WFTW Body: 

1 రాజులు 19:19-21 లో ఏలీయా, ఎలీషాను పిలుచుచున్నాడని చదువుచున్నాము

ఏలీయా పిలిచినప్పుడు, ఎలీషా తన యెడ్లచేత దుక్కి దున్నించుచూ కష్టపడి పనిచేయుచుండెను.

మొదటగా గమనించవలసినదేమనగా, ఎవరైతే లౌకికసంబంధమైన పనులు(ఉద్యోగములు) కష్టపడి మరియు నమ్మకముగా చేయుదురో, వారినే దేవుడు పిలుచుచున్నాడు. దేవుడు మోషేను పిలిచినప్పుడు , అతడు తన మామ యొక్క గొఱ్ఱెలమందను నమ్మకముగా కాయుచుండెను. దావీదు గొఱ్ఱెలకాపరిగా ఉండి మరియు వాటిని కాపాడుటకు సింహములతోను మరియు ఎలుగుబంట్లుతోను పోరాడుచుండెను. ఆమోసు పశువుల మందను మేపువాడుగా ఉండెను. పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ కష్టపడి చేపలు పట్టేవారుగా ఉండిరి. మత్తయి బల్లదగ్గర కూర్చొని లెక్కలు వ్రాయువాడుగా ఉండెను. పాతనిబంధనలోగాని లేక క్రొత్తనిబంధనలోగాని ఎక్కడైనను దేవుడు సోమరిని పిలిచినట్టుగా మనము చూడము.

ఎలీషా తన ఇంటిలో గాఢ నిద్రపోవుచున్నప్పుడు ఏలీయా వెళ్ళి తనను పిలిచినట్లు మనము కనుగొనుటలేదు. అలాగయినట్లయితే అతనిని మనము సోమరివాడని అనుకొని యుందుము. ప్రభువైన యేసుకూడా పేతురును పిలచుటకు, అతడు సాయంత్రము తన ఇంటిలో ఉన్నప్పుడు వెళ్ళలేదు. పేతురు చేపలు పట్టుచున్నప్పుడు అతనిని పిలిచెను.

దేవుడు మనలను తన సేవకు పిలువకమునుపు మనము మనలౌకిక ఉద్యోగములలో నమ్మకముగా ఉండి మరియు కష్టపడి పనిచేయుచుండవలెనని దేవుడు కోరుచున్నట్లుగా ఈ ఉదాహరణలన్నియు చూపించుచున్నవి. భూలోకసంబంధమైన విషయములలో నీవు నమ్మకముగా ఉండని యెడల, పరలోక సంబంధమైన విషయములలో ఏలాగు నమ్మకముగా ఉండగలవు? మీరు చిన్నవారైయుండి మరియు ఇంటిదగ్గర జీవించుచున్నట్లయితే, ఇంటిదగ్గర నమ్మకమైన కుమారుడుగాగాని లేక కుమార్తెగాగాని ఉండుము.

రెండవదిగా మనము గమనించవలసినది : దేవుడు పిలచినవెంటనే వారు అన్నిటిని వదలివేసి వెళ్ళియున్నారు. దానిని పేతురు, యోహాను మరియు మత్తయిలలోను మరియు ఎలీషాలోను మనము చూచుచున్నాము. ఎవరైతే దేవుని పిలుపునకు వెంటనే మరియు పూర్ణహృదయముతో స్పందించెదరో వారినే దేవుడు పిలుచును. వారు తమ స్వంత ఉద్రేకములతో ఏమియు చెయ్యక, దేవుని పిలుపును నిశ్చయపరచుకొనుటకు దైవజనులను కోరెదరు. ఒకసారి వారు పిలుపును నిశ్చయపరచుకున్న తరువాత, వెంటనే లోబడెదరు. వెంటనే విధేయత చూపుట, పూర్ణసమర్పణ మరియు కష్టపడి పనిచేయుట, దేవుని సేవకునికి తప్పనిసరిగా అవసరము గనుక దేవుడు అటువంటి వారినే తన సేవకు పిలుచును.

గనుక దేవుడు మనము లోకసంబంధమైన ఉద్యోగములలో నమ్మకముగా ఉన్నామా లేదా అని పరీక్షించును. నిన్ను ఒక గదిని శుభ్రము చెయ్యమని అడిగినట్లయితే, అది చేసే విషయములో నీవు అజాగ్రత్తగా ఉండి మరియు దాని విషయములో అవిధేయతగా ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఎప్పటికైనా తన సేవకు పిలువడని నేను అనుమానించుచున్నాను. ఎందుకనగా, నీవు గదిని ఆవిధముగా శుభ్రపరచినయెడల, నీవు నీ హృదయమును కూడా దాదాపు ఆవిధముగానే శుభ్రపరచెదవు. అటువంటప్పుడు దేవుడు తన సంఘమును పవిత్రపరచుటకు నిన్ను ఎలాగు వాడుకొనగలడు? స్వల్పవిషయములలో నమ్మకత్వమును దేవుడు చూచుచున్నాడు.