"మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు" (మత్తయి 5:13). దీనిని యేసు జనసమూహాలకు చెప్పలేదు. కొండమీది ప్రసంగం ప్రధానంగా తన శిష్యులకు అని గుర్తుంచుకోండి మరియు జనసమూహాలు చుట్టూ కూర్చుని వింటున్నారు. జనసమూహాలు ఖచ్చితంగా లోకానికి ఉప్పు కాదు - వారి దగ్గర ఎటువంటి ఉప్పుసారం లేదు. కానీ శిష్యులు లోకానికి ఉప్పుగా ఉండాలి. యేసు పద చిత్రాలను ఉపయోగించడంలో నిష్ణాతుడు. మనం పరిశుద్ధాత్మ ప్రేరణ మరియు ప్రత్యక్షత కోసం వెతుకుతుండగా వాటి వెనుక ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకునే బాధ్యతను ఆయన మనకే వదిలేశాడు. "మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు, కానీ ఉప్పు రుచిని కోల్పోతే, అది ఎలా ఉప్పుసారం పొందుతుంది? మనుషులచే బయటకు విసిరివేయబడి, కాళ్ళ క్రింద తొక్కబడటానికి తప్ప అది ఇక దేనికీ పనికిరాదు".
తన శిష్యులు ఎల్లప్పుడూ సంఖ్యలో తక్కువగా ఉంటారని మనకు చూపించడానికి ఆయన ఈ సాదృశ్యాన్ని ఉపయోగిస్తున్నాడు. మీ దగ్గర ఉన్న పళ్ళెంలో అన్నం మరియు కూర ఉంటే, ఆ మొత్తం పళ్ళెంలో ఎంత ఉప్పు వేస్తారు? మీరు అర చెంచా కూడా వేయరు. ఆ పళ్ళెం మొత్తం రుచిగా ఉండటానికి మీకు చాలా తక్కువ ఉప్పు అవసరం. కానీ ఉప్పు రుచిగా లేకపోతే, మీరు దానిలో 20 చెంచాల ఉప్పు వేసినా, అది రుచిలో ఎటువంటి తేడాను కలిగించదు. కాబట్టి ఇక్కడ విషయం, పరిమాణం కాదు నాణ్యత. "ఉప్పు నిస్సారమైతే" (మత్తయి 5:13) అని యేసు చెప్పినప్పుడు, ఆయన ఉప్పు పరిమాణం గురించి అస్సలు మాట్లాడటం లేదు.
ఆహారానికి సంబంధించి ఉప్పు పరిమాణం యొక్క నిష్పత్తి, ప్రపంచ జనాభాకు (కొన్నిసార్లు సంఘంలోని వ్యక్తుల సంఖ్యకు కూడా!) భూమిపై ఉన్న నిజమైన శిష్యుల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. నిజమైన శిష్యులు చాలా తక్కువ.
అయితే నిజమైన శిష్యులు మాత్రమే లోకానికి ఉప్పు అని పిలువబడతారు. వారి కారణంగానే లోకం తీర్పు నుండి రక్షించబడింది. అబ్రాహాము ఒకసారి ప్రభువు నాశనం చేస్తానని చెప్పిన దుష్ట పట్టణమైన సొదొమ గురించి దేవుణ్ణి ప్రార్థించాడు. అతను ప్రభువును ఇలా అడిగాడు (ఆయన దానిని అప్పుడు కూడా నాశనం చేస్తాడా అని), "ప్రభువా, సొదొమలో నీకు పది మంది నీతిమంతులు మాత్రమే కనిపిస్తారని అనుకుందాం?" (ఆదికాండము 18:32), “సొదొమ పట్టణంలో పదిమంది నీతిమంతులు ఉంటే నేను దానిని నాశనం చేయను" అని ప్రభువు అన్నాడు. ఆ పట్టణం నాశనం కాకుండా కాపాడటానికి పదిమంది సరిపోతారు, కానీ అక్కడ పదిమంది కూడా లేరు, కాబట్టి అది నాశనం చేయబడింది.
యిర్మీయా కాలంలో, ప్రభువు ఆ సంఖ్యను మరింత తగ్గించాడు. ఇశ్రాయేలును బబులోను రాజు చెరలోకి తీసుకెళ్లబోతున్న సమయంలో (అది దేవుని శిక్ష) యిర్మీయా ప్రవచిస్తున్నాడు. అయితే దానికి ముందూ, యిర్మీయా ప్రవచించడానికి వెళ్ళాడు. అతను 40 సంవత్సరాలు వారికి ప్రకటించాడు మరియు హెచ్చరించాడు, కానీ వారు అతని మాట వినలేదు. ప్రభువు యిర్మీయాతో, "యెరూషలేము వీధుల గుండా వెళ్లి న్యాయం చేసే, సత్యాన్ని వెతుకుతున్న ఒక వ్యక్తిని (పదిమంది కాదు, ఒకే ఒక్క వ్యక్తిని) నీవు కనుగొనగలవో లేదో చూడు, నేను పట్టణం మొత్తాన్ని క్షమిస్తాను" (యిర్మీయా 5:1). ఇది ఎంతో ఆశ్చర్యం, అయితే ఒక్క నీతిమంతుడు కూడా లేడు, కాబట్టి పట్టణం మొత్తం చెరలోకి వెళ్ళింది.
తరచుగా దేవుడు ఆవిధంగా చూస్తున్నాడు. బబులోను కాలంలో యెహెజ్కేలు కూడా ఒక ప్రవక్త, దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇలా అన్నాడు, "నాకు వారికి మధ్యలో నిలబడి, నేను ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఉండేందుకు మధ్యలో గోడ కట్టే ఒక వ్యక్తి కోసం నేను వెతికాను, కానీ నాకు ఎవరూ దొరకలేదు" (యెహెజ్కేలు 22:30). దేవుడు అవే మాటలు మాట్లాడాడు: నాణ్యత, పరిమాణం కాదు. ఆయన 10,000 మంది కోసం వెతకలేదు. ఆయన ఒక్క మనిషి కోసం వెతుకుతున్నాడు.
ఒక వ్యక్తి హృదయపూర్వకంగా మరియు తీవ్రంగా ఉంటే దేవుడు ఏమి చేయగలడో చూచుట ఎంతో ఆశ్చర్యం. పాత నిబంధనలో 20 లక్షల మంది ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు ఉపయోగించుకున్న మోషే గురించి ఆలోచించండి. ఇశ్రాయేలులో నాయకుడిగా ఉండటానికి తగిన వ్యక్తి మరెవరూ లేరు. ఏలీయా కాలంలో, బయలుకు మోకరిల్లని 7000 మంది ఉన్నప్పటికీ (విగ్రహాలను ఆరాధించని 7000 మంది విశ్వాసులకు సాదృశ్యం), ఆకాశం నుండి అగ్నిని దించగల ఒకే ఒక వ్యక్తి (ఎలీయా) మాత్రమే ఉన్నాడు. నేటికీ నిష్పత్తి ఆవిధంగానే ఉంది. 7000 మంది విశ్వాసులలో, తమ పరిచర్య ద్వారా లేదా ప్రార్థన ద్వారా పరలోకం నుండి అగ్నిని క్రిందికి తీసుకురాగల ఒకే ఒక విశ్వాసిని మీరు కనుగొనవచ్చు.
7000 మంది, "నేను ఇలా చేయను, నేను అలా చేయను" అని చెప్పవచ్చు. వారి సాక్ష్యం క్రియలు చేయకపోవుట! "నేను సినిమాలకు వెళ్లను, నేను తాగను, నేను జూదం ఆడను మరియు నేను సిగరెట్లు కాల్చను." వారు బయలును పూజించరు, కానీ పరలోకం నుండి అగ్నిని ఎవరు తీసుకురాగలరు? ఏలీయా చేసినట్లుగా దేవుని ముఖం ఎదుట నివసించేవాడు మాత్రమే; ఏలీయా ఉప్పుసారం కలిగి ఉన్నాడు.
కొత్త నిబంధనలో కూడా ఆవిధంగానే ఉంటుంది. అపొస్తలుడైన పౌలు ఎప్పుడూ ఉనికిలో లేకుంటే, సంఘం ఎదుర్కొనే నష్టాన్ని, మనం ఎదుర్కొనే నష్టాన్ని మీరు ఊహించగలరా? ఎన్ని లేఖనాలు లేకుండా ఉండేవి? అతను ఒకేఒక వ్యక్తి!. అవును, ఒక వ్యక్తి విఫలమైనందున దేవుని పనికి ఆటంకం ఉండదు (దేవుడు వేరొకరిని ఉపయోగించుకొని ఉండేవాడు). అయితే లేఖనంలో మనం చూసేది ఏమిటంటే, తరచుగా దేవుడు 10,000 మంది రాజీపడే వారి ద్వారా సాధించే దానికంటే పూర్ణహృదయుడైన ఒక వ్యక్తి ద్వారా ఎక్కువ సాధిస్తాడు. "మీరు ఉప్పుయి ఉన్నారు" అని యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. "మేము చాలా తక్కువమంది!" అని ఎప్పుడూ ఫిర్యాదు చేయకండి.