హెబ్రీ 5:8లో "ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను" అని చదువుతాము. ప్రభువైనయేసు విధేయతను నేర్చుకోవలసియున్నది. "నేర్చుకొనుట" అను పదము విద్యకు సంబంధించినది. ఆయన శరీరధారిగా ఉన్నదినములలో ప్రభువైనయేసు విధేయతను నేర్చుకోవలసి వచ్చింది. పరలోకములో దేవుడిగా, ఆయన ఎవరికీ లోబడలేదు. నీ జీవితంలో ఇంతకుముందుగా దేనినైనను చేయనట్లయితే, దానిని మొదటిసారిగా చేయునప్పుడు నేర్చుకోవలసియుండును. ప్రభువైనయేసు మానవుడుగా భూమిమీదకు వచ్చినప్పుడు ఆయన విధేయతను నేర్చుకున్నారు. అప్పుడు ఆయన తన తండ్రికి మాత్రమేగాక మరియ యోసేపులకు కూడా విధేయత చూపాల్సి ఉంది. మరియ యోసేపులు పాపముగలవారై, అసంపూర్ణులైనవారు. తల్లిదండ్రులందరు చేసే పొరపాట్లు వాళ్ళు కూడా చేసియుండవచ్చును. అయినప్పటికీ ప్రభువైనయేసు వారి విధేయుడైయున్నారు. అది ఎంతో కష్టమైయుంటుంది. ఆయన విధేయత చూపుటలో ఎంతో శ్రమపడియున్నారు. ఆయన జీవితమంతటిలో ఎల్లప్పుడు తండ్రి చిత్తమే చేయుటకు తన స్వంతచిత్తాన్ని ఉపేక్షించుటకు ఆయన శ్రమపడియున్నారు. ఆయన శ్రమలలో గుండా వెళ్ళి విధేయత నేర్చుకున్నారు. కొన్ని విషయాలలో విధేయత చూపుట ఎంతో సంతోషాన్నిస్తుంది. నీ బిడ్డతో ఐస్క్రీమ్ తినమని చెప్పినట్లయితే, సంతోషంగా విధేయత చూపిస్తాడు. అక్కడ ఎటువంటి శ్రమలేదు. కాని తన స్నేహితులతో ఆడుకొనుచుండగా ఆ ఆటను ఆపి వచ్చి ఇంటిపని (హోమ్ వర్క్) చెయ్యమని చెప్పినట్లయితే, అది అతనికి కష్టంగా ఉంటుంది. మన జీవితంలో కూడా కొన్ని విషయాలలో విధేయత చూపుట తేలికగాను మరియు సంతోషంగాను ఉంటుంది. విధేయత చూపుట మంచిదని తెలిసి విధేయత చూపిస్తాం. కాని మనకు ఇష్టంలేనిదాన్ని చేయ్యటం, మన స్వచిత్తాన్ని ఉపేక్షించుకొని చేయుటకు శ్రమపడినట్లయితే, నిజమైన విధేయత పరీక్షించబడుతుంది. ఇక్కడే మన విధేయత పరీక్షించబడుతుంది.
తన్నుతాను ఉపేక్షించుకొనుట ద్వారా ప్రభువైనయేసు విధేయత నేర్చుకొన్నారు. తన తండ్రి దేనినైతే "వద్దని" అన్నారో, దాన్ని ఆయన కూడా "వద్దని" అన్నారు. శ్రమలద్వారా ఆయన విధేయత నేర్చుకొని చివరకు ఆయన సంపూర్ణసిద్ది పొందియున్నారు (హెబ్రీ 5:9). సంపూర్ణునిగా అనగా పరిపూర్ణుడిగా అని అర్ధం. ప్రభువైనయేసు ఆవిధంగా విధేయతలో డిగ్రీ పొందియున్నారు. మనం కూడా ఆ స్థాయికి చేరాలి. ఆయన వలె మనం కూడా అనేక శోధనలు జయించాలి.
ఒక పరీక్షలో తప్పినప్పుడు ఏమి జరుగుతుంది? ఆ పరీక్షలో గుండా మరొకసారి వెళ్ళాలి. ఆఖరిగా మనం అన్ని పరీక్షలు పాసయినట్లయితే, ఆ డిగ్రీ పొందుతాము. అప్పుడు మనం జయించేవారమవుతాము. మన జీవితంలో పొందవలసిన అత్యుత్తమ డిగ్రీ ఇది. వేరే డిగ్రీలన్నియు దీనితో పోలిస్తే పెంటతో సమానం. మన రక్షణంతటకీ కర్తయైయుండి ఆయన విధేయుడైయున్నట్లే మనం కూడా విధేయులమై ఆయనను వెంబడించాలని ప్రభువు అడుగుచున్నాడు. ఆయన ఎదుర్కొనని ఏ శోధననైనను మనలను ఎదుర్కొనమనడు. కాబట్టి మనం నేర్చుకొనుటకు అవసరమైన కృప అంతటినీ ఎల్లప్పుడు పొందుకొని ధైర్యముతో ఆయన కృపాసింహసనము యొద్దకు వెళ్ళదాము రండి. మనం శ్రమపడవలసివస్తే, ఆయన కృపద్వారా శ్రమపడదాం. కాని ఎట్టి పరిస్థితులలోనైను విధేయతను నేర్చుకుందాం.
హెబ్రీ 5:9, "ఆయన సంపూర్ణసిద్ధిపొందినవాడై, తనకు విధేయులైన వారందరికిని నిత్యరక్షణకు కారకుడాయెను" అని చదువుతాము. విధేయత అనే కాలేజీలో ప్రభువైనయేసు నేర్పించేవాడు(ప్రొఫెసర్)గా ఉన్నాడు. ఆయన అన్నింటిలో విధేయత చూపించి, అదే కాలేజీలో అత్యల్పస్థానం నుండి అత్యున్నతస్థానానికి వెళ్ళారు.
దేవుని సేవకులముగా అదే విధేయతతో అదే కాలేజీలో జూనియర్ లెక్చరర్గా ఉండుటకు మనం పిలువబడ్డాము. శ్రమలద్వారా నీవు ఎంత విధేయత నేర్చుకుంటావో అంతగా ఇతరులను విధేయతలోనికి నడిపించుటకు నీవు ప్రభువు సేవకుడిగా ఉంటావు. అదే నిజమైన క్రైస్తవ పరిచర్య. కాని నీవు ఎల్లప్పుడు పరీక్షలలో ఓడిపోవుచున్నట్లయితే, ఈ కాలేజీలో లెక్చరరుగా ఎలా ఉంటావు? "తనకు విధేయులగు వారందరికిని ఆయన నిత్యరక్షణకు కారకుడాయెను"(హెబ్రీ 5:9). నిత్యరక్షణ అంటే కేవలం పాపక్షమాపణ మాత్రమేకాదు గాని ప్రతిరోజు పాపం యొక్క శక్తి(స్వభావం) నుండి రక్షింపబడుచూ ఉండుట.