WFTW Body: 

సువార్త ప్రకటన నిషేధించబడిన ఒక దేశానికి వేళ్ళే ప్రయత్నములో నేను ఉన్నప్పుడు ప్రభువు నాకు మత్తయి 28:18-19 లేఖన భాగాన్ని గుర్తు చేశాడు. పరలోకంలో మరియు భూలోకంలో సర్వాధికారము తనకున్నందుచేత సర్వలోకములోని సకల దేశములకు వెళ్ళి శిష్యులుగా చేయమని ప్రభువు మనల్ని ఆజ్ఞాపించాడని నేను అందులో చూచాను. ఆ వాక్య ఆధారముపై మనము వెళ్ళకపోతే, ప్రతిచోటా మనము సమస్యలు ఎదుర్కొంటాము.

మత్తయి 28 అధ్యాయములోని ప్రధాన ఆజ్ఞలో "కాబట్టి" అనే మాట చాలా ముఖ్యమైనది. చాలా మంది బోధకులు "వెళ్ళండి" అను మాటను నొక్కి చెబుతారు. అది మంచిదే. కానీ మనము దేనిని ఆధారము చేసుకొని వెళ్ళాలి? ఈ భూలోక ప్రజలందరి మీద, దయ్యములన్నింటి మీద ప్రభువు సంపూర్ణ సార్వభౌమాధికారం కలిగివున్నాడనే సత్యముపై ఆధారపడి మాత్రమే. దీనిని నమ్మకపోతే, నీవు ఎక్కడికీ వెళ్ళకపోవటమే మంచిది.

ఆ సమయములో మత్తయి 28లోని ఈ వాక్యము నాకొక నూతన ప్రత్యక్షతలా వచ్చింది. అప్పుడు నేను నిస్సందేహంగా, ఆ దేశానికి వెళ్ళవచ్చునని గ్రహించాను. నేను ఆ దేశపు సరిహద్దుల్లో ప్రవేశిస్తున్నప్పుడు సహజంగానే నాలో అనేక భయాలు చెలరేగాయి. అయితే నేను నాకు కలిగిన ఆ భయములపై ఆధారపడి నిర్ణయము తీసుకోలేదు.

ఈ ప్రపంచంలో ఏ దేశములోనైనా యేసు ప్రభువుకు సార్యభౌమాధికారము లేదని నీవనుకుంటున్నట్లైతే నీవు ఆ దేశానికి వెళ్ళవద్దని నేను సలహా ఇస్తాను! నేను కూడా అటువంటి దేశానికి వెళ్ళను. నేను భయపడతాను. అయితే దేవునికి స్తోత్రం, ఈ భూలోకంలో అటువంటి ప్రదేశము లేనేలేదు! భూలోకములోని ప్రతిమూల మన ప్రభువు యొక్క అధికారము క్రింద ఉంది.

అదే విధముగా, ఎక్కడైనా ఎవరైనా (అతడు ఎంతటి శక్తిమంతుడైనా సరే) ప్రభువు అధికారం క్రింద లేకుండా ఉన్నాడని నీవు భావిస్తే అతని గూర్చి ఎల్లప్పుడు భయముతో బ్రతకాల్సివస్తుంది. అయితే దేవునికి వందనాలు, అటువంటి మనిషి ఎక్కడా లేడు. ప్రతి మానవునిపై మన ప్రభువు అధికారము కలిగివున్నాడు. దానియేలు 4:35లో మనము చదవినట్లుగా నెబుకద్నెజరు రాజుకూడా ఈ సత్యాన్ని అర్ధము చేసుకున్నాడు.

కల్వరి సిలువలో ప్రభువు చేతిలో ఓడింపబడక ఏదో విధముగా తప్పించుకొని తిరుగులాడుతున్న దయ్యమంటూ ఏదైనా ఉంటే ఆ దయ్యము విషయంలో మనము ఎల్లప్పుడూ భయంతోనే జీవిస్తాము. అయితే ఈవిధముగా సిలువలో ఓడింపబడని దయ్యము లేదు. అక్కడ సాతాను కూడా శాశ్వతముగా ఓడిపోయాడు. ఈ సత్యం మనల్ని సాతాను, అతని దురాత్మల భయము నుండి తప్పించి మన పరిచర్యలో మనకు గొప్ప ధైర్యమును ఇస్తుంది.

కాబట్టి మనము దేవుడు వెళ్ళమన్న చోటికల్లా వెళ్తాము. కొన్ని ప్రదేశాల్లో ప్రమాదాలు ఉండొచ్చు. కానీ మనకు తెలిసినంత మట్టుకు అక్కడికి ప్రభవు నడిపిస్తున్నాడని భావిస్తే అక్కడికి వెళ్ళటానికి మనము భయపడనవసరము లేదు. ఒకానొక ప్రదేశములో క్రైస్తవులకు శ్రమ ఉన్నది, లేక లేదు అనేది ప్రశ్నకాదు. అసలైన ప్రశ్న ఏమిటంటే అక్కడికి వెళ్ళమని ప్రభువు మనతో చెప్పాడా, లేదా? ఒకవేళ ఆయన గనుక వెళ్ళమని చెబితే తన అధికారము మనల్ని సంపూర్ణముగా బలపరుస్తుంది. మనకు ఎటువంటి భయమూ అవసరములేదు. అయితే ఒక ప్రదేశానికి వెళ్ళమని దేవుడు మనల్ని పిలువకపోతే మనము వెళ్ళకూడదు. వెళ్ళమని ఎంతమంది మనల్ని ఎంతగా బలవంతపెట్టినా సరే లేక మనలోని సాహస స్పూర్తి ఎంతగా మనల్ని పురికొల్పి ముందుకు త్రోసినా సరే వెళ్ళకూడదు!

మనము ఒక ప్రదేశమునకు ఎందుకు వెళ్తున్నామో మనలను మనము ప్రశ్నించుకోవాలి. మనకు మరెటువంటి కోరికలేకుండా శిష్యులుగా చేయుటకు మాత్రమే మనము వెళ్ళుచున్నట్లయితే ప్రభువు మనకు వాగ్దానము చేసినట్లుగా "యుగసమాప్తి వరకు" ఆయన మనకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడని చెప్పగలము కాని దానికి బదులుగా మనము వేరే ఉద్దేశ్యములు కలిగియుండవచ్చు. ప్రభువు "మన హృదయములు ఎట్లున్నవో పరీక్షించువాడు" (యిర్మీయా 12:3) మరియు మన ఉద్దేశ్యములను పరీక్షించువాడు.

తనకు తానుగా విశ్వాసి అని పిలిపించుకునే ప్రతి ఒక్కరికీ ప్రభువు తన్ను తాను వశపరచుకోడు. యోహాను సువార్త 2:24లో ఈ విషయము చదువుతాము.

"ప్రభువా, ఈ ప్రదేశానికి వెళ్ళమని నన్ను నీవే పిలిచావని నేను గ్రహించాను గనుక వెళ్తున్నాను. శిష్యులుగా చేయుటకోసము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మమిచ్చుటకు, నీవు ఆజ్ఞాపించిన సమస్తమును వారికి నేర్పించుటకు నేను అక్కడికి వెళ్తున్నాను. డబ్బు సంపాదనకోసం గానీ, నా పేరు ప్రఖ్యాతులకోసంగానీ, మరో వ్యక్తిగత కారణము చేతగానీ నేను అక్కడకి వెళ్ళటము లేదు".

నీవు ఈ విధముగా యదార్ధహృదయముతో ప్రభువుతో చెప్పినప్పుడు ప్రభువు యొక్క అధికారము నిన్ను ఎల్లప్పుడు నిశ్చయముగా బలపరుస్తుంది.

అప్పుడు నీవు, నీ భార్యా పిల్లలకు ఏమి జరుగుతుందోనని గానీ, నీ ఆర్థిక అవసరతలు ఎలా తీరుతాయోననిగానీ ఆలోచిస్తు భయాందోళనలో జీవించవు. ఒకేఒక్క ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, "దేవుడు నిన్ను పిలిచాడా లేదా?" నిన్ను ఆ ప్రదేశానికి దేవుడు పంపుతున్నాడా? లేక ఒక మానవుడు పంపుతున్నాడా? లేక నీలోని సాహస స్పూర్తి పురికొల్పుతున్నదా?

దేవుని ప్రణాళికకు బదులు మరో ప్రణాళిక నీ జీవితములో ఉంటే నిన్ను ఆదరించుటకు లేఖన భాగమునుండి ఒక్క వాగ్ధానమును కూడా నేను నీకు చూపించలేను. అయితే శిష్యులుగా చేయుట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మమిచ్చుట, యేసు ఆజ్ఞానుసారం సమస్తము బోధించుట వంటి దేవుని ప్రణాళిక, నీ ప్రణాళికగా మారినప్పుడు నీవు మానవులకు గానీ, దయ్యాలకు గానీ భయపడ నవసరము లేదని నేను నీకు హామీ ఇవ్వగలను.