మేము విశ్వసించు సత్యము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
Article Body: 

మనమును మరియు మనభోధను వినువారు రక్షింపబడవలెనని కోరినచో, కేవలము మనలనుగూర్చియు మరియు మనభోధనుగూర్చియు జాగ్రత్తపడుటద్వారా మాత్రమేనని లేఖనములలో ఆజ్ఞాపించబడియున్నాము (1 తిమోతి 4:16).

మనజీవితము మరియు మనసిద్దాంతము రెండుకాళ్ళవలె ఉన్నప్పుడే మనము స్థిరమైన క్రైస్తవజీవితమును పొందెదము. మానవునికాళ్ళవలె, అవిరెండు సమానముగా ఉండవలెను. క్రైస్తత్వము సామాన్యముగా రెండుకాళ్ళలో ఒకదానిని ఎక్కువగాచేసి మరొకదానిని తగ్గించెదరు.

సిద్ధాంతము విషయము వచ్చినప్పుడు “సత్యవాక్యమును సరిగా ఉపదేశించవలెనని” (2 తిమోతీ 2:15) ఆజ్ఞాపించబడియున్నాము. చాలామంది లేఖనములను అశ్రద్దగా చదివెదరు గనుక సిద్దాంతములను అర్థము చేసుకొనుటలో సమతుల్యతలేదు.

దేవునియొక్కసత్యము మానవుని శరీరమువలె ఉన్నది. ప్రతియొక్క‍అవయవము తగినంత ప్రమాణములో ఉన్నప్పుడు మాత్రమే శరీరము పరిపూర్ణముగా ఉండును. లేఖనములలో ఉన్న సత్యములన్నియు ఒకేవిధముగా(సమానముగా) ముఖ్యమైనవి కావు. ఒక ఉదాహరణ చూచెదము: అన్యబాషలలో మాట్లాడుట ఇతరవిశ్వాసులను ప్రేమించుటకంటే ముఖ్యమైనదికాదు. ఒకసిద్ధాంతముకంటే వేరొకదానిని విశేషించి ఎక్కువచేసినట్లయితే, అది ఎక్కువగా పెరిగిన కన్ను లేక చెవు కలిగినశరీరమువలె ఉండును. అటువంటిపద్దతి మనలను విశ్వాసభ్రష్టత్వములోనికి నడిపించును. గనుక దేవునివాక్యమును సరిగా ఉపదేశించుట ఎంతో ముఖ్యమైయున్నది.

దేవునివాక్యము(బైబిలులో ఉన్న 66 పుస్తకములు)లో ఉన్న సత్యమంతటినీ విశ్వసించుచున్నామని చెప్పుట సామాన్యమైనవిషయము. అది సత్యమే. సైతాను మరియు మనుష్యుల కపటమువలన దేవునివాక్యము చెరుపబడెను గనుక దేవునివాక్యము బోధించువాటిని ఉన్నదిఉన్నట్టుగా సరిగా వివరించవలసిన అవసరము వచ్చియున్నది.

దేవునివాక్యము, లెక్కలు మరియు సామాన్యశాస్త్రమువలె మనజ్ఞానముకాక, కేవలము పరిశుద్దాత్మ ప్రత్యక్షతవలన మాత్రమే గ్రహించగలము. ఈప్రత్యక్షత గర్విష్టులైన జ్ఞానులకుకాకుండా పసిబిడ్డల(దీనుల)కుమాత్రమే ఇవ్వబడునని ప్రభువైనయేసు చెప్పెను (మత్తయి 11:25 ). ఇందువలనే యేసుప్రభువు కాలమందలి బైబిలుపండితులు కూడా ఆయనబోధను అర్థము చేసుకొనలేకపోయిరి. అదేకారణమునుబట్టి ఈనాటి అనేక బైబిలుపండితులుకూడా అదే పడవలో ఉన్నారు.

అదేసమయములో మన “బుద్ది విషయమై పెద్దవారులై యుండిడి” (1 కొరింథి 14:20) అని ఆజ్ఞాపించబడియున్నాము.

గనుక ఎవరిమనస్సైతే సంపూర్ణముగా పరిశుద్ధాత్మకు లోబడునో, అటువంటివారు మాత్రమే దేవునివాక్యమును సరిగా అర్థము చేసికొనగలరు.

తనపిల్లలు ప్రతివిషయములో సంపూర్ణముగా స్వతంత్రులై యుండవలెనని దేవుడు కోరుచున్నాడు. కాని అనేకమంది విశ్వాసులు అనేకపాపములలోను మరియు మనుష్యుల పారంపర్యాచారములలోను బంధించబడియున్నారు. దానికికారణము వారు దేవునివాక్యమును అజాగ్రత్తగా చదువుటయే.

దేవునివాక్యము అర్థముచేసుకొనుటకు ఎంత ఆసక్తిని చూపెదమో అంతగా మన జీవితములలోని ప్రతి విషయములో సత్యముచేత స్వతంత్రులమగుదుము (యోహాను 8:32 ).

వారి డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు చాలామంది విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండెదరు. కాని లేఖనములను చదివే విషయములో వారు చాలా అజాగ్రత్తగా ఉండెదరు. దేవునికంటే డబ్బుకే వారు ఎక్కువ విలువనిచ్చుచున్నట్లు ఇది చూపుచున్నది. అటువంటి విశ్వాసులు దేవునివాక్యమును సరిగా అర్థముచేసుకొనుటలో తప్పకుండా తప్పిపోవుదురు.

మనలను పరిపూర్ణులుగా చేయుటకే లేఖనములు ఇవ్వబడినవని బహుతేటగా చెప్పబడియున్నది.(2 తిమోతి 3:16,17). గనుక ఎవరికైతే క్రైస్తవులుగా పరిపూర్ణులగుటకు ఆసక్తిఉండదో వారు దేవునివాక్యమును సరిగా అర్థము చేసికొనలేరు(యోహాను 7:17).

