వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు
WFTW Body: 

ఆదికాండము 2వ అధ్యాయములో ఈలాగు చదువుతాము; "ప్రభువా నేను ఒంటరిగా ఉన్నాను. దయచేసి నాకు భార్యను అనుగ్రహించుము: అని ఆదాము దేవునియొద్దకు వెళ్ళి అడుగలేదు. ఇది చాలా ఆసక్తికరముగా ఉన్నదికదా! ఆదికాండము 2 : 18 దేవుడే ఈలాగు చెప్పియున్నాడు, "నరుడు ఒంటరిగా నుండుట మంచిదికాదు. వానికి సాటియైన సహాయము వానికొరకు చేయుదుననుకొనెను". దేవుడు ఆదామును మరియు హవ్వను ఒక్కసారే ఎందుకు సృష్టించలేదు. ఆయన దానిని చాలా సులభముగా చేయగలడు. నేలమంటితో ఆయన నరుని నిర్మించెనని వాక్యము చెప్పుచున్నది. వారు నిర్మించబడిన వెంటనే ఇరువురిని చూచుకొనునట్లు దేవుడు హవ్వను కూడా రూపించి మరియు ఆయన జీవమును ఆమెలో ఊదవచ్చును. దేవుడు ఆదామును ఒక్కడినే ఎందుకు మొదట సృష్టించాడు? మరియు తరువాత అతనికి గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతనియొక్క ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి, ఆమెను నిర్మించారు. దానికి ఒక కారణము ఉన్నది. ఆదాము మరియు హవ్వలు ఇద్దరు ఆత్మీయముగా ఒక్కటి అవటానికి ఉన్న రహస్యాన్ని వారికి తెలియచెప్పుటకు ఆవిధముగా దేవుడు చేశారు. ఆ రహస్యమేమిటి? దేవుడు ఆదామును చేసినప్పుడు అతడు ప్రాణము పొంది, కళ్ళు తెరిచాడు. మొదటిగా అతడు ఎవరిని చూశాడు? మీకు జవాబు తెలుసు అనగా అతడు దేవునిని చూశాడు. దేవునిని కలుసుకున్నాడు. దేవునితో మాట్లాడాడు. అతనికి భార్యలేదు. దేవుడు మరియు అతడు మాత్రమే ఉన్నారు. తరువాత అతడు భార్యను పొందుకున్నాడు. కాబట్టి దీని ద్వారా దేవుడు ఆదాముతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు? అదేమనగా, "నీ జీవితములో ఎల్లప్పుడు నేను మొదటిగా (సర్వమై) యుండాలి. నీ భార్యను చూడకముందు నీవు నన్ను చూడాలి. నీ భార్య కంటే నీవు నాకు ఎక్కువ విలువ ఇవ్వాలి". అందుకే దేవుడు ఆదామును ఒక్కడినే మొదట సృజించారు. భార్య ఉనికిలోనికి రాకముందే అతడు దేవునితో సహవాసము చేశాడు. దీని నుండి మనము ఏమి నేర్చుకుంటాము? నీకు వివాహమై 50 సం||లు లేక 75 సం||లు అయినప్పటికీ ఎల్లప్పుడు దేవుడే మనకు మొదటిగా ఉండాలి. చాలామంది ప్రేమలోపడినప్పుడు భార్యలనే మొదటిగా కలిగిఉంటారు. కొంతమందికి తల్లిదండ్రులే మొదటిగా ఉంటారు.

