WFTW Body: 

దేవుడు వెలుగు మరియు ప్రేమయై యున్నాడు (1యోహాను 1:5; 4:8). ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించుచున్నాడు (1తిమోతి 6:16). ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండవలెనని ఆయన పిలుచుచున్నాడు.

అయితే పరిశుద్ధత మానవులకు శోధన ద్వారా మాత్రమే వచ్చును. ఆదాము అమాయకుడుగా, మంచి చెడులంటే ఏమిటో తెలియని వానిగా సృష్టింపబడెను. అతడు పరిశుద్ధుడుగా ఉండాలని దేవుడు కోరుకొనెను. అందుకోసం అతడు పరీక్షింపబడుటకు దేవుడు అనుమతించెను.

మంచి చెడుల వివేచననిచ్చే చెట్టు దేవుని చేత సృష్టింపబడెను, అది చెడ్డది కాదు. దేవుడు "చాలా మంచిది" అని ప్రకటించిన ప్రపంచంలో ఆ చెట్టు ఉండెను (ఆది 1:31). ఆదాముకు, శోధనను ఎదురించుట ద్వారా పరిశుద్ధుడగు అవకాశము ఆ చెట్టు కల్పించెను గనుక అది ఎంతో మంచిది.

శోధనలు దేవుని యొక్క జీవములోను, పరిశుద్ధతలోను పాలుపంచుకొనునట్లు అవకాశము కల్పించి (హెబ్రీ 12:10) "పరిపూర్ణులమును మరియు అనునాంగులమును (సంపూర్ణులము)" (యాకోబు 1:4) అగునట్లు చేయుట చేత "మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు మహానందమని ఎంచుకొనుడని" (యాకోబు 1:2) బైబిలు చెప్తుంది.

మనము యేసు యొక్క పరిశుద్ధతను చూచినప్పుడు ఆయనకు దేవునిగా సంక్రమించిన పరిశుద్ధతను మనము చూడము. ఎందుకంటె అది మనకు ఏ విధముగానూ మాదిరికాదు. మనము ఆయనను "అన్ని విషయములలో తన సహోదరుల వంటివాడుగాను" మరియు "సమస్త విషయములలో మనవలె శోధింపబడినను పాపము చేయనటువంటి" వానిగా (హెబ్రీ 2:17, 4:15) చూచెదము.

యేసు మనము పరిగెత్త వలసిన పరుగు పందెపు మార్గములో మనకంటె ముందు పరిగెత్తుతూ మనము వెంబడించుటకు (యోహాను 12:16) మార్గము సిద్ధపరచుచు ముందు పరిగెత్తువాడాయెను (ఆద్యుడాయెను) (హెబ్రీ 6:20). మనము కూడ అలసట పడకయు ప్రాణములు విసుకకయు ఉండునట్లు మనకంటె ముందు పరిగెత్తిన ఆయనవైపు చూచుచూ మనము కూడా పరిగెత్తుదము (హెబ్రీ 12:1-4).

యేసు ఏమనుష్యుడైనా ఎప్పుడైనా ఎదుర్కొను ప్రతి శోధనను ఎదుర్కొనెను. ఆయన "అన్ని విషయములలో మనవలె శోధింపబడెను". ఇది హెబ్రీ 4:15లో తేటగా వ్రాయబడెను. ఇది మనకు ప్రోత్సాహకరమైన విషయం. ఈ రోజున దేవునిచే మనకివ్వబడని ఎటువంటి ప్రత్యేకమైన శక్తినీ యేసు ఉపయోగించలేదు. ఆయన ఒక మానవుడిగా, పరిశుద్ధాత్మ ద్వారా తన తండ్రిచే ఇవ్వబడిన శక్తితో శోధనను ఎదుర్కొని జయించారు.

దేవుని న్యాయవిధులు విధేయత చూపుటకు భారమైనవి మరియు అసాధ్యమైనవని సాతాను మనుష్యులకు ఎప్పుడూ చెప్పుచుండును. యేసు మానవునిగా ఆయన జీవితములో పరిపూర్ణ విధేయత చూపుట ద్వారా అది అబద్ధమని ఋజువు చేసెను. యేసు జయించని ఏ శోధననైనా లేక దేవునికి విధేయత చూపని ఏ ఆజ్ఞయైనా ఉండినట్లయితే, అప్పుడు దానిని బట్టి మనకు పాపముచేయుటకు అవకాశము దొరికి ఉండేది. అలాగే యేసు అటువంటి పరిపూర్ణమైన జీవితమును, మనకున్నటువంటి రక్తమాంసములు గల శరీరములో నుండిన బలహీనతలు లేకుండా మనకు అందుబాటులో లేనటువంటి శక్తితో జీవించినట్లయితే, అప్పుడు ఆయన జీవితము మనము వెంబడించుటకు మాదిరిగా ఉండేదికాదు లేక మనము శోధింపబడు సమయాలలో అది మనకు ప్రోత్సాహకరముగా ఉండేదికాదు. యేసు ఈ భూమిపై మానవుడిగా, ఆయన వాక్యములో మనము చూచు ఆజ్ఞలను పాటించుటకు దేవుడు మనకు అందుబాటులో ఉంచు శక్తి సరిపోతుందని జీవించి చూపారు.

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడెను (హెబ్రీ 4:15).

పాపము లేని యేసు యొక్క జీవితము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మానవుడు పాపముపై సంపూర్ణ విజయము పొందవచ్చనియు, దేవునికి సంతోషముతో విధేయత చూపవచ్చని లోకమునకు దేవుడు చూపుటైయున్నది. మనము ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే, మనము "ఆయన వలె నడువబద్దులై యున్నాము" (1 యోహాను 2:6).