"నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి" (మత్తయి 28:20).
ఇది గొప్పపని యొక్క తదుపరి భాగం. మొదటిగా మనం లోకమంతటికి వెళ్లి- వారు పాపులని, క్రీస్తు వారి పాపముల కొరకు మరణించి మృతులలోనుండి లేచాడని, ఆయన పరలోకానికి ఆరోహణుడై మరల తిరిగి వస్తున్నాడని, ఆయనే తండ్రివద్దకు ఏకైక మార్గమని ప్రజలకు చెప్పాలి. ఎక్కడైతే ప్రజలు ప్రతిస్పందిస్తారో, యేసును వారి జీవితాలకు ప్రభువుగా చేయమని, వారి జీవితమంతా క్రీస్తును అనుసరించే శిష్యులుగా ఉండమని వారిని ఆహ్వానిస్తాము. వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చి, వారికి దైవమర్మాన్ని పరిచయం చేస్తాము. కానీ అంతటితో పూర్తి కాదు; అదంతా ఒలింపిక్ మారథాన్ పరుగుపందెం యొక్క ప్రారంభ గీతవద్దకు రావడం లాంటిది.
మీరు మీ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి మరియు ఒలింపిక్ మారథాన్ పరుగుపందెం యొక్క ప్రారంభ గీతకు రావడానికి ఎంపిక చేయబడటమే ఒక గొప్ప విషయం. అది గొప్ప విషయమే కానీ దానంతట దానికి ఏ అర్థం లేదు, ఎందుకంటే ప్రారంభ గీతకు రావడం పరుగుపందెం ప్రారంభం మాత్రమే. మీరు శిష్యులుగా మారటం మరియు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట బాప్తిస్మం పొందారనే వాస్తవం కూడా గొప్పది, కానీ ఒలింపిక్స్ చిత్రం వలె, మీరు పరుగుపందెంను ప్రారంభించాలి. ఆ పరుగుపందెంలో పరిగెత్తడం అంటే, యేసు మనకు ఆజ్ఞాపించిన ప్రతి పనిని చేయడమే.
ఇది ప్రతి క్రైస్తవునికి జీవితకాలం పడుతుంది మరియు దీనినే ప్రతి సంఘం ప్రజలకు బోధించాలి.
ఒక సంఘం శిష్యులను తయారు చేయుటలో మరియు బాప్తిస్మం ఇచ్చుటలో ప్రాధాన్యతనిస్తుంటే, అది అక్కడితో ఆగకూడదు. వారు తమ సంఘకూడికలలో ప్రతి ఆదివారం ఏమి బోధించాలి? యేసు బోధించిన ప్రతి ఒక్కటి బోధించాలి. కేవలం కొన్ని ఎంపిక చేసిన విషయాలు మాత్రమే కాదు యేసు బోధించినవన్నీ బోధించాలి, ఖచ్చితంగా మనస్తత్వశాస్త్రం లేదా వినోదమైనవి కాదు. ఒక సంఘం దాని సభ్యుల నాణ్యతను మెరుగుపరచడం కంటే దాని సంగీతాన్ని మెరుగుపరచడంలో ఎక్కువ ఆసక్తి చూపడం విచారకరం. అది ఎంతో విచారకరం. పరలోకంలో ఉన్న దేవునికి దేనిపై ఎక్కువ ఆసక్తి ఉందని మీరు అనుకుంటున్నారు?
ఒక కొత్త సంఘం సమావేశమైందని అనుకుందాం. ఆ సంఘం నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తులతో నిండి ఉన్నదని అనుకోండి మరియు వారు నిజంగా యేసును తమ జీవితానికి ప్రభువుగా చేయాలనుకుంటున్నారు. అలాంటి సంఘం సంగీతంపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు మీరు కనుగొంటే, దేవుడు సంతోషిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? మంచి సంగీతం ఉంటే బాగుంటుంది. దానికి నేను వ్యతిరేకం కాదు. అయితే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నదే ప్రశ్న. దేవుడు దేనిపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాడు, ఆ సంఘంలోని ప్రజలు క్రీస్తులా మారడంలోని నాణ్యత విషయంలోనా లేదా సంగీతం మరింత వినోదాత్మకంగా మారడంలోనా? అక్కడే క్రైస్తవులు ఎలా తొలగిపోయారో మనం చూడగలం, ఎందుకంటే దేవునికి ఏది ఇష్టమో క్రైస్తవ నాయకులు అర్థం చేసుకోలేదు.
మన సంఘాలలో మనం ఏమి చేయాలి? యేసు ఆజ్ఞాపించిన ప్రతి విషయానికి లోబడాలని మనం ప్రజలకు నేర్పించాలి. మనమే దేవుని ఆజ్ఞలను పాటించకపోతే, ఎలా పాటించాలో ఇతరులకు నేర్పించలేము. ఈ రెండు ప్రకటనల మధ్య వ్యత్యాసాన్ని గమనించండి: "నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ వారికి బోధించండి", "నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేయమని(గైకొనమని) వారికి బోధించండి".
నేను యేసు ఆజ్ఞాపించినవన్నీ ఇతరులకు కేవలం బోధించవలసి వస్తే, నేను యేసు యొక్క అన్ని బోధనలను తీసుకొని ఒక వ్యక్తి రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం లేదా చరిత్రను బోధించినట్లే వాటిని బోధించగలను. నేను వాటిని అధ్యయనం చేసి వాటిని బోధిస్తాను. కానీ "చేయమని(గైకొనమని) వారికి బోధించుడి..." అంటే నేనే ముందుగా దాన్ని చేయవలసి ఉంటుంది, తద్వారా వారు కూడా ఎలా చేయగలరో నేను వారికి నేర్పించగలను. నేనే చేయకపోతే, నాకు ఈత తెలియనప్పుడు ఈత నేర్పేవాడిలా ఉంటాను. మీరు ఈత యొక్క సూత్రాలు మరియు పద్ధతులను అర్థం చేసుకున్నట్లయితే, మీరు ఈతగాడు కాకపోయినప్పటికీ మీరు దానిని బ్లాక్‌బోర్డ్‌పై స్పష్టంగా అనేక మందికి వివరించవచ్చు. అది కేవలం "వారికి బోధించడం" మాత్రమే. కానీ "గైకొనవలెనని వారికి బోధించుడి..." అంటే ఈత కొలనులో లేదా నదిలో మీరు నీటి ఉపరితలంపై ఎలా నిజంగా ఈత కొట్టగలమో మరియు ఒక చోట నుండి మరొక చోటకు ఎలా వెళ్లాలో వారికి చూపించటం.
ఒక బైబిలు క్రైస్తవ నాయకుడికి యేసు ఆజ్ఞాపించిన ప్రతి పనిని నిజంగా చేయమని ప్రజలకు బోధించే బాధ్యత ఉంది. అది చాలా ఎక్కువ బోధన. అందుకే నేను ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి "యేసు బోధించినవన్నియు" అనే పుస్తకాన్ని రాశాను. యేసు ఆజ్ఞను నెరవేర్చడం, యేసు బోధించినవన్నీ బోధించడం, నా జీవితంలో గత 52 సంవత్సరాలలో నేను దానిని చేయాలని ప్రయత్నించినట్లు మీరుకూడా చేయాలని నేర్పించడమే నేను చేయాలనుకునేది. కేవలం నాకిష్టమైన ఆజ్ఞలు లేదా సులువుగా ఉన్నవాటిని నొక్కిచెప్పి, వేరేవాటిని నిర్లక్ష్యం చేయడం కాదు.
యేసు ఆజ్ఞాపించినవన్నీ చేయడమే ప్రతి శిష్యుని అభిరుచి కావాలి.