WFTW Body: 

దేవునిని మన తండ్రిగాను మరియు ప్రభువైనయేసుక్రీస్తును మనయొక్క ప్రభువుగాను, రక్షకునిగాను మరియు మనకంటే ముందుగా దేవుని సన్నిధిలో మనకొరకు ప్రవేశించినవాడుగాను ఎరుగుటయే నిత్యజీవము(యోహాను 17:3). నీవు క్రైస్తవ జీవితములో అంతకంతకు వర్ధిల్లవలెనని కోరినచో మనయొక్క పరలోకపు తండ్రితోను మరియు ప్రభువైనయేసుతోను సన్నిహిత సహవాసము కలిగియుండుము. ఇది మనము వెనుకంజ వేయకుండ కాపాడును.

దేవుని యొద్దనుండి అభిషేకము కలిగిన వర్తమానములను వినుటయే సరిపోదు. ఆకాశమునుండి కుమ్మరించబడిన మన్నా 24 గంటలలో పురుగులు పట్టి వాసన కొట్టెను (నిర్గమకాండం 16:20). నీయొక్క క్రైస్తవ జీవితములోని తాజాదనమును 24 గంటలలో పోగొట్టుకొనుట సులభము. కాని ఆ మన్నా ప్రత్యక్ష గుడారములో అనగా దేవుని యొక్క సన్నిధిలోని అతిపరిశుద్ధ స్థలములో ఉంచినప్పుడు నలభై సంవత్సరముల వరకు పురుగుపట్టలేదు మరియు కంపుకొట్టలేదు మరియు తరువాత కానానులో 400 సంవత్సరములు కూడా అది పురుగుపట్టి కంపుకొట్టలేదు (నిర్గమకాండం 16:33; హెబ్రీ 9:4). మన జీవితములలో కూడా దేవునియొక్క సన్నిధిలో ఉన్న శక్తి మాత్రమే సమస్తమును తాజాగా ఉంచును. కాబట్టి ఇతరులయొద్దనుండి ప్రభువు గురించి నీవు వినినదానిని అనగా కూటములలోగాని లేక టేపులోగాని వినినదానిని ప్రభువుయొద్దకు తీసుకొని వెళ్ళి ప్రార్థించినయెడల అప్పుడు నేరుగా ప్రభువుయొద్దనుండి పొందెదవు.

ప్రభువైనయేసు మనకు బయలుపరచని యెడల మనము తండ్రిని యెరుగుట అసాధ్యము అని మత్తయి 11:27-29లో ప్రభువైనయేసు చెప్పాడు. మనము ఆయనయొద్దకు వెళ్ళి ఆయన కాడిని (సిలువను) ఎత్తుకొని మరియు సాత్వికమును దీనత్వమును ఆయన యొద్ద నేర్చుకొనమని ప్రభువు మనలను ఆహ్వానించుచున్నాడు (ఆ మూడు వచనములను కలిపి చదవండి). ఈ రెండు విషయములను మాత్రమే ఆయనయొద్దనుండి మనము నేర్చుకొనవలెనని ప్రభువు చెప్పాడు కాబట్టి ఈ విషయములలో ప్రభువైన యేసు మహిమను చూచుటకు మనము వాక్యమును చూడాలి.

(1) సాత్వికము: మొదటిగా ప్రభువైనయేసు పరిసయ్యులకు వ్యతిరేకముగా ఉండి, ఎల్లప్పుడు పాపులైన వారి పక్షముగా ఉండుటలో ఆయనయొక్క సాత్వికమును చూచెదము. వ్యభిచారములో పట్టబడిన స్త్రీ విషయములో మనము దీనిని చూచెదము(యోహాను 8:1-12) మరియు పరిసయ్యుడైన సీమోను ఇంటిలో పాపాత్మురాలైన స్త్రీ ప్రభువైనయేసు యొక్క పాదములను అభిషేకించుటలో దీనిని చూడగలము(లూకా 7:36-50). పాపాత్మురాలైన స్త్రీని సీమోను విమర్శించనంత వరకు ప్రభువైనయేసు అతనితో ఏమియు చెప్పలేదు కాని అతడు ఆమెను తృణీకరించిన వెంటనే దేవుని యెడల గౌరవము మరియు ప్రేమల విషయములో ఉన్న కొదువను బట్టి ప్రభువు అతనిని గద్దించెను(లూకా 7:40-47). మారుమనస్సు పొందుచున్న పాపులను విమర్శించే వారి విషయములో ప్రభువైనయేసు తీవ్రముగా ఉండెను. ఆయన ఎల్లప్పుడు బైబిలును ఎరిగిన పరిసయ్యులకు వ్యతిరేకముగా ఉండి మరియు మారుమనస్సు పొందుచున్న పాపుల పక్షముగా ఉండెను. ఇది తెలుసుకొనుట ద్వారా మనకు గొప్ప ఆదరణ కలుగుచున్నది. ఈ సాత్వికమును మనము ఆయనయొద్ద నుండి నేర్చుకొనవలెను.