హవ్వను సృజించిన విధమును చూద్దాము. దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగజేశాడని చెప్పుచున్నది. అతడు లేవలేనంతగా గాఢనిద్ర కలుగజేశాడని 21వ వచనములో చెప్పబడింది. ఆదికాండము 2 : 21 లో అతని ఎముకలలో ఒకదానిని తీసెనని చెప్పబడింది. మాంసముతో ఆ ఎముకను కప్పి, స్త్రీని నిర్మించాడు. దేవుడు ఎముకనుండి ఆమెను నిర్మించిన వెంటనే, దేవుడు జీవ వాయువును ఆమెలోనికి ఊదగా ఆమె ప్రాణమును పొంది మరియు ఆమె కళ్ళు తెరువబడినవి. ఆమె మొదటిగా ఎవరిని చూసింది? ఆదామునికాదు. ఆదాము ఉన్నట్టు కూడా ఆమెకు తెలియదు. తానోక్కటే మనుష్యుడననుకొనియున్నది. ఆదాము గురించి ఆమెకు ఏమియు తెలియదు. ఆమె కళ్ళు తెరువబడి, దేవుని చూసింది. ఆదాము సృజించబడినప్పటివలెనే జరిగింది. ఆదాము తోటలో గాఢనిద్రలో ఉన్నాడు. ఆమె గురించి అతనికి తెలియదు మరియు అతని గురించి ఆమెకు తెలియదు. ఆమె దేవునిని కలుసుకొన్నది. ఆమెతో మొదటిగా దేవుడు మాట్లాడాడు తరువాత చాలా కాలమునకు దేవుడు ఆమెను ఆదాము యొద్దకు తెచ్చారు. కాబట్టి దేవుడు ఆమెకు ఏమి బోధిస్తున్నారు? ఆదాముకు చెప్పాలనుకున్నదే, "నేను నీ జీవితములో మొదటిగా ఉండాలి. నీ భర్తతో సహవాసము చేసేముందు నీవు నాతో సహవాసము చేయాలి". శ్రేష్టమైన వివాహమునకు దేవుని ప్రణాళిక ఏమిటో ఇప్పుడు అర్ధమవుతుందా? హవ్వతో సహవాసము చేసే ముందు ఆదాము దేవునితో సహవాసము చేయాలి. ఆదాముతో సహవాసము చేయకముందు హవ్వ దేవునితో సహవాసము చేయాలి. ఇదంతయు అక్కడ వ్రాయబడియున్నది. ఆరంభము నుండి దేవుడు దీనినే కోరియున్నాడు.

వివాహజీవితములో భార్యాభర్తలలో దేవుడు (జీవమిచ్చే ఆత్మగా) ఉన్నట్లయితే అనగా వారు ప్రభువుకే మొదటి స్థానమిచ్చినట్లయితే ఏమి జరుగుతుందో తెలుసా? వారిద్దరు ఒకటవుతారు. విశ్వములో ఐక్యపరచుటకు (కట్టుటకు లేక సంధించుటకు) దేవుడు అత్యంత శక్తిని కలిగియున్నాడు. ఇద్దరు వ్యక్తులను దేవుడు జతపరచినట్లయితే, వారిని విడదీయుట ఎవరికైనను అసాధ్యము. సాతానుగాని, దయ్యములుగాని, లోకమంతయు కలసిగాని, పరిస్థితులుగాని, బీదరికముగాని లేక మరణముగాని వారిని వేరుచేయలేవు. దేవుడు జతపరచని యెడల(ఐక్యపరచని యెడల) అప్పుడు వారు వేరేశక్తుల ద్వారా జతపరచబడతారు. వేరేవారు (శక్తులు) అంత శక్తిగలవారుకాదు. "ఫెవికొల్‍" గూర్చిన ప్రకటన మీరు చూసే ఉంటారు. ఆ ప్రకటనలో నేను చూశాను. అందులో రెండు వస్తువులు "ఫెవికొల్‍" తో అతికించారు. వాటిని రెండు ప్రక్కల ఏనుగులు లాగినవి. అయినను వాటిని వేరుచేయలేకపోయినవి. భార్యాభర్తలు ఇద్దరు దేవుని చేత జతపరచబడినయెడల అది ఎంతో బలమైన బంధముగా ఉంటుంది. ఎంతటి ఏనుగులైనను వారిని వేరుచేయలేవు. దయ్యములైనను లేక మనుష్యులైనను వారిని వేరుచేయలేరు. కాని వారి మధ్యలో దేవుడు ఉండాలి. ఫెవికొల్‍ కంటే లేక అర్లాడైట్‍ కంటే లేక మరి దేనికంటేనైనను దేవుడు ఎంతో ఎక్కువగా ఐక్యపరచగలడు. దేనిచేతనైనను భార్యాభర్తలు వేరు పరచబడకుండునట్లు వారు దేవుని చేత ఐక్యపరచబడుదురు. కాబట్టి దేవుడు తప్ప మరేదియు మీ మధ్యకు రాకుండునట్లు జాగ్రత్తపడాలి. అనేకమంది యౌవ్వనస్థుల వివాహములలో ఐక్యపరచే శక్తి ఏమిటి? అవి పైకి చూచుటకు బాగుగానే ఉంటాయి. ఒక అమ్మాయి అందముగా ఉంది కాబట్టి ఒక అబ్బాయి ఆమెను ఇష్టపడవచ్చును. కేవలము అందమే 50 సం||ల వివాహ జీవితమునకు సరిపోదు. అందమును చూచి పెళ్ళి చేసుకున్న వాళ్ళను చూస్తే, 3 నెలల తరువాత వాళ్ళు పోట్లాడుకొందురు. అదివారిని ఐక్యముగా ఉంచలేదు. మనము అందానికి వ్యతిరేకులముకాదు. అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చును. కాని అది ప్రాముఖ్యమైనది కాదు. అది వివాహజీవితమును కలిపి ఉంచదు. చాలమంది అమ్మాయిలు అబ్బాయిలను ఎందుకు ఎన్నుకుంటారు? మంచి ఉద్యోగమును బట్టి లేక మంచి కుటుంబమును బట్టి లేక ధనవంతుడైయుండుటను బట్టి. అది వివాహజీవితమును చివరివరకు నిలుపుతుందా? ఎన్నటికీ కాదు. కొందరు యౌవ్వస్థులు కట్నం కోసము పెళ్ళి చేసుకుంటారు. అది కూడా వివాహమును చివరివరకు కలిపి ఉంచదు. అది అసాధ్యము. ప్రభువే మొదటగా ఉండే విధానమే, వివాహ జీవితమును చివరివరకు కలిపి ఉంచుతుంది. వారిమధ్య ఉండే బంధము కంటే, దేవునితో ఎక్కువ బంధము కలిగియుంటారు. మరొకమాటలో, నీవు భర్తవైతే నీభార్యకు మొదట నీవుండాలని కోరకూడదు. ప్రభువే ఆమెకు మొదటివాడైయుండాలి. నీవు భార్యవైతే నీ భర్తకు ప్రభువే మొదటి వాడైయుండాలి మరియు నీవు తరువాత. ఆవిధముగా మనము వెలుగులో నడిచినట్లయితే, బైబిలు ఈలాగు చెప్పుచున్నది, "అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన యెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును"( 1యోహాను 1 : 7). అప్పుడు ఇద్దరు కలిసియుందురు.

