సంఘనాయకులకు బిరుదులు మరియు జీతాలు
బిరుదులు: “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైననూ తండ్రి అని పేరు పెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకులై యుండవలెను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును (మత్తయి 23:8-12).
ప్రభువైనయేసుయొక్క ఆజ్ఞ ఇక్కడ స్పష్టముగా ఉన్నది. సంఘపెద్దలు ఎటువంటి బిరుదులు పెట్టుకోకూడదు. సంఘములోని ఇతర సహోదరులవలె వారుకూడా “సహోదరులై” ఉండాలి. సంఘములో ఇతరులకంటే తమ్ముతాము హెచ్చించుకొనుటకు చాలామంది సంఘపెద్దలు వారిపేరుకు ముందుగా గౌరవప్రదమైన బిరుదులు పెట్టుకుంటారు. కాని సంఘములో ప్రభువైనయేసు మాత్రమే శిరస్సుగాను మరియు ప్రభువుగాను హెచ్చింపబడాలి. రెవరెండ్, రైట్‍రెవరెండ్, అపోస్తలుడు, ప్రవక్త, పోప్, కార్డినల్, బిషప్, పాస్టర్ మొదలైన బిరుదులన్నియుకూడా ఒకవ్యక్తి తన్నుతాను హెచ్చించుకొని సంఘములో క్రీస్తుకు పోటీగా ఉన్నట్లుంటుంది.
కాని ఒక సంఘపెద్ద “ఒక సేవకుడు”గా ఉండుటకు పిలువబడ్డాడు (మత్తయి 23:11).
ధనము విషయాలు: ధనము విషయంలో పూర్తికాలపు క్రైస్తవపనివారు మరియు సంఘపెద్దలు ప్రభువైనయేసు మాదిరినే వెంబడించాలి ఎందుకనగా ఆయన 3 1/2 సం||లు ఆవిధంగా పరిచర్య చేసారు. ఆయన ఎప్పుడైనను లేక ఎవరికైనను తన ఆర్దిక అవసరాన్ని చెప్పలేదు. ఆయన తన పరిచర్య గురించి ప్రకటించుకోలేదు లేక తన పరిచర్య గురించి ఎవరికీ రిపోర్ట్(ఉత్తరాలు) పంపలేదు. (ఎందుకనగా అదికూడా వేరొకవిదంగా డబ్బును అడిగినట్లే). ప్రభువైనయేసు తన 12 మంది శిష్యులను మరియు వారి కుటుంబాలను పోషించాలి కాబట్టి ఆయన తండ్రియే కొంతమందిని ప్రేరేపించి స్వచ్ఛందంగా ప్రభువుకు కానుకలు ఇచ్చునట్లు చేసారు. ధనమును చూచుకొనుటకు ప్రభువుకు ఒక కోశాధికారి(యూదా) అవసరమైయున్నాడు మరియు అతడు ఆ సంచిలోనుండి దొంగలించేవాడు, దీనినిబట్టి ఆసంచిలో చాలాధనము ఉండి ఉంటుంది.
“పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును, వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి (లూకా 8:2,3).ప్రభువైనయేసు కానుకలు స్వీకరించారు.
అయితే ఆయన తీసుకున్న ధనమును ఆయన చాలా జాగ్రత్తగా ఉపయోగించారు. యోహాను 13:29 లో చెప్పబడినట్లు ఆ ధనమును ఆయన రెండింటికి మాత్రమే వినియోగించారు. 1. అవసరమైనవాటిని కొనుటకు 2. బీదవారికి ఇచ్చుటకు.
మన కుటుంబాలలోను మరియు సంఘాలలోను ఈ మాదిరినే పాటించాలి. అనవసరమైనవాటికి డబ్బును ఖర్చుపెట్టకూడదు. మీకు అవసరమైనవాటిని కొనండి. మిగిలినవాటిని బీదవిశ్వాసులతో పంచుకొనుటను మర్చిపోవద్దు. నీవు పూర్తికాలపు పరిచర్య చేయుచు మరియు దేవుడు ధనమును (ఆస్తిపాస్తులు) అనుగ్రహించినయెడల, అప్పుడు సంఘముమీద ఆధారపడవద్దు. స్వచ్చంధంగా దేవుని పరిచర్య చేయుము.
