వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

1. వేర్వేరు పరిచర్యలపట్ల యేసుయొక్క వైఖరి

లూకా 9:49, 50 వచనాలలో మనము కలిగియున్న పరిచర్యకు వేరైన పరిచర్యను కలిగిన వారిని కలుసుకున్నప్పుడు ఏమి చేయాలో ప్రభువు మనకు నేర్పించాడు. ఒకడు దయ్యాలను వెళ్ళగొట్టెను గాని అతడు శిష్యులతో కలవలేదు. అతనిని అడ్డుకొమ్మని యోహాను యేసునడిగెను. అతని జోలికి వెళ్ళవద్దని అతనిని ఆ పరిచర్యను కొనసాగించనివ్వమని యేసు యోహానుతో చెప్పారు. నీవు నీ పిలుపుకు కట్టుబడియుండుము. వాళ్ళు వారి పరిచర్యను నెరవేర్చనిమ్ము. అనేకమంది క్రైస్తవులు తాము చేసే పరిచర్య ఎంతో ముఖ్యమైనదని భావించి అందరు దానినే చేయాలనుకుంటారు. "శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?" (1కొరంథీ 12:17). దేవుడు వేర్వేరు పరిచర్యలను వేర్వేరు వ్యక్తులకు ఇచ్చియున్నాడని ఒక పరిణితిగల క్రైస్తవుడు గుర్తిస్తాడు. ఒక వ్యక్తి సువార్తీకరణ, మరియొక వ్యక్తి సమాజసేవ చేయగోరిన యెడల ఎవరి పరిచర్య వారు చేసుకోవచ్చు. ఈ రెండు పరిచర్యల ద్వారా, ఇద్దరు వ్యక్తుల ద్వారా క్రీస్తు బయలుపరచబడును. మనము ఒకరినొకరు విమర్శింపకుందుము గాక. సృష్టిలో భేదమున్నది. దేవుడు ప్రతి పువ్వును ఒకే రంగులో, ఒకే పరిమాణములో చేయలేదు. ఇంద్రధనుస్సుకు అనేక వ్యత్యాసమైన రంగులున్నాయి. క్రీస్తు శరీరము కూడా అంతే. తాము బైబిలు కళాశాలకు వెళ్లలేదు కాబట్టి ఇంకెవ్వరు వెళ్ళకూడదని కొందరనుకుంటారు. ఇతరులు తాము బైబిలు కళాశాలకు వెళ్ళినందున అందరు వెళ్ళాలనుకుంటారు. ఇద్దరూ తప్పే. దేవుడు వారికిచ్చిన పిలుపును బట్టి రెండు పద్ధతులను వాడుకోవచ్చు. అయితే సంకుచితమైన మనస్సుగలవారు వారు చేసే పరిచర్యను తప్ప వేరే వాటిని చూడరు. అటువంటి వారికి ఇదొక మాట, "ప్రతి పరిచర్యను బట్టి దేవునికి వందనాలు చెల్లించండి, మీ పరిచర్యకు మీరు కట్టుబడి యుండుడి".

2. పాపులపట్ల యేసుయొక్క వైఖరి

యోహాను సువార్త 8:1-12 వచనాలలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీయొక్క కథను చదువుతాము. ఆమెను పరిసయ్యులు రాళ్ళతో కొట్టి చంపాలనుకొనిరి. ఈ రోజున కూడా అనేకమంది పరిసయ్యులున్నారు. వారి జేబులలో ఇతరులమీద విసరడానికి రాళ్ళుంటాయి. అనేకమంది బోధకులు బోధిస్తున్నప్పుడు ఇతరులమీదకు రాళ్ళువేస్తారు. ఎవరిపైనా రాళ్ళు వేయుటకు యేసు యొద్ద రాళ్ళుండవు. పాపము చేసినవారిని ఆయన ఎల్లప్పుడు కనికరించెను. నరహంతకులను, దొంగలను, వ్యభిచారులను యేసు విమర్శించండం మనం సువార్తలలో ఎప్పుడు చూడము. కాని ఆయన పరిసయ్యులను సమాజమందిరములో ఉన్న మతనిష్టగల వేషధారులను నరకానికి వెళతారని ఖండిచండం మనం చూస్తాము. కాని వ్యభిచారములో పట్టబడిన స్త్రీతో ఆయన "నేను నీకు శిక్షవిధింపను, ఇక పాపము చేయకుము" అని చెప్పెను (యోహను 8:11). ఈ రెండు వాఖ్యలలో సువార్త అంతయు (నీతిమంతులుగా తీర్చబడుట మరియు పరిశుద్ధపరచబడుట) ఇమిడియున్నది. "మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయవచ్చు" అని పరిసయ్యులతో చెప్పెను. నీవు ఎవరిపైనైనను రాయి విసరడానికి శోధింపబడినప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొనుము: 1. దేవుడు నిన్ను బయటకు తీసిన గుంటను, 2. నీ శరీరములో ఈ రోజున కూడా ఉన్న పాపమును. అప్పుడు నీ జేబులోనుండి రాళ్ళన్నిటిని ఖాళి చేస్తావు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఎవరిమీద రాళ్ళువేయలేవు.

3. లేఖనాలపట్ల యేసుయొక్క వైఖరి

లూకా 2:47-52 వచనాలలో యేసు యెరూషలేము వెళ్ళుట గురించి, యోసేపు మరియలు ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఆలయములో విడచిపెట్టడము గురించి చదువుతాము. 12 ఏళ్ళ వయస్సులో యేసు లేఖనాలను ఇశ్రాయేలులో ఉన్న పండితులందరి కంటే మెరుగుగా యెరిగియుండెను. ఆయన లేఖనాలను వివరించిన రీతిని బట్టి వారు ఆశ్చర్యపడిరి. యేసు ఇంటియొద్ద బైబిలును కలిగియుండలేదు. ఆ రోజులలో ముద్రింపబడిన బైబిళ్ళు లేకుండెను. ఎవరూ ఇంటియొద్ద వాటిని కలిగియుండలేదు. అయితే 12 ఏళ్ళ వయస్సులో యేసు లేఖనాలను ఎలా యెరిగియుండెను? అవి సమాజమందిరములోను బడిలోను చదవబడినప్పుడు ఆయన జాగ్రత్తగా వినెను. ఈ రోజున మన ఇళ్ళలో ముద్రింపబడిన బైబిళ్ళున్నాయి - మనలో చాలామంది అనేక తర్జుమాలను కలిగియున్నాము. అయినప్పటికీ ఈ రోజున ఎక్కువమంది క్రైస్తవులకు బైబిలు చాలా కొద్దిగా మాత్రమే తెలుసు. నీవు దేవుని వాక్యాన్ని అధ్యయనము చేయకపోతే క్రీస్తు శరీరాన్ని కట్టలేవు. ఆయన తండ్రిని సేవించుటకు యేసుకూడా బాల్యమునుండి లేఖనాలను అధ్యయనము చేయవలసి వచ్చెను. నీవు లేఖనాలను అధ్యయనము చేసే విషయములో సోమరివిగా ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకోడని నేను నిశ్చయముగా నమ్ముతాను. కాని నీవు లేఖనాలను జాగ్రత్తగా అధ్యయనము చేసి ఆత్మతో నింపబడుటకు ఆశపడితే దేవుడు నిన్ను బలముగా వాడుకొనును. గనుక నీవు రక్షణపొందిన మొదటి దినాలనుండి దేవుని వాక్యమును అధ్యయనము చేసే అలవాటును అలవరచుకొనుము. అప్పుడు నీవు దేవుని మనస్సును ఆయన మార్గములను తెలుసుకొనెదవు.