WFTW Body: 

1 యోహాను 1:3 లో "తండ్రితోనే మనము సహవాసము చేయాలి" అని యోహాను వ్రాసాడు. సిలువకు రెండు భుజములు ఉన్నట్లు నిజమైన సహవాసానికి రెండు మార్గములు అవసరము. సిలువ ద్వారానే మనము దేవునితోను, ఇతరులతోను సహవాసములోనికి వస్తాము. క్రీస్తుకు మరియు మనకు మధ్యలో ఉన్న సిలువ మీద ఆయన మరణించాడు. దానిని బట్టి మనము ప్రభువుతో సహవాసము చేయవచ్చును. సిలువ లేకుండా మనము దేవునితో సహవాసము చేయలేము. ఎందుకనగా మనము అనర్హులము. విశ్వాసులమైన మన మధ్యలో కూడా సహవాసము కావాలని కోరినట్లయితే మన మధ్యలో ఉన్న సిలువ మీద మన స్వచిత్తానికి చనిపోవాలి. పరలోక సంబంధముగాను, భూలోకసంబంధముగాను సిలువ మీద మరణించని యెడల సహవాసము చేయలేము. జీవానికి మరియు సహవాసానికి సిలువే రహస్యము. సిలువలేకుండా జీవములేదు. సహవాసము కూడా అసాధ్యమే. ఆదియందే అనగా జగదుత్పత్తికి ముందుగానే దేవుని మనస్సులో సిలువ ఉన్నది. "జగదుత్పత్తి కంటె ముందుగానే దేవుని గొఱ్ఱెపిల్ల వధింపబడియున్నది" (ప్రకటక 13:8). త్రిత్వములో రెండవ వ్యక్తి భూమిమీదికి మనుష్యకుమారుడుగా వచ్చి మానవుల కొరకు సిలువవేయబడతాడని దేవుడు ఆదియందే ఎరిగియున్నాడు. ఆదాము పాపము చేసిన తరువాత దేవుడు దానిని నిర్ణయించలేదు. జగదుత్పత్తికి ముందుగానే ఆయన ఎరుగును. ఆదాము పాపము చేసినప్పుడు జీవవృక్షమునకు పోవు మార్గమున ఒక ఖడ్గమును దేవుడు ఉంచాడు. ఆ ఖడ్గజ్వాల ప్రభువైన యేసుమీద పడి ఆయనను సిలువవేసింది. ఆ ఖడ్గజ్వాల మనలో ఉన్న ఆదాముయొక్క జీవము మీద కూడా పడియున్నది. అనగా మనము "క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నామని" మనము అంగీకరించాలి (గలతీ 2:20). ఆవిధముగా మనము జీవవృక్షము వద్దకు వచ్చి దేవునితోను మరియు ఒకరితోనొకరమును సహవాసము కలిగియుండగలము.

సహవాసము ద్వారా మన సంతోషము పరిపూర్ణమగుచున్నది అని యోహాను చెప్పుచున్నాడు (1 యోహాను 1:4). ఈ సంతోషము పరలోకంలోనే ఉంటుంది గనుక అది ఒక క్రైస్తవునిలోనికి పరలోకమును తెస్తుంది. పరలోకంలో ఎవరు దిగులుపడరు. దేవదూతలు ఎన్నడైననూ నిరాశ పడరు. వారు ఎల్లప్పుడు సంపూర్ణ సంతోషమును కలిగియుంటారు. దేవునితో మనకు కూడా సహవాసము ఉన్నట్లయితే మనము కూడా పరిపూర్ణ సంతోషమును కలిగియుంటాము. పరిశుద్ధాత్ముడు పరలోక వాతావరణము మన హృదయములోనికి తెస్తాడు. పరిపూర్ణ సంతోషము వాటిలో ఒకటి. నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొన్నట్లయితే, నీవు ఎల్లప్పుడు బాధతో, దిగులుతో నిరాశలో ఉంటావని సాతాను నీకు చెపుతాడు. కొంతమంది క్రైస్తవులు ఆ విధముగా కనిపించుట బాధాకరము. దిగులుతో ముఖము చిన్నబుచ్చుకొన్న క్రైస్తవుడు ఒక వ్యక్తికి సాక్ష్యము చెప్పుచూ ఇట్లన్నాడు "ప్రభువైన క్రీస్తును నీ హృదయములోనికి స్వీకరిస్తావా?". ఆ వ్యక్తి ఆ క్రైస్తవుని ముఖము చూచి ఇట్లన్నాడు, "వద్దు నీకు వందనములు నాకు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నవి". ఆశ్చర్యకరమైన మన ప్రభువుకు ఇది ఎంతో బలహీనమైన సాక్ష్యము. నీ జీవితములోను మరియు నీ కుటుంబ జీవితములోను ప్రభువుతో ఉన్న సంతోషము ప్రకాశించనట్లయితే నీ జీవితములో ఏదో తప్పు ఉన్నది. నీవు ఎక్కడో దేవుని చిత్తాన్ని కోల్పోయావు.