బాగుగా పాలనచేయు పెద్దలను, విషేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెంట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు (1 తిమోతి 5:17,18). పౌలు ఇక్కడ “ధనము” అను పదము ఉపయోగించలేదు కాని “సన్మానము” అను పదము వాడియున్నాడు. ఒకవేళ ఇది డబ్బుగురించి అయినట్లయితే సంఘస్థులకొచ్చే జీతాలకన్నా రెట్టింపు జీతం పెద్దలకు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించినట్లు అర్ధమవుతుంది. అది తప్పు మరియు పరిశుద్ధాత్ముడు దానిని చెప్పుటలేదు. సంఘపెద్దలకు రెట్టింపు సన్మానము(మెచ్చుకొనుట) మరియు గౌరవించుట గురించి పౌలు మాట్లాడుచున్నాడు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయనట్లే, మన సంఘపెద్దలను సన్మానించాలి. వారి సంఘస్థులనుండి “గౌరవము, మెప్పుపొందుట మరియు కృతజ్ఞత చెల్లించుటయే సంఘపెద్దలు పొందవలసిన ముఖ్యమైన జీతం. అంతేకాని డబ్బుకాదు”.
పూర్తికాలపు క్రైస్తవపనివారికి ధనసహాయము చేయుట గురించి పౌలు 1 కొరింథీ 9:7-18 లో మాట్లాడుచున్నాడు: “ఎవడైనను తన సొంతకర్చుపెట్టుకొని దండులో కొలువుచేయునా? ద్రాక్షతోటవేసి దానిని ఫలము తిననివాడెవడు? మందనుకాచి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారముబట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడా వీటిని చెప్పుచున్నదికదా? - కళ్ళము త్రొక్కుచున్నయెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా? కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకేగదా ఈ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా? ఇతరులకు మీపైని ఈ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు కదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో పాలివారైయున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు. నేనైతే వీటిలో దేనినైననూ వినియోగించుకొనలేదు; మీరు నాయెడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులను వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుటకంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినయెడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయిననూ గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాజీతము”. ఎవరికైతే పరిచర్య చేయుచున్నారో వారియొద్దనుండి భోదకులు మరియు పెద్దలు కానుకలు తీసుకొనవచ్చును.
పౌలు జీతంకొరకు బోధించలేదు. విశ్వాసులిచ్చే కానుకల కొరకు అతడు ఎదురుచూడలేదు. “క్రీస్తుప్రేమ చేత బలవంతపెట్టబడి” అతడు బోధించాడు మరియు సువార్తయొక్క గృహనిర్వాహకత్వము దేవుడతనికి ఇచ్చి యున్నాడు. సువార్తకొరకు మనమేమియు దేవునికి చెల్లించనవసరములేదని అందరు తెలుసుకొనునట్లుగా పౌలు సువార్తను ఉచితముగా ప్రకటించియున్నాడు. ప్రభువు కొరకు పనిచేసే ప్రతి సేవకుడు ఇతరులనుండి కానుకలు తీసుకొనవచ్చని కొత్తనిబంధనలో చెప్పబడింది. అయినప్పటికీ మనము ఈవిధంగా గమనిస్తాం.
1. నెలనెలా ఎవరికీ జీతం ఇవ్వబడేదికాదు. ప్రభువైనయేసు తన శిష్యులకు జీతాన్ని వాగ్ధానం చేయలేదు. అపోస్తలులు జీతం తీసుకోలేదు. ప్రభువైనయేసువలె తమ ఆర్థిక అవసరములకొరకు తమ పరలోకపుతండ్రి ప్రజల హృదయాలను ప్రేరేపిస్తాడని నమ్మియున్నారు. వారి పరిచర్య శక్తివంతముగా ఉండుటకు అటువంటి విశ్వాసజీవితము అవసరమైయుంది. అది వారిని దురాశనుండి కూడా కాపాడింది.
2. కొన్ని సంధర్బాలలో ఈ సదుపాయము కొందరు బోధకులలో దుర్వినియోగం చేయబడిందని పౌలు చూచాడు. కాబట్టి అతడు ప్రకటించే సువార్త సాక్ష్యము నిమిత్తము తాను ఎవరిదగ్గరినుండి తీసుకొనకూడదని నిర్ణయించుకొని తనయొక్క ఆర్ధికావసరం నిమిత్తం తానే పనిచేసి యున్నాడు. 2 కొరింథీ 11:7-13 లో అతడు ఇట్లనుచున్నాడు “మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచూ నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా? మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలినవాడనైతిని. మరియు నేను మీయొద్ద నున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవరిమీద భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులువచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని ఇకముందుకును జాగ్రత్త పడుదును. క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిసయపడకుండా, నన్ను ఆటంక పరచుటకు ఎవరి తరముకాదు. ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలనా? దేవునికే తెలియును. అతిశయకారణము వెదకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపోస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపోస్తలులును మోసగాండ్రగు పనివారునైయున్నారు”.
కాబట్టి మాసిదోనియ (ఫిలిప్పీ) సంఘమునుండి పౌలు కొన్నిసార్లు కానుకలు తీసుకొన్నాడు. కొరింథీలో ఉన్న నకిలీ బోధకులకు వేరుగా ఉండుటకు కొరింథీ క్రైస్తవులనుండి పౌలు ఏమియూ తీసుకొనలేదు.
తెస్సలోనీక సంఘమునుండి కూడా పౌలు ఏమియూ తీసుకొనలేదు “ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికినీ భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మీము మాదిరిగా కనబరచుకొనుటకే ఈలాగు చేసితిమిగాని, మాకు అధికారములేదని చేయలేదు. మరియు మేము మీయొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచెయ్యనియెడల వాడు బోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా” (2 తెస్స 3:8-10).
ఎఫెసీ క్రైస్తవులనుండికూడా పౌలు డబ్బులు తీసుకొనలేదు. అపోస్తలుల కార్యములలో ఇట్లనుచున్నాడు, “కావున నేను మూడు సం||లు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచూ ప్రతి మనిషికిని మానక బుద్ది చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాబివృద్ధిని కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైననూ, బంగారమునైననూ వస్త్రములనైననూ నేను ఆశింపలేదు; నా అవసరములనిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నాచేతులు కష్టబడినవని మీకే తెలియును. మీరును ఈలాగు ప్రయాసబడి బలహీనులను సంరక్షింపవలెననియు - పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైనయేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను” (అ.కా. 20:31-35).
మీ దేశములో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభువుకొరకు పవిత్రమైన సాక్ష్యము కలిగి యుండుటకు నీవు ఏవిధంగా ఉండవలెనో ఎరిగియుండుటకు నీవు మెలకువగా ఉండాలి.
దేవుడు నాటిన సి.ఎఫ్.సి(CFC) సంఘాలన్నిటిలో ఉన్న 100కు పైగా ఉన్న పెద్దలు జీతం తీసుకోకుండా వారినివారే పోషించుకొనుచున్నారు. ఈ విధానము గత 40 సం||లు గా మన సంఘాలలో మంచిగా పనిచేయుచున్నది (ఇండియాలోని ధనిక మరియు పేద గ్రామాలలో). కొన్ని లేఖనాలను చూపించి, ఇతర విశ్వాసులనుండి పొందుకోవాలనే దురాశ కలిగిన బోధకులనుండి మనలను రక్షించింది.
ప్రపంచములోని దాదాపు అన్ని సంఘముల పెద్దలు జీతం తీసుకుంటారు. మేము వారిని తీర్పు తీర్చము. జీతం తీసుకోవద్దని కూడా వారికి చెప్పము. కాని మేము యేమి చెప్పుచున్నామంటే, దేవుని యొద్దనుండి స్పష్టమైన పిలుపు లేకుండా పెద్దజీతం ఇస్తామన్న సంఘములో పాష్టరుగా చేసిన యెడల అప్పుడు వారు దేవుని చిత్తంలో లేకపోవచ్చును.
