WFTW Body: 

మన అంతరంగం నుండి పరిశుద్ధాత్మ ప్రవహించే జీవితం వైపు మొదటి అడుగు మారుమనస్సు పొందటం లేదా పూర్తిగా తిరగడం అని యేసు మనకు బోధించాడు (మత్తయి 4:17). భూసంబంధమైన వస్తువులను వెతకడం నుండి మరలడమే కాదు, అన్నింటికంటే ముఖ్యంగా పాపం నుండి మరలడం. మనం పరిశుద్ధాత్మను పొందుటకు ముందు పాపాన్ని అధిగమించాల్సిన అవసరం లేదు. పాపాన్ని అధిగమించడానికి పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. మనం బండిని గుర్రం ముందు పెట్టము. గుర్రం బండి ముందు ఉండాలి. నేను పాపాన్ని విడిచిపెట్టి "ప్రభువా, నాకు పరిశుద్ధాత్మను ఇవ్వండి" అని చెప్పలేను. బదులుగా, "ప్రభువా, పాపాన్ని అధిగమించేందుకు నాకు పరిశుద్ధాత్మ అవసరం" అని చెప్తాను. అయినప్పటికీ నా మనస్సులో నేను పాపం నుండి తిరగగలను; అంటే నేను నిజంగా అన్ని పాపాలను వదులుకోవాలని కోరుకోవడమే నా వైఖరిగా ఉంటుంది.

దేవుడు మిమ్మల్ని అడుగుతున్నది అంతే. మీ జీవితంలో దేవునికి అవమానకరమైన ప్రతి విషయాన్ని వదులుకోవాలనుకునే వైఖరి మీకు ఉందా? మీరు వాటిని అధిగమించడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, అది ప్రాముఖ్యం కాదు. మీ వైఖరి ఎల్లప్పుడూ మారుమనస్సుకు సంబంధించినదిగా, మీ పాత జీవన విధానం నుండి తిరిగేదిగా ఉండేలా చూసుకోండి. మారుమనస్సు మరియు క్రీస్తుపై విశ్వాసం ద్వారా మనం క్రైస్తవ పరుగుపందెం ప్రారంభ గీతకు చేరుకుంటాము. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం లాంటిదని, నేను మారుమనస్సు పొందితేనే నేను ప్రారంభ గీతకు రాగలనని హెబ్రీ 12:1-2 చెబుతుంది. మారుమనస్సు మరియు పాపం నుండి తిరగడం అనే సందేశం నేడు క్రైస్తవ్యంలో లేకుండాపోయింది.

మారుమనస్సు గురించి మీరు ఎన్ని సువార్త సందేశాలు విన్నారు? మారుమనస్సు గురించి మీరు ఎన్ని పాటలు విన్నారు? ఏదైనా పాటల పుస్తకాన్ని తీసుకొని మారుమనస్సు గురించి ఎన్ని పాటలు ఉన్నాయో చూడండి - చాలా అరుదు. నమ్మడం గురించి మీకు చాలా పాటలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ’దేవునికి మహిమ కలుగును గాక, ఆయన గొప్ప పనులు చేశాడు’(To God be the glory, great things He has done) అని చెప్పే ఒక ప్రసిద్ధమైన పాట ఉంది. ఆ పాటలోని ఒక చరణంలో, "నిజంగా నమ్మే అత్యంత నీచమైన అపరాధి, ఆ క్షణంలోనే యేసు నుండి క్షమాపణ పొందుతాడు" అని ఉంది. నేను దానితో ఏకీభవించను. సువార్త గురించి ఏమీ తెలియని, ఎంతో దౌర్భాగ్యమైన పాపియైన ఒక వ్యక్తి ఒక సమావేశానికి హాజరవుతున్నాడనుకుందాం. అతను అక్కడికి వచ్చి- "నిజంగా నమ్మే అత్యంత నీచమైన అపరాధి, ఆ క్షణంలోనే యేసు నుండి క్షమాపణ పొందుతాడు" అని పాట వింటాడు. అతను, "అవును, నేను అత్యంత నీచమైన అపరాధిని" అని దానిని అంగీకరించి, "నేను చేయాల్సిందల్లా యేసును నమ్మడమే. నేను ఆయనను నమ్ముతున్నాను, ఆయన దేవుని కుమారుడు, ఆయన నా పాపాల కోసం మరణించాడు" అని ఒప్పుకున్నాడు. అతను క్షమించబడ్డాడా? అతను మారుమనస్సు పొందకపోతే క్షమించబడలేదు. మారుమనస్సుపొంది నమ్మే అత్యంత నీచమైన అపరాధి క్షమించబడతాడు. చాలా మంది, "నిజంగా నమ్మడం అంటే అదే" అని అంటారు. కానీ మార్పుచెందని, దేవుడు లేని పాపికి ఆ వేదాంత వివరణ తెలియదు. అతను మారుమనస్సు పొందాలని అతనికి చెప్పాలి. పెంతెకోస్తు రోజున అపొస్తలుడైన పేతురు స్పష్టం చేసిన విషయం ఇదే: మారుమనస్సు. పౌలు ప్రతిచోటా బోధించినది ఇదే. అతను రెండు విషయాలను బోధించాడు - "దేవుని యెదుట మారుమనస్సు మరియు మన ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసం" (అపొ.కా. 20:21).

దేవుని యెడల మారుమనస్సు, శ్రేయస్సు మరియు స్వస్థత వైపు కాదు. మారుమనస్సు అంటే అనారోగ్యం నుండి స్వస్థతకు మారడం కాదు. నేను పేదరికం నుండి శ్రేయస్సు వైపు మళ్లడం లేదు. అది నేడు ప్రకటించబడుతున్న తప్పుడు సువార్త. నా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాని నుండి నేను దేవుని యెదుట పశ్చాత్తాపపడాలి మరియు మన ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడింది. పౌలు థెస్సలొనీకయులకు వ్రాసేటప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పాడు. "దేవుని వాక్యం వారి దగ్గరకు వచ్చినప్పుడు, వారు విగ్రహాలను విడిచిపెట్టి జీవముగల దేవుని సేవ చేయడానికి దేవుని వైపు తిరిగారని" అతను వారికి చెప్పాడు (1 థెస్సలొనీకయులు 1:8-9).

విగ్రహం అంటే ఏమిటి? మీ హృదయంలో దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా విగ్రహమే. అది మీ ఆరోగ్యం, మీ సంపద, మీ ఉద్యోగం, మీ ఇల్లు, మీ కారు, మీ భార్య లేదా మీ పిల్లలు కావచ్చు. అది మీ హృదయంలో దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా కావచ్చు. అది అబ్రహాము హృదయంలో దేవుని స్థానాన్ని ఇస్సాకు తీసుకున్నట్లుగా ఉంటుంది. దేవుడు ఆ విగ్రహారాధనను విడిచిపెట్టమని అబ్రహాముతో చెప్పాడు. విగ్రహాల నుండి, దేవుడు మీ హృదయంలో మొదటి మరియు ఉన్నతమైన స్థానంలో ఉండకుండా నిరోధించే ప్రతిదాని నుండి దేవుని వైపు తిరగడమే మారుమనస్సు. మన భూసంబంధమైన అవసరాలన్నీ మనకు జోడించబడే విధంగా దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని మొదట వెతకడం అంటే అదే (మత్తయి 6:33). మీ భూసంబంధమైన అవసరాలకు ఎప్పటికీ లోటు రాదని మీరు ఖచ్చితంగా నిశ్చయించుకోవచ్చు - మీరు ఎప్పటికీ లక్షాధికారి కాకపోయినా, మీరు దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుతుంటే మీ భూసంబంధమైన అవసరాలు మీకు అనుగ్రహింపబడునట్లు ఆయన చూసుకుంటాడు. దానిని బట్టి దేవునికి వందనాలు.

ప్రతి క్రైస్తవుడు జీవించాల్సిన విధానం ఇదే. ఈ రోజుల్లో క్రైస్తవులు భౌతిక శ్రేయస్సు మరియు శారీరక స్వస్థత దేవుని ఆశీర్వాదానికి చిహ్నాలు అని అనుకోవడం చాలా విచారకరం. అది నిజం కాదు ఎందుకంటే ఆత్మీయ క్రైస్తవుల కంటే కూడా చాలా అధికంగా భౌతిక శ్రేయస్సు మరియు శారీరక ఆరోగ్యం ఉన్న క్రైస్తవేతరులు చాలా మంది ఉన్నారు. అది సువార్త కాదని ఈవిషయం నిరూపిస్తుంది. అంతేకాకుండా, నిజమైన శిష్యుడికి ఉన్న పాపం నుండి స్వేచ్ఛ వారికి లేదు.

యేసు మొదట ప్రకటించిన సందేశం, మరియు మనం నిరంతరం ప్రకటించాల్సిన సందేశం, మారుమనస్సు. "నేను బోధించినవన్నీ చేయమని వారికి నేర్పించండి" అని యేసు చెప్పినప్పుడు, ఆయన ఏమి బోధించాడు? మొదటి అడుగు, పాపం నుండి దేవుని వైపు తిరగటం, మీ హృదయాన్ని పరలోక రాజ్యానికి తెరవడం, తద్వారా మీ మనస్సు ఇప్పుడు పైనున్న వాటిపై, దేవుని విషయాలపై - నీతి, సమాధానం మరియు పరిశుద్ధాత్మలో ఆనందంపై - కేంద్రీకరించబడుతుంది.