తనకు హానిచేసిన వారిని క్షమించే విషయములో ప్రభువైనయేసు యొక్క దీనత్వమును చూడగలము. ప్రజలు తనను దయ్యములకు అధిపతి అని పిలిచినప్పుడు, వెంటనే వారి పాపమును క్షమించాడు (మత్తయి 12:24,32). వారు ఆయనను దూషించినప్పుడు, ఆయన వారిని బెదిరించలేదు. ఆయన మౌనముగా ఉండెను (1పేతురు 2:23). ప్రభువైనయేసు యొక్క ఈ సాత్వికమును కూడా మనము నేర్చుకోవాలి. మన చేతిమీద పడిన బల్లినిగాని బొద్దింకనుగాని మనము ఏ విధముగా దులిపివేయుదుమో ఆవిధముగానే ద్వేషమునుగాని, పగనుగాని, లేక క్షమించలేని ఆత్మనుగాని పూర్తిగా దులిపివేయాలి.

(2) దీనత్వము: మత్తయి సువార్తలోని మొదటి ఆరు వచనములు, ప్రభువైనయేసు ఈ లోకములో పుట్టుటకు ఎన్నుకొనిన కుటుంబములో, ఆయనయొక్క దీనత్వమును చూపించుచున్నవి. యూదుల వంశావళిలో సామాన్యముగా స్త్రీలయొక్క పేర్లును చెప్పరు. అయినను తామారు, రాహాబు, రూతు, బత్సెబ అను నలుగురు స్త్రీల గురించి చెప్పబడింది. తామారు అను స్త్రీ తనయొక్క మామ అయిన యూదాతో వ్యభిచారము చేయుట వలన ఆమెను బిడ్డపుట్టెను (ఆదికాండము 38వ అధ్యాయము). రాహాబు యెరికోలో పేరుపొందిన వ్యభిచారి (యెహోషువ 2వ అధ్యాయము). రూతు మోయాబీయురాలు అనగా లోతు కుమార్తె అతనితో వ్యభిచారము చేయుటవలన పుట్టినవారు (ఆదికాండము 19వ అధ్యాయము). మరియు బెత్సెబ దావీదుతో వ్యభిచారము చేసెను. లైంగిక పాపము చేసిన ఈ నలుగురు స్త్రీలయొక్క పేర్లు క్తొత్తనిబంధనలోని మొదటి పారాలో ఎందుకు వ్రాయబడింది? ఎందుకనగా ప్రభువైనయేసు పాపులతో గుర్తింపబడి మరియు వారిని రక్షించుటకు ఆయన వచ్చియున్నాడని చూపించుచున్నది.

యేసుప్రభువు ఈ భూమిమీద చేసిన వండ్రంగి పని మరియు ఈ భూమిమీద ఆయన జీవితకాలమంతయు ఆయన ఒక దాసునిగా ఉండుటలోను ఆయనయొక్క దీనత్వమును చూడగలము. ఒక దాసునియొక్క వైఖరి అనగా ఎల్లప్పుడు మెలకువగా ఉండి ఇతరులయొక్క అవసరమును చూచుచు మరియు చూచినవెంటనే వారికి సహాయపడవలెనని కోరెను (ఉదహరణకు: ప్రభువైనయేసు తన శిష్యులయొక్క పాదములు కడుగుట).

ఆండ్రూ ముర్రే వ్రాసిన దీనత్వము(వినయము) అను పుస్తకములో దీనత్వమును గురించి ఈ విధముగా చెప్పెను: "దేవుడే మనలో సర్వమగునట్లు, మనము ఏమి కానివారముగా కావలయునని కోరవలెను". ఈవిధముగా ఉండుటకు ప్రభువైనయేసు సంతోషించెను. ఆయనయొద్దనుండి దీనినే మనము నేర్చుకొనవలెను.

కాబట్టి ఆయనయొక్క కాడిని ఎల్లప్పుడును మన మెడమీద పెట్టుకొని మరియు సాత్వికమును దీనత్వమును ఆయనయొద్ద నేర్చుకొనవలెను. ఆ విధముగా ఆయన మనకు తండ్రిని అంతకంతకు బయలుపరచును.