WFTW Body: 

దేవుడు సంఘమునుండి, "గర్విష్టులను, అతిశయించువారిని" తీసివేయును (జెఫన్యా 3:8-17).

అపొస్తలుడైన యోహాను అతని రోజుల్లో ఇది జరుగుట చూచెను. "వారు మనలోనుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులుకారు; వారు మన సంబంధులైతే మనతోకూడా నిలచియుందురు; అయితే వారందరూ మన సంబంధులుకారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్ళిరి" అని అతడు చెప్పెను (1 యోహాను 2:19).

ప్రతీ సంఘముయొక్క పెద్దలు వారి సంఘములో ఎటువంటి ఆత్మీయ ప్రమాణమును నిలబెట్టవలెనో నిర్ణయించుదురు. పరిశుద్ధతయొక్క ప్రమాణాలులేని సంఘములను ఎవరు విడచి వెళ్ళిపోరు. కాని యేసు బోధించిన ప్రమాణాలనుబట్టి జీవించగోరు సంఘములు, యేసు కనుగొన్నట్టే, అనేకులు వారిని వదిలివెళ్ళుట కనుగొందురు. ఇది మా మధ్య కూడా జరుగుట మేము చూచితిమి.

మొట్టమొదటిగా మా సంఘములను వదలివెళ్ళినవారు ధనికులు మరియు అధికారం కలిగిన వారు (గొప్పవారు) ఎందుకంటే వారు లోకములోను మరియు ఇతర సంఘములలోనూ పొందే ప్రాధాన్యతను మామధ్య పొందలేకపోయిరి. గనుక వారు అభ్యంతరపడి వెళ్ళిపోయిరి. వారిని యేసు శిష్యులుకాకుండా ఆటంకపరచినది వారి ధనము లేక అంతస్తు కాదుగాని వీటిని బట్టి వారికున్న గర్వమే. మేము ఎవరి భూసంబంధమైన ఆస్థినిగాని అంతస్తునుగాని లెక్కచేయలేదు. వారు ధనికులైనా పేదవారైనా మేము దీనులను దైవభక్తిగలిగినవారిని మాత్రమే గౌరవించాము (కీర్తన 15:4).

మరికొందరు మా సంఘాలలో పెద్దలు కావాలని కోరుకొనిరి, వారు పెద్దలుగా నియమించబడని కారణముగా మమ్మును వదలివెళ్ళిపోయిరి! మరికొందరు పెద్దలుగా నియమింపబడినవారు, వారి పనిలో అపనమ్మకముగా నుండుటచేత, వారిపెద్దరికమునుండి దిగిపొమ్మని అడగబడిరి గనుక మమ్మును వదలివెళ్ళిపోయిరి. కొందరు వారికున్న బోధించు సామార్ధ్యాలద్వారా డబ్బును సంపాదించాలని కోరుకొనిరి (1 పేతురు 5:2). అయితే సువార్త ప్రకటించుట ద్వారా డబ్బును సంపాదించేవారినుండి దూరముగా ఉండమని మనము ఆజ్ఞాపించబడితిమి (1 తిమోతి 6:3). ఇతరులు మందపైన ప్రభువులుగా ఏలిరి (1 పేతురు 5:3). వారిలో కొందరు జనులను ప్రభువుతో కాకుండా వారితోనే జతపరచుకొనిరి (అపొ.కా. 20:30)! దేవుడు ఈ పెద్దలందరి స్థానములో ఇంకా శ్రేష్టమైన వ్యక్తులనిచ్చి ఆయనే వారిని తీసివేసెనని మాకు నిర్ధారించెను.

ఇతరులు మావంటి ఒక బీద భారతీయ సంఘముతోకాకుండా, ఒక ధనిక పాశ్చాత్య సంఘముతో జోడించబడి ఉండాలని కోరుకున్నారు. కాబట్టి మమ్మును వదలివెళ్ళిరి. చాలామంది భారతీయ క్రైస్తవులు పాశ్చాత్య క్రైస్తవులు ఆత్మీయముగా ఉత్తమమైనవారని నమ్ముదురు కాబట్టి వారికి దాసోహం వహించుదురు. భారతదేశములో చాలా సంఘాలు ఒక అమెరికా వ్యక్తినిగాని, ఒక ఐరోపా వ్యక్తినిగాని వారి మధ్య ప్రధానమైన బోధకునిగా లేకుండా ప్రత్యేకకూటములు జరిపించరు. ఈ విధముగానే వారు జనులను వారి కూటములకు ఆకర్షించగలరు! కాని మేము అన్ని జాతుల ప్రజలను మాతో సమానులుగా ఎంచి, మా సంఘములకు ప్రజలను ఆత్మాభిషేకముచేతను మేము ప్రకటించే సందేశముచేతను ఆకర్షించాలని చూచాము. కాని బోధకుని చర్మపు రంగు (జాతిని) బట్టి కాదు!! అనేక భారతీయ క్రైస్తవులు ఆర్థికలబ్ది కోసము మరియు విదేశాలకు ఉచిత ప్రయాణాల కోసము పాశ్చాత్యగుంపులను పట్టుకొందురు!! మేము ఇటువంటి "స్వంతలాభము వెతుక్కొనుటకు" వ్యతిరేకముగా నిలబడినాము.

మేము ప్రకటించే పరిశుద్ధత యొక్క ప్రమాణములు చాలా ఉన్నతంగా అనిపించినందున మరికొందరు మమ్మును వదలివెళ్ళిరి! మేము శిష్యత్వమును, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును (ఆయన వరములను), తెలిసిన ప్రతి పాపముపై విజయమును, కొండమీద ప్రసంగమును (మత్తయి 5,6,7 అధ్యాయములు), సంపూర్ణులగుటకు సాగిపోవుటగురించి, యేసు నడచినట్లు నడచుటగురించి దైవభక్తి కలిగిన కుటుంబజీవితము గురించి, ప్రతిదినము సిలువనెత్తుకొనుట గురించి, లోకసంబంధమైన ఆత్మనుండి వేర్పాటు గురించి, ధనాపేక్షనుండి విడుదలను, ఉపవాసం మరియు ప్రార్థననూ, అందరిని హృదయపూర్వకముగా క్షమించుటను, యేసు మనలను ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించుటను, స్థానిక సంఘమును క్రీస్తుశరీరముగా కట్టుట మొదలగునవి బోధించాము. ఇటువంటి బోధ కొందరిని అభ్యంతరపరచెను గనుక వారు మమ్ములను వదిలివెళ్ళిపోయిరి. కాని ఇది మమ్ములను కలవర పరచలేదు, ఎందుకనగా అనేకులు యేసు సందేశమును బట్టి అభ్యంతరపడిరి, ఆయనను వదిలివెళ్ళిరని మాకు తెలియును (యోహాను 6:60,66). కాని వారి పిల్లల చదువుకొరకు శ్రేష్టమైన బడులను, వారి వైద్యచికిత్స కొరకు శ్రేష్టమైన ఆసుపత్రులను ఎంచుకొనే క్రైస్తవులు, వారి ఆత్మీయ సహవాసము కొరకు తక్కువ పరిశుద్ధత ప్రమాణాలు కలిగిన సంఘాలను ఎంచుకొనుట మమ్ములను ఆశ్చర్యపరచెను. వారు ఆత్మీయ సంగతులకంటే భూలోక సంగతులకు, వారి ఆత్మలకంటే వారి దేహములకు ఎక్కువ విలువనిచ్చు వారని ఇది ఋజువు పరచును.

కాని భక్తిపరమైన జీవితంకొరకు ఆసక్తిలేని కొందరు మా సంఘములలో కొనసాగుటకు ఎంచుకొనుట మమ్ములను ఇంకా ఆశ్చర్యపరచెను. వారు మా మధ్య వారి కుటుంబాల కొరకు మంచి వాతావరణమును కనుగొనుట వలననే మాతో ఉండిరని మేము కనుగొంటిమి. మా సంఘము సభ్యత్వపు రుసుములు తీసుకొనని ఒక మంచి క్లబ్బువలె నుండెను!! కాబట్టి కొందరు "బబులోను" క్రైస్తవులు మా సంఘములలో కొనసాగిరి. యేసుకూడా తన సంఘములో ఒక యూదా ఇస్కరియోతును కలిగియుండెను!

అయితే మా సంఘములలోనున్న పెద్దల మధ్య ఉన్నతమైన ప్రమాణాలను కలిగియుండాలని వారికొరకు తరచు కూటములు, ప్రత్యేక సదస్సులను జరిపితిమి. దేవుడు కొంతమంది ఉత్తమమైన వ్యక్తులను మా సంఘములలో పెద్దలుగా ఉండుటకు లేవనెత్తెను. వారిలో చాలామంది అనర్గలంగా మాట్లాడగలిగే బోధకులు కాదు, కాని వారు క్రీస్తు మహిమను వెదకిరి. మరియు దేవుని ప్రజల శ్రేయస్సు, క్షేమముకొరకు యదార్థమైన ఆసక్తికలిగియుండిరి (ఫిలిప్పి 2:19-21). ఒక ప్రదేశములో అటువంటి సహోదరుడిని ఒక్కడినైనా మేము కనుగొనలేకపోతే అక్కడ మేము ఒక సంఘాన్ని ప్రారంభించేవారిమి కాదు. ఎందుకనగా భక్తిపరుడైన కాపరిలేకుండా గొఱ్ఱెలు చెదరిపోవునని మేము గ్రహించాము.

ఈ రోజున మా సంఘములను చూచినప్పుడు, దేవుడు మేముండగోరిన స్థానమునకు చాలా దూరముగా ఉన్నామని మేము చూడగలము. కాని మేము సంపూర్ణములగుటకు సాగిపోవుచున్నాము. మాతో ఎవరు చేరుతారో, ఎవరు వదిలివెళ్ళిపోతారో అనుదానితో నిమిత్తంలేకుండా యేసు బోధించిన పరిశుద్ధతయొక్క ప్రమాణములను కొనసాగించుటకు కోరుకొనుచున్నాము.

పాతనిబంధనలో సాక్ష్యపు గుడారము ఉన్నట్లే సంఘము దేవుని నివాసస్థలము. ఆ మందిరమునకు మూడు భాగములుండెను - బయట‌ఆవరణము, పరిశుద్ధస్థలము, అతి పరిశుద్ధస్థలము. బయటి ఆవరణములో గొప్ప సంఖ్యగల ప్రజలు బలిపీఠముచుట్టూ, గంగాళముచుట్టూ కిక్కిరిసియుండిరి. ఇది పాపక్షమాపణను, నీటి బాప్తిస్మమును సూచిస్తుంది. అయితే పరిశుద్ధ స్థలములో, జనుల సంఖ్య తక్కువగా ఉండెను. అక్కడ దీపవృక్షము, రొట్టెలు ఉంచినబల్ల, ధూపమువేయు వేదిక ఉండెను, ఇవి పరిశుద్ధాత్మ అభిషేకమును, దేవుని వాక్యధ్యానమును, ప్రార్థనను సూచిస్తున్నవి. కాని పాతనిబంధన కాలములో అతిపరిశుద్ధ స్థలములోనికి ఎవరూ వెళ్ళగలిగేవారుకాదు. ఈ పవిత్ర స్థలమే ఈ రోజున, దేవునితో సహవాసమును కోరుకొనేవారికి, తమకున్నదంతా ఆయనకు సమర్పించినవారికి, ఆయనను ఆత్మతోను సత్మముతోను ఆరాధించుటకు కోరుకొనేవారికి తెరచియున్నది.

ఈ సాక్ష్యపు గుడారముయొక్క మూడు భాగములు దేవునితో సాన్నిహిత్యములో మూడు స్థాయిలను చూపిస్తుంది. ప్రతియొక్క సంఘములో (మా సంఘముతోసహా) ఈ మూడు స్థానములలో ఒక దానిలో జీవించుటకు (నివసించుటకు) ఎంచుకొన్న జనులు ఉందురు. అయితే జయించువారు అన్నివేళలా అతిపరిశుద్ధ స్థలములో నివసించుటకు ఎంచుకొనేవారు. కాబట్టి చివరివరకు ప్రభువుకు నమ్మకస్థులుగా ఉందురు. ఇటువంటివారే మా సంఘములలో మరియు ప్రతిసంఘములో నిజమైన బలముగా ఉందురు.