వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట అన్వేషకుడు
WFTW Body: 

యాకోబు 4:2 చివరి భాగంలో మనము ఇలా చదువుతాము: "మీరు అడగనందున మీకు ఏమియు దొరుకుట లేదు". దేవుడు తన బిడ్డలైన క్రైస్తవులకు ఎన్నో ఇవ్వాలని ఆశిస్తున్నాడు, కానీ వారు అడగకపోవడం వలన వాటిని పొందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆత్మీయ ఆశీర్వాదాల విషయంలో ఇది ఎంతో నిజం. లూకా 11:13లోని వచనాన్ని చూడండి: "పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును". మనలను పరిశుద్ధపరిచే పరిశుద్ధాత్మ కొరకు మనకు ఆశ లేకపోతే, యేసు చూపించిన పరిపూర్ణమైన ప్రమాణాల ప్రకారం జీవించే శక్తి మనకు ఎన్నటికీ రాదు. అందుకే యేసు మత్తయి 7:7లో, "అడుగుడి మీకియ్యబడును" అని స్పష్టంగా సెలవిచ్చారు.

మనం అడిగేంతవరకు దేవుడు ఎందుకు వేచి ఉంటాడు? ఎందుకంటే ఆయన మనకు ఇచ్చే వాటిని మనం విలువైనవిగా ఎంచాలని ఆయన ఆశిస్తున్నాడు. మనం అడగకుండానే ఆయన ఇచ్చే వాటిని సాధారణంగా మనం అంతగా అభినందించము, వాటికి విలువ ఇవ్వము. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పాప క్షమాపణ. దానిని మీరు దేవుణ్ణి అడగడం ద్వారానే కదా పొందుకున్నారు? మీరు అడగకపోతే అది మీకు దొరికేదా? మీరు అడగకుండా రక్షణను పొందుకునేవారా? ఈ భూమిపై లక్షలాది మంది ప్రజలు ఇంకా రక్షించబడకపోవడానికి కారణం, వారు దేవుణ్ణి అడగకపోవడమే. తమకు ఆ రక్షణ అవసరమనే విషయాన్ని ఒప్పుకోవడానికి వారు తమ్మును తాము తగ్గించుకోరు.

దేవుని యొక్క అత్యున్నతమైన ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఇంకా ఏ ఇతర అర్హతలు కలిగి ఉండాలి? అన్నిటికంటే మొదటిగా, వాటి పట్ల మనకు ఒక తీవ్రమైన ఆశ, తృష్ణ (దాహం) ఉండాలి. ఆ తర్వాత, మనం విశ్వాసంతో అడగాలి. ‘అడగడం’ అనేది ఆ ఆశను తెలియజేస్తుంది; యేసుప్రభువు కొన్ని వచనాల తర్వాత మత్తయి 7:11లో విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఇలా చెప్పారు: "మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును".

మీరు అడగకపోతే, పొందరు. వెదికితే, కనుగొంటారు. మీరు సత్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటే, దాని కొరకు వెదకాలి. దేవుని వాక్యంలో ఎన్నో దాచబడిన నిధులు ఉన్నాయి. ఉపరితలంపై (పైపైన) కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని ఎవరైనా గ్రహించవచ్చు; కానీ దాని లోతైన నిధులు అంతరంగంలో దాగి ఉన్నాయి, వాటి కోసం మీరు వెదకాలి. ఈ భూమి గురించి ఆలోచించండి. ఉపరితలంపై మామిడి పండ్లు, కొబ్బరికాయలు మరియు మరెన్నో మంచి ఫలాల వంటి ఎన్నో విలువైన వస్తువులు లభిస్తాయి, కానీ బంగారం, వజ్రాల వంటి అత్యంత ఖరీదైన సంపదలు కావాలంటే, మీరు భూమిలోకి వేల అడుగుల లోతుకు తవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా, బైబిలును పైపైన చదివితే కొన్ని విషయాలు మనకు లభిస్తాయి, ఉదాహరణకు, క్రీస్తు మన కొరకు మరణించారు గనుక మన పాపాలు ఎలా క్షమించబడతాయి అనేది తెలుస్తుంది. అయితే లేఖనాల యొక్క అత్యంత లోతైన సత్యాలను మీరు కనుగొనాలనుకుంటే - ఆత్మపూర్ణులైన జీవితాన్ని ఎలా జీవించాలి, దైవస్వభావంలో ఎలా పాలివారు కావాలి, సమస్త పాపమును ఎలా జయించాలి, కోపము, చేదుస్వభావం, క్షమించలేక పోవడం, అసూయ, మోహపు ఆలోచనలను ఎలా జయించాలి అనేవి తెలుసుకోవాలంటే మీరు లోతుగా తవ్వాలి. ఒక వ్యక్తి లోతుగా తవ్వకపోతే, అతనికి నిజంగా ఆసక్తి లేదని దేవుడు చూస్తాడు. "అడుగుడి మీకియ్యబడును. పూర్ణహృదయంతో వెదకండి, అప్పుడు మీకు దొరుకును".

యిర్మీయా 29:13లో మనం ఒక అద్భుతమైన వాగ్దానం కనుగొంటాము: "మీరు మీ పూర్ణహృదయముతో నన్ను వెదకినయెడల నన్ను కనుగొందురు". ఒక వ్యక్తి దేవుణ్ణి మరియు ఆయనలో ఉన్న ఐశ్వర్యాన్ని కనుగొనలేకపోయాడంటే, ఆ వ్యక్తి దేవుణ్ణి తన పూర్ణహృదయంతో వెదకలేదని నేను నిస్సందేహంగా చెప్పగలను. అతను అరకొర హృదయంతో వెదికాడు, వాక్యంలో అరకొర హృదయం గలవారికి ఎలాంటి వాగ్దానాలు లేవు. ముప్పావు హృదయంతో వెదికేవారికి కూడా ఎటువంటి వాగ్దానాలు లేవు, కానీ సంపూర్ణ హృదయంతో వెదికేవారి కొరకు అత్యధికమైన వాగ్దానాలు ఉన్నాయి. మీరు దేవునికి చాలా దగ్గరగా ఉండవచ్చు; మీరు 90% దేవునికి సమర్పించుకున్నా, దేవునికి 10% మాత్రమే ఇచ్చిన వ్యక్తి కంటే ఎక్కువగా ఏమీ పొందలేకపోవచ్చు. కానీ, మీరు దేవునికి 100% అప్పగించుకున్నప్పుడు, మీరు సమస్తాన్ని పొందుకొంటారు. మీరు 90% ఇచ్చినప్పటికీ మీరు కూడా ఆ 10% ఇచ్చిన వ్యక్తి వర్గంలోనే ఉంటారు. ఈ సత్యాన్ని క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. మీరు 10% హృదయంతో దేవుణ్ణి వెదకితే, మీరు ఆయనను కనుగొనలేరు. మీరు 90% హృదయంతో దేవుణ్ణి వెదకినా సరే మీరు ఆయనను కనుగొనలేరు. మీ పూర్ణహృదయంతో దేవుణ్ణి వెదకినప్పుడే మీరు ఆయనను కనుగొంటారు.

వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇవి దేవుని వాగ్దానాలు. దేవుడు తన వాగ్దానాలను ఎన్నడూ మీరడు. "అడుగు ప్రతివాడును పొందును". మరి మీరు ఎందుకు పొందుకోలేదు? స్పష్టంగా, దేవుడు కోరుకున్న రీతిలో మీరు అడగడం లేదు. "వెదకు ప్రతివానికి దొరకును". బహుశా దేవుడు ఆశించినట్లుగా మీరు వెదకడం లేదేమో. "తట్టు ప్రతివానికి తీయబడును". బహుశా మీరు తగినంతగా తట్టడం లేదేమో.

క్రైస్తవులు కేవలం దేవుణ్ణి అడగకపోవడం వల్లే ఎన్నో విషయాలను, ఆశీర్వాదాలను కోల్పోతున్నారు. యాకోబు 4:2 చివరిలో ఉన్న ఈ చిన్న వాక్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: "దేవుడు మీకు ఇవ్వాలని ఆశించే దేనినైనా మీరు కలిగిలేకపోవడానికి కారణం, మీరు అడగకపోవడమే" (స్వేచ్ఛానువాదం).