WFTW Body: 

ఎఫెసీ 4వ అధ్యాయంలో, "కోపపడుడి, కానీ పