WFTW Body: 

దేవుణ్ణి ఆరాధించుట, మన పరలోకపు తండ్రితో మనల్ని చాలా సన్నిహిత సంబంధానికి తీసుకువస్తుంది. ఆరాధన అంటే కేవలం పదాలు పలకటం లేదా దేవునికి మాటలు చెప్పడం కంటే ఎక్కువైనది. 90 శాతం కంటే ఎక్కువ మంది విశ్వాసులు అపార్థం చేసుకుంటున్న ఒక విషయాన్ని నన్ను స్పష్టం చేయనివ్వండి. ఈ రోజు చాలా సంఘాలలో వారి ఆదివారం ఉదయం సమావేశాన్ని చాలా సాధారణంగా "ఆరాధన కూటం"(worship service) అని పిలుస్తారు. కరిస్మాటిక్ లేదా ఇతర పెంతెకోస్తు సంఘాలలో వారు దీనిని "స్తుతి మరియు ఆరాధన" అని పిలుస్తారు. మీరు పూర్తిగా లేఖనానుసారంగా మరియు బైబిలును అనుసరించాలనుకుంటే, అది తప్పు వ్యక్తీకరణ; ఆదివారం ఉదయం చేస్తున్నది ఆరాధన కాదు. వారు పాడే పాటల్లోని పదాలు విన్నట్లయితే అది స్తుతి మరియు కృతజ్ఞతలని కనుగొంటారు. ఇది అస్సలు ఆరాధనే కాదు. మీరు నన్ను నమ్మకపోతే, పదపట్టికను తీసుకొని మీరు కొత్త నిబంధన అంతటా ఆరాధన(సాగిలపడుట, మ్రొక్కుట) అనే పదాన్ని వెదకండి. పాత నిబంధనలో, వారు దేవునికి తమ ఆరాధనను వ్యక్తపరచగల ఏకైక మార్గం: చప్పట్లు కొట్టడం, పాడటం మరియు దేవునికి పాటలు పాడటానికి వాయిద్యాలను ఉపయోగించడం. కానీ కొత్త నిబంధనలో, యోహాను 4:23-24లో యేసు సమరయ స్త్రీతో ఇలా అన్నాడు, "యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను".

యేసు "రానున్న" ఒక గడియ గురించి మాట్లాడాడు. ఆయన పెంతెకొస్తు రోజును సూచిస్తున్నాడు, అది ఇంకా రాలేదు. ఆయన యోహాను 4:23లో ఇలా కూడా చెప్పాడు, "ఇప్పుడును" అంటే ఇది ఇప్పటికే ఆయనలో నెరవేరింది, ఎందుకంటే కొత్త నిబంధనలో యేసు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. ఆయనే మనకు కొత్త నిబంధనను ఆరంభించాడు, కాబట్టి ఒక విధంగా ఆయన మొదటివాడు మరియు మన నాయకుడు. కాబట్టి, తండ్రిని ఆత్మతో మరియు సత్యంతో ఆరాధించే ఒక వ్యక్తి(అది యేసే) చివరకు భూమిపై నడుస్తున్న కాలం వచ్చింది. అది ఇంతకు ముందు ఎవరూ చేయలేదు.

మనిషి ఆత్మ, జీవం మరియు శరీరం అని 1 థెస్స 5:23 చెబుతుంది. యేసు ఆత్మ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, పాత నిబంధన ఆరాధన అంతా శరీరం మరియు జీవం(ప్రాణం)లో మాత్రమే ఉందని ఆయన చెబుతున్నాడని సూచిస్తుంది. వారు చేతులు పైకెత్తుతూ, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించారు; వారు తమ ప్రాణంతో అనగా మనస్సు, బుద్ధి, భావోద్వేగాలను ఉపయోగించి దేవుణ్ణి ఆరాధించారు; మీరు కూటములలో స్తుతి మరియు కృతజ్ఞతల పాటలు పాడినప్పుడు సంతోషాన్ని, అనుభూతులను మరియు భావోద్వేగాలను అనుభవించినట్లు వారు కూడా అనుభవించారు. అది ప్రాణం మరియు శరీరంలో ఆరాధన యొక్క పరిధి. ఆయన, "పరిశుద్ధాత్మ నాలో నివసిస్తునట్లుగా మీలో నివసించినప్పుడు, మీరు కలిగిఉండగల ఆరాధన యొక్క లోతైన స్థాయికి ఇప్పుడు మీరు వచ్చారు" అని చెప్పాడు. "మీరు శరీరములో మరియు ప్రాణంలో మాత్రమే కాకుండా ఆత్మలో మరియు సత్యముతో కూడా ఆరాధించగలరు" అని యేసు చెప్తున్నాడు.

ఈరోజు మనం ఏమి చేయాలి? మనం ఇప్పటికీ చప్పట్లు కొట్టి చేతులు పైకెత్తుతాము, దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనం భావోద్వేగానికి లోనవుతాము మరియు మన తెలివిని ఉపయోగిస్తాము, కానీ అన్నింటికి మించి, మనం ఆత్మలో ఆరాధించాలి. అంటే మనం ప్రాణాత్మల మధ్య ఉన్న తెరను చొచ్చుకొని దేవునితో ఒంటరిగా ఉన్న స్థితిలోనికి ప్రవేశించాలి. శరీరం, ప్రాణం మరియు ఆత్మకు మాదిరిగా, పాత నిబంధన ప్రత్యక్షగుడారంలో మూడు భాగాలు ఉన్నాయి. చివరి భాగం దేవుడు మాత్రమే నివసించే అతిపరిశుద్ధ స్థలం, అది తెరతో మూయబడి ఉంటుంది. బయటి ఆవరణం, బలి అర్పణలు చేయబడుతూ చాలా ఉత్సాహంతో నిండి ఉంది. పరిశుద్ధస్థలంలో అనేక మంది యాజకులు ధూపం సమర్పించడం మరియు దీపాలు వెలిగించడం మొదలైన వాటిని చేస్తూ తిరుగుతున్నారు. కానీ అతిపరిశుద్ధ స్థలంలో దేవుడు మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి అతిపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు, అతను దేవునితో మాత్రమే ఉంటాడు. అతను మరెవరి గురించి స్పృహ కలిగిఉండడు. అక్కడ అతను మరియు దేవుడు తప్ప మరెవరూ ఉండరు. అదే మీరు మరియు దేవుడు మాత్రమే ఉండి ఆత్మలో ఆరాధించడం. అది మీ గదిలో కూడా మీరు చేయగలరు, ఇది మీరు కేవలం మాటలతో చేసే పని కాదు.

దేవునిపట్ల తన దృక్పథంలో ఒక నిజమైన ఆరాధికుడు ఏమి చెబుతాడో అన్నదానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటి కీర్తన 73:25లో కనిపిస్తుంది. మీరు మీ హృదయాంతరంగంలో నుండి దీనిని దేవునికి నిజాయితీగా చెప్పగలిగితే, మీరు ఆరాధికులవుతారు. లేకపోతే, మీరు ఆత్మలో ఆరాధించడం లేదు. "ఓ దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?" మరో మాటలో చెప్పాలంటే, "నేను పరలోకానికి వచ్చినప్పుడు, నేను బంగారు వీధుల కోసం, భవనం లేదా కిరీటం కోసం వెతకను. నేను దేవునితో మాత్రమే సంతోషిస్తాను మరియు సంతృప్తి చెందుతాను. నాకు దేవుడు తప్ప ఏ ఒక్కరు లేదా మరేమీ అవసరం లేదు". అది ఇలా చెప్పినట్లుగా ఉంటుంది, "నాకు పరలోకంలో అద్భుతమైన సహోదరీ సహోదరులు మరియు కుటుంబ సభ్యులు ఉండవచ్చు కానీ మీరే నాకు సర్వస్వం. మీరు తప్ప, నేను భూమిపై దేనినీ కోరుకోను. పరలోకంలో మాత్రమే కాదు పరలోకానికి రాకముందే ఇక్కడ ఈ భూమిపై కూడా నేను మిమ్మును తప్ప మరేమీ కోరుకోను. మీరు నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా భౌతిక వస్తువులను నేను కోరుకోను. నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను". సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభసాధకం. ఆరాధికుడికి ఈ భూమిపై దేని గురించి ఫిర్యాదు ఉండదు - దేవుడు తన కోసం ఏర్పాటు చేసిన అన్ని పరిస్థితులతో అతను సంపూర్ణంగా సంతృప్తి చెందుతాడు. దేవుడు తనను తీసుకువచ్చిన కుటుంబంతో, అతను కలిగి ఉన్న ఉద్యోగంతో, అతను కలిగి ఉన్న అన్నిటితో పూర్తిగా సంతృప్తి కలిగి ఉంటాడు. అతను దేవుణ్ణి తప్ప మరేమీ కోరుకోడు. ఒక పాత సామెత ఇలా చెప్పబడింది, మీ జీవితంలో అన్నిటినీ కోల్పోయి దేవుడు తప్ప మరేమీ లేని సమయం వచ్చినప్పుడు, దేవుడు తగినంత కంటే ఎక్కువ అని మీరు కనుగొంటారు.

నేను ఈ భూమిపై దేవుణ్ణి తప్ప మరేమీ కోరుకోను అనే వైఖరి నా హృదయంలో కలిగి ఉండటమే నిజమైన ఆరాధన. మీకు అటువంటి దృక్పథం మీ హృదయంలో లేకపోతే, మీరు ఆదివారం ఉదయం దేవుణ్ణి స్తుతించేటప్పుడు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు మీరు ఎంత ఉద్వేగానికి లోనైనప్పటికీ, మీరు ఆరాధికులు కాదు. మీరు దానిని ఆరాధన మరియు స్తుతి అని పిలవవచ్చు, కానీ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు, మీరు ఆరాధించకుండానే మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని ఊహించుకోవడం వలన సాతాను ఎంతో సంతోషిస్తున్నాడు. అయితే యేసు యోహాను 4:23లో, తండ్రి తనను ఆత్మలో ఆరాధించే వారి కోసం వెతుకుతున్నాడని చెప్పాడు. తండ్రికి ఎంత ఆశ ఉందో కదా.

ఆత్మలో ఆరాధికులుగా ఉండి, మీ తండ్రి హృదయాన్ని సంతృప్తి పరచాలనే కోరిక మీకు ఉందా? అప్పుడు కీర్తన 73:25కి వెళ్లి, ఆ మాటలను మీ హృదయం వ్యక్తపరిచే వరకు విశ్రాంతి తీసుకోకండి, మీరు భూమిపై యేసుక్రీస్తును తప్ప మరేమీ కోరుకోనని, కనీసం పరిచర్యను కూడా కోరుకోనని నిర్ణయించుకోండి. మీ సువార్త ప్రచారంలో లేదా మీ బోధనలో లేదా మీ సంఘ భవనంలో లేదా ఏదైనా పరిచర్యలో లేదా మీ డబ్బు లేదా మీ ఆస్తి లేదా దేనిలోనైనా మీ సంతృప్తిని కనుగొనవద్దు. "ప్రభువా, నేను నిన్ను కలిగి ఉన్నాను మరియు నేను నిన్ను మాత్రమే కోరుకుంటున్నాను."