వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

మనము బాప్తీస్మము తీసుకొనినప్పుడు, మనకు బాప్తీస్మము ఇచ్చే వ్యక్తి మనలను కేవలము నీటిలో ముంచుటయే కాక నీటిలోనుండి పైకి లేపునని నమ్ముదుము. మన జీవితములోని అన్ని పరిస్థితులలో ఈ విధముగా మనము విశ్వాసముంచాలి. మన స్వజీవమును ఉపేక్షించుకోవసిన పరిస్థితిగాని లేక ఇతరులచేత మనము సిలువవేయబడే పరిస్థితిగాని ఆయన అనుమతించినప్పుడు వీటన్నిటి వెనుక దేవుడే ఉన్నాడని మనము చూడగలగాలి.

శుద్ధహృదయము గలవారు దేవునినే గాని మానవ పరిస్థితులను చూడరని ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 5:8). మనము సిలువవేసే వారిని మాత్రమే మనము చూచుచున్నయెడల, మనము శుద్ధ హృదయము కలిగిలేమని అది మనకు చూపించుచున్నది. అప్పుడు వారికి వ్యతిరేకముగా మనకు ఫిర్యాదులు ఉండును.

కాని మనము శుద్ధ హృదయము కలిగియున్నయెడల, దేవునిని మాత్రమే చూచెదము. గనుక నీటి బాప్తీస్మములో వలె మనలను మరణములోనికి ముంచబడుటకు అనుమతించిన దేవుడు పైకి లేపునని నమ్ముదుము. "మనమాయనతో కూడా చనిపోయినవారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము" (2 తిమోతి 2:11). అప్పుడు మనము దేవునిలో ఉన్న నమ్మకము ద్వారా విశ్వాసముచేత చనిపోయెదము. అప్పుడు మనము మహిమకరమైన పునరుత్థానజీవితములో ప్రవేశించుదము. లేనట్లయితే ఇదివరకు జీవించినట్లే ఆదామువలె ఎల్లప్పుడు ఓడిపోయెదము. మన స్వజీవమునకు చనిపోవుటకు తిరస్కరించినయెడల, అది మనలో దేవునియెడల నమ్మకముగాని విశ్వాసముగాని లేదని రుజువుపరచుచున్నది.

విశ్వాసమున్న వ్యక్తి ద్విమనస్కుడై యుండడని యాకోబు 1:6-8లో చదివెదము. అటువంటి వ్యక్తిలో దేవున్ని సంతోషపెట్టి మరియు ఆయనను మహిమపరచవలెనని ఒకేఒక గురి కలిగియుండును. అటువంటి వ్యక్తి మాత్రమే విశ్వాసమూలముగా జీవించును. ఎందుకనగా అదృశ్యమైనవి నిత్యమైనవని అతడు గుర్తించును. అనగా దేవునివాక్యము చెప్పేదానిని అతడు విశ్వసించును.

వారు నరకానికి వెళ్ళకుండునట్లు అనేకమంది విశ్వాసులు ప్రభువైనయేసును విశ్వసించెదరు. కాని వారు విశ్వాసమూలముగా జీవించరు. దేవుని వాక్యము సత్యమైయున్నదని వారు ఒప్పించబడరు. వారి జీవితములలో చేసిన వాటన్నింటిని మరియు వారు చేయుచున్నవాటన్నింటిని గురించి దేవునికి లెక్కచెప్పవలసివుందని వారు విశ్వసించరు. తమ్మునుతాము సంతోషపెట్టుకొనుటకును, లోకములోని సుఖభోగములను అనుభవించుటకును మరియు ధనాపేక్షతో డబ్బు సంపాదించుటకును జీవించినయెడల ఈ లోకమును విడిచి నిత్యత్వములోనికి వెళ్ళిన తరువాత చింతించవలసియుండునని వారు నమ్మరు.

ధనవంతుడు చనిపోయినవెంటనే నరకానికి వెళ్ళి చింతించెను మరియు తాను చేసిన పొరపాటు అనగా ప్రతిరోజు మారుమనస్సు పొందకపోవుట గురించి సహోదరులకు ఎవరైనను వెళ్ళిచెప్పవలెనని అతడు కోరెను (లూకా 16:28,30). ఈ భూమిమీద మనమందరము కొద్దికాలమే ఉండెదము మరియు మనము జంతువులవలె కేవలము ఈ లోకముకొరకు మాత్రమే జీవించెదమా లేక మంచితనము, ప్రేమ, పవిత్రత మరియు దీనత్వము మొదలగువాటిని కలిగి నిత్యమైన విలువైన వాటికొరకు జీవించుచున్నామా అని దేవునిచేత పరీక్షించబడుచున్నాము.

నిత్యత్వపువిలువగల వాటికొరకు జీవించుటకు దేవుడు మీకు కృపనిచ్చును గాక.