నఖిళీ ఉజ్జీవము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
Article Body: 

చి వరి దినాలు విస్తరిస్తున్న మోసముతో మరియు అనేకులైన అబద్ద ప్రవక్తలతో నిండి యుండునని యేసుక్రీస్తు మరియు ఆయన అపొస్తులులు మరల మరల చెప్పారు (మత్త 24:3-5, 11, 24: 1 తిమో 4:1). మరియు అటువంటి వాటిని మనము గత కొద్ది దశాబ్దాలుగా చాలా చూచితిమి.

లక్షల కొద్ది క్రైస్తవులు ఎందువలన ఈ అబద్ధ ప్రవక్తలు మరియు ఈ "నఖిలీ ఉజ్జీవములు" వలన మోసపోవుచున్నారు? ఎందువలన అనేక మంది బోధకులు వ్యభిచారము మరియు ధన వ్యామోహములో పడిపోవుచున్నారు.

నేను చూచిన కొన్ని ముఖ్య కారణములు :

1. అనేక మంది క్రైస్తవులకు క్రొత్త నిబంధన ఏమి బోధిస్తున్నదో ఈనాడు తెలియదు. దానికి కారణం వారు దానిని జాగ్రత్తగా చదువకపోవుట; అందువలన వారు క్రొత్త నిబంధన బోధించునవి కాక వారి నాయకులు బోధించునవే అనుసరించుచున్నారు.

2. వారి యొక్క గుణగణాల కంటే (మానవతాతీతమైన జీవితము) సూచక క్రియలు (మానవాతీత వరములు) వారికి ప్రాముఖ్యముగా నున్నవి.

3. ఆత్మీయ సంపద కంటే భౌతిక సంపద ఎక్కువ ప్రాముఖ్యమగుచున్నది.

4. వారు మానసికమైన ఆవేశానికి లేదా మానసిక గమనమునకు మరియు నిజమైన పరిశుద్ధాత్మ సంచారమునకును మధ్య తేడాను గుర్తించలేకపోవుచున్నారు. దీనికి కారణము మరల క్రొత్త నిబంధన తెలియకపోవుట.

5. వారు మానసిక శాస్త్ర మూలమున కలుగు స్వస్థతకు (మనసులో మంచి వైఖరులు కలిగించుట ద్వారా కలుగు స్వస్థత) యేసు నామములో మానవాతీతముగా కలుగు స్వస్థతకు మధ్య నుండిన తేడాను గ్రహించలేకపోవుచున్నారు.

6. అంతరంగములో ప్రభువునందు ఆనందించుట కంటే భావోద్రేకములు మరియు విపరీతమైన భౌతిక ప్రదర్శనలను ఎక్కువ ప్రాముఖ్యముగా చూచుచున్నారు.

7. నాయకులకు, దేవునితో వారియొక్క అంతరంగ నడక కంటే జనులకు చేయు పరిచర్య ఎక్కువ ప్రాముఖ్యమగుచున్నది.

8. ఈ నాయకులకు, దేవుని యొక్క ఆమోదము కంటే మనుష్యుల యొక్క ఆమోదము ఎక్కువ ప్రాముఖ్యమగుచున్నదు.

9. ఈ నాయకులకు వారి కూటములకు వచ్చు జనులు దేవునికి పూర్తిగా సమర్పించుకొంటిరా, లేదా? అనుదానికంటే ఎంతమంది హాజరవుతున్నారనేదే ప్రాముఖ్యముగా నుండుచున్నది.

10. ఈ నాయకులకు ఒక స్థానిక సంఘమును నిర్మించి ఆ స్థానిక సంఘమునకు సేవకులుగా నుండుట కంటే (యిర్మియా 6:13) వారి స్వంత జాగీరులను మరియు వారి ఆర్థిక సామ్రాజ్యములను కట్టుకొనుట ఎక్కువ ప్రాముఖ్యమైనది.

ఇవన్నీ కూడా యేసుప్రభువు బోధించిన వాటికి ఎంతో వ్యతిరేకమైనవి. క్రీస్తుకు వ్యతిరేకమైనది "క్రీస్తు విరోధి" అని క్రొత్త నిబంధనలో పిలువబడినది. ఒకవేళ దీనిని క్రైస్తవులు తేటగా చూడనట్లయితే, క్రీస్తు విరోది తన యొక్క అబద్ధపు సూచక క్రియలు మరియు అద్భుతములతో లోకమును తలక్రిందులు చేయునప్పుడు (2 థెస్స 2:3-10) వారు కూడా గ్రుడ్డిగా అతడిని అంగీకరించుదురు. పైన చెప్పుకొనిన అంశములకు సంపూర్తిగా వ్యతిరేకముగా నుండుట క్రీస్తు ఆత్మతో నడిపింపబడుటగా యున్నది.

ముందుగా నేను వివరించినట్లు (మత్తయి 5 నుండి 7 అధ్యాయములు) నిత్య జీవమునకు పొవు మార్గము మరియు ద్వారము, ఈ రెండూ కూడా చాలా ఇరుకైనవి. అబద్దప్రవక్తలు వచ్చి మార్గము మరియు ద్వారము, ఈ రెండు ఇరుకుకాదు విశాలమని మీతోచెబుతారు. వారినిగూర్చి జాగ్రత్తగా వుండుడి. వారి ప్రవర్తన వలన కలుగు ఫలమును పరిశీలించుట ద్వారా మీరు సుళువుగా వారిని గుర్తించవచ్చు: కోపము నుండి విడుదలపోందారా, స్త్రీ వ్యామోహమునుండి విడుదలపొందారా, ధనాశనుండి విడుదలపొందారా మరియు వస్తుసంపదను ఆశక్తితో వెదకుటనుండి(లోకస్తులు వెదకునట్లు) విడుదలపొందినారా? అనునవి పరిశీలించుట. ఇక్కడ (మత్తయి 5:21-32 మరియు 6:24-34 అధ్యాయములు) చెప్పబడినట్లు బోధిస్తున్నారా?. ఈ అబద్ద భోధకులు ఎన్నో మానవాతీత వరములను అభ్యాసము చేయుచు ఆశ్చర్య కార్యములను చేయవచ్చు మరియు నా నామములో ప్రజలను స్వస్ధపరచవచ్చు అయినప్పటికి ఇంకా వారినందరిని అంత్యదినమున నరకానికి పంపిస్తాను, దానికికారణం వారు నన్నెరుగరు(నేను పరిశుద్దుడను) మరియు వారు వారి వ్యక్తిగత జీవితాలలో పాపాన్ని విడచిన వారు కారు (మత్తయి 7:21-23) . కాబట్టి ఒకవేళ నీవు సంఘమును బండమీద కట్టాలనుకొంటే అది ఎప్పటికిని కదిలించబడదు లేదా పడిపోదు లేదా నిత్యత్వమువరకు నిలచివుంటుంది, నేను ఇప్పటివరకు మీతో చెప్పిన వాటియందు చాలా జాగ్రత్త కలిగివుండాలి (మత్తయి 5 నుండి 7 అధ్యాయముల వరకు). మరియు మీకు ఆజ్ఞాపించబడినవి యావత్తు గైకోనాలని ప్రజలకు భోధించాలి. అప్పుడు సధాకాలము నేను మీతోవుంటాను నా అధికారము మిమ్ములనువెంబడిస్తుంది (మత్తయి 28:20,18). ఒకవేళ మీరు వినువారు మాత్రమే అయివుండి దానిని గైకొననట్లయితే అప్పుడు నీవు కట్టిన సంఘము కంటిచూపునకు పెద్దదిగాను మనుష్యులను మెప్పించేదిగా వుంటుంది, కాని ఒకదినమున అది కచ్చితముగా కూల్చివేయబడుతుంది(మత్తయి 7:25)

అటువంటప్పుడు మనము కదలనటువంటి సంఘమును ఈ రోజుల్లో ఎట్లు నిర్మించగలము?

1. మనము కొండమీద ప్రసంగము ప్రకారము జీవించవలెను (మత్త 5 నుండి 7 అధ్యాయములు) మరియు ఎల్లప్పుడు దానిని బోధించవలెను.

2. మనము పాత నిబంధన ప్రకారము కాక క్రొత్త నిబంధన ప్రకారము జీవించవలెను. దీనికొరకు, మనము రెండు నిబంధనల మధ్య నుండిన వ్యత్యాసమును తేటగా తెలుసుకొనవలెను (2 కొరి 3:6). మనము క్రొత్త నిబంధనను తప్పక బోధించవలెను.

ఈ దినము బోధకులు ఏదైనా తీవ్రమైన పాపములో పడినప్పుడు, వారి పాత నిబంధనలో పాపములో పడిన పరిశుద్ధుల ఉదాహరణలు తీసుకొని వారిని వారు సమర్ధించుకొందురు. (ఆ విధముగా ఆదరణ పొందుదురు). మరియు కొంతకాలము మౌనముగా నుండిన తరువాత తిరిగి వారి పరిచర్యను కొనసాగింతురు. వారు వ్యభిచారము చేసిన దావీదు మరియు వ్యాకులత చెందిన ఏలియాలను ఉదహరించుదురు మరియు "దేవుడు వారిని తిరిగి ఉపయోగించుకొనెను" అని చెప్పుదురు. కాని జీవితాంతము వరకు విజయముతోను మరియు పవిత్రతతో జీవించిన పౌలు యొక్క మాదిరిని ఉదహరింపరు.

ఈనాడు మనము అనుసరింపవలసిన మాదిరి క్రొత్త నిబంధన పరిశుద్ధులు గాని పాత నిబంధన పరిశుద్ధులు కారని ఈ బోధకులు మరియు (అనేకమంది క్రైస్తవులు) చూడరు. ఈ కృపకాలములో మనకు అధికమైన కృప యివ్వబడినది. మరియు "ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడినదో వారి నుండి ఎక్కువుగా అడుగుదురు" (లూకా 12:48). యేసుప్రభువు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి మరియు మనకు మాదిరి మరియు ఈనాటి మన విశ్వాసమునకు కర్తయై యుండెను. అంతేకాని దావీదు లేక ఏలీయాల కాలము నాటి విశ్వాసమునకు కాదు. పాత నిబంధన పరిశుద్ధుల (హెబ్రీ 11వ అధ్యాయములో చెప్పబడిన వరుస) కు మరియు యేసుకు నుండిన తేడా, హెబ్రీ 12:14లో చాలా తేటగా చెప్పబడినది. కాని చాలా తక్కువ మంది దీని యొక్క యదార్థతలో జీవించుదురు. చాలా తక్కువ మంది క్రొత్తనిబంధనలో దేవుడు మన కొరకు మరి శ్రేష్ఠమైన దానిని ఏర్పాటు చేసెను" అను దానిని చూడలేదు (హెబ్రీ 11:40).

మనము జాగ్రత్త కలిగి మెళకువగా నుండక పోయినట్లయితే, సైతాను కుయుక్తి కలిగిన శత్రువు కాబట్టి మనలో ఎవరమైనా అనేక మంది బోధకులు పడిపోయిన మార్గములోనే మనమును పడిపోవచ్చును. మన యొక్క భద్రత, కేవలము క్రొత్త నిబంధన బోధకు ఉన్నది ఉన్నట్లుగా విధేయత చూపుటలో మరియు దైవికమైన నాయకత్వమునకు లోబడుటలో నున్నది ("దైవికమైన" నాయకత్వము అనగా, నేను పైన చెప్పిన వరుసలోని పది తప్పుడు విషయములలో ఒక్కటి కూడా లేనివాడని అర్థము). ఇతరులు చేసిన తప్పుల నుండి మనము నేర్చుకొనినట్లయితే, మనము ఇతరులు చేసిన తప్పులను చేయకుండా తప్పించుకొనవచ్చును.

అందువలన మన ముఖములను ప్రభువు ముందు అన్నివేళలా ధూళిలో ఉంచుకొందుము - ఎందుకనగా అక్కడనే మనము యోహాను పొందినట్లు దైవికమైన ప్రత్యక్షతను పొందుదుము (ప్రక 1:17). మనలను మనము తగ్గించుకొనినట్లయితే మనము జయించువారుగా నుండుటకు కావలసిన కృపను పొందుకొందుము (1 పేతు 5:5) మరియు పరిశుద్ధాత్మ మనకు దేవుని యొక్క వాక్యములో సత్యమును చూపించినప్పుడు మరియు మన గూర్చిన సత్యమును మనకు చూపించినప్పుడు మనము సంపూర్తిగా నిజాయితీగా యుండినట్లయితే మరియు పాపమంతటినుండి "మనము రక్షింపబడునట్లు సత్యమును ప్రేమింతుము". ఆ విధముగా మనము మోసమంతటి నుండి దేవుని చేత కాపాడబడుదుము ( 2 థెస్స 2:10,11 ). ఆమెన్.