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు మూలము. యెహోవామర్మము ఆయనయందు భయభక్తులు గలవారికి తెలిసేయున్నది(కీర్తన 25:14).

దేవుని గూర్చిన సత్యము

దేవుడొక్కడే అనియు మరియు ఆయనలో ముగ్గురు వ్యక్తులున్నారనియు బైబిలు బోధిస్తున్నది.

అయితే అంకెలు భూసంబంధమైనవి కాని దేవుడు ఆత్మ గనుక ఒకసముద్రపునీటిని ఒకచిన్నకప్పులో పోయలేనట్టే పరిమితమైన మానవమనస్సు ఈ సత్యమును గ్రహించలేదు.

ఒక కుక్క గుణింతమును అర్థముచేసుకొనలేదు. మూడు ఒకటులను గుణించినప్పుడు జవాబు ఒక్కటే వచ్చును. 1x1x1=1. అలాగే దేవుడు ఒక్కడైయుండి మరలా త్రిత్వముగా ఉండుట అనునది మనకు అర్థముకాదు. ఒకకుక్క మరొకకుక్కను మాత్రమే అర్థము చేసుకొనగలదు. కుక్క మానవుని పూర్తిగా అర్థము చేసుకొనలేదు. అదేవిధముగా దేవుణ్ణి, మానవుడు అర్థము చేసుకొని మరియు వివరించగలిగినయెడల దేవుడుకూడా మానవుడైయుండును. బైబులులోఉన్న దేవుడు మనజ్ఞానమునకు మించినవాడు గనుక ఇది సత్యమనుటకు అది గొప్పఋజువుగా ఉన్నది.

త్రిత్వమునుగూర్చిన సత్యము బైబులులోని మొదటివచనములో తెలియజేయబడినది. బైబులులో దేవుడు అను పదమునకు ‘ఎలోహిమ్’ అనే హెబ్రి పదము బహువచనములో వాడబడినది. ‘మనము’ మరియు ‘మనయొక్క’ అను పదములు వాడబడడమునుఆదికాండము 1:26లో చూచెదము. క్రొత్తనిబంధనలో ఈవిషయము మరివిషేశముగా వెలుగులోనికి తేబడినది. యేసుప్రభువు బాప్తిస్మము సమయములో తండ్రి (పరలోకము నుండి వచ్చిన స్వరము) కుమారుడు (యేసుక్రీస్తు) పరిశుద్దాత్మ (పావురము రూపములో) ఉండిరి (మత్తయి 3:16,17).

యేసుప్రభువే తండ్రి, కుమార మరియు పరిశుద్దాత్మయై యున్నాడని చెప్పుచున్నవారు ఆయన భూమిమీద ఉన్నప్పుడు తనచిత్తాన్ని ఉపేక్షించుకొని తండ్రిచిత్తమును ఏవిధముగా చేసియున్నాడో వివరించలేరు. (యోహాను 6:38). దేవుడు ఒకవ్యక్తిమాత్రమే అయిఉన్నాడని నమ్ము ‘యూనిటీరియమ్’ అనువారు “యేసునామములో” మాత్రమే బాప్తిస్మమిచ్చుచు యేసు మానవుడుగా వచ్చియున్నాడను సత్యమును తృణీకరించుచున్నారు.

తండ్రి మరియు కుమారుని గూర్చిన బోధయే సరియైనదని మరియు తండ్రినిగాని లేక కుమారునిగాని తృణీకరించువాడు అంత్యక్రీస్తుఆత్మ కలిగియున్నాడని బైబులు చెప్పుచున్నది. (2 యోహాను 9, 1 యోహాను 2:22).

క్రైస్తవబాప్తిస్మములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను ముగ్గురినామములోనికి బాప్తిస్మము ఇవ్వవలెనని యేసు ప్రత్యేకముగా ఆజ్ఞాపించియున్నారు. (మత్తయి 28:19 ). కుమారుడు ప్రభువైనయేసుక్రీస్తుగా గుర్తించబడియున్నాడు. (అ.కా. 2:38).

క్రీస్తుని గూర్చిన సత్యము

యేసుక్రీస్తు దేవుడనియు ఆదినుండి ఆయన దేవునితో సమానుడిగా ఉన్నాడనియు మరియు ఆయన ఈలోకమునకు వచ్చినపుడు దేవునితో ఆయనకుండిన సమానత్వమును విడచిపెట్టెననియు “తన్ను తానే రిక్తునిగా చేసుకొనెననియు” లేఖనములు బోధించుచున్నవి.(యొహాను 1:1, ఫిలిప్పి 2:6,7). దీనిని ఋజువుచేయుటకు కొన్ని ఉదాహరణములను చూచెదము. దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు. (యాకోబు 1:13). అయితే యేసు, శోధించబడుటకు అనుమతించెను(మత్తయి 4:1-11). దేవుడు సమస్తమును యెరుగును గాని యేసు భూలోకములో ఉన్నపుడు తన రెండవరాకడ దినమునుగూర్చి యెరుగననెను (మత్తయి 24:36). ఫలమేదైన దొరుకునేమోనని అంజూరపుచెట్టు దగ్గరకువెళ్ళి చూచెను.(మత్తయి 21:19). దేవునిగా తనశక్తిని ఉపయోగించినయెడల ‘ఆ చెట్టున ఫలములేదని దూరమునుండె తెలుసుకొనగలుగును! దేవునిజ్ఞానము మార్పులేనిది మరియు నిత్యమైనది కాని “యేసు జ్ఞానముతో నిండుకొనుచు వర్ధిల్లుచుండెను” అని రెండుసార్లు చూడగలము.(లూకా 2:40,52).

ఈ వచనములన్నియు ఆయన భూమిమీదకు వచ్చినప్పుడు దేవునిగా తనకున్న అనేక శక్తులను వదులుకొని “తన్ను తాను ఖాళీగా చేసుకొనె”నని చూపించుచున్నవి.

యేసు భూమిమీదకు వచ్చినప్పుడు తన్నుతాను రిక్తునిగా చేసుకున్నప్పటికినీ, వ్యక్తిత్వములో తానింకా దేవునిగానే ఉండెను. ఆయన కావాలని కోరినప్పటికీ, దేవుడు కాకుండా ఉండుట అసాధ్యము. ఒకరాజు తన హక్కులన్నిటినీ వదలుకొని ఒకమురికివాడలో నివసించవచ్చును. అయినను అతడు రాజైయుండును. ఆ విధముగానే యేసు కూడా.

యేసుప్రభువు భూమిపై ఉన్నప్పుడు ఇతరుల నుండి ఆరాధనను అంగీకరించినట్లు 7 సార్లు వ్రాయబడినది గనుక అది ఆయన దైవత్వమును ఋజువుచేయుచున్నది (మత్తయి 8:2, 9:18, 14:33, 15:25, 20:20, మార్కు 5:6 , యోహాను 9:38). దేవదూతలు మరియు దేవునియందు భయభక్తులుగలవారు మ్రొక్కబడుటకు ఒప్పుకొనరు (అ.కా. 10:25,26, ప్రకటన 22:8,9). కాని యేసు దేవునికుమారుడు కనుక ఆయన అంగీకరించును. యేసు భూమిపై ఉండినప్పటికీ ఆయన దేవుని కుమారుడే అని తండ్రి పేతురుకు బయలుపరచెను (మత్తయి 16:16,17).

యేసుయొక్క మానవత్వమును గూర్చి హెబ్రీ 2:17 లో “అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను” అని చాలా స్పష్టముగా చెప్పుచున్నది.

మనుష్యులందరివలె ఆయన “ప్రాచీన పురుషుని” కలిగియుండకుండునట్లు ఆయన ఆదాము పిల్లలవంటివాడు కాలేదు. (లేఖనములలో ఉన్న “ప్రాచీన పురుషుడు” అనే పదమునకు దురదృష్టవశాత్తు లేఖనమునకు విరుద్ధముగా “పాప స్వభావము” అని వాడుచున్నారు).

యేసు ప్రభువునకు మానవతండ్రి లేడు గనుక ఆయనకు పాపస్వభావము లేదు. ఆయన పరిశుద్దాత్మవలన పుట్టియున్నాడు గనుక పుట్టుకనుండి పరిశుద్ధుడైయున్నాడు (లూకా 1:35).

దేవుని చిత్తమును జరిగించువారే యేసునకు ఆత్మీయ సహోదరులైయున్నారు(మత్తయి 12:49,50). అట్టివారు ఆత్మమూలముగా జన్మించినవారై (యోహాను 3:5) మరియు వారు ప్రాచీనపురుషుని వదలుకొని మరియు నవీనపురుషుని ధరించుకొనియున్నారు (ఎఫెసీ 4:22,24). కాని యేసుయొక్క సహోదరులైన మనలో సొంతచిత్తమున్నది మరియు “అన్ని విషయముల”లో యేసు మనవంటివాడాయెను. ఆయన కూడా సొంతచిత్తమును కలిగియుండి, దానిని ఉపేక్షించుకొనెను (యోహాను 6:38).

ఆదాము బిడ్డలముగా మనము ప్రాచీనస్వభావము (పురుషుని)తో జన్మించియున్నాము. శరీరేచ్చలు దొంగలముఠావలె హృదయమనే ద్వారముగుండా ప్రవేశించుటకు ప్రయత్నించినపుడు అపనమ్మకస్తుడైన సేవకునివలె ప్రాచీనస్వభావము తలుపు తీయును. మనము తిరిగిజన్మించినపుడు ఈ ప్రాచీనస్వభావము దేవునిచేత చంపబడియున్నది (రోమా 6:6 ) అయినను స్వకీయదురాశలచేత శోధించబడునట్లు శరీరమును కలిగియున్నాము (యాకోబు 1:14,15 ). “దొంగలముఠా” వంటి శరీరయిచ్చలను హృదయమనే తలుపుగుండా ప్రవేశించకుండునట్లు ఆపి, శరీరయిచ్చలను అడ్డగించునట్లుగా ప్రాచీనస్వభావమునకు బదులుగా నవీనస్వభావము ఇవ్వబడినది.

ప్రభువైనయేసు అన్నివిషయములలో మనవలె శోధించబడి జయించెను (హెబ్రీ 4:15 ). అయినను ఆయన ‘పాపశరీరము’తో రాలేదు కాని ‘పాపశరీరాకారము’తో వచ్చెను(రోమా 8:3 ). మనము అనేకసంవత్సరములు పాపములో జీవించియున్నాము. అనేకసంవత్సరములు పాపముచేయుటద్వారా నేర్చుకొనిన పాపపుఅలవాట్లు, మనము తిరిగిజన్మించిన తరువాతకూడా మనకు తెలియకుండానే పాపముచేయునట్లు చేయును.

ఉదాహరణకు, తిట్టే అలవాటు ఉన్న వ్యక్తి, వత్తిడికి గురైనపుడు తనకు తెలియకుండానే అటువంటిమాటలు నోటిగుండా వచ్చును, మారుమనస్సు పొందకముందు ఆటువంటి అలవాటు లేనివ్యక్తి, తరువాత కూడా అటువంటి మాటలు పలుకడు. అదేవిధముగా ఎవరైతే బూతుపుస్తకములు చదివియుండెదరో వారు చదివినకొలది, అవి చదవని వారికంటే ఎక్కువ చెడ్డ తలంపులు మరియు కలలు వచ్చును.

ప్రభువైనయేసు పాపము చేయలేదు. మరియు ఆయన జీవితములో తెలియని పాపమంటూ ఏదియు లేదు. ఆయన ఒక్కసారియైనను, తెలియనిరీతిగా పాపము చేసియున్నట్లైతే దానికొరకు ఆయన బలియర్పించవలసియుండును(లేవీ 4:27,28 ). అప్పుడు మనపాపములకు ఆయన పరిపూర్ణబలి అయియుండెడివాడు కాదు. తెలిసిగాని లేక తెలియకగాని ఆయన ఒకసారి కూడా పాపము చేయలేదు.

సంఘచరిత్ర అంతటిలో ప్రభువైనయేసు వ్యక్తిత్వము వివాదాస్పదమైయున్నది మరియు దానిగురించి అనేకమైన అభ్యంతరములు చాటించబడెను. కొందరు ఆయన దైవత్వమును ఎక్కువగాచేసి, ఆయన అన్నివిషయములలో మనవలె శోధించబడి యున్నాడనునది చూడలేనివారుగా ఉన్నారు. మరికొందరు ఆయన మానవత్వమును ఎక్కువగాచేసి, ఆయన దైవత్వమును కొట్టివేయుచున్నారు.

ఇటువంటి భ్రష్టత్వమునుండి మనము కాపాడబడవలయుననినచో లేఖనములలోని దేవుని ప్రత్యక్షత అంతటికి మనము నిలువవలెను. లేనియెడల మనము "క్రీస్తు బోధయందు నిలిచియుండక దానినివిడచి ముందుకు సాగెదము" ( 2 యోహాను 1:7,9 ).

యేసు మానవునిగా భూమిమీదకు వచ్చుట అనునది మర్మము. బైబులులో చెప్పబడిన దానికంటే ఎక్కువగా ప్రయత్నించి మరియు పరిశీలనచేయుట బుధ్ధిహీనమైయున్నది. అదేవిధముగా చేయుట బుద్ధిహీనమై మరియు అగౌరవమునునై యుండును. ఇశ్రాయేలీయులు బుద్ధిహీనులై దేవుని మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసెను ( 1 సమూయేలు 6:19 ).

తనయిష్టమును నెరవేర్చుకొనుటకు కాదు గాని తన తండ్రి చిత్తము నెరవేర్చుటకే భూమిమీదకు వచ్చినట్లు యేసు చెప్పెను (యోహాను 6:38 ). తన తండ్రిచిత్తమునకు వ్యతిరేఖముగా తనచిత్తమున్నదని ఇది చూపుచున్నది (మత్తయి 26:39 ). లేనియెడల తనచిత్తమును ఉపేక్షించుకొనవలసిన అవసరము ఉండెడిదికాదు.

అన్ని విషయములలో యేసుకూడా మనవలె శోధించబడెను (హెబ్రీ 4:15 ). కాని తన మనస్సు అటువంటి శోధనలకు ఎన్నడు సమ్మతించలేదు గనుక పాపము చేయలేదు (యాకోబు 1:15 ). మనము ఎదుర్కొనిన మరియు ఎదుర్కొనుచున్న ప్రతిశోధనను యేసు తన భూలోక జీవితములో జయించెను.

పాపము చేయకుండా ఒక్కరోజైనను గడుపుట ఎంతకష్టతరమో మనకందరికి తెలియును. ప్రతిదినము, అన్ని విషయములలో మనవలె శోధింపబడియు, 33సంవత్సరములలో ఒక్కపాపము కూడా చేయకుండుటయే అత్యంతగొప్ప అద్బుతము. ఆయన మరణముపొందునంతగా పాపమును ఎదిరించెను మరియు ఆయన మహారోదనతోను, కన్నీటితోను మొఱ్ఱపెట్టెను (హెబ్రీ 5:7,12:3,4 ) గనుక ఆయన పుట్టిననాటినుండి మరణించువరకు తండ్రికృపను పొందెను (లూకా 2:40 ) మరియు (హెబ్రీ 2:9 ).

ప్రతిదినము, మన స్వంతచిత్తమును చంపుకొని- ఆయనవలె మన సిలువనెత్తుకొని వెంబడించుమని మన మార్గదర్శకుడైన యేసు పిలచుచున్నాడు (లూకా 9:23 ).

మనము పాపమును చాలినంత తీవ్రముగా పోరాడనందున మరియు దానిని జయించుటకు కావలసిన కృపను ఇవ్వమని తండ్రిని అడుగనందున మనము పాపములో పడిపోవుచున్నాము. ఈ రోజున బాహ్యసంబంధమైన వడ్రంగిగానో, బ్రహ్మచారిగానో లేక నీటిమీద నడచుట లేక మృతులను లేపుట అను పరిచర్యలో మనలను వెంబడించమని ఆయన కోరుటలేదు కాని పాపమును జయించే విషయములో ఆయన నమ్మకముగా ఉండినట్లు మనమును ఉండవలెను.

యేసుక్రీస్తునుగూర్చి రెండువిషయములు, ఒకటి ఆయన ప్రభువనియు, మరొకటి ఆయన శరిరధారియై వచ్చెననియు ఒప్పుకొనునట్లు పరిశుద్ధాత్ముడు మనలను ప్రేరేపించుచున్నాడు ( 1 కొరింథి 12:3 ; 1 యోహాను 4:2,3 ). ఈ రెండు ఒప్పుదలలు ముఖ్యమైనవే కాని యేసు శరీరధారియై వచ్చెనని ఒప్పుకొనక పోవుటయే క్రీస్తువిరోధియైన అంత్యక్రీస్తుయొక్క‍ఆత్మను గుర్తుపట్టుటకు ఆనవాలు గనుక రెండవ ఒప్పుకోలు మరికొంచెము ముఖ్యమైయున్నది ( 2 యోహాను 7,8 ).

ఈనాడు క్రీస్తుయేసను నరుడు ( 1 తిమోతి 2:5 ) అనేకులైన సహోదరులలో జ్యేష్టుడైయున్నాడు మరియు ఆయనయొక్క తండ్రియే మనకును తండ్రియైయున్నాడు (రోమా 8:29 : యోహాను 20:17 ; ఎఫెసీ 1:3 ; హెబ్రీ 2:11 ).

యేసు భూమిమీదకు వచ్చినప్పుడు దేవునిగా ఆయన ఉనికిని కోల్పోలేదు (యోహాను 10:33 ). ఆయన పరలోకము వెళ్ళినప్పుడు మానవునిగా తన ఉనికిని కోల్పోలేదు ( 1 తిమోతి 2:5 ).

రక్షణను గూర్చిన సత్యము

దేవునివాక్యము రక్షణనుగూర్చి మూడు కాలములలో - భూతకాలము (ఎఫెసీ 2:8 ) వర్తమానకాలము (ఫిలిప్పీ 2:12 ) మరియు భవిష్యత్కాలము (రోమా 13:11 )లలో చెప్పుచున్నది. మరొకమాటలో నీతిమంతులుగాతీర్చబడుట, పరిశుధ్ధపరచబడుట మరియు మహిమపరచబడుటగా చెప్పవచ్చును.

రక్షణానునది పునాది మరియు కట్టడమును కలిగియున్నది. పాపక్షమాపణ మరియు నీతిమంతులుగా తీర్చబడుట పునాదిగా ఉన్నది.

నీతిమంతులముగాతీర్చబడుట అనునది మన పాపములను క్షమించుట మాత్రమేగాక క్రీస్తుయొక్క మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము ఆధారముగా దేవునిదృష్టిలో మనము నీతిమంతులముగా అగుటయైయున్నది. ఇది క్రియలములముగా కలిగినదికాదు (ఎఫెసీ 2:8,9 ). ఎందుకనగా మననీతిక్రియలు కూడా దేవునిదృష్టిలో మురికి గుడ్డలవలె ఉన్నవి (యెషయా 64:6 ). మనము క్రీస్తుయొక్క నీతిని ధరించుకొనియున్నాము (గలతీ 3:27 ). మనము క్షమాపణ పొందుటకును మరియు నీతిమంతులముగా తీర్చబడుటకును మారుమనస్సు మరియు విశ్వాసము షరతులుగా ఉన్నవి (అ.కా. 20:21 ).

నిజమైన మారుమనస్సు(పశ్చాతాపము) ‘చేసిన‍అప్పును’ తిరిగి చెల్లించటము అను ఫలము ఫలించునట్లు చేయును. ఇతరులకు సంబంధించిన డబ్బు, వస్తువులు (తప్పుగా మన దగ్గర ఉన్నవి) కట్టవలసిన పన్నులు, ఇతరుల విషయములో మనము గతములో చేసిన తప్పులకు క్షమాపణ అడుగుట, వీటన్నిటినీ అవకాశము ఉన్నంతవరకు మనము చేయవలయును (లూకా 19:8,9 ). దేవుడు మనలను క్షమించినపుడు మనముకూడా ఇతరులను అదేవిధముగా క్షమించవలయునని ఆయన కోరుచున్నాడు. ఆవిధముగా క్షమించుటలో మనము తప్పిపోయినట్లయితే ఆయన ఇచ్చే క్షమాపణను ఆయన రద్దు చేయును (మత్తయి 18:23-35 ).

మారుమనస్సుపొంది మరియు విశ్వసించిన తరువాత నీటిలో ముంచబడే బాప్తిస్మము తీసుకొనవలెను. దీనిద్వారా మనలో ఉండిన ప్రాచీనపురుషుడు పాతిపెట్టబడినట్లు, దేవునియెదుట మనుష్యులయెదుట మరియు దయ్యములయెదుట బహిరంగముగా మనము సాక్ష్యమిచ్చుచున్నాము (రోమా 6:4-6 ).

అప్పుడు మనము పరిశుద్దాత్మ బాప్తిస్మమును పొందగలము. దానిద్వారా మనము శక్తితో నింపబడి క్రీస్తుకు మనజీవితములద్వారా, పెదవులద్వారా సాక్ష్యులముగా ఉండెదము (అ.కా. 1:8 ). పరిశుద్దాత్మతో నింపబడే బాప్తిస్మము అను వాగ్దానమును అడిగి (లూకా 11:13 ) మరియు దేవునియొక్క ప్రతిబిడ్డ, విశ్వాసముద్వారా ఆవాగ్దానమును పొందవలెను (మత్తయి 3:11 ).

మనము దేవునిపిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిచ్చును (రోమా 8:16 ). అది ప్రతిశిష్యునియొక్క ధన్యత అయివున్నది. మరియు మనము పరిశుద్దాత్మతో నింపబడియున్నామని నిశ్చయముగా ఎరుగుదుము (ఎఫెసీ 5:18 ).

పాపక్షమాపణపొందుట మరియు నీతిమంతులుగాతీర్చబడుట అనుపునాది మీద పరిశుద్దపరచబడుట అను కట్టడము ఉన్నది. పరిశుద్దపరచబడుట అనగా పాపమునుండి మరియు లోకమునుండి వేరుపరచబడుటయైయున్నది. ఇది ఒకవ్యక్తియొక్క నూతనజన్మతో (1 కొరంథీ 1:2 ) ప్రారంభమై, అతడు భూమిపై నివసించు కాలమంతా కొనసాగే ప్రక్రియయై ఉన్నది ( 1 థెస్స 5:23,24 ). ఈపనిని దేవుడు పరిశుద్ధాత్మద్వారా తనకట్టడలను మనహృదయములపై మరియు మనమనస్సునందు వ్రాయుటద్వారా ప్రారంభించును (హెబ్రీ 8:10 ). అయితే మన భాధ్యతగా మనరక్షణను మనము భయముతోను, వణుకుతోను కొనసాగించవలెనను (ఫిలిప్పి 2:12,13 ). అదేమనగా పరిశుద్దాత్ముడు ఇచ్చుచున్న శక్తి ద్వారా మనము శరీరక్రియలను చంపవలెను (రోమా 8:13 ). మనము మన శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్తకల్మషమునుండి పవిత్రపరచుకొనవలెను ( 2 కొరంథీ 7:1 ).

ఏ శిష్యుడైతే నిజముగా పరిపూర్ణమైన పరిశుద్దతను కోరి పూర్ణహృదయముతో పరిశుద్దాత్మునికి ఈ పనిలో సహకరించునో ఆప్పుడు అతని జీవితములో పరిశుద్ధపరచబడే ప్రక్రియ త్వరితముగా జరుగును. అదేపని పరిశుద్దాత్మునితో సహకరించనివానియందు నెమ్మదిగాజరుగుట లేక నిలచిపోవటము జరుగును.

మనము శోధించబడినపుడు నిజముగా మన మనస్సునందు ఎంతకోర్కె ఉన్నదో పరీక్షింపబడుచున్నది.

పరిశుద్దపరచబడుట అనగా ధర్మశాస్త్రమునందలినీతి మనహృదయములలో నెరవేర్చబడవలెను. అంతేకాని, పాతనిబంధనలోవలె బాహ్యక్రియల వలన కాదు (రోమా 8:4 ). దీనినే యేసు మత్తయి 5:17-48 వచనములలో వివరించి చెప్పెను. ధర్మశాస్త్రమంతయు "నీ దేవుని పూర్ణహృదయముతో ప్రేమించుట మరియు నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించుట" అను వాటిలో యిమిడి ఉన్నదని యేసు చెప్పెను (మత్తయి 22:36-40 ).

ఆయనస్వభావము (2 పేతురు 1:4 ) అయివున్న ప్రేమనియమమే మన హృదయములలో వ్రాయవలెనని దేవుడు కోరుచున్నాడు. యేసుయొక్క ఆజ్ఞలన్నిటికిలోబడి (విధేయత చూపించి) మరియు మనము ఎరిగిన పాపమంతటిని జయించే జీవితముద్వారా మాత్రమే ఆప్రేమ ప్రత్యక్ష పరచబడును (యోహాను 14:15 ).

యేసుప్రభువు తన శిష్యులకు విధించిన షరతులను (లూకా 14:26-33 ) నెరవేర్చుటద్వారా మాత్రమే ఇటువంటి జీవితములోనికి ప్రవేశింపగలము. అదిముఖ్యముగా మన బంధువులందరికంటే మరియు సొంతప్రాణముకంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించి, ఆయనకు మొదటి స్థానమిచ్చి మరియు మనకున్న సిరిసంపదలనుండి విడుదల పొందటము.

ఇటువంటి ఇరుకుద్వారమున మొదటిగా మనము వెళ్ళవలెను. అప్పుడు పరిశుద్దపరచబడే ఇరుకుమార్గము వచ్చును. పరిశుద్దపరచబడుటకు ప్రయత్నించని వారు ప్రభువును చూడరు (హెబ్రీ 12:14 ).

ఇప్పుడు మరియు ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుటకు సాధ్యమైనప్పటికీ (హెబ్రీ 7:19; 9:9,14 ) ప్రభువైనయేసు తిరిగివచ్చినపుడు మహిమశరీరము పొందువరకు పాపరహితమైన పరిపూర్ణత అసాధ్యము ( 1 యోహాను 3:2 ). అప్పుడుమాత్రమే మనము ఆయనను పోలియుందుము. కాని ఇప్పుడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే మనమును నడుచుకొన బద్దులమైయున్నాము ( 1 యోహాను 2:6 ).

మనము క్షయమైన శరీరముతో ఉన్నంతవరకు మనమెంత పరిశుద్ధపరచబడినా దానిలో మనకు తెలియని రీతిలో దాగియున్న పాపము ఉండును ( 1 యోహాను 1:8 ). ఇప్పుడు మనము పూర్ణహృదయముతో వెదకినయెడల ( 1 కొరంథీ 4:4 ) మనము నిర్దోషమైన మనస్సాక్షి కలిగియుండి (అ.కా. 24:16 ) మరియు తెలిసిన పాపమునుండి విడుదల పొందవచ్చును ( 1 యోహాను 2:1a). ఆ విధముగా మనము యేసు రెండవరాకడ కొరకును మరియు మనము మహిమ పరచబడుటకును ఎదురుచూచుచున్నాము. ఈ విధముగా రక్షణకార్యములో చివరిభాగము పొంది పాపరహితులముగా అగుదుము (రోమా 8:23 ; ఫిలిప్పీ 3:21 ).

సంఘమును గూర్చిన సత్యము

సంఘము క్రీస్తుయొక్క శరీరము. దీనికిఉండే ఒకేఒక శిరస్సు క్రీస్తు. మరియు మూడవ‍ఆకాశము సంఘమునకున్న ఒకేఒక ప్రధాన కార్యాలయము. క్రీస్తు శరీరములోని ప్రతి అవయవమునకు భాద్యత (పని) ఉన్నది (ఎఫెసీ 4:16 ). కొంతమందికి ముఖ్యమైన లేక బయటకుకనబడే పరిచర్య ఉన్నప్పటికీ, ప్రతిఒక్క అవయవము(వ్యక్తి) ఏదో ఒక విలువైనపరిచర్య కలిగియుండును.

క్రీస్తు తనసంఘమునకు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను తన శరీరముగా కట్టబడుటకు నియమించెను (ఎఫెసీ 4:13 ). ఇవి బిరుదులు కావు కాని పరిచర్యలై యున్నవి. అపోస్తలులు దేవునిచేత పిలువబడి మరియు స్థానిక సంఘములను కట్టుటకు పిలువబడిరి. సంఘములో వారికి మొదటి స్థానమున్నది ( 1 కొరంథీ 12:28 ) మరియు వారి పరిధిలో సంఘపెద్దలకు పెద్దలైయున్నారు ( 2 కొరంథీ 10:13 ). ప్రవక్తలు దేవుని ప్రజలయొక్క ఆత్మీయావసరతలను తీర్చేపరిచర్య చేసెడివారు. సువార్తికులు దేవునిఎరుగని ప్రజలను క్రీస్తునొద్దకు తీసుకొనిరాగల వరమును కలిగినవారు. క్రీస్తుశరీరమైన స్థానికసంఘములోనికి, దేవుని కొత్తగా తెలుసుకున్నవారిని తీసుకొనిరావలెను. ఈవిషయములో ఈకాలపు సువార్తికులనేకులు తప్పిపోవుచున్నారు. కాపరులు, గొఱ్ఱెపిల్లల మరియు గొఱ్ఱెలగురించి (అనగా క్రైస్తవవిశ్వాస జీవితములో క్రొత్తగా ప్రవేశించినవారిని మరియు స్థిరపడినవారిని) జాగ్రత్తతీసుకొని దారిచూపించెడివారు. లేఖనములను మరియు సిద్ధాంతములను వివిరించగలిగినవారే బోధకులు. ఈ ఐదువరములు ప్రపంచమంతా వ్యాపించియున్న సంఘమునకు ఇవ్వబడెను. వీటిలో కాపరులు మరియు ప్రవక్తలు ప్రతి స్థానికసంఘమునకు అవసరమైయున్నారు. మిగిలినవరముల అవసరత సంచారము చేయువారిద్వారా నెరవేర్చబడును.

స్థానికసంఘము యొక్క నాయకత్వము పెద్దల చేతులలో ఉండవలెను. దీనిని క్రొత్తనిబంధన స్పష్టముగా బోధించుచున్నది (తితు 1:5 ; అ.కా. 14:23). "పెద్దలు" బహువచనము కాబట్టి కనీసము ఇద్దరు పెద్దలు ప్రతిస్థానికసంఘములో ఉండవలెనని స్పష్టముగా తెలియుచున్నది. ప్రభువుయొక్క సన్నిధిలో సైతానుక్రియలను బంధించుటకు మరియు నాయకత్వములో సమతుల్యతకొరకు స్థానికసంఘములో ఒకరికంటే ఎక్కువ పెద్దలుండవలెను (మత్తయి 18:18-20 ). సంఘములో ఒకేవ్యక్తి నాయకత్వము క్రొత్తనిబంధన బోధకు వ్యతిరేకము. ఆపెద్దలలో ఒకరు ప్రభువునుండి ప్రవచనవరము పొందినయెడల అతడు ఆసంఘపుదూత కావచ్చును (ప్రకటన 2:1 ). ఒక స్థానికసంఘములో ఉన్న విశ్వాసులందరు సంఘవిషయములలో ఆ సంఘనాయకత్వమునకు లోబడవలెను (హెబ్రీ 13:17 ; 1 థెస్స 5:12,13 ).

యేసు తనశిష్యులకు బిరుదులు కలిగియుండకూడదని ఖచ్చితముగా చెప్పెను (మత్తయి 23:7-12 ). అందుచేత బోధకుడని లేక తండ్రి(ఫాదర్)అని లేక కాపరి(పాస్టర్)అని లేక పూజ్యుడని(రెవరెండ్) లేక నాయకుడని(లీడర్) పిలువబడడము వాక్యవిరుద్ధము. నిజానికి "పూజ్యుడు" (రెవరెండ్) అనేబిరుదు బైబులులో ఒక్కదేవునికే ఉపయోగించబడియున్నది (కీర్తన 111:9 ). సంఘములోని ప్రతిఒక్కరు ఒకసహోదరుడుగాగాని లేక సేవకునిగాగాని పిలువబడవలెను.

స్థానికసంఘములో వాక్యోపదేశముకొరకు (అ.కా. 20:9,11 ) లేక ప్రార్థనకొరకు (అ.కా. 12:5,12 ) లేక సువార్తీకరణకొరకు (అ.కా. 2:14-40 ) మరియు అందరిక్షేమాభివృద్ధికొరకు (హెబ్రీ 3:13 ) ప్రవచనావరము కలిగినవారు ఇతరులను ప్రోత్సహించుటకు వాక్యమును పంచుకొనవచ్చును ( 1 కొరంథీ 14:26-40 ). ఎవరైతే కూటములలో ప్రవచించవలెనని కోరుదురో వారందరు ప్రవచనావరమును అపేక్షించవలెను ( 1 కొరంథీ 14:1,39 ). బాషలలోమాట్లాడే కృపావరమువలన ముఖ్యముగా వ్యక్తిగత ఆత్మీయాభివృద్ది కలుగును ( 1 కొరంథీ 14:4,18,19 ). కాని సంఘకూటములలో బాషలలో మాట్లాడినయెడల, తప్పనిసరిగా దానిఅర్థము చెప్పువారుండవలెను ( 1 కొరంథీ 14:27 ). దానిఅర్థము ప్రత్యక్షతనుగాని, జ్ఞానవాక్యముగాని, ఒకప్రవచనముగాని, ఒకబోధగాని లేక దేవునికిప్రార్థనగాని అయిఉండవచ్చును ( 1 కొరంథీ 14:2-6 ). 1 కొరంథీ 12:8-10,28 మరియు రోమా 12:6-8లో ఉన్న కృపావరములన్నియు క్రీస్తుశరీరము(సంఘము) కట్టబడుటకు అవసరము. ఏ సంఘమైతే వీటిని నిర్లక్ష్యముచేయునో లేక అంగీకరించకుండునో ఆసంఘము వాటిని కలిగియుండదు- మరియు శక్తిహీనముగా ఉండును.

కూటములలో స్త్రీలు ముసుకువేసుకొనినవారై ప్రార్థించుటకును మరియు ప్రవచించుటకును అనుమతించబడియున్నది. కాని వారు పురుషులమీద అధికారము చేయుటకుగాని లేక బోధించుటకుగాని అనుమతించబడలేదు ( 1 కొరంథీ 11:5 ; 1 తిమొతీ 2:12 ). 1 కొరంథీ 11:1-16 వచనములలో చెప్పబడిన ప్రకారము ముసుకు ఈక్రింద వాటికి సూచనగా ఉన్నది.

1. స్త్రీ, పురుషుని మహిమయై యున్నది( 7 వ) గనుక సంఘములో పురుషుని మహిమ కప్పబడవలెను.

2. స్త్రీకి తలవెంట్రుకలు పైటచెంగు(మహిమ)గా ఇవ్వబడెను గనుక సంఘములో స్త్రీమహిమ కప్పబడవలెను ( 15 వ) (వారిఅందము వారివెంట్రుకలలో ఉన్నదని స్త్రీలకు తెలియును గనుకనే ముసుకు వేసుకొనువారు కొంచెము(సగభాగము) మాత్రమే వేసుకొనెదరు).

3. ముసుకు పురుషునిఅధికార సూచనగాఉన్నది ( 10 వ) అతను భర్తగాని, తండ్రిగాని లేక పెద్దగాని అయి ఉండవచ్చును..

స్త్రీలు అణకువయు స్వస్థబుద్దిగల వారైయుండి తగుమాత్రపు వస్త్రములతోనేగాని మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక క్రీస్తు పవిత్రతను ప్రత్యక్షపరచవలెను ( 1 తిమోతి 2:9 ).

అన్నిదేశములయందు కూడా యేసుప్రభువు శిష్యులను తయారుచేయుటకుగాను, వీలైనంతమందికి వీలైనన్నిరీతులలో యేసుక్రీస్తును గూర్చిన సువార్తబోధించే బాధ్యత సంఘము కలిగియున్నది (మార్కు 16:15 ; మత్తయి 28:19 ). శిష్యులను తయారుచేయలేని సువార్త దేవునిచిత్తముకాదు మరియు భూమిపై క్రీస్తుయొక్క సాక్ష్యమునకు ఆటంకముగా ఉండును.

ప్రతిస్థానికసంఘము "రొట్టె విరచుట" ద్వారా క్రీస్తుయొక్క మరణమును ప్రకటించవలెను ( 1 కొరంథీ 11:23-34 ). అయితే ఎన్నిసార్లు "రొట్టె విరచుట" అనేవిషయములో సంఘానికి పూర్తిస్వేచ్చ ఇవ్వబడినది. అయితే దీనినిఎన్నటికీ ఒకవిలువలేని ఆచారముగా మాత్రము మారనివ్వకూడదు.

కానుకలగురించి 3వయోహాను 7వవచనము ప్రకారము అవిశ్వాసులనుండి దేవునిపనికొరకు ద్రవ్యముతీసుకొనుట తప్పు అని వాక్యము తేటపరచుచున్నది గనుక అవిశ్వాసులు హాజరయ్యే కూటములలో కానుకలు పట్ట(వసూలుచేయ)కూడదు. విశ్వాసులు ఇచ్చేదంతయు రహస్యముగాను, తమకుతాముగాను మరియు సంతోషముతోను ఇవ్వవలెను(మత్తయి 6:13; 2 కొరంథీ 9:7 ). గనుక కానుకలపెట్టెను కూటములలో వేరేవారికి కనబడకుండా ఉండేస్థలములో ఉంచవలెను. కానుకలు పొందవలెననే ఉద్దేశ్యముతో "ప్రార్థనా ఉత్తరములు" లేక సువార్త సేవయొక్క నివేదికలు పంపించుట తప్పని మేము నమ్ముచున్నాము. ఎందుకనగా యేసుప్రభువు మరియు అపోస్తలులు ఆవిధముగా ఎప్పుడూ చేయలేదు.

యేసుయొక్క ఆజ్ఞలన్నిటినీ ప్రత్యేకముగా మత్తయి 5,6,7 అధ్యాయములలో వ్రాయబడిన వాటన్నిటినీ విశ్వాసముతో లోబడుటకు శిష్యులను నడిపించగలిగినప్పుడే సంఘము స్థిరముగా కదలకుండా ఉంటుంది. క్రొత్తనిబంధనలోని అతిచిన్న‍ఆజ్ఞకుకూడా లోబడవలెను మరియు ఉత్సాహముతో ప్రకటించవలెను (మత్తయి 5:19 ).

అనేకవిషయములను గూర్చి క్రొత్తనిబంధన మౌనముగా ఉన్నది. ఇటువంటి విషయములలో మేము సిద్దాంతములేమియు చేయకుండా ఇతరశిష్యులు వారినమ్మకములను బట్టి వారుండుటకు స్వేచ్చనిస్తూ మూఢనమ్మకముల విషయములలో మేము ఖచ్చితముగా ఉండెదము ( రోమా 14:5 ).

మనతో ప్రతివిషయములో ఏకీభవించేవారిని ప్రేమించుట సులభము. మనతో ఏకీభవించని వారియెడల మనకుగల వైఖరినిబట్టి మనప్రేమ పరీక్షించబడుచున్నది. దేవుడు తనపిల్లలందరూ ప్రతివిషయములో కూడా ఒకేవిధమైన అభిప్రాయము కలిగిఉండవలెనని తలంచలేదు. అదేవిధముగా ప్రతిస్థానికసంఘము వాక్యానుసారముకాని విషయములయందు ఒకేవిధమైన బాహ్యరూపము కలిగియుండవలెనని దేవుడు ఉపదేశించలేదు. భిన్నత్వములో ఏకత్వమునందు దేవునిమహిమ కనబడును. ఒకేవిధమైన రూపు ఉండటము అనేది మానవకల్పితము. ఇది ఆత్మీయమరణమును తెచ్చును. దేవుడు ఐక్యతను కోరుచున్నాడు కాని ఒకేవిధమైన బాహ్యరూపమును కోరుటలేదు.

చివరగా మనము జ్ఞాపకము ఉంచుకొనవలసినది ఒకరియెడల ఒకరికి గల ప్రేమయే. యేసు శిష్యులకుండవలసిన స్పష్టమైన గుర్తు (యోహాను 13:35 ) తండ్రి కుమారుడు ఒకరుగా ఏకమై ఉన్నట్లే సంఘముకూడా ఏకమైయుండుటకు అపేక్షించవలెను ( యోహాను 17:21 ).

దీన్నంతటినీ ఒక్కమాటలో చెప్పవలయుననినచో సత్యములో మనము స్థిరముగా నిలచియుండవలెను.

ఎందుకనగా దీనిని పూర్ణహృదయముతో అంగీకరించినవారిని ఈసత్యము స్వతంత్రులుగా చేయుచున్నది ( యోహాను 8:32 ).