జీతం తీసుకోవాలని నీవు నిర్ణయించుకొనినట్లయితే, స్వశ్చందంగా సంఘము ఇచ్చే కానుకను తీసుకోవాలిగాని జీతం తీసుకొనరాదు. జీతానికి మరియు కానుకకు ఉన్న తేడా ఇది. డిమాండు చేసి అడిగి తీసుకొనేది జీతం మరియు అడగకుండా ఎదురుచూడకుండ తీసుకొనేది కానుక.
క్రొత్త నిబంధన కాలములో అపొస్తలులు డబ్బు తీసుకొనే విషయంలో ఈవిధంగా ఉన్నారు. క్రైస్తవత్వం ఈవిషయంలో ఏంతో దిగజారింది. డబ్బు విషయాలలో ఓడిపోయినందున క్రైస్తవ పరిచర్యలో దేవుని అభిషేకము మరియు ఆత్మీయ దృష్టి తగ్గిపోయి చాలమంది బోధకులు దేవునియొద్దనుండి చాలా తక్కువ ప్రత్యక్షత పొందుకొనుచున్నారు. ధనము విషయములో నమ్మకముగా ఉన్నవారికి దేవుని ప్రత్యక్షతలో ఉన్న నిజమైన ఐశ్వర్యములు ఇవ్వబడతాయి (లూకా 16:11). మనము ఎవరి దగ్గరనుండి ధనము తీసుకొనుచున్నామనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతియొక్క విశ్వాసినుండి మనం డబ్బును తీసుకొనకూడదు.
ఇటువంటివారి దగ్గరనుండి మనం కానుకనుగాని లేక డబ్బునుగాని తీసుకోకూడదు.
1. దేవుని మూలముగా క్రొత్తగా జన్మించనివారి దగ్గరనుండి తీసుకొనకూడదు. భూమిమీద దేవుని పరిచర్యకు ఇచ్చుట ఎంతో ధన్యకరం. కాని క్రొత్తగా జన్మించిన దేవుని పిల్లలకు మాత్రమే ఆ ఆధిక్యత ఉంది.
2. తమ కుటుంబఖర్చులకు సరిపోయే ధనము లేనివారియొద్దనుండి తీసుకోకూడదు. మొదటిగా వారి కుటుంబఅవసరములు వారు చూసుకోవాలి (1 తిమోతి 5:8; మత్తయి 7:9-13).
3. అప్పులున్నవారియొద్దనుండి మనం డబ్బును తీసుకోకూడదు. అప్పులేకుండా నెమ్మదిగా, సమాధానముతో తన బిడ్డలు జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అటువంటి విశ్వాసులు, మొదటిగా కైసరువి కైసరుకు తరువాత మాత్రమే దేవునికివ్వాలి. దేవునికి కైసరు డబ్బుగాని లేక మరెవరి డబ్బుగాని అవసరం లేదు (మత్తయి 22:21; రోమా 13:8). (అయితే ఇంటికి అప్పు(లోన్) తీసుకొనవచ్చును లేక ఒక బండి కొనుటకు అప్పు తీసుకొనవచ్చును ఎందుకంటే దాని సమాన విలువ చేసే ఇల్లుగాని బండిగాని ఉన్నది కాబట్టి).
4. ఎవరినైన గాయపరచి, వారితో సమాధానపడని వారియొద్దనుండి డబ్బు తీసుకొనకూడదు (మత్తయి 5:23,24).
5. బలవంతముగానో లేక దేవుడు వారికి గొప్ప బహుమానం ఇస్తాడనో ఆశించేవారిదగ్గరనుండి తీసుకొనకూడదు. సంతోషముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును కాబట్టి మనమలాగే ఇవ్వాలి (2 కొరింథీ 9:7).
వేరేవిధంగా చేసే సంఘములనుగాని లేక పెద్దలనుగాని మేము తీర్పు తీర్చము. కాని సి.ఎఫ్.సి సంఘములలో ప్రభువైనయేసు చెప్పినట్లుగానే చేస్తాము.
చెవులుగలవారు వినునుగాక.