క్రీస్తుశరీరమే నిజమైన సంఘము, కేవలము విశ్వాసులు ప్రతివారము కలుసుకొనుట కాదు. కాబట్టి మనము నిర్మించేది ఒక శరీరమా లేక మతానుసారమైన సమూహమా అనుదానిని నిశ్చయపరచుకోవాలి. ఎవరైనా ఒక మత గుంపును ఏర్పరచగలరు. క్రీస్తు శరీరమనే సంఘమును నిర్మించుటకు మనకు దేవుని నుండి కృప మరియు అభిషేకము కావాలి. దానికొరకు మనలను మనము ఉపేక్షించుకొనుచు, ప్రతి దినము చనిపోవుచు మరియు పరిశుద్ధాత్మతో నింపబడుచుండవలెను.
పాత నిబంధనలోని ఇశ్రాయేలీయులు ఒక సమాజమే గాని ఒక శరీరము కాదు. ఈనాడు అనేక పెద్ద సంఘములు కూడా సమాజములే గాని శరీరములు కాదు. కొన్ని ఇంట్లో కూడుకునే చిన్న సంఘములు శరీరముగా ఉండక క్లబ్‍గా ఉండుటవలన కొంత శ్రేష్టముగా ఉంటున్నారు. కాని యేసు తన శరీరమును నిర్మించుచున్నారు.
క్రీస్తు యొక్క మొదటి శరీరమును మనుష్యులు చూచారు, ఆయన పశువుల పాకలో పరుండ బెట్టబడ్డాడు. అవమానకరమైన అటువంటి జన్మద్వారా కాపరులు క్రీస్తు యొక్క శరీరమును కనుగొనగలరని సూచనగా వారికి ఇవ్వబడింది (లూకా 2:12). కలువరి సిలువలో చివరిగా క్రీస్తుయొక్క శరీరము సిలువవేయబడుట ద్వారా నిందించబడియున్నాడు. పుట్టినప్పుటి నుండి మరణించేవరకు లోకస్థుల ద్వారా మరియు మతస్థుల ద్వారా క్రీస్తు యొక్క శరీరము నిందించబడియున్నది.
ఈనాడు కూడా క్రీస్తుయొక్క నిజమైన శరీరముగా ఉన్న సంఘము లోకమునుండియు మరియు బబులోను క్రైస్తవ్యమునుండియు నిందించబడతారు. మనయొక్క స్థానిక సంఘము క్రీస్తు యొక్క నిందను భరించే సంఘముగా లేనట్లయితే దానికి కారణము బహూశా మనము రాజీపడె వారిగా తయారయ్యాము మరియు మనము ’బబులోను అను శిబిరము బయటకు’ వెళ్ళలేదు (హెబ్రీ 13:13). క్రీస్తు యొక్క నిందను భరించుటకును మరియు మన యొక్క పాపమును బట్టిగాని లేక బుద్ధిహీనతను బట్టిగాని లేక నులువెచ్చని స్థితినిబట్టిగాని నిందించబడుటకును చాలా తేడా ఉన్నది. కాబట్టి మనము పొరపాటు పడకూడదు.
"మనమతని చూచి అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. ఆయన తృణీకరింపబడిన వాడును మరియు మనుష్యులచేత విసర్జింపబడినవాడును ఆయెను" (యెషయా 53:2,3) అని యేసును గూర్చి వ్రాయబడింది. ఆయన కృపాసత్య సంపూర్ణుడైయుండి తన అంతరంగ జీవితములో మహిమను కలిగియున్నాడు. ఇది అనేకమందికి మరుగుచేయబడింది (యోహాను 1:14). మన స్థానిక సంఘములు కూడా లోకమునకు గాని బబులోను క్రైస్తవ్యమునకు గాని ఆకర్షణగా ఉండకూడదు. దైవభక్తిగల జీవితము కొరకు ఆసక్తి కలిగి మన సంఘములోనికి వచ్చువారికి మాత్రమే అది ఆకర్షణగా ఉండాలి. ప్రత్యక్ష గుడారములో లోపల ఉన్న తెరలు అందముగా ఉండెడివి. కాని బయట ముదురు గోధుమరంగులో మురికితో దుమ్ముతో ఉన్నటువంటి గొఱ్ఱెల చర్మముతో కప్పబడింది. దాని అందమంతయు లోపల ఉన్న తెరలో ఉన్నది. క్రీస్తు యొక్క పెళ్ళికుమారై కూడా "అంతరంగ జీవితములో మహిమగలదై ఉండును"(కీర్తన 45:13). దాని మహిమంతటి మీద పందిరి ఉంటుంది (నింద) (యెషయా 4:6).
ఈ విషయములో సంఘపెద్దలు గొప్ప బాధ్యత కలిగియున్నారు. వారు సంఘమును నడిపించిన విధానమును బట్టి అది మనుష్యులమెప్పును పొందని యేసువలెగాని లేక లోకము చేత ఘనపరచబడి కొనియాడబడే దానిగాను ఉండవచ్చును. మనము లోకమునుండియు లేక శరీరానుసారమైన క్రైస్తవ్యమునుండి మెప్పును లేక ఘనతను కోరినయెడల మనము బబులోనును నిర్మించెదము. మనము పేరు ప్రతిష్టలు పొంది మరియు క్రైస్తవులందరిచేత అంగీకరించబడుటకు కోరినయెడల మనము యేసు యొక్క అడుగుజాడలను పూర్తిగా పోగొట్టుకొని ఉన్నామని నిశ్చయపరచుకోవచ్చును.
యేసు ఇట్లన్నాడు, "నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి" (మత్తయి 5:11,12). 20 శతాబ్దముల క్రితము యేసు బాలుడుగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మొదటి శరీరమును చంపవలెనని హేరోదు మరియు అతని సైనికులు కోరియున్నారు. ఈనాడు కూడా చాలా ప్రదేశములలో క్రీస్తుయొక్క శరీరము ఆరంభించబడకుండునట్లు దానిని నాశనము చేయవలెనని అనేకులు కోరుచున్నారు. దేవుని స్వరమును వినుటలో సున్నితముగా ఉండి, దానికి వెంటనే లోబడుట ద్వారా యేసు యొక్క శరీరమును యోసేపు కాపాడాడు (మత్తయి 2:13-15). క్రీస్తు యొక్క సంఘములో బాధ్యత కలిగిన మనము కూడా యోసేపు వలె ఉండవలెను. పరిశుద్ధాత్ముడు మనతో చెప్పేదానిని వినువారమై యుండి, దానికి వెంటనే లోబడాలి. మనము దానిని విని లోబడని యెడల క్రీస్తు యొక్క శరీరమైయున్న సంఘము ఏదొక విషయములో నష్టపోవును. అంత్యదినమందు దానికి భాధ్యత మనమే వహించవలెను. మనకు అప్పగింపబడిన వారందరి విషయములో దేవునికి లెక్క అప్పజెప్పవలెను గనుక మనము ఈ బాధ్యతను తీవ్రముగా తీసుకొనవలెను (హెబ్రీ 13:17).