మన జ్ఞాపకాల వీడియో టేపు

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   అన్వేషకుడు
Article Body: 

నాడు ఒక వీడియో కెమేరాతో మన పరిసర దృశ్యాలను ధ్వనులను యథాతధంగా వీడియో టేపుపై ముద్రించుకోవచ్చు.తరువాత ఈ టేపును ఒక తెరమీద ప్రదర్శిస్తే, జరిగినదాన్ని ఉన్నదున్నట్లుగా అది మనకు చూపిస్తుంది.

మన మందరమూ దేవునికి లెక్క అప్పగించే రోజు ఒకటి రాబోతోందని బైబులు చెబుతోంది. మానవ చరిత్రలో అనేక శతాబ్ధాలు దొర్లిపోయాయి. కొటానుకోట్ల ప్రజలు ఈ భూమ్మీద జీవించారు. అలాంటప్పుడు ప్రతి మనిషి అతని జీవిత కాలంలో చేసిన ప్రతి పనిని, అతడి ప్రతి ఆలోచనను గ్రంథస్థం (రికార్డు) చేయడం దేవునికి ఎలా సాధ్యం అని మనం విస్తుపోవడం సహజం. ప్రతి మనిషియొక్క జ్ఞాపకశక్తిలో దేవుడు ఈ వివరాలను ఉంచుతాడు.

జ్ఞాపకశక్తి అనేది మనం చేసే ప్రతి కార్యాన్ని, మన ప్రతి తలంపును, ప్రతిమాటను నమోదు చేసే వీడియో టేపు లాంటిది. అది మన అంతరంగ వైఖరులను, లక్ష్యాలను కూడా నమోదు చేస్తుంది. ఒక మనిషి చనిపోయినప్పుడు తన శరీరాన్ని ఈ భూమ్మీదే విడిచివేస్తాడు. అయితే, అతడి ఆత్మలో ఒక భాగం అయిన అతడి జ్ఞాపకశక్తి ఆత్మతోపాటే మృత ఆత్మలుండే చోటుకుపోతుంది. తీర్పుదినం ఆసన్నమైనప్పుడు అతడి ఆత్మ మళ్ళీ అంతకు పూర్వం ఈ లోకంలో తాను జీవించిన ఆ శరీరం తాలూకు మట్టిలోకి చేర్చబడుతుంది. మళ్ళీ భౌతిక శరీరం దాల్చి ఈ లోకంలో తన జీవిత వివరాల జాబితాను సమర్పించడానికి దేవుని యొద్దనిలుస్తుంది. ప్రతి మనిషికి తీర్పుతీర్చే ఆ దినం వచ్చినప్పుడు ప్రతి మనిషి యొక్క జ్ఞాపకశక్తి అనే ఆ వీడియో టేపును దేవుడు తెరమీద ప్రదర్శించి చూపుతాడు. లోకమంతా ఆ ప్రదర్శనను చూస్తారు. మనిషి జ్ఞాపకశక్తి అనే యంత్రమే అతడి జీవిత వివరాలను తిరిగి ప్రదర్శించి చూపుతుంది. గనుక, ఆ ప్రదర్శనలోని నిజానిజాలను ప్రశ్నించే సాహసం ఎవరికీ వుండదు.

ఈనాడు ప్రజలు ధరించిన సభ్యత, మత సంస్కారం అనే అచ్చాదన (ముసుగు) తొలగించబడి, అసలైన ఆంతర్య స్వరూపం చూపించబడుతుంది. ఏ మతంలో పుట్టి పెరిగినా అందరూ పాపంచేసినట్లుగా తెలిసిపోతుంది. గనుక మతం అనేది ఎవర్ని రక్షించలేదు. సత్కార్యాలు చేసినా, పేద సాదలకు డబ్బుదానాలు ఇచ్చినా గుడికి చందాలిచ్చినా దేవాలయాలు కట్టించినా - ఇవేవీ ఎవ్వరినీ రక్షించలేవు. ఎందుకంటే, రికార్డు చేయబడిన మన పాపాలను ఈ రకమైన మతకార్యకలాపాలు ఏవికూడా తుడిచి పెట్టలేవు.

తీర్పు దినాన మనం చేసిన పాపకార్యాలు, మన తలంపులు, మన మాటలు శాశ్వతంగా దేవుని దృష్టి నుండి తొలగించి వేసి, వాటిని మళ్ళీ తెరమీద ప్రదర్శింప కుండా చేయడానికి ఒకే ఒక మార్గంవుంది. మన మంచి కార్యాలు మన చెడు కార్యాలను తుడిచి వేయలేవు మనం చేసిన పాపానికి న్యాయమైన శిక్షను మనం ఎదుర్కొనక తప్పదు. పాపానికి దేవుని ధర్మశాస్త్రం విధించిన ఏకైక శిక్ష నిత్యమరణం. మన పాపాలను బట్టి మన మంతా ఆ శిక్ష పొందవలసియుంది.

ఈ నిత్య మరణం నుండి మనల్ని రక్షించడానికే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి యెరూషలేము వెలుపట సిలువమీద ఒక మానవుడిగా మరణించాడు. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం, మానవ జాతి పాపాల కోసం ఆయన దేవుని శిక్షను భరించాడు. అన్ని మతాల ప్రజల పాపాల కోసం, పాతి పెట్టబడిన మూడు దినాల తరువాత ఆయన సమాధిలో నుండి సజీవంగా లేచాడు. తాను నిజంగా దేవుని కుమారుడునని మానవుడి గొప్ప శత్రువైన మరణాన్ని జయించగలనని రుజువు చేశాడు. ఆ తరువాత నలభైరోజులకు, తాను మళ్ళీ నిర్ణీత కాలానికి ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి వస్తానని చెబుతూ, అనేకులు చూస్తూ వుండగా పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఈ వాగ్ధానం ఇచ్చి ఇప్పటికి సుమారు 1980 సం||రాలు గడిచిపోయాయి. అయన మళ్ళీ ఈ లోకానికి రాబోయే రోజు సమీపిస్తోంది. ఏదో ఒక రోజున ఆయన పరలోకం నుండి దిగి రావడం మనం చూస్తాము.

మానవ జాతి పాపాలకోసం మరణించిన వ్యక్తి చరిత్రలో యేసువొక్కడే మృతులలో నుండి సజీవుడిగా మళ్ళీ లేచినవాడు కూడా ఆయన వోక్కడే. ఈ రెండు విషయాల్లో ఆయన విశిష్ఠుడు.

మనం మన పాపాలనుండి మళ్ళుకొని, పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తును బట్టి మనల్ని క్షమించమని దేవుని బ్రతిమాలు కొంటే, ఆయన మన పాపాలకోసం చనిపోయి, సమాధిలోంచి తిరిగి లేచాడని విశ్వసిస్తే, ఆ వీడియో టేప్ నుండి మన పాపాలు తుడిచి వేయబడతాయి.యేసును నీ జీవితంలోకి ఆహ్వనించి నీ గత కాలపు పాపపు జాబితాను అవి ఎంత ఘోరమైనవైనా సరే, ఇప్పుడే రద్దు చేయమని నీవు ఆయన్ని అడగవచ్చు. ఆ తరువాత నీవు పవిత్ర జీవితాన్ని ప్రారంభించి ఆయన బిడ్డగా వుండొచ్చు.

మానవ జాతి కోసం దేవుడు ఏర్పరచిన ఏకైక రక్షణ మార్గం ఇదే. ఈ అవకాశాన్ని నీవు వినియోగించుకో. అలా కాని పక్షంలో నీ జ్ఞాపకశక్తి అనే ఆ వీడియో టేపు ఆ తీర్పు దినాన చూపించే నీ పాపపు జాబితాను చూడవలసివస్తుంది. ఈ వాస్తవాన్ని తెలిసికొని, పాపులందరికీ నిత్య నరకాగ్ని తీర్పు వుంటుందని ఎరిగి ప్రేమతో ప్రతి వొక్కరిని మనం హెచ్చరించాలి.

ఇక ఏ మాత్రం జాగు చేయక సరైన నిర్ణయం నీవు తీసుకో. దేవుడు నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక! యదార్థమైన ప్రేమతో ఈ దైవ సందేశాన్ని మీకందిస్తున్నాము.