WFTW Body: 

నీ శక్తికి బదులుగా దేవుని శక్తిని పొందుట

యెషయా 40:29-31 లో మనము ఆరాధించి మరియు సేవించుచున్న సర్వశక్తిగల దేవుడు మనము బలహీనముగా ఉన్నపుడు నూతన బలమునిచ్చును. మన శక్తిహీనులమైనపుడు, ఆయన మనకు శక్తినిచ్చును. మనమాయనను సేవించుటకు కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఆయన ఇస్తాడు. ప్రభువును సేవించుటలో యవ్వనస్తులు సొమ్మసిల్లి తొట్రిల్లవచ్చును కాని దేవుని కొరకు కనిపెట్టువారు, ఏ వయసులో ఉన్నప్పటికిని నూతన శక్తిని పొందెదరు. ఇది ఎంత అద్భుతమైన వాగ్ధానం. వృద్ధులవలె యవ్వనస్తులు తొట్రిల్లవచ్చును కాని "యెహోవా కొరకు యెదురు చూచువారు నూతన బలము పొందుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మస్లిలక నడిచిపొవుదురు." మీ అవసరములన్నిటి కొరకు సామాన్యమైన విశ్వాసముతో ప్రభువు దగ్గర కనిపెట్టి ప్రార్థించాలని ప్రోత్సహిస్తున్నాను. ఈ వచనము చెప్పుచున్నట్లుగా నూతన బలమును పొందెదరు. మరొక తర్జుమాలో ఇలా చెప్పబడింది "ప్రభువు యొద్ద కనిపెట్టువారు వారి బలానికి బదులుగా నూతన బలము పొందుదురు". అనగా మన శక్తిని మనము ప్రభువుకిచ్చినట్లయితే ఆయన తన శక్తిని మనకిచ్చును హల్లెలూయా! మనకున్నదంతా ప్రభువుకిచ్చి ప్రభువుకున్నదానిని మనము పొందవచ్చు. ప్రభువైన యేసు తండ్రితో ఇట్లన్నారు "తండ్రి, నావన్నియు నీవి, నీవియు నావి" యోహాను 17: 10-11. ప్రభువుయొక్క పరిచర్యలో ఆయనయొక్క శక్తి నీకు అవసరమని నీవు చూస్తావు. ప్రభువును సేవించువారందరు, ఆయనయొక్క అద్భుతమైన శక్తిని మరియు పునరుత్థాన శక్తిని వారి ఆత్మలలోనే గాక వారి శరీరములలో కూడా పొందేటట్లు వారు ప్రభువునందు విశ్వాసముంచాలి. అప్పుడు మనము వృద్ధులమైనప్పటికి ప్రభువుకొరకు ఫలిస్తాము కీర్తనలు 92:15.

పరిశుద్ధాత్మ అభిషేకమునకు విలువనిచ్చుట

యెహెజ్కేలు 3:23,24. "నేను లేచి మొదట చూచినటువంటి యెహోవా ప్రభావమును నేను చూచితిని. నేను నేలను సాగిలపడితిని". పరిచర్యకు సంబంధించిన మరియొక ముఖ్యమైన సూత్రము ఇక్కడున్నది. నీ ముఖమును ఎల్లప్పుడు ధూళిలో పెట్టుకొనుము. కొన్నిసార్లు అలా శారీరకముగా చేయడం కూడా మంచిది. నీ గదిలో నేలపై సాష్టాంగపడి, "ప్రభువా, నేను ఇలా ఉండుటకే తగినవాడను. నేను నీ దృష్టిలో ఏమి కాని వాడనుగా ఉన్నాను" అని చెప్పండి. ఇతరులఎదుట నిలబడి బోధించే మనమే గొప్ప ప్రమాదములో ఉన్నాము. ఎందుకంటే అనేకమంది మనలను అభినందిస్తారు మరిము ఘనపరుస్తారు. అందరికంటే ఎక్కువగా మనము ప్రభువుయొద్దకు వెళ్లి ఏకాంతముగా ఆయన యొద్ద సాష్టాంగపడి ఆయన దృష్టిలో మనము ఏమికానివారిమని గుర్తెరగాలి. దేవుడు ఒక్క క్షణములో మన ఊపిరిని తీసివేయగలడు. ఆయన ఒక్క క్షణములో మన అభిషేకమును తీసివేయగలడు. నా జీవితములో అన్నిటికంటే ఎక్కువగా నా అభిషేకాన్ని పోగొట్టుకొనుటకు భయపడతాను. నా జీవితము పైన దేవుని అభిషేకమును పోగొట్టుకొనుటకంటే నా డబ్బంతటిని నా ఆరోగ్యమునంతటిని పోగొట్టుకొనుటకు ఇష్టపడతాను. మన నాలుకల విషయములో లేక డబ్బు విషయములో కొంచెం లెక్కలేనితనంగా ఉండుట ద్వారా అభిషేకాన్ని పోగొట్టుకోవచ్చును. యెహెజ్కేలు ముఖము ధూళిలో ఉన్నప్పుడు, ఆత్మ వచ్చి అతనిని తన కాళ్లమీద నిలబెట్టెను. దేవుని యెదుట ధూళిలో ఉన్నప్పుడే ఆత్మ మనపైకి వచ్చును. నిన్ను నీవు ఎప్పుడు ఘనపరచుకొనకుము. ఆయనే మనలను పైకెత్తుటకు ఘనపరచుటకు అనుమతించెదము.

నీ గత జీవితములో ఓటములెన్ని ఉన్నప్పటికిని ప్రభువు నిన్ను ప్రోత్సహించును

యెషయా 42:2 "అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధులలో వినబడనియ్యడు". ఈ మాట యేసుకు సంబంధించినదిగా మత్తయి 12:19, 20 లో పేర్కొనబడింది. తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు అని కూడా చెప్పబడినంది. అంటే తన జీవితాన్ని పాడుచేసుకున్న వ్యక్తిని ప్రభువెన్నడు నిరుత్సాహపరచడు. దానికి బదులు అతనిని ప్రోత్సాహించి స్వస్థపరచును. ప్రభువు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. కాని అది మండే విధముగా దాని మీద ఊదును. తప్పిపోయిన బలహీన విశ్వాసులకు సహాయపడుటకు ఆయన ఆసక్తి కలిగియున్నాడు. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని లేవనెత్తుటకు వారికి సహాయపడుటకు ఆయన ఆసక్తి కలిగియున్నాడు. ఒక నిజమైన దేవుని సేవకుడు అటువంటి ప్రోత్సహించే పరిచర్యను కలిగియుంటాడు. నిరాశ నిస్పృహలలో ఉన్నవారిని, నిరీక్షణలేనివారిని, జీవితం పైన విరక్తిగలవారిని తన పరిచర్య ద్వారా పైకి లేపుతాడు. అన్నిచోట్ల ప్రజలకు ఇటువంటి పరిచర్య అవసరము గనుక మనమందరము దానిని కోరుకోవాలి.