లోకము తనకుమారుని ద్వారా రక్షణపొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు (యోహాను 3:17).
మనము దేవునివాక్యము బోధించునప్పుడు, దేవుని ప్రజలకు అపరాధభావన కలిగించి, వారు నేరారోపణలోనికి వెళ్ళునట్లు మనము బోధించకూడదు. "పాపమువలన కలుగు భ్రమచేత ఎవడును కఠినపరచబడకుండునట్లు", నేడు అను సమయము ఉండగానే "ప్రతిదినము" ఒకనినొకడు "ప్రోత్సహించుకోవాలి" (హెబ్రీ 12:13-15). అనగా ప్రతిదినము, మనము చేసే ప్రతిప్రసంగము విశ్వాసులను ప్రోత్సహించి, పురికొల్పి వారు క్షేమాభివృద్ధిపొందునట్లు చేయాలి. ఆవిధముగా మాత్రమే వారు పాపమునుండి రక్షించబడుటకు (విడుదలపొందుటకు) సహాయపడగలము. కాని మన బోధద్వారా విశ్వాసులను నేరారోపణలోనికి నడిపించి మరియు అపరాధభావము కలుగునట్లు చేసినట్లయితే వారు ఎక్కువ పరిశుద్ధులై, దేవుని యెడల భయభక్తులు కలిగియుంటారని చెప్పి సాతాను మోసగిస్తాడు. అది అబద్ధము.
దేవునివాక్యమును ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని పిల్లలను ఒప్పింపజేస్తాడు కాని అదే సమయములో ఆయన వారిని ఎంతో ప్రోత్సహిస్తాడు. మనము చదివినరీతిగా, దేవుడు లోకమును(మనలను) రక్షించుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన కుమారుని పంపలేదు. సంఘములోని విశ్వాసులను ప్రోత్సహించి, ఆదరించుటకేగాని వారిలో శిక్షావిధి కలిగించి, వారిని నిషేధించుటకు దేవుడు పరిశుద్ధాత్మను వారిలోనికి పంపలేదు. ఆయన కనికరించే దేవుడును, సమస్తఆదరణకు కర్తయైన దేవుడునైయున్నాడు. ఆయన ఎల్లప్పుడు మన ఆత్మలను ఉజ్జీవింపజేసి, పైకిలేవనెత్తువాడు. ఆయన ఎల్లప్పుడు మనలో నిరీక్షణ కలుగజేస్తాడు (2 కొరింథీ 1:4,5; రోమా 15:4). శిక్షావిధిలోనికి నడిపించే పరిచర్య "పాతనిబంధన పరిచర్య". ఈ పరిచర్య ప్రజలను ఆత్మీయమరణములోనికి మాత్రమే నడిపిస్తుంది (2 కొరింథీ 3:7-9). అయితే క్రొత్తనిబంధన పరిచర్య ప్రజలు దైవ-మానవులు అగునట్లు, దేవుని జీవాన్ని వారు పొందుకొనునట్లు చేస్తుంది.
మన బోధద్వారా విశ్వాసుల పాపములను బయటపెట్టి, వారిని శిక్షావిధిలోనికి మరియు అపరాధభావనలోనికి నడిపించే బోనులో మనము పడుట చాలా సులభము. అప్పుడు మనము పరిచర్యలో ఓడిపోయి ప్రజలను నేరారోపణలోనికి నడిపిస్తాము. ఆవిధముగా కేవలము మనష్యులద్వారా కలిగిన నేరారోపణ అను బోనులోనుండి తమ్మునుతాము విడిపించుకొనుట వారికి చాలా కష్టమవుతుంది.
బోధకులలో సామాన్యముగా ఉపయోగించే పద్దతి ఏదనగా (ముఖ్యముగా అనుభవము లేకపోవుటవలనను, యౌవ్వనస్థులైయుండి అభద్రతలో ఉండుట వలనను మరియు ఇతరులను మెప్పించాలని కోరినప్పుడు) కృత్రిమైన, హెచ్చయిన పరిశుద్ధతను బోధించి, వారుతప్ప మిగిలిన వారందరు శిక్షావిధిలో ఉండునట్లు చేస్తారు. జీవించుటకు అసాధ్యమైన జీవితమును జీవించాలని వారు బోధిస్తారు. ప్రభువైనయేసుగాని లేక అపొస్తలులుగాని బోధించనటువంటి జీవించుటకు అసాధ్యమైనబోధను వారు బోధిస్తారు. వారు బోధించేది వారే జీవించరు. బలహీనమైన మనస్సుగల విశ్వాసులు వారి ప్రసంగాలను విని అపరాధబావనతో శిక్షావిధికి గురై, నిరాశపడతారు.