యోహాను ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. నీకు ఈ దేవుని జీవము, సహవాసము మరియు సంతోషము కావాలంటే, "దేవుడు వెలుగైయున్నాడు మరియు ఆయనయందు చీకటి ఎంత మాత్రమును లేదు (1 యోహాను 1:5)" అని మొట్టమొదట నీవు అర్థం చేసుకోవాలి. ఒక్క అబద్ధము కూడా చెప్పకుండుట, అపవిత్రత, ద్వేషము, గర్వము మొదలగునవన్నీ ఏ మాత్రమును కూడా లేకుండుట. అబద్ధములు చెప్పకుండుట, ఎవరిని ద్వేషింపకుండుట, ఎవరి మీదనైననూ అసూయ పడకుండా మరియు గర్వించకుండా ఉండే జీవితాన్ని నీవు కోరుచున్నావా? ఆ జీవితాన్ని నీవు కోరినట్లయితే, నీవు దిగులుపడవు. నిరాశపడవు. నీవు ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందిస్తుంటావు. పాపమును బట్టి శపించబడిన ఈ భూమిమీద అటువంటి జీవితము సాధ్యమేనా? అవును సాధ్యమే. ప్రభువులో మనము ఎల్లప్పుడు ఆనందించాలని ఫిలిప్పీ 4:4లో ఆజ్ఞాపించబడ్డాము. అది భూమి మీద ఉన్న వారికే గాని పరలోకంలో ఉన్నవారికొరకు వ్రాయబడలేదు. నీవు సౌఖ్యముగా ఇంటిలో కూర్చున్నప్పటికి, యోహాను వలె పత్మాసు ద్వీపములో హింసింపబడినప్పటికిని నీవు పరిపూర్ణ సంతోషమును కలిగియుండగలవు. ఎల్లప్పుడు నీవు దేవుని వెలుగులో నడవాలని నీవు కోరినట్లయితే, నీ పరిస్థితులకు అతీతముగా నీవు సంతోషముగా ఉండగలవు.

మనము ఆయనలో సహవాసము గలవారమని చెప్పుకొని మరియు చీకటిలో నడిచినయెడల సత్యమును జరిగింపక యుందుము. అనేకమంది క్రైస్తవులు దేవునితో సహవాసము కలదు అని చెప్పుకొనుచూ పాపములో జీవిస్తున్నారు. వారి ముఖములలో ప్రభువులో ఉన్న సంతోషము లేకపోవుటను మీరు చూడగలరు. వారిలో జీవము సమృద్ధిగా లేదు, పెదవులపై పాట ఉండదు, వారి కళ్ళలో ప్రకాశము ఉండదు. దేవుని సహవాసములో ఉన్న సంతోషాన్ని వారు పోగొట్టుకొనుచున్నారు. విశ్వాసులముగా మనము దేవునితో ఎంతకాలము నడిస్తే అంత సంతోషాన్ని అనుభవిస్తాము.