునికి తెలుసు. ఆ రోజుల్లో ఉన్న ఆజ్ఞ ఏమిటంటే "నరహత్య చేయకూడదు". అదేవిధంగా పాత నిబంధనలో "స్త్రీని మోహపు చూపు చూడకూడదు" అనే ఆజ్ఞ లేదు. ఎందుకంటే ఎవ్వరు కూడా దానిని నెరవేర్చలేరని దేవునికి తెలుసు. అందుకే "నీవు వ్యభిచరించ వద్దు" అనే ఆజ్ఞ ఇవ్వబడింది.

అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో మనలోనికి పరిశుద్ధాత్మ వరం ప్రవేశించుట వలన అటువంటి జీవితమును జీవించుటను సాధ్యపరచింది. పరిశుద్ధాత్ముడు శక్తితో వచ్చినప్పుడు, ఒక బల్బుకు కాంతినిచ్చుటకు, ఒక ఫ్యాన్ తిప్పుటకు లేదా ఇతర పనిముట్లను నడిపించుటకు విద్యుత్ శక్తి వచ్చినట్లే ఆయన వస్తాడు. అప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తి లేకుండా చేయలేని పనులను మనం చేయగలము. ఇప్పుడు మోహపు చూపులను జయించడం సాధ్యమే, కోపాన్ని జయించడం సాధ్యమే, నీ భాగస్వామిపై అరచుటను ఆపివేయుట సాధ్యమే, అన్ని సమయాలలో సత్యం చెప్పడం సాధ్యమే, నీ అవును అవునుగానూ నీ కాదు కాదుగానూ ఉండుట సాధ్యమే.

ఒక సమకాలీన దృష్టాంతాన్ని మనము ఉపయోగిస్తే, ఒక చట్టబద్ధమైన కోర్టులో సాక్షుల ఎదుట ఒక కొనుగోలు పత్రంపై కానీ లేక వేరొక ఒప్పందపత్రంపై కానీ నీవు సంతకం చేసేముందు, దానిలో ఏముందో నువ్వు జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే సంతకం చేస్తావు. ఎందుకంటే అది చట్టబద్ధమైన కోర్టు ద్వారా అమలుచేయబడుతుందని నీకు తెలుసు. ఒక క్రైస్తవునికి అతని మాటే ఒక ఒప్పందపత్రం మీద సంతకం చేసిన దాంతో సమానం. నీ జీవితంలో అది నిజమని నీవు చెప్పగలవా?

నా జీవితంలో ఒకసారి నా ఇంటిలో ఉన్న వస్తువును వేరొకరికి అమ్ముటకు ఒప్పందం కుదుర్చుకున్న సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అది కొంత ఖరీదైన వస్తువు. మేము ఒక ధరకు ఒప్పుకున్నాము. అయితే అనేక నెలలు అతడు దాన్ని తీసుకోవడానికి రాలేదు. ఈ సమయంలో దాని విలువ పెరిగింది. అప్పుడు నేను, ‘ఇదిగో దీని విలువ పెరిగింది నీవు అప్పుడు దాన్ని తీసుకోలేదు’ అని చెప్పవచ్చు. నేను ఎటువంటి ఒప్పంద పత్రంపై సంతకం చేయకపోయినా ఆ ధరకే ఇస్తానని మాట ఇచ్చాను. అప్పుడు ప్రభువు నాతో ఈ విధంగా చెప్పాడు, "నీ అవును అవునుగా కాదు కాదుగా ఉండాలి". అతను కష్ట కాలంలో ఆదుకునే సహోదరుడు అతనికి నా మాటను నిలబెట్టుకొనుటకు ఇది కూడా మరొక కారణం. నేను, ‘నీవు దాన్ని మనం మాట్లాడుకున్న ధరకే తీసుకోవచ్చు’ అని చెప్పాను. అవును అతను ఎంతో సంతోషించాడు. నేనేం కోల్పోయాను? ఆర్థికంగా కొద్దిగా నష్టపోయుంటాను. అధిక ధరకు ఇవ్వడం ద్వారా ఇంకా కొన్ని వేల రూపాయలు నేను పొందేవాడని. కానీ నా అవును అవునుగా లేదు కాబట్టి ఒక చెడ్డ మనస్సాక్షిని కలిగి ఉండేవాడిని.

మనం నీతిమంతులుగా ఉండుటకు మరియు మన ప్రవర్తనలో క్రీస్తు వలే ఉండుటకు కొద్దిగా డబ్బును పోగొట్టుకోవడం సరైనదే. మన అవును అవునుగా మన కాదు కాదుగా ఉందో లేదో అని అనేకసార్లు మనం డబ్బు విషయంలో పరీక్షింపబడతాము.

మనల్ని ఇంకా ఉన్నతమైన వాటివైపు నడిపించే ముందు దేవుడు ఈ విషయంలో పరీక్షిస్తాడు. నా జీవితంలో అనేకసార్లు ఏదైనా పోగొట్టుకోవడం లేక ఏదైనా త్యాగం చేయవలసి వచ్చే పరిస్థితులలో దేవుడు అనేకసార్లు నన్ను పరీక్షించాడు. ఈ ఆజ్ఞలన్నిటిని బట్టి నేను జీవిస్తానా లేదా అని ఆయన నన్ను పరీక్షించాడు. అప్పుడే నిజంగా నేను వాటిని నమ్ముతున్నానా లేదా అనే విషయాన్ని కనుగొన్నాను. ఈనాడు నిజం చెప్పుటకు ఎటువంటి వెల చెల్లించనవసరం లేని అనేక సందర్భాలు ఉన్నాయి, వాటిలో ఎటువంటి పరీక్ష లేదు. అయితే ఉదాహరణగా, నిజం చెప్పడం వలన నీ ఉద్యోగమును నీవు కోల్పోయే అవకాశం ఉంటే నిన్ను ఉన్నతమైన పరిచర్యకు తీసుకొని వెళ్ళాలా లేదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులన్నిటిలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడని నేను నమ్ముతున్నాను. అనేకమంది యవ్వనస్తులు దేవుని యొక్క పరీక్షలో విఫలమయ్యారు.

దేవుడు ఎవరిని కూడా తన నమ్మకమైన సేవకునిగా ఉండమని బలవంతం చేయడు. నీవు నేను కూడా నమ్మకమైన తన సేవకులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, అయితే మనం నమ్మకస్తులుగా ఉంటామా లేదా, దేవుని వాక్య ప్రమాణాలను అనుసరిస్తామా లేక ప్రజలను సంతోష పెట్టుటకు ఆయన విషయంలో రాజీ పడతామా లేదా అనేదే నీవు ఒక నిజమైన దేవుని సేవకుడిగా అవుతావా లేదా అనేది నిర్ణయిస్తుంది.

ఉదాహరణగా ఒక సన్నివేశాన్ని ఆలోచించండి, నీవు ఒక ఆఫీసులో పని చేస్తున్నప్పుడు ఒక ఖరీదైన యంత్రం ఉంది, అనుకోకుండా నీవు దాన్ని తప్పుగా ఉపయోగించి పాడు చేశావు, నీవు చేయడం ఎవ్వరూ చూడలేదు. అనేకమంది ఆ యంత్రాన్ని వాడతారు, కొంత సమయం తర్వాత ఆ యంత్రం పనిచేయడం లేదని ఒకరు కనుక్కున్నప్పుడు అధికారులు దాన్ని దర్యాప్తు చేయుటకు వచ్చారు. అప్పుడు మీ యజమాని వచ్చి ఆ యంత్రాన్ని పాడు చేసింది ఎవరని అడిగాడు. నీవే అనే విషయం నీకు తెలుసు కానీ నీవు మౌనంగా ఉన్నావు ఎందుకంటే దాన్ని అనేకమంది వాడుతున్నారు కాబట్టి నీవే చేశావు అనే విషయాన్ని వారు కనుగొనలేరు. నీవు నోరు తెరవలేదు కాబట్టి నీవు అబద్ధం చెప్పలేదని నీవు ఊహించవచ్చు. కానీ నిజానికి, నీ నోరు తెరవకుండా నీవు అబద్ధం చెప్పావు. చివరిసారి ఆ యంత్రాన్ని ఉపయోగించింది నీవేనని ఏదో ఒక విధంగా పాడు చేసింది నీవే అని ఒప్పుకోకుండా నీ ఉద్యోగాన్ని నీవు కాపాడుకున్నావు. ఒకవేళ నీవు ఒప్పుకున్నట్లయితే అది ఖరీదైన యంత్రం కాబట్టి వారు నిన్ను ఉద్యోగంలో నుండి తొలగించి ఉండేవారేమో.

ఆ క్షణంలో ఏది ముఖ్యమైనది? సాతాను వచ్చి అబద్ధమే సర్వశక్తివంతమైనదని చెప్తాడు. నీవు ఒక అబద్ధం చెప్పినట్లయితే నీ ఉద్యోగాన్ని కాపాడుకొనగలవని చెప్తాడు. అదే సమయంలో అది ఒక అబద్ధం అని పరిశుద్ధాత్ముడు నీ హృదయానికి మెల్లగా చెప్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు కాదా? ఆ పరిస్థితుల్లో నీవు దేవునిపై విశ్వాసం ఉంచి నిజం చెప్పినట్లయితే నీ ఉద్యోగాన్ని నీవు కోల్పోవచ్చు. అయితే దేవుడు అంతకంటే శ్రేష్టమైన దానిని ఇస్తాడు. ఆ విశ్వాసము నీకుందా? అటువంటి పరిస్థితుల్లోనే మనం పరీక్షింపబడతాం.

నేనేదో ఒక సిద్ధాంతపరంగా దీన్ని చెప్పటం లేదు. అనేక విషయాలలో అనేకసార్లు దేవుడు ఈ విషయంలో నన్ను పరీక్షించాడు. ఆ పరిస్థితుల్లో తెలివిగా చాకచక్యంగా దాన్నుంచి ఏ విధంగా బయటపడతానని చూడడానికి కాదు, నేను నిజాయితీగా ఉంటానా, సత్యం చెప్పడానికి వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానా అనే విషయాన్ని పరీక్షించాడు.

ఈ విధంగానే ఆయన నన్ను అభిషేకించి ప్రసంగవేదికపై నుండి ఎటువంటి విలువ చెల్లించైనా సరే సత్యం మాట్లాడే పరిచర్యను నాకు అనుగ్రహించాడు. ఈనాడు క్రైస్తవ ప్రసంగవేదికలపై అనేకమంది దేవుని ప్రవక్తలను - ఎవరైతే సత్యం మాట్లాడుటకు ఎటువంటి వెల చెల్లించడానికైనా సిద్ధంగా ఉంటారో, ఎవరైతే బయటకి త్రోసివేయబడుటకు, తృణీకరించబడుటకు, అపార్థం చేసుకోబడుటకు, విమర్శింపబడుటకు, అబద్ధంగా నిందించబడుటకు సిద్ధంగా ఉంటారో వారిని దేవుడు కోరుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను. అటువంటి పరిచర్య కోసం నిన్ను సిద్ధం చేయుటకు రోజువారి సాధారణమైన పరిస్థితులలో నీ ఉద్యోగం కోల్పోయైనా సరే నీవు నిజం మాట్లాడతావా మరియు దానికి వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా లేదా, సత్యం కోసం నిలబడినందుకు నీవు డబ్బు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అనే విషయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం.