దేవుని యొక్క ఆశీర్వాదమా? లేక దేవుని యొక్క ఆమోదమా?

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
Article Body: 

వి శ్వాసులలో రెండు రకములైన వారుందురు - వారు ఒకరు దేవుని యొక్క ఆశీర్వాదము కోరువారు మరియు దేవుని యొక్క ఆమోదము కోరువారు.వీరిరువుర మధ్యను ఎంతో గొప్ప వ్యత్యాసము ఉంటుంది.
ప్రకటన 7:9-14 లో విశ్వాసుల సమూహముల గూర్చి చదువుతాము వారు లెక్కించుటకు వీలుకానంత మందిగా ఉన్నారు. వారు వారి రక్షణ కొరకు దేవునికి కృతజ్ఞత కల్గిన వారు (వ 10) మరియు వారి యొక్క వస్త్రములు క్రీస్తు రక్తములో కడుగబడినవి. (వ 14) వేరొకవిధంగా చెప్పవలెనంటె దేవుడు వారిని ఆశీర్వదించాడు. సందేహం లేకుండా ఇది చాలా మంచిదై ఉన్నది. అయితే ప్రకటన 14:1-5 లో చెప్పబడిన విశ్వాసుల యొక్క సాక్ష్యము కంటె ఇది ఎంతో వేరైనది.అక్కడ లెక్క పెట్టగలిగినంతటి చిన్న గుంపు గూర్చి చదువుతాము. నిజానికి వారు 144,000 మంది మాత్రమే, వారు ఈ భూమిపై నివసిస్తున్న కోటాను కోట్ల ప్రజల నుండి ఎన్నికచేయబడిన వారని నువ్వు గమనించినట్లయితే అది చాలా చిన్న సంఖ్య. వారు భూమిపై క్రీస్తును పూర్తిగా వెంబడించిన వారని వారి గూర్చి సాక్ష్యము చెప్పబడినది. వారి నోట అబద్దమేమియు లేదు మరియు వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాకుండునట్లు కాపాడు కొన్నవారు. (ప్రకటన 17వ అధ్యాయములో చెప్పబడిన స్త్రీ - అది బబులోను మరియు ఆమె కుమార్తెలు) వేరే విధంగా చెప్పవలెనంటె, వారు దేవునిని ఆనందింపచేసినవారు. ఇక్కడ తేడాను గమనించండి. మొదటి గుంపు దేవుని యొక్క ఆశీర్వాదములను పొందినది. రెండవ గుంపు దేవుని ఆమోదాన్ని పొందినది. మనము దేవుని యొక్క ఆశీర్వాదములతో సంతృప్తి చెందితే, మనము పొందగలిగేవి అవి మాత్రమే. మరియు దేవుడిచ్చు వస్తు వాహనాల యొక్క ఆశీర్వాదములతో మాత్రమే సంతృప్తి పడినట్లయితే, ఆయన యిచ్చే ఆత్మీయ ఆశీర్వాదములు పొందునట్లు ముందుకు వెళ్లలేము.

అనేక విశ్వాసులు దేవుని చేత ఆశీర్వదింపబడుటతో సంతృప్తి చెందుదురు - అది కూడా ఎక్కువగా వస్తు వాహన పరిధి యందు మాత్రమే. ఆ కారణం చేతనే క్రైస్తవ పుస్తకశాలలు, ఏ విధంగా ఒకరు, తన రోగము నుండి స్వస్థపడవచ్చును మరియు దశమ భాగము అర్పించుట ద్వారా ఎలాగు ధనికుడుగా అవ్వవచ్చు మొదలైన విషయాలతో నిండిన పుస్తకాలతో నిండి యుంటున్నవి. అక్కడ ప్రాధాన్యత భౌతికంగా మరియు వస్తు సముదాయాలతో గొప్పగా నుండడం - అది ఆరోగ్యం మరియు అన్నిటిలో వర్ధిల్లడం. ఇది తనకు తానే ముఖ్యమైనటువంటి జీవితానికి ఒక ముఖ్యముగా కనుపించే లక్షణము. అయితే మనము వాక్యములో ''జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు యేసు మృతి పొందెనని'' చదువుదుము(2 కొరింథీ 5:15) లేక వేరొక విధంగా చెప్పాలంటే ”మనలను మనము సంతోష పెట్టుకొనుట కొరకు కాక ఆయనను సంతోష పర్చుటకు మాత్రమే” అని చెప్పవచ్చును. ఇంకా వేరొక విధంగా చెప్పాలంటే ”యేసు చనిపోయినది మనలను మన కొరకు జీవించే జీవితము నుండి విడుదల చేసి, దేవుని కొరకు జీవించే జీవితంలోనికి తెచ్చుటకు” అని చెప్పవచ్చును.

ఈ దినాలలో మనకు అర్థంకాని విషయాలలో ఒకటి తనకు ఉండవలసిన ప్రత్యేక లక్షణముల విషయంలో ఎంతగానో రాజీ పడిపోయే క్రైస్తవ పరిచర్యను దేవుడు ఆశీర్వదించే విషయం. దీని అర్థం వాక్యం నుండి వేరు పడి రాజీపడిపోవడం విషయంలో దేవుడు ఏ మాత్రము కలత చెందడం లేదని కాదు. తప్పని సరిగా అలాకాదు. ఎన్నో పరిచర్యలను ఆయనకు పూర్తిగా అంగీకారము కాకపోయినా దేవుడు దీవించును. మోషే బండను కొట్టుట ద్వారా దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు కూడా (దేవుడు బండతో మాట్లాడమని అతడితో చెప్పెను) అవిధేయతతో కూడినదయినప్పటికి దేవుడు ఆ పరిచర్యను దీవించెను. నిజానికి ఇరువది లక్షలమంది ప్రజలు దాని ద్వారా దీవింపబడిరి. అయినను అటు తరువాత తన అవిధేయుడైన సేవకునిని బహు కఠినముగా శిక్షించెను(సంఖ్యా 20:8-13). దేవుడు ఇరువది లక్షల మంది అవసరములో నుండిన ప్రజలను ప్రేమించుట చేత ఆ పరిచర్యను దీవించాడు కాని, ఆయన సేవకుడు చేసినది ఆమోదించుట వలన కాదు. ఈనాడు కూడా అంతే. రక్షణ మరియు స్వస్థత మొదలైనవి అవసరము కల్గిన ప్రజలను ప్రేమించి దేవుడు అనేక పరిచర్యలను ఆశీర్వదిస్తున్నాడు. కాని ఈనాడు యేసు క్రీస్తు నామము పేరట జరుగుతున్న ఎన్నో విషయాలను ఆయన తప్పనిసరిగా ఆమోదించడు. తగిన కాలమందు ఈ రాజీపడే బోధకులను ఆయన తప్పక శిక్షించును.

దేవుని యొద్ద నుండి వస్తు రూపేణా ఆశీర్వదింపబడుటకు నెరవేర్చాల్సిన ఒక షరతు ఏమిటంటే ఒకరు మంచిగా కాని చెడుగా కాని ఉండుటయే!! ఎందుకంటె దేవుడు చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుని ఉదయింప చేసి, వర్షమును కురియింప చేయుచున్నాడు(మత్తయి 5:45). దీనిని బట్టి వస్తు సముదాయాల దీవెన ఒకరి జీవితంపై దేవుని యొక్క ఆమోదానికి గుర్తు కాదు. అరణ్యములో ఇరువది లక్షల మంది ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు దేవునికి అవిధేయులుగా నుండిరి - దేవుడు వారి యెడల ఎంతగానో కోపించెను(హెబ్రీ 3:17) అయినప్పటికి దేవుడు ఆ సంవత్సరాలన్నిటిలో వారికి ఆహారము, స్వస్థత ఇచ్చియున్నాడు అది కూడ అద్భుతంగా(ద్వితి 8:2). అందుచేత భౌతిక మరియు వస్తు సముదాయ పరిధులలో ప్రార్థనకు మనము పొందే అద్భుత జవాబులు ఒక వ్యక్తి యొక్క జీవితము దేవునికి సంతోషం కలిగించేదిగా ఉందనటానికి నిదర్శనం కాదు.

యేసు ముప్పై సంవత్సరాల వయసున్నప్పుడు, ఒకే ఒక కారణాన ఆయనపై దేవుని యొక్క ఆమోదము ఉండినది, ఆ కారణము! ఆ సంవత్సరాలన్నిటిలో యేసు నమ్మకముగా శోధనను జయించుట వలన. ఆయన, ఆయన యొక్క తండ్రిలో తన జీవితాన్నుంచుకొని జీవితం జీవించాడు తప్ప తనలో తన జీవితాన్ని ఉంచుకొని జీవించలేదు. తనను సంతోష పర్చుదానిని ఎప్పుడు ఆయన చేయలేదు(రోమా 15:3). ఆయన బాప్తిస్మము సమయములో తండ్రి ఈ విధంగా సాక్ష్యమిచ్చారు: "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను"; అంతే కాని "నేను ఎంతగానో దీవించిన నా ప్రియకుమారుడు" అని చెప్పలేదు. అలా అయినట్లయితే ఆ తరువాత సాక్ష్యం అర్థం లేనిదిగా ఉండియుండును. ఆ మొదటిది, దేవుని యొక్క మెప్పును తెలిపేది, అది యేసు క్రీస్తునకు సమస్తమై ఉంది. యేసు క్రీస్తును వెంబడించడం అంటె మన కొరకు అటువంటి సాక్ష్యం వెదకడం అన్నమాట.

ఆదాము పిల్లలుగా మన మందరం మనకు మనమే ముఖ్యులుగా చూచుకొనే వారముగా పుట్టాము. ప్రతీది మన చుట్టూ తిరగాలని, ప్రతీది మనకు ఉపయోగపడాలని అనుకుంటూ మనము ఎదిగాము. మనము రక్షణ పొందినప్పుడు దేవుడు మనకు పరిచర్య చెయ్యాలని మరియు అనేక విధాల ఆశీర్వదించాలని అనుకొంటిమి. తొలిదొలుత ఆయన యొక్క క్షమాపణతో మనము దీవింపబడాలని అటు తరువాత స్వస్థత, ప్రార్థనకు జవాబు, వస్తు రూపమైన అభివృద్ది ఉద్యోగము, ఇల్లు, వివాహ సహచరి మొదలైన వాటిని వెదకుతూ ఆయన దగ్గరకు వచ్చి యుంటిమి. అయితే మనము మన దృష్టిలోనూ మరియు ఇతరుల దృష్టిలోనూ ఎంతో లోతైన మతాసక్తికలవారమై ఉండినప్పటికి, మనమింకా మనకు మనమే మధ్యలో ఉండే జీవితం జీవించటానికి అవకాశం ఉంది. మనచుట్టూ భ్రమణం చేసే అనేక వాటిలో దేవుడు కూడా ఒక వ్యక్తి అవుతాడు, మరియు ఆయన దగ్గర్నుండి ఏమైతే పొందటానికి వీలుంటుందో అది పొందటానికి మనము ప్రయత్నిస్తాము. తప్పిపోయిన కుమారుడు తిండి కొరకే తన తండ్రి యొద్దకు వచ్చెను; అయినప్పటికిని తండ్రి అతడిని చేర్చుకొనెను. మన ఉద్దేశాలు పూర్తిగా స్వార్థ పూరితంగా నుండినా కూడా దేవుడు మనలను చేర్చుకొనును. మన స్వంతం గూర్చిన తలంపులను బహిర్గత పరస్తూ ఆయన దగ్గరకు వచ్చినా మనలను చేర్చుకొనేంతగా ఆయన మనలను ప్రేమిస్తున్నడు. అయితే మనము వేగంగా పరిపక్వత చెంది, పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యత, అనే ఆయన స్వభావములోనికి వచ్చుటయే నిజమైన ఆత్మీయతయని తెల్సుకోవాలని ఆయన నిరీక్షిస్తున్నారు. అయితే అనేకులైన ఆయన బిడ్డలలో, ఈ ఉద్దేశాన్ని అర్థము చేసికొనేలా ఆయన చెయ్యలేక పోవుచున్నారు. వారు వారి యొక్క స్వంతం గురించి ఆలోచనయైన ’నేను’ ’నాకు’ మరియు ’నాది’ మరియు వస్తు సముదాయాలు మరియు భౌతిక ఆశీర్వాదాలతోనే జీవించి చనిపోతున్నారు.

పరిపక్వత చెందుటయనగా మనము దేవుని యొద్ద నుండి ఏమి పొందుతాము అనే ఆలోచన నుండి, మనకున్న ఈ ఒక్క జీవితం నుండి దేవుడు ఏమి పొందగలడు అనే ఆలోచనలోనికి మన మనస్సులు నూతన పర్చబడడం. ఈ నూతన పర్చబడిన మనస్సే రూపాంతరమును తెస్తుంది(రోమా 12:2). ఇదియే 144,000 మందిని క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెలో భాగముగా అర్హత కలుగజేస్తుంది.

నిజమైన ఆత్మీయతయనగా కోపం, చిరాకు, కామపు ఆలోచనలు మరియు ధనాశ మొదలగు వాటిపై విజయం మాత్రమే కాదు. అది ఒకరు తన స్వంతం గురించి జీవించుట మానివేయడం. అది నా గూర్చి నేను, నా యొక్క స్వంత లాభము, నా యొక్క స్వంత సౌఖ్యం నా యొక్క స్వంత సదుపాయం వెదుక్కోవడం, మానడం - చివరకు స్వంత హక్కులు, స్వంత గౌరవము మరియు స్వంత ఆత్మీయతను కూడా విడిచిపెట్టుట. శిష్యులు యేసును ప్రార్థించుట నేర్పించమని అడిగినప్పుడు,`నేను’, `నాకు’, లేక `నాది’ అనే పదములు ఒక్క మారుకూడా రాని ప్రార్థనను యేసు వారికి భోదించారు (లూకా 11:1-4). అక్కడ ఆయన మొదట తండ్రి యొక్క నామము, రాజ్యము గూర్చిన ఆలోచన కలిగి, అటు తరువాత మన గూర్చి మనమెట్లు ఆలోచన కలిగియుందుమో అట్లే మనతోటి విశ్వాసుల గూర్చి (వారి యొక్క వస్తు పరమైన మరియు ఆత్మీయ సంక్షేమము) మనము ఆలోచన కలిగి యుండాలని భోధించెను(మాకు, మాకు, మాకు అంతేకాని నాకు, నాకు, నాకు కాదు). ఆ ప్రార్థన కంఠస్థంగా నేర్చుకొని చిలకవలె తిరిగి చెప్పడం సుళువే. కాని ఆ పాఠాన్ని హృదయంలో నేర్చుకోవటానికి, మన మన్నిటిని విడిచి దేవునిని మన హృదయ మధ్య భాగములో ఉంచుకొనవలెను. మన శరీర భాగములలో తరచు కనబడే నియమము(రోమా 7:22), మనము నిజాయితీగా తీర్పు తీర్చుకొనినట్లయితే అది స్వార్థ పరత్వము అనే నియమముగా తెలుస్తుంది. అది జీవిత మంతా మన స్వంత సౌకర్యములను మరియు హక్కులను వెదకుకొనుటయే.

దేవుని రాజ్యమును మొదట వెదుక మని యేసు క్రీస్తు బోధించారు. అది మన జీవితంలో నా అనుదానిని సింహాసనము నుండి దించి దేవునిని ఆయనకు ఇష్టమైన వాటిని అక్కడ ఉంచుకొనుట. యేసు క్రీస్తు ఆయన తండ్రి చిత్తమును భూమిపై నెరవేర్చుటకు ఆయన పరలోకపు సౌఖ్యాలను విడిచి పెట్టెను. పౌలు ప్రభువు కొరకు అపోస్తలుడుగా కష్టములను ఎదుర్కొనుటకు తార్సు పట్టణంలో ఒక క్రైస్తవ వ్యాపారిగా విలాసవంతముగా జీవించాల్సిన సౌఖ్యములను విడిచి పెట్టెను. అపోస్తలులలో ప్రతి ఒక్కరు వారి జీవితములలో దేవుడు ప్రధానముగా నుండిన త్యాగపూరితమైన జీవితాలను జీవించిరి. ఈనాటి అనేక యాత్రిక బోధకులు వలె కాక, దేవుని రాజ్యము ఈ లోకములో ఎక్కువగునట్లు వారికున్న దానినంతటిని ఇచ్చివేసిరి.

మన యొక్క స్వంత సౌఖ్యములను సౌఖర్యాలను ఇంకను వెతుక్కొనే పరిశుద్ధత, ఒక వేళ మనము కోపాన్నీ మరియు చెడు తలంపులను జయించినా అది నిజమైన పరిశుద్ధతకాదు. దీనినే చాలా మంది అర్థము చేసుకొనరు. అందు వలననే సైతాను వారిని మోసము చేయగల్గుచున్నాడు. చాలా మంది క్రైస్తవులు వేరు వేరు దేశములకు వారి స్వంత సౌఖ్యము కొరకు, సౌఖర్యముల కొరకు మరియు సంపద కొరకు ప్రయాణములు చేయుట లేక వలసపోవుట చేయుచున్నారు. వారి జీవితాలపై అప్పటికిని దేవుని ఆశీర్వాదముండవచ్చును, కాని దేవుని ఆమోదము ఉండదు, ఎందుకనగా ఎవడును సిరికిని(సంపద, భోగములు సౌఖ్యము మొదలైనవి) దేవునికిని దాసుడుగా నుండలేడు. మనపై మన బిడ్డల పై ఉండిన దేవుని ఆశీర్వాదము, దేవుడు మన గూర్చి సంతోషిస్తున్నాడనుటకు గుర్తుగా మనమనుకొంటే సైతాను మనలను నిజముగా మోసగించాడన్నమాట. దేవుని ఆశీర్వాదము మరియు దేవుని ఆమోదము రెండూ, రెండు వేరు వేరు విషయములు. ఈ లోకములో మన జీవితపు చివరన మనకుండాల్సిన సాక్ష్యము హనోకు భూమి నుండి తీసుకుపోబడుటకు ముందు ఆయనకుండిన సాక్ష్యము, అది “అతడు దేవునికి ఇష్టుడై యుండెను”(హెబ్రీ 11:5)అనేదిగా ఉండవలెను. అవి కేవలము మూడు మాటలు, కాని ఎవ్వరికిని తన ఈలోక జీవితము గూర్చి అంతకంటె గొప్ప బలమైన సాక్ష్యము ఉండదు. యేసు ప్రభువు, పౌలు ఇటు వంటి సాక్ష్యము కలిగియుండిరి. కేవలము అతడు దేవునిచేత దీవింపబడెను అను సాక్ష్యము ఏవిలువ లేనిది, ఎందరో అవిశ్వాసులు కూడా అటువంటి సాక్ష్యము కలిగియున్నారు. దేవుడు కేవలము ఆయన ఆశీర్వాదము కొరకు కాక ఆయన ఆమోదము కొరకు వెదకు వారి కొరకు చూచుచుండెను.