"నిన్ను అడుగువానికిమ్ము, నీ యొద్ద అప్పుతీసికొనగోరువానినుండి ముఖము తిప్పుకొనకుము" అని మనము మత్తయి 5:42లో చదువుతాము. కొన్నిసార్లు ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసినప్పుడు మనకు విషయాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి, కాబట్టి ఈ వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి దీనికి సమాంతరమైన మరొక లేఖన భాగాన్ని మనము చూడాలి. లూకా 6:34,35లో(సంక్షిప్త సారాంశం) "తిరిగి ఆశింపక అప్పు ఇయ్యుడి" అని యేసు సెలవిచ్చారు.
ఒకసారి ఒక సహోదరుడు నా యొద్దకు వచ్చి, తాను మరొక సహోదరునికి మూడు వేల రూపాయలు అప్పుగా ఇచ్చానని, అతడు తిరిగి ఇస్తానని చెప్పాడని, అయితే ఎంతో కాలం గడిచిపోయినా అతడు ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదని చెప్పాడు. అప్పుడు నేను ఆ సహోదరునితో, లేఖనాన్ని ఉల్లంఘించింది నీవే అని చెప్పాను, ఎందుకంటే "తిరిగి ఆశింపక (తిరిగి వస్తుందని నిరీక్షించకుండా) అప్పు ఇయ్యుడి" అని లేఖనము చెప్తుంది. మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా(లూకా 6:34). కానీ ఒక విశ్వాసిగా మీరు అప్పు ఇచ్చేటప్పుడు వేరుగా ఉండాలి — తిరిగి ఏమీ ఆశించకూడదు.
యేసుప్రభువు ఉద్దేశం ఏంటంటే — మీరు తిరిగి ఆశించకుండా ఒక బహుమతిగా దానిని వదిలివేయగలిగిన మొత్తాన్ని మాత్రమే మీరు అప్పుగా ఇవ్వాలి. అందుకే నేను ఆ సహోదరునితో, ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు నీవు అతనికి మూడు వేల రూపాయలు అప్పుగా ఇచ్చి ఉండకూడదు అని చెప్పాను. నీవు అతనితో ఇలా చెప్పి ఉండాల్సింది, "సహోదరుడా క్షమించు, నేను నీకు మూడు వేల రూపాయలు ఇచ్చే పరిస్థితిలో లేను, కానీ ఒక ఐదువందల రూపాయలు ఇవ్వగలను". మరో మాటలో చెప్పాలంటే, ఆ డబ్బు తిరిగి రాకపోయినా నీవు మనశ్శాంతిగా ఉండగలిగినంత మొత్తాన్ని మాత్రమే అప్పుగా ఇవ్వాలి. అతడు తిరిగి ఇవ్వకపోతే దాన్ని ఒక కానుకగా ఎంచి అంతటితో మర్చిపోవాలి! కానీ నీవు అలా చేయకపోతే, నీవు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించినట్లే. ఈ విషయాలలో ఉన్న ఆత్మను (ఆంతర్యాన్ని) మనము గ్రహించాలి.
"నీ యొద్ద అప్పుతీసికొనగోరువానినుండి ముఖము తిప్పుకొనకుము" అని యేసుప్రభువు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి? నేను యౌవన క్రైస్తవుడిగా, నావికాదళంలో అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఎంతో ఎక్కువ జీతం సంపాదించేవాడిని (నా అవసరాల కంటే ఎంతో ఎక్కువ) మరియు నా దగ్గర ధారాళంగా డబ్బు ఉండేది. నాకంటే పేదవాడైన ఒక సహోదరుడు ఆ సంగతి తెలుసుకుని, నా యొద్దకు వచ్చి అప్పుగా డబ్బు అడిగేవాడు. ఒక నెలలో తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తీసుకునేవాడు. మరుసటి నెల రాగానే అతడు మళ్లీ నా యొద్దకు వచ్చి, తాను అప్పు తీర్చలేకపోతున్నానని చెప్పి మరికొంత డబ్బు అడిగేవాడు, నేను అతనికి మరికొంత ఇచ్చేవాడిని. "నీ యొద్ద అప్పుతీసికొనగోరువానినుండి ముఖము తిప్పుకొనకుము" అనే వచనం నా మనస్సులో ఉండేది, దాంతో నేనెన్నో నెలల పాటు అతనికి డబ్బు ఇస్తూనే వచ్చాను. దేవుని వాక్యానికి లోబడుతున్నాననే భావనతో నేను మౌనంగా ఉండిపోయాను. నేను అప్పుడే బాప్తిస్మము పొందిన యౌవన క్రైస్తవుడిని, నాకు తెలిసినంతవరకు దేవుని వాక్యము చెప్పినట్లే చేశాను. కానీ కొంతకాలం తర్వాత ఈ డబ్బు తీసుకున్న వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోయి, మధ్యపానానికి మరియు ఇతర చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆ సంగతి నేను విన్నప్పుడు, దేవుని రాజ్యము కొరకు ఉపయోగించాల్సిన ఈ డబ్బును నీవు తాగుడుకు, సాతాను రాజ్యానికి ఖర్చు పెడుతున్నట్లయితే ఆ సొమ్మును వెంటనే నాకు తిరిగి ఇచ్చేయడం మంచిదని అతనికి ఉత్తరం రాశాను. దానికి అతడు నాపై ఎంతో కోపపడి, మృతమైన నామకార్థ సంఘాలవారు కూడా నీలాగా డబ్బులు వెనక్కి అడగరని అన్నాడు.
అప్పుడు ప్రభువు ఆ విషయాన్ని వదిలేయమని నాతో చెప్పారు. నేను మళ్లీ అతనికి ఉత్తరం రాయలేదు, నా డబ్బు కూడా నాకు తిరిగి రాలేదు. నేను, "ప్రభువా, నేను చేసిన తప్పేంటి? ‘నీ యొద్ద అప్పుతీసికొనగోరువానినుండి ముఖము తిప్పుకొనకుము’ అని నీ వాక్యములో ఉన్నట్లే నేను లోబడ్డాను కదా" అని అనుకున్నాను. అప్పుడు ప్రభువు నాకు ఒక పాఠాన్ని నేర్పించారు, అది గడిచిన ఈ 50 సంవత్సరాలుగా నాకు ఎంతో సహాయపడింది. అదేంటంటే — మనము ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూడాలి. ఆ డబ్బు నా సొంతమైనట్లు నేను ప్రవర్తించానని ప్రభువు నాకు చూపించారు. నిన్ను అడిగిన వానికి అప్పు ఇవ్వాలని ఒక లేఖనము చెబుతోంది, కానీ నాకున్నదేదీ నా సొంతం కాదని, భూమిపై ఉన్న సమస్తము ప్రభువుదేనని మరొక లేఖనము చెబుతోంది. "భూమియు దాని సంపూర్ణతయు ప్రభువువే" (1 కొరింథీ 10:26). కాబట్టి నాది అనుకుంటున్న జీతం నాకు వచ్చినప్పుడు, అది నాది కాదని నేను గ్రహించాలి; దాన్ని వదిలేయాలి. దాన్ని ప్రభువుకే అప్పగించాలి. నెల మొదటి తారీఖున నా జీతం వచ్చి నా బ్యాంకు ఖాతాలో పడినప్పటికీ, అది నా డబ్బు కాదు, అది దేవుని డబ్బు అని నేను ఒప్పుకోవాలి.
ఆ సమయంలో నేను ఆలోచించిన ఒక ఉపమానం ఏంటంటే: ఒకవేళ ఎవరైనా దాచిపెట్టమని నాకు ఒక 5000 రూపాయలు ఇచ్చి, ఆ తర్వాత వచ్చి తీసుకుంటానని చెప్పారనుకోండి. ఆ సమయంలో మరొక వ్యక్తి నా యొద్దకు వచ్చి, నా దగ్గర 5000 రూపాయలు ఉన్నట్లు తను విన్నానని చెప్పి, ఒక 3000 రూపాయలు అప్పుగా ఇవ్వమని అడిగితే నేను ఏమి చెబుతాను? నేను అతనితో, "సహోదరుడా క్షమించు, అది నా డబ్బు కాదు, అది వేరొకరిది. వారు దాన్ని నా దగ్గర భద్రపరచమని మాత్రమే ఇచ్చారు. నేను వారిని అడుగుతాను, నీకు ఇవ్వడానికి వారు అంగీకరిస్తే అప్పుడు నీకు ఇస్తాను" అని అంటాను కదా. అది నా డబ్బు కానప్పుడు, ఆ పరిస్థితిని సక్రమంగా నిర్వహించే విధానం ఇదే కదా? నా జీతాన్ని ప్రభువు డబ్బుగా నేను ఎంచి ఉంటే, అంత తేలికగా దాన్ని ఇతరులకు ఇచ్చి ఉండేవాడిని కాదు. ఆ సహోదరుడు నా యొద్దకు అప్పు కోసం వచ్చినప్పుడు, నేను అతనితో, "సరే, అవసరంలో ఉన్నవారికి అప్పు ఇవ్వడం మంచిదే, కానీ ఈ సొమ్ము ఎవరిదో (ఈ సందర్భంలో ప్రభువుది) ఆయనను అడిగి వస్తాను" అని చెప్పి ఉండేవాడిని. నేను దాన్ని ప్రభువు దగ్గరకు తీసుకెళ్లి, "ప్రభువా, ఈ వ్యక్తికి నేను ఈ డబ్బు ఇవ్వాలని నీవు కోరుకుంటున్నావా?" అని అడిగి ఉండేవాడిని. అప్పుడు ప్రభువు అవుననో లేదా కాదనో చెప్పేవారు.
దేవుడు మాట్లాడే దేవుడు; ఆయన జీవముగల దేవుడు. బహుశా మొదటిసారి ఆయన ఇవ్వమని చెప్పవచ్చు, రెండవసారి ఇవ్వవద్దని చెప్పవచ్చు, కానీ నేను ఆయన మాట వినడానికి వేచియుండలేదు. నేను కేవలం అక్షరానుసారమైన చట్టమును బట్టి నడుచుకుని బంధకంలో పడ్డాను. కానీ దేవుని వాక్యానికి ఎలా లోబడాలి అనే విషయంలో -"అని వ్రాయబడియున్నది" మరియు "ఇలా కూడా వ్రాయబడియున్నది" అనే పాఠాన్ని నా జీవితం ప్రారంభంలోనే నేర్చుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. సరిగ్గా అర్థం చేసుకోవాలంటే లేఖనాన్ని మరొక లేఖనంతో సమతుల్యం చేయాలి. వాక్యములో ఉన్నట్లే ఈ రోజు నన్ను అడిగే ప్రతి ఒక్కరికీ అప్పు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకున్న సమస్తము ప్రభువుదేనని గుర్తించాలనుకుంటున్నాను, కాబట్టి ప్రభువును అడగకుండా నేను దేనినీ ఇవ్వలేను. ఆ తర్వాత ఎవరైనా వచ్చి నా దగ్గర డబ్బు అడిగినప్పుడు నేను అనుసరించిన విధానం ఇదే. ఇప్పుడు నేను వారితో, "నేను ప్రభువు చిత్తాన్ని వెదకనివ్వు; నా ఆత్మలో నాకు స్వతంత్రత ఉంటే నీకు ఇస్తాను" అని చెబుతాను. కొన్నిసార్లు నేను ఇచ్చాను, అది నాకు తిరిగి రాలేదు; మరికొన్నిసార్లు ఇవ్వడానికి ప్రభువు నాకు మనస్సులో స్వతంత్రత ఇవ్వనందున నేను ఇవ్వలేదు, కానీ నా హృదయమైతే సిద్ధంగానే ఉంది.
యేసుప్రభువు వీటన్నిటినీ ఏ ఆత్మతో మాట్లాడారన్న విషయాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలనుటకు ఇదొక ఉదాహరణ. ప్రజలు మనల్ని కాళ్ళు తుడుచుకొనే చాపలా వాడుకోవడానికి మనము అనుమతిస్తున్నామని దీని అర్థం కాదు. మనము ఎవరిపైనా పగ తీర్చుకోకూడదు, మనకు హాని చేసిన వారికి ప్రతిహాని చేయకూడదు అనేదే దీని యొక్క ప్రాథమిక సూత్రం.