క్రీస్తు శరీరాన్ని ఒక హాస్పిటల్‍తో పోల్చవచ్చు. ఒక రోగి హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు అతనికి సహాయపడేందుకు అందులో ఆయా విభాగాలుంటాయి. ఆ రోగికి ఒక ఇంజక్షన్ అవసరం కావచ్చు, లేక శరీర వ్యాయామ చికిత్స (ఫిజియోథెరపీ), శస్త్ర చికిత్సలాంటివి అవసరం కావచ్చు. అతడొక కంటి డాక్టరునో, చెవి డాక్టరునో సంప్రదించాల్సి ఉండవచ్చు. ఇలా హాస్పిటల్ ఆయా విభాగాలు కలిగి ఉంటుంది. కంటి డాక్టరు తనసమయమంతా రోగుల కళ్ళు పరీక్షించటంలోనే గడుపుతాడు, మరేదీ చేయడు. అంతమాత్రాన అతడు శరీరంలోని ఇతర అవయవములను తేలికగా భావించడం లేదు, అతని ప్రత్యేకత కన్నుమాత్రమే.
క్రీస్తు శరీరములో కూడా ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క వరము, పిలుపు ఉంది. విడివిడిగానైతే ఒక్కొక్కరు ఎటువంటి సమతుల్యత లేకుండా ఉంటారు. ఈ భూమి మీద ఎన్నడైనా నడచిన సంపూర్ణ సమతుల్యత కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మనమందరమూ, మనలో శ్రేష్టులైన వారు కూడా సమతుల్యత లేనివారే. మనము ఇతర సహోదర, సహోదరీలతో కలసి పరిచర్య చేసినప్పుడు మాత్రమే మన సమతుల్యతను కనుగొంటాము. - ప్రభువు హాస్పిటల్‍లో ఇతర విభాగాలతో కలసి పని చేసినప్పుడు మాత్రమే సమతుల్యత లభిస్తుంది. అందుచేత ఈ హాస్పిటల్‍లో వ్యక్తిగతమునకు ఎటువంటి స్థానము ఉండదు.
ఒక మంచి హాస్పిటల్‍లో రోగుల అవసరతలన్నీ తీర్చుటకు ఆయా విభాగాలుంటాయి. అదే విధంగా క్రీస్తు శరీరము కూడా ప్రజలందరికీ సహాయపడేందుకు ఆయా రకాల పరిచర్యలు, అనేకమైన ఆత్మ వరాలు కలిగివుంది. ఏ ఒక్క సంఘముగానీ, గుంపుగానీ ఆత్మ వరాలన్నిటినీ కలిగిలేదు. కానీ క్రీస్తు శరీరమంతటిలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి.
క్రీస్తు శరీరములో మన సొంత నిర్దిష్టమైన పిలుపు ఏమిటో మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి.
లోకమంతా ఆత్మీయముగా జబ్బుపడిన ప్రజలతో నిండి ఉంది. దానిలో ఎవ్వరూ నిరీక్షణ లేనివారు లేరు. ఎవరైనా ప్రభువుచేత సంపూర్ణ స్వస్థతపొందగలరు. మనము ప్రకటిస్తున్న సువార్త యొక్క శుభవార్త ఇదే. ఒక భయంకర పాపి, అతి భ్రష్టుడైన వాడుకూడా ప్రభువు హాస్పిటల్‍కు వచ్చి చికిత్సపొంది బాగుపడగలడు. తీవ్రమైన రోగంతో కృశించిపోతున్నవాడినైనా, ఒక మంచి హాస్పిటల్ మేము చేర్చుకొనలేమని చెప్పదు. భయంకర రోగాలకు చికిత్స చేయటానికి సరైన పరికరాలు లేనందుచేత తక్కువ ప్రమాణాలు కలిగిన హాస్పిటల్స్ అటువంటి రోగుల్ని చేర్చుకొనవు. అదే విధముగా ఒక మంచి సంఘము తనను ఆశ్రయించినవాడు ప్రపంచంలోకెల్లా మహా గొప్ప పాపి అయినప్పటికీ అతనికి నిరీక్షణ లేదని చెప్పదు. ఒక పాపి చికిత్స పొందుటకు ఇష్టపడితే - ఒక మంచి సంఘము అత్యంత భ్రష్టులైన పాపులను కూడా మహాగొప్ప పరిశుద్ధులుగా మార్చగలదు.
సంఘాన్ని ఒక మానవ శరీరముతో కూడా పోల్చవచ్చు. మానవ శరీరములోని ప్రతి అవయవము ఒక్కొక్క పనిని(విధిని) కలిగి ఉంటుంది. ఆ అవయవము తన పని నెరవేర్చటం మీదనే లక్ష్యముంచుతుంది. అయినప్పటికీ అది వేర్వేరు పనులు కలిగియున్న ఇతర శరీర భాగాలకు తగిన విలువనిస్తూ, అభినందిస్తూ వాటికి సహకరిస్తుంది. క్రీస్తు శరీరములోని ఇతర పరిచర్యలతో మనము కలసి పని చేసేటప్పుడు ఈ విధముగానే చేయాలి.
క్రీస్తు శరీరములో ఆత్మ వరాలు పనిచేసే తీరును చిత్రీకరించుటకు ఉదాహరణగా 1కొరింథీ 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు కళ్ళు, చెవులు, చేతులు, పాదాలను ప్రస్తావించాడు.
చేయి చేసే పనిని కడుపు ఘన పరుస్తుంది, కానీ కడుపు ఎన్నటికీ చేయి చేసే పని చేయుటకు ప్రయత్నించదు. ఉదాహరణకు, కడుపు ప్లేటులో ఉన్న ఆహారమును తీసుకొనుటకు ఎప్పుడూ ప్రయత్నించదు. చేతిని ఆ పనిని చేయుటకు అనుమతించి, తన స్వంత పనియైన చేయి తీసిచ్చిన ఆహారమును జీర్ణము చేసే పనిని చేస్తుంది. క్రీస్తు శరీరములో ఉన్న మనము పరస్పరము ఏ విధముగా పూరించుకోవాలో దానికిది సాదృశ్యము.
శరీరములో ఇమిడియున్న ఈ వివిధ పరిచర్యల సత్యాన్ని చాలా మంది విశ్వాసులు చూడలేదు. మీరు ఈ సత్యాన్ని గమనించకపోతే దేవుడు నెరవేర్చాలని సంకల్పించిన కార్యమును మీరెన్నడూ సాధించలేరు.
పాత నిబంధన ప్రవక్తల్లో ఎవ్వరూ తమ పరిచర్యలో సమతుల్యముగా లేరు. కేవలం దౌత్యముగా ఉండే (అందరిని సంతోషపెట్టాలనే) బోధకులే సమతుల్యముగా ఉండుటకు చూస్తారు. ప్రవక్తలందరూ సమతుల్యత లేనివారే. వారంతా ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పటం జరిగింది - ఎందుకంటే ఇశ్రాయేలీయులకు, యూదులకు వారితరంలో అది అవసరము - దానిని దేవుడు అప్పటి ప్రవక్తల హృదయాల్లో భారంగా ఉంచాడు. దేవుడు మనల్ని దేనికి పిలిచాడో మన స్వంత మనస్సులో స్పష్టంగా ఉండటం మనందరికీ మంచిది.
సాధారణంగా ప్రభువు మన హృదయాలలో మనకు ఇచ్చే భారమే ఆయన శరీరంలో మన కోసం ఆయన కలిగి ఉన్న పరిచర్యకు సూచనగా ఉంటుంది.
ప్రభువు సేవ చేయనారంభించిన వెంటనే మన పిలుపుఏమిటో మనకున్న వరమేమిటో మనమందరము తెలుసుకోగలమని నేను చెప్పటంలేదు. నా పరిచర్య ఏమిటో నాకు స్పష్టముగా తెలియుటకు నేను క్రొత్తగా జన్మించిన తరువాత 15 సంవత్సరములు పట్టినది. నీకు ఇంత కాలం పట్టకపోవచ్చు. ఇంకా తక్కువ కాలమే పట్టవచ్చు. సమయం విషయం నీవు దేవునికే విడిచిపెట్టాలి. మరెవ్వరూ సాధించలేని వ్యత్యాసమైన, ప్రత్యేకమైన పరిచర్య నీకు క్రీస్తు శరీరములో ఉందనే విషయాన్ని నీవు స్పష్టముగా అవగాహన చేసుకోవాలి. అంతేగాక ఆ పరిచర్య ఎన్నటికీ సమతుల్యత కలిగియుండదు. అది అసమతుల్యమైనదిగా ఉండును. శరీరములో వేరే ఇతర పరిచర్యలు కలిగియున్న ఇతరులతో సహవాసము చేస్తూ పనిచేయుట ద్వారా మాత్రమే నీ సమతుల్యతను కనుగొనగలవు. ఈ విధముగా ఇతరులపై ఆధారపడేలా చేస్తూ దేవుడు మనల్ని దీనులుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం!