దేవునికి కావలసిన భక్తిగల స్త్రీలు

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
Article Body: 
దేవుడు ప్రారంభములో హవ్వను సృష్టించినప్పుడు స్త్రీ జీవితము ద్వారా ఆయన ఎటువంటి మహిమను పొందాలని ఉద్దేశించెనో, దానిని నమ్మకంగా ప్రత్యక్ష పరచే స్త్రీలు ఈనాడు దేవునికి అవసరమైయున్నారు. భర్తకు సహాయకురాలుగా ఆమె యొక్క మహిమ దేవుడు హవ్వను సృష్టించినప్పుడు ఆమె ఆదాముకు “సహాయకురాలు”(Helper) గా ఉండునట్లు ఆమెను సృష్టించెను (ఆది 2:18) ఈ పరిచర్య యొక్క మహిమను, యేసు ప్రభువు పరిశుద్ధాత్మ గూర్చి “ఆదరణకర్త” (Helper) గా చెప్పినప్పుడు మనము గుర్తించగలము (యోహాను 14:16) పరిశుద్ధాత్ముడు ఎలాగు కనబడకుండా, మౌనముగా నుండినా శక్తివంతముగా విశ్వానికి ఎలా సహాయము చేయునో, స్త్రీ కూడా మగవాడికి అలా సహాయము చేయుటకు సృష్టింపబడినది. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య “తెరవెనుక నుండి” పని చేసేది. స్త్రీలు కూడా అలాంటి పరిచర్యలో ఉండవలెను. యేసుప్రభువు యొక్క జీవితము కూడా స్త్రీలకు మాదిరి కరమైనదే. పురుషుడు ఎలాగు స్త్రీకి తలగానుండునో అట్లే దేవుడు (తండ్రి) క్రీస్తుకు తలగా ఉన్నాడని దేవుని వాక్యము చెప్పుచున్నది (1 కొరి 11:3) యేసు ప్రభువు ఎప్పుడును తన తండ్రికి లోబడి జీవించేవారు. దేవునికి భయపడే స్త్రీ కూడా తన భర్త విషయంలో అలాగే ఉండును. హవ్వ తన నిర్ణయం తీసుకొనే ముందు తన భర్తతో సంప్రదించకపోవుటయే ఆమె ఏదేను వనములో చేసిన గొప్ప పొరపాటు. ఆ విధముగా సైతాను ఆమెను మోసగించాడు (1 తిమోతి 2:14) హవ్వ ఎక్కడైతే తప్పిపోయినదో ఆ విషయంలో, యేసు ప్రభువు తన తండ్రికి లోబడినట్లుగా మరియు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా (ఎఫె 5:24) స్త్రీలు తమ భర్తలకు లోబడుటలో నుండిన మహిమను ప్రత్యక్షపరచుటకై దేవుడు ఈనాడు క్రైస్తవ భార్యలను పిలిచెను. లూసిఫిరు యొక్క తిరుగుబాటు ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించినది, క్రీస్తు యొక్క విధేయత ద్వారా రక్షణ వచ్చినది. దేవుని అధికారానికి అణకువతో లోబడే ఆత్మే లోకములో అతిగొప్ప శక్తి - ఎందుకంటే అది క్రీస్తు యొక్క ఆత్మయై ఉన్నది. ఆ ఆత్మ, తిరుగుబాటు చేసే ఆత్మలన్నిటిని సిలువపై గెలిచినది. ఒక భార్య తన భర్తకు లోబడినప్పుడు, నిజానికి ఆ విదముగా చేయమని చెప్పిన దేవుని వాక్యపు అధికారానికి లోబడుచున్నది. మరియు ఆ విధముగా ఆమె చేయుటకు లోకములో నుండిన అతి గొప్పశక్తి ఆమెపై ప్రభావము చూపుట చేత క్రీస్తు నెరుగని భర్తలు కూడా ఆ శక్తిచేత జయింపబడుదురు (1 పేతు 2:1-2) ఆమె యొక్క ఇహలోక జీవితములో ఆమె ఆటువంటి లోబడే ఆత్మతో నుండినట్లైతే, ఆమె ఒక జయించు స్త్రీగా నుండి, యేసు ప్రభువుతో కలసి యుగయుగములు పాలించును (ప్రక 3:21). ఇక్కడే సైతాను తిరిగి స్త్రీలను మోసగిస్తున్నాడు. దేవదూతలను ఎలా తిరుగుబాటు ఆలోచనతో తప్పుత్రోవను పట్టించాడో అలాగే స్త్రీలనూ తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. ఒక తిరుగుబాటుచేసే భార్య తన ఇంటిని పనికిరాని ఏ ఎడారి కంటే కూడా భయంకరముగా తయారు చేయును (సామెతలు 21:19లో చెప్పబడిన దానికి ఉద్దేశమదే). దానికి బదులుగా ఒక గుణవతియైన లోబడే భార్య తన భర్తను రాజును చేయుట ద్వారా తన ఇంటిని ఒక రాజ ప్రాసాదముగా మార్చును (సామెతలు 12:4). ఆత్మీయముగా చెప్పుకొన్నట్లయితే నీ గృహము ఒక రాజ ప్రాసాదమైనా కావచ్చును లేక ఒక ఎడారి అయినా కావచ్చును. అది నీవు ఎటువంటి భార్యవు అను దానిపై ఆధారపడియుండును. అందుచేతనే దేవుడు వినయము, అణకువ గల ఆత్మను ఎక్కువ విలువైనదిగా చూచును (1 పేతురు 3:4). సామెతలు 31:10-31లో గుణవతియైన భార్య యొక్క గుణములు గూర్చి చెప్పబడినది. అందులో ఆమె హృదయము, చేతులు మరియు నాలుక గూర్చి చక్కగా వివరింపబడినది. ఆమె సొగసు గూర్చి ఏమీ చెప్పబడలేదు, పైపెచ్చు అవి వ్యర్ధమైనవియు మరియు మోసకరమైనవని చెప్పబడెను (30వ). అందులో చెప్పబడిన గుణవతికి దేవునికి భయపడే హృదయమున్నది (30వ). ఇదే ఆమె జీవిత మంతటికి పునాదిగా నున్నది. ఆమె తన చేతులను బట్టలుతుకుతూ, వంట చేస్తూ, మొక్కలు నాటుతూ మరియు బీదలకు సహాయపడ్తూ ఉపయోగించేది (13-22వ). ఆమె అందముగా లేకపోయినా దేవుని భయము కలిగి, కష్టపడి పని చేయుచు దయకలిగియుండేది. దేవుని యొక్క మహిమ ఆమె యొక్క స్వచ్ఛమైన హృదయము ద్వారాను, గరుకుగానుండిన చేతల ద్వారాను మరియు సున్నితముగా మాట్లాడే నాలుక ద్వారాను కనపరచబడుచుండెను. (లోకస్థులైన స్త్రీలు, దీనికి వ్యతిరేకముగా అపవిత్రమైన హృదయము కలిగియుండి, మెత్తని చేతులు కలవారై, కరుకుగా మాట్లాడే నాలుకను కలిగియుందురు). ఈ విషయాలలోనే దేవుడు తన మహిమను చూపుటకు ఈనాడు స్త్రీల గూర్చి చూచుచుండెను. ఒక భార్యగా ఈ గుణవతియైన భార్య తన భర్తకు నిజమైన సహాయకురాలుగా నుండినది. ఆమె తన భర్తకు ఆమె జీవితాంతము వరకు ఒకే విధముగా - అరుపులతో, కేకలతో, మూర్చలతో కాకుండా అతడికి మేలు చేయును. ఇంకొక మాటలలో చెప్పవలెనంటే అతడిపై ఆమెకుండిన మొదటి ప్రేమను ఎప్పటికీ ఆమె పోగొట్టుకొనదు. ఆమె అతడి ఉద్యోగమునకు, సేవలో పిలుపునకు తగినట్లుగా సర్దుకొని, అతడి రాబడికి తగినట్లు ఇంటి ఖర్చులలో జాగ్రత్తచేసి, డబ్బు ఏమీ వ్యర్ధమవకుండునట్లు పొదుపుగా నుండి జాగ్రత్తగా ఖర్చుచేయును. ఆమె భర్త ప్రభువు పరిచర్యకు ఉపయోగపడునట్లు అతడిని ఇంటి వ్యాపకాల నుండి స్వేచ్ఛ నిచ్చును (23-27వ). అటువంటి స్తీని అమెభర్త లోకములో నుండిన అందరు స్త్రీల కంటే నీవు శ్రేష్టమైన దానవు (29వ) అని పొగుడుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ విధముగా అందరిలో పొగడుబడుటకు కూడా అర్హురాలే (31వ). ఎందుకంటే స్త్రీగా ఆమె యొక్క పిలుపులో మహిమను ఆమె గ్రహించినది (31వ). మన ఇళ్లల్లో “పరిశుద్ధులకు పరిచారము చేయుట” గూర్చి క్రొత్త నిబంధన ఎక్కువగా చెప్పినది. “ఆకలి గొన్నవారికి ఆహారమిచ్చుచు, రాత్రియందు ఉండుటకు చోటు, అక్కరగొన్న వానికి స్థలము నిచ్చుచు సంతోషముతో శ్రద్ధగా ఆతిధ్యమిచ్చుడి (1 పేతురు 4:9, రోమా 12:13). ఆతిథ్యము విషయములో ఇంటిలో భార్యదే ముఖ్యమైన బాధ్యత. ఆమె ఒక ప్రవక్తకాకుండానే, ఒక ప్రవక్తను కేవలము తన ఇంటిలోనికి ఆహ్వానించుట ద్వారా ఆమె ఒక ప్రవక్త ఫలమును పొందును (మత్త 10:41). అలాగే యేసు క్రీస్తు శిష్యులలో అతిచిన్న వానికి ఆతిథ్యమిచ్చుటచేత ఆమె తగిన ప్రతిఫలము పొందును (మత్త 10:41). ఒక అపొస్తులునికి ఇంటిలో ఆతిథ్యమిచ్చుట యేసు ప్రభువును చేర్చుకొనుటతో సమానమైనది (మత్త 18:5). ఈ ఆతిథ్యము విషయములో సహోదరిలకు ఎటువంటి అద్భుతమైన అవకాశములు తెరువబడి ఉన్నవి. పేతురు, పౌలు ఉత్తరాలు వ్రాసిన క్రైస్తవులు చాలా బీదవారు. వారు కేవలము పరిశుద్ధులకు సామాన్యమైన భోజనము, నిద్రించుటకు నేలపై పడక మాత్రము ఇమ్మనమని వారిని అడిగిరి. గొప్ప భోజనము పెడితేనే ఆతిధ్యమనుకోకుండునట్లు, 1 తిమోతి 5:10లో బీద విధవరాండ్రు కూడా పరిశుద్ధులుకు ఉపచారము చేసిన విషయం వ్రాయబడినది. ఒక ఇంటిని కట్టుటకు పిలువబడిన దానిగా చూచిన స్త్రీలో దేవుని మహిమను చూడగలము. తల్లిగా ఆమె యొక్క మహిమ “హవ్వ” తల్లి కాబట్టి ఆదాము ఆమెను ఆ పేరుతో పిలిచెను. దేవుని సన్నిధి యొక్క స్వచ్ఛమైన వెలుగులో ఆదామునకు అతడి భార్య యొక్క పరిచర్య ఏమిటో తెలియును. హవ్వకు కూడా అది తెలియును. అయితే పాపము మరియు మానవ పద్ధతులు (సైతాను చేత ప్రభావింపబడి) ఇప్పుడు స్త్రీ యొక్క గ్రహింపు, మబ్బుకమ్మినట్లు చేసినవి. అందువలన స్త్రీ ఇప్పుడు తల్లిగా ఆమె మహిమను చూచుకో లేకపోవుచున్నది. పిల్లలు ఇప్పుడు దేవుని మాటలలో వరములుగా కాక (కీర్త 127:3) సైతాను మాటలలో “అనుకోకుండా” కలిగిన వారు అని పిలువబడ్తున్నారు. ఇది క్రైస్తవులని పిలువబడుచున్న వారు కూడా దేవుని నుండి తప్పిపోయి ఎంతగా సైతాను కలిగించు ఆలోచనలలోనికి వెళ్ళిపోయారో తెలియజేస్తుంది. అయితే తిమోతి యొక్క తల్లి పూర్తిగా వేరైనది. ఆమె యొక్క పిలుపును ఆమె చక్కగా చూడగలిగినది. ఆమె భర్త ఒక అవిశ్వాసి అయినా (అ. కా. 16:1) అది ఆమె విశ్వాసాన్ని ఆరిపోచేయలేదు. ఆమె నిష్కపటమైన విశ్వాసురాలు మరియు దేవుని వాక్యము తెలిసినది (1తిమోతి 1:5). ఆమె తిమోతికి దేవుని వాక్యమును నేర్పించినది. అంతకంటే ముఖ్యముగా ఆమె అతనికి విశ్వాసాన్ని నూరిపోసినది. లోకమంతా విషతుల్యమైన అవిశ్వాసపు గాలులు పీల్చుకొనుచుండగా, తిమోతి ఇంటిలో అతడి తల్లి అతడు స్వచ్ఛమైన విశ్వాసపు గాలి పీల్చుకొనేలా చేసినది. బహుశా అతడు తన తల్లి తరుచుగా ప్రార్ధనలో గడుపుట, తరుచుగా దేవునిస్తుతించుట, కష్ట సమయాల్లో దేవుని యందు నమ్మకము ఉండుట చూచి ఉండవచ్చు. ఎందుకంటే ఇవన్ని “నిష్కపటమైన విశ్వాసము” యొక్క కొన్ని లక్షణములు. అటువంటి పరిస్థితుల్లో తిమోతి పౌలుకు తోటి పనివాడైన అపొస్తులుడుగా ఎదుగుటలో ఆశ్చర్యమేమీ లేదు. అతడి తల్లి యొక్క ప్రయాస చివరకు ఫలించినది. గడచిన సంవత్సరాలలో సూసన్నావెస్లీ గూర్చి మనము వినియుంటిమి. ఆమె 15 మంది బిడ్డలకు తల్లియై యుండి పేదరికముతో, కొందరు పిల్లలు మరణించిన పరిస్థితులలో నుండినది. కాని, ఆమె మిగిలిన ప్రతివారికి దేవుని భయమును బోధిస్తూ పెంచినది. వారిలో ఒకడైన జాన్ వెస్లీ పెరిగి పెద్దవాడై దేవుని చేతిలో గొప్ప పనిముట్టుగా అయ్యెను. ప్రపంచమంతా అనేకులు గత రెండు శతాబ్దాలుగా ఆయన సేవ ద్వారా ఆయన వ్రాతల ద్వారా దీవింపబడిరి. సూసన్న వెస్లీ తన కుటుంబమును నిర్లక్ష్యము చేసి డబ్బు సంపాదనకు బయటకు వెల్ళినట్లయితే లేక ప్రపంచమంతా బైబిలు బోధకురాలుగా కాని లేక సువార్తికురాలుగా కాని పర్యటించినా తన కుమారుడు దేవుని కొరకు నెరవేర్చిన దానిలో లేశమాత్రమైన నెరవేర్చకపోయి యుండును. పౌలు స్త్రీల పరిచర్య గూర్చి తిమోతికి తెలుపుతూ స్త్రీలకు బోధించే పరిచర్య కాని, పెద్దలుగా ఉండే పరిచర్య కాని లేకపోయినా వారు మాతృత్వపు పరిచర్య కలిగియుండవచ్చునని చెప్పెను (1తిమోతి 2:12,15). ఆ పత్రిక సారాంశములో మాతృత్వము కూడా ఒక పరిచర్యగా పౌలు పరిగణించెను. ఇది దేవునికి భయపడే తల్లులుగా ఉండేందుకు దేవుడు స్త్రీలను పిలిచిన రెండవ పరిచర్య. క్రీస్తుకు సాక్షిగా ఆమె యొక్క మహిమ దేవుడు ఆమెను ఆమె నోటి ద్వారా క్రీస్తుకు సాక్షిగా ఉండాలని పిలిచెను. మగ్దలేనే మరియ పునరుథ్ధానుడైన క్రీస్తుకు మొదటి సాక్షి. ఆమె చూచిన దానిని అనుభవించిన దానిని అమె నమ్మకముగా సాక్ష్యము చెప్పినది. క్రీస్తు కొరకు అటువంటి సాక్షిగా నుండుటకు ప్రతి స్త్రీ కూడా పరిశుద్దాత్మలో బాప్తిస్మము పొందవలసియున్నది. భారతదేశములో నుండిన సాంఘిక కట్టుబాట్ల వలన స్త్రీలు మగవారి నోటి నుండి సువార్త వినుటకు అనేక ఆటంకములున్నవి. కేవలము ఆత్మచేత నింపబడిన స్త్రీలు మాత్రమే అటువంటి వారిని చేరగలరు. దేవునికి భయపడే ప్రతి సహోదరి, తను కలుసుకొనే ప్రతి బంధువుకు, స్నేహితులకు, పొరుగువారికి, ఇంట్లో పనిచేసే పనికత్తెకు మొదలగు వారికి సువార్త చెప్పే బాధ్యతను చేపట్టాలి. క్రొత్త నిబంధనలో స్త్రీలు సంఘములో ప్రార్ధించుట మరియు ప్రవచించుట చేయవచ్చునని చెప్పబడినది. అయితే అట్లు చేయునప్పుడు వారి తలపై ముసుగు వేసుకొనవలెను (1 కొరింథి 11:5). సంఘము కట్టబడుటకు ప్రార్ధన ఒక ముఖ్యమైన పరిచర్య. సహోదరిలందరు అందులో పాలు పొందవచ్చును. స్త్రీలు ప్రవచింపవచ్చు కూడా. ఆ. కా. 2:17, 18లో పరిశుద్దాత్మతో నింపబడినప్పుడు స్త్రీ పురుషులు ప్రవచింతురు అని తేటగా చెప్పబడినది. సంఘములో దేవుడిచ్చు ఆత్మ వరములలో “ఉపకారములు” ఒకటి (1 కొరింధి 12:28). స్త్రీలందరూ అవసరానుగుణంగా సంఘములో ఉపకారము చేయుటకు ఈ ఆత్మ వరమును అడగవచ్చును. స్త్రీలు వారి వస్త్రధారణను బట్టి దేవునికి నమ్మకమైన సాక్షిగా నుండవచ్చును. పరిశుద్దాత్ముడు మూడు విషయాలను క్రైస్తవ స్త్రీలందరకూ కూడదని చెప్పాడు. అవి తలవెంట్రుకలను రకరకాలుగా అలంకరించుకొనుట, ఖరీదైన దుస్తులు మరియు నగలు (1 తిమో 2:9, 1పేతు 3:3). దుస్తులు స్త్రీల శరీరములను కప్పుటకే తప్ప బహిరంగ పర్చుటకు కాదు. మెడ క్రిందకి కుట్టబడిన జాకెట్లు, క్రిందకి కట్టబడిన చీరెలు, రంగు పూసుకున్న పెదువులు, గోళ్ళు యెజెబెలును అనుసరించు వారి గుర్తులు (2 రాజు 9:30) తప్ప యేసుక్రీస్తు శిష్యులకు గుర్తులు కావు. యెషయా 3: 16-24 జాగ్రత్తగా చదవండి. దేవుడు స్త్రీ పురుషులలో ఏర్పాటు చేసిన తేడాలను సైతాను నాశనము చేయాలని చూస్తుండగా 20వ శతాబ్దపు స్త్రీలు మగవారివలె మగవారు స్త్రీలవలె కనబడునట్లు తయారగుటలో ఆశ్చర్యమేమీలేదు. అటువంటి పరిస్థితులలో దేవుడు ఆయన వాక్యములో ఏర్పాటు చేసిన హద్దులలో ఉండి స్త్రీ యొక్క మహిమను వారి జీవితాల ద్వారా చూపే స్త్రీలు దేవునికి అవసరమై యున్నారు. ఈ ఆఖరి దినాల్లో పాపము, వ్యభిచారము మరియు రాజీతత్వముతో నిండిపోయిన క్రైస్తవత్వములో దేవుని హృదయానుసారిగా నుండిన స్త్రీ వలె నుండుటకు నీ హృదయమంతటితో నిర్ణయించుకో, నీవు నిజముగా దీని కొరకు ఆశపడితే, దానికి కావలసిన కృపను దేవుడిచ్చును. “వినుటకు చెవి గలిగిన స్త్రీ ఇది వినును గాక.”