పూర్తికాలపు క్రైస్తవపరిచర్యకు లేక సువార్తపరిచర్యకు రమ్మని ఇట్టి బోధకులు క్రైస్తవులలోని ఎక్కువమంది విశ్వాసులను సవాలు చేస్తారు. ప్రపంచములోని అనేకప్రాంతములలో సువార్త ప్రకటించే అవసరాన్ని నొక్కిచెప్పి, వినేవారు శిక్షావిధికిగురై వారి ఉద్యోగములకు రాజీనామాచేసి సువార్తికులుగా మారేటట్లు చేస్తారు కాని ప్రభువైనయేసుగాని లేక అపొస్తలులుగాని ఎవరిని లోకములోనికి ఆవిధముగా పంపలేదు. సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి, శిష్యులనుగా చేయమని ప్రభువైనయేసు చెప్పారు. అయితే వారు ఇశ్రాయేలులో జీవించే సుఖవంతమైన జీవితమును ఇతర ప్రదేశములతో పోల్చిచెప్పి, వారు వెళ్ళుటకు ఆయన బలవంతపెట్టలేదు. కాని అటువంటి బోధకులనుబట్టి ఈనాడు అనేక క్రైస్తవపరిచారకులలో లోతైన అనుభవము లేదు. సువార్తను గురించి సవాలుతో కూడిన మాటలు విని, వారి ఉద్యోగాలలో కొనసాగుటకు నేరారోపణగా తలంచి వారు "ప్రభువుసేవకు" వెళ్ళియున్నారు. దేవుడు వారిని తన పరిచర్యకు పిలువనేలేదు. కాని వారు నేరారోపణకు గురియై వెళ్ళారు. పూర్తికాలపు పరిచర్య ఎంత పవిత్రమైనదంటే, దేవుడే స్వయముగా మనలను పిలువని యెడల మనము చెయ్యకూడదు.
ఈనాడు క్రైస్తవ్యములో దశమభాగము గురించి మరియు ఇవ్వడం గురించి అపరాధభావముకలుగజేసే ఈ విధానమునే ఎక్కువగా బోధిస్తున్నారు. "దేవునిపరిచర్యకు" ఇవ్వనట్లయితే విశ్వాసులకు గొప్ప శిక్షావిధి కలుగుతుందని భయపెట్టుచున్నారు. దురాశపరులైన ఇటువంటి బోధకుల "పరిచర్యల"కు, ఎంతో కష్టపడి సంపాదించిన వేలాదిరూపాయలను వారు ఇచ్చుచున్నారు. బీదవిశ్వాసులకు ఈనాడు ఇటువంటి బోధకులు ఎంతో కీడు చేయుచున్నారు మరియు ఇదంతయు "ప్రభువైనయేసు నామములోనే" జరుగుచున్నది. ప్రభువైనయేసు బలవంతపెట్టె ఈ విధానమును ఉపయోగించినట్లు అసలు చూడనే చూడము. "మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలు గైకొందురని" ఆయన చెప్పారు (యోహాను 14:15). పేతురుతో ఆయన ఇట్లన్నారు, "మిగతా వాటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించినట్లయితే, నా గొఱ్ఱలకు కాపరిగాఉండి మరియు వాటిని మేపుము (యోహాను 21:15-17). సంతోషముగా విధేయులగువారిని ఆయన ప్రేమించును (2 కొరింథీ 9:7).
ఏ బోధకునిచేతనైనను బలవంతపెట్టబడక, స్వచ్ఛందముగాను సంతోషముగాను చేసే సేవయే క్రొత్తనిబంధనలో దేవుని విధానము. తెలివైనబోధకులు పెట్టే ఒత్తిడికిని మరియు పరిశుద్ధాత్మునియొక్క నిర్మలమైన నడిపింపునకును మధ్య ఉన్న భేదము(తేడా) మనకు తెలిసియుండాలి. ప్రజలను దయ్యములు పట్టినప్పడు, అవి వారి స్వాతంత్ర్యమును దొంగిలించి మరియు వారిని పూర్తిగా అదుపులో పెట్టును. కాని పరిశుద్ధాత్ముడు ఎవరిని దయ్యమువలె పట్టడు. పరిశుద్ధాత్మతో నింపబడతాము. పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత కూడా నిర్ణయించుకునే స్వాతంత్ర్యాన్ని ఆయన మనకు యిచ్చి, పూర్తి స్వాతంత్ర్యాన్ని యిస్తాడు. సాతానువలె మరియు అనేకబోధకులవలె పరిశుద్ధాత్ముడు మన స్వంతచిత్తాన్ని తీసివేయడు లేక బలవంతపెట్టడు.
మనము ఆత్మలో స్వతంత్రులమై నడుచుకోవాలంటే, అపరాధభావన కలిగించే ప్రసంగాలను వెంటనే పసికట్టి(తెలుసుకొని) వాటిని విసర్జించాలి.
నేను యౌవ్వనస్థుడుగా ఉన్నప్పుడు, క్రొత్తనిబంధన సేవకుడుగా ఉండుట అనగా ఏమిటో నాకు తెలియనప్పుడు నేను కూడా ఇటువంటి నేరారోపణ కలిగించే బోధ చేసాను. కాని దాని విషయములో నేను మారుమనస్సు పొంది మరియు దానిని విడిచిపెట్టాను. "నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని" (1 కొరింథీ 13:11). "నేరారోపణ కలిగించే బోధ" ప్రజలను బంధకాలలోనికి నడిపిస్తుంది. అయితే ప్రభువైనయేసు తరువాత పరిశుద్ధాత్మయును ప్రజలను స్వతంత్రులుగా చేయుటకు వచ్చియున్నారు.
నేరారోపణ కలిగించేబోధను స్వీకరించే ప్రతిబోధకుడు అక్షరానుసారమైన వ్యక్తి. కాని అది అతనికి తెలియదు. అక్షారానుసారమైన వ్యక్తులు క్రొత్తనిబంధన లేఖనములను పాతనిబంధనఆత్మతో బోధిస్తారు. క్రొత్తనిబంధననే బోధిస్తున్నామని వారు ఊహించుకుంటారు గాని క్రొత్తనిబంధనఆత్మను కలిగియుండకుండానే (ఆత్మానుసారమైన నవీనస్థితిని గలిగియుండకుండా) బోధించునట్లు సాతాను వారిని మోసగించియున్నాడు. క్రొత్తనిబంధనలోని సువార్త అక్షరానుసారమైన ప్రాచీనస్థితిగలదికాదు గాని ఆత్మానుసారమైన నవీనస్థితిని కలిగియున్నది. ప్రభువైనయేసు యొక్క మాటలే "ఆత్మయు మరియు జీవమును" అయిఉన్నవి (యోహాను 6:63).ఆత్మానుసారమైన పరిచర్య ఎన్నటెన్నటికీ బలవంతపెట్టదు లేక శిక్షావిధికలిగించదు గాని ఎల్లప్పుడు ప్రోత్సహించి, పురికొల్పి మరియు నిత్యనిరీక్షణ కలిగిస్తుంది. మన దేవుడు "మన తలలను దించుకొననియ్యడు (మనలను సిగ్గుపడనియ్యడు)" (కీర్తనలు 3:3).ఆయనకు విధేయులమగుటను బట్టి మనలను ఎన్నటెన్నటికీ సిగ్గుపరచడు. స్కూలులో ఉన్న టీచర్లు విద్యార్ధులు విధేయులగునట్లు వారిని సిగ్గుపరచవచ్చును కాని ప్రేమించే తండ్రులు ఆవిధముగా చెయ్యరు. సంతోషముగా విధేయులగునట్లు వారి పిల్లలను తండ్రులు ప్రోత్సహిస్తారు (1 కొరింథీ 4:14,15). ఈ విషయములో మన మంద(సంఘము)లోని వారియెడల మన వైఖరినిబట్టి మనము తండ్రులమైయున్నామా లేక టీచర్లమైయున్నామా అనునది కనుగొనగలము. మన సంఘాలలో టీచర్లు (కేవలము బోధించేవారు) అవసరములేదు. మనకు తండ్రులు అవసరమైయున్నారు.
పరిశుద్ధాత్ముడు కలిగించే ఒప్పుదలకును మరియు ధర్మశాస్త్రము కలిగించే శిక్షావిధికిని మధ్య ఉన్న తేడాను మనము గుర్తించాలి. నేరారోపణ కలిగించే బోధ ప్రజలను శిక్షావిధిలోనికిని మరియు నిరాశలోనికిని నడిపిస్తుంది. కాబట్టి వారు జయించువారగునట్లు ఆత్మలో జీవసరఫరాను సమృద్ధిగా పొందుకొని, స్వతంత్రులు కాలేరు.
ఒక బోధకుడు నేరారోపణ కలిగించే పద్దతిని స్వీకరించినట్లయితే, అతడు ప్రభువునుగాని లేక పరిశుద్ధాత్మ నడిపించేవిధానమునుగాని ఎరుగడని చూపిస్తున్నది. అనగా అతనికి బైబిలు కేవలము అక్షరానుసారముగా మాత్రమే తెలియునని అది రుజువుపరచుచున్నది. అతడు బోధించే దాని ప్రకారము అతడు జీవించలేడు కాబట్టి అతడు యధార్ధవంతుడు కూడా కాదు. ప్రభువైనయేసు మొదటచేసి(జీవించి) తరువాత బోధించారు (అపొ.కా. 1:2). కాని అప్పటి పరిసయ్యులవలె ఈ బోధకులు ఉన్నారు. గనుక - వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు (మత్తయి 23:3,4).
నేరారోపణ కలిగించే బోధకులు ఆత్మ విషయమై దీనులైయుండరు కాబట్టి వారితో సహవాసము చేయుట చాలా కష్టము. "ఆత్మవిషయమై దీనులైనవారు" అనుమాటలు యాంప్లిఫైడ్ బైబిల్లో "తమ్మునుతాము స్వల్పమైన వారుగా ఎంచుకొనువారు" అని చెప్పబడింది (మత్తయి 5:3). తమ్మునుతాము స్వల్పమైనవారుగా ఎంచుకొనే బోధకులను నాజీవితములో అతి తక్కువమందిని చూచాను. వారి సంఘాలలో ఉన్న సామాన్యవిశ్వాసులకంటే, వారు ఎంతో ఎంతో ముఖ్యమైన వారుగా అనేకమంది బోధకులు తలంచెదరు. అటువంటి గర్విష్టుల బోధను వినేటప్పుడు, దానిలో నుండి నిత్యమైనవాటిలో ఒకటైనను పొందలేనని నాకు తెలియును. కాబట్టి నేను వినను. నేరారోపణచేసేఆత్మ వారిలో వ్యాపించినందున వారి బోధ ఎక్కువగా నేరారోపణ చేసేదిగా ఉంటుంది గాని దేవుని ప్రమాణాలకు సరిపోదు. వారి గురించి వారు "ప్రవక్తలని" అనుకుంటారు గాని నిజమైన ప్రవక్తలకుండే కనికరము వారి కుండదు. అటువంటి దురహంకారముగల బోధకులు పరలోకరాజ్యమును స్వతంత్రించుకొనలేరు (మత్తయి 5:3). పరలోకరాజ్యాన్ని వ్యక్తపరచే స్వతంత్రులుగా చేసేఆత్మతో నింపబడునట్లుగా వారు ఇతరులను నడిపించలేరు. అటువంటి బోధకులు సహోదరులమధ్య అన్యోన్యసహవాసమును కట్టలేరు లేక వారు క్రీస్తుశరీరమును వ్యక్తపరచే స్థానికసంఘమును ఏ స్థలమందైనను కట్టలేరు. వారిని మెచ్చుకొని, పొగడే సమాజములను మాత్రమే కట్టగలరు. అటువంటి దౌర్భాగ్యాస్థితి నుండి దేవుడు మనలను కాపాడునుగాక ఆమేన్.
సాధారణముగా యౌవ్వస్థులు ఇటువంటి బోధ చేయుటను నేను ఎక్కువగా గమనించాను. కాని యౌవ్వనస్థులు తమ్మును తామే తీర్పు తీర్చుకొని, కృపను అంతకంతకు పొందుకొనుచు దేవుని కృపలో ఎదుగని యెడల, వారు అలాగే కొనసాగి పెద్దవారై తరువాత సంఘపెద్దలు కూడా అవ్వవచ్చును.
కాబట్టి ఇతరులు దేవునికి విధేయులగుటకు ఇటువంటి నేరారోపణ కలిగించే బోధ ఎన్నటికీ చెయ్యకుండునట్లు మనము నిర్ణయము తీసుకోవాలి. ఇటువంటి బోధద్వారా మనము నేరారోపణలోనికి వెళ్ళకుండునట్లు ఇటువంటి బోధకులను మనము అనుమతించకూడదు.
ఇటువంటి అక్షరానుసారమైన బోధకులుగా మనము ఉన్నట్లయితే, మారుమనస్సుపొంది మరియు తండ్రులుగా ఉండుటను కోరెదము.
ప్రభువైనయేసు ఈ లోకములో బ్రతికిన దినములన్నిటిలోను కృపతోను, సత్యముతోను నింపబడినవాడై, కృపాసత్యసంపూర్ణుడుగా తన మాటల ద్వారాను, క్రియలద్వారాను కృపను, సత్యమును వ్యక్తపరచుటలో ప్రభువు మహిమను చూడగలము (యోహాను 1:14).
అదే మహిమ మనలో నుండి కూడా వ్యక్తపరచబడునుగాక ఆమేన్ మరియు ఆమేన్.