భార్యాభర్తల మధ్య వచ్చే విషయాలు ఏంటి? తల్లిదండ్రులై ఉండవచ్చును. ఆదికాండము 2 : 24 లో "కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. వారు ఏకశరీరమైయుందురు" అని చెప్పుచున్నది. ఇక్కడ నీవు ఒక దానిని విడిచిపెట్టాలి మరియు మరొక దానిని హత్తుకోవాలి అని ఉంది. నీవు విడిచి పెట్టకుండా హత్తుకుంటే, నీవు ఏకమవ్వలేవు. పాపము లోకములోనికి రాకముందు లేఖనములో దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. నీ తండ్రిని, నీ తల్లిని విడిచిపెట్టుము. వివాహమైన వారిని నేను అడుగుచున్నాను. నీ తండ్రిని, తల్లిని విడిచిపెట్టావా? అనగా శారీరకముగా కాదు వారు చనిపోవువరకు వారి గురించి జాగ్రత్తవహించుము. మనము అలాగున చేయాలి. మన తల్లిదండ్రులను సన్మానించాలి. కాని వారిని నీకు మరియు నీ వివాహజీవితానికి మధ్యకు రానియ్యకుము. ప్రేమతో వారిని విడవాలి. వారు అనేక సం||లు నిన్ను పెంచి మరియు పెద్ద చేశారు. అది మంచిది. కాని నీవు పెళ్ళి చేసుకున్నావు కాబట్టి వారిని విడవాలి. చాలామంది భర్తలు వారి తల్లిదండ్రులతో ఉన్న అనురాగాన్ని విడిచిపెట్టరు. కాబట్టి వారి వివాహజీవితములో సమస్యలు ఉంటున్నాయి. అలాగే అనేకమంది భార్యలు కూడా ఉన్నారు. వారి భర్తలతో వారు ఏకమవ్వలేదు.

ఇది బాధాకరము. ప్రభువు మొదటగా ఉండకుండా, తల్లిదండ్రులు వారి మధ్యలో ఉంటున్నారు. కొన్నిసార్లు ఉద్యోగము ముఖ్యమైయుండవచ్చు. దేవుడు కాకుండా ధనముగాని లేక పిల్లలుకాని లేక మరేదైనా కాని మధ్యలోనికి రాకూడదు.

సంతోషకరమైన వివాహజీవితానికి జవాబేమిటి? ప్రతి పరిస్థితిలో దేవునికి మొదట స్థానమిమ్ము, వెలుగులో నడువుము, నిన్నునీవు తీర్పు తీర్చుకో. అప్పుడు మీ మధ్య ఉన్న ఐక్యతను ఏదియు నాశనము చేయలేదు.