ఈ వారం, గొప్పపని యొక్క రెండు అంశాలను నెరవేర్చడం అంటే ఏమిటనే మన అధ్యయనాన్ని కొనసాగిద్దాము. శిష్యత్వం యొక్క మొదటి షరతు క్రీస్తు పట్ల అత్యున్నతమైన ప్రేమ అని గత వారం మనం చూశాము. మనం క్రీస్తును మన తల్లిదండ్రుల కంటే, మన భార్యల కంటే, మన పిల్లల కంటే, మన రక్త సంబంధులైన లేదా సంఘంలో ఉన్న ప్రతి సహోదరుడు మరియు సహోదరి కంటే, మన స్వంత జీవితం కంటే ఎక్కువగా ప్రేమించుట.
శిష్యత్వం యొక్క రెండవ షరతు లూకా 14:27లో ప్రస్తావించబడింది: "ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు"
మళ్ళీ, యేసు నిశ్చయంగా చెప్పాడు: "కానేరడు".
ప్రతిరోజూ సిలువను మోయడం అంటే ఏమిటి? ఆయన "తన స్వంత సిలువ" అని చెప్పాడు. నేను యేసుక్రీస్తు యొక్క సిలువను మోయవలసిన అవసరం లేదు, నేను ఇతరుల సిలువను మోయవలసిన అవసరం లేదు, కానీ నేను నా స్వంత సిలువను మోయాలి. యేసు దానిని లూకా 9:23లో ఇలా వివరించాడు: "ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల, అతడు తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను."
లూకా 9:23లో "ప్రతిరోజు" అనే పదం జోడించబడింది, ఇది లూకా 14:27కి కూడా వర్తిస్తుంది. మనం మన జీవితంలో ప్రతిరోజు ఒక సిలువను ఎత్తుకొని క్రీస్తుని అనుసరించాలంటే, క్రీస్తు స్వయంగా ప్రతిరోజూ ఒక సిలువను మోసాడని అర్థం. లేనట్లయితే, నా సిలువను మోయుటలో ప్రతిరోజూ ఆయనను అనుసరించమని ఆయన నన్ను ఎలా అడగగలడు?
ప్రభువైన యేసు ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో అంతర్గత సిలువ ఉంది, ఇది ఆయన కల్వరికి తీసుకెళ్లిన భౌతిక సిలువతో ముగిసింది. ఈ అంతర్గత సిలువ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నేను నా జీవితంలో ఆ సిలువను మోయకపోతే -- నేను శిష్యుడిని కాలేను.
ఈ రోజు మనం "సిలువ" అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించము, ఎందుకంటే ఇది క్రైస్తవత్వానికి చిహ్నంగా మారింది. ప్రజలు బంగారు సిలువలు మరియు దంతపు సిలువలను కలిగి ఉన్నారు, కానీ యేసు దాని గురించి మాట్లాడిన రోజుల్లో, అది అత్యంత భయంకరంగా వ్యక్తులను చంపే రోమీయులు కనిపెట్టిన విధానం. నేడు మరింత సముచితమైన చిహ్నం ఉరితాడు, విద్యుత్ కుర్చీ లేదా గిలెటిన్(తల నరికే పరికరం) కావచ్చు. ఒక నేరస్థుడైన వ్యక్తికి విధించబడిన మరణశిక్షకు చిహ్నంగా సిలువ ఉంది. నేరస్థులు మాత్రమే సిలువ వేయబడ్డారు.
మనం ఆయనను వెంబడించాలంటే, ప్రతిరోజు మనలోని చంపవలసిన ఒక విషయం గురించి యేసు మాట్లాడుతున్నాడు. అది ఏమిటి? యేసు మన స్వీయ-జీవితాన్ని సూచిస్తున్నాడు: "ఎవరైనా తన స్వంత జీవితాన్ని (తన స్వీయ-జీవితాన్ని) ప్రేమించినట్లయితే, అతను దానిని కోల్పోతాడు."
ఇది మనం తప్పక ఎత్తుకొనవలసిన సిలువ, దానిపై మన స్వంతచిత్తం ప్రతిరోజు సిలువ వేయబడాలి. గెత్సేమనే తోటలో యేసు చెప్పిన మాటల వలె, "నా చిత్త ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే" అని మనం చెప్పాలి. నా స్వంతశక్తి నా చిత్తంలో కనుగొనబడుతుంది. నా ఇష్టాన్ని, నాకు ఏది నచ్చితే అది చేయాలనుకుంటున్నాను. ఇది అన్ని పాపాలకు మూలం, అది చంపబడకపోతే, నేను సిలువను మోయటంలేదు.
ఇది ప్రతిరోజూ చేయవలసిన పని. అప్పుడే నేను శిష్యుడిని కాగలను. నేను ప్రతిరోజూ ఆ మాటలు చెప్పనవసరం లేదు, కానీ "నేను ఈ రోజు నా ఇష్టాన్ని ఏ విషయంలోనూ చేయను, నేను దేవుని చిత్తం చేయబోతున్నాను" అనే వైఖరిని కలిగి ఉండాలి. యేసు మనకు ప్రార్థించమని బోధించిన విషయాలలో "నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమిమీదను నెరవేరును గాక" అనేది ఒకటి.
పరలోకంలో, దేవదూతలు ఎవరూ తమ స్వంత ఇష్టాన్ని చేయరు. దేవుడు తాము ఏమి చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి వారు ఎల్లప్పుడూ దేవుని కోసం వేచి ఉంటారు, పరలోకంలో ప్రతిరోజు వారు అదే చేస్తారు. మన రోజులు భూమిపై పరలోకపు రోజులలాగా ఉండాలంటే, మన జీవితం పరలోకపు జీవితం కావాలంటే, ఇదే రహస్యం: "నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమిపైనా నెరవేరును గాక".
మరో మాటలో చెప్పాలంటే, ప్రభువు పట్ల ఒక శిష్యుడి వైఖరి ఎలా ఉండాలంటే, "ప్రభువా నేను ఎప్పుడూ నా ఇష్టాన్ని ఏ విషయంలోనూ చేయను, నాకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోను, నాకు నచ్చిన ఉద్యోగాన్ని నేను తీసుకోను, నాకు నచ్చిన చోట నేను జీవించను, ప్రతి ఒక్క విషయంలో నీ చిత్తం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను". ఎవరైనా నాతో చెడుగా ప్రవర్తించినప్పుడు, మీరు నేను ఎలా ప్రతిస్పందించాలనుకుంటున్నారో అదే విధంగా నేను ప్రతిస్పందించాలనుకుంటున్నాను, నా శరీరం, నా స్వీయ-జీవితం ప్రతిస్పందించాలనుకునే విధంగా కాదు."
ప్రతి రోజు సిలువను ఎత్తుకోవడం అంటే ఇదే, మరియు మీరు అలా చేయకపోతే, మీరు ఖచ్చితంగా "నా శిష్యులు కాలేరు" అని ఆయన చెప్పారు.
యేసు మత్తయి 28లో గొప్పపనిలోని మిగిలిన సగం ఇచ్చాడని తెలుసుకున్నప్పుడు, మీరు కలుసుకున్న విశ్వాసులు ప్రతిరోజూ సిలువను ఎత్తుకుని, ప్రతిరోజూ తమకు తాము చనిపోతున్నారని మీరు కనుగొన్నారా? దానిని నువ్వు చేస్తున్నావా? మత్తయి 28:19,20లో ఇచ్చిన పనిని క్రైస్తవులు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారనే దానికి ఇది నిదర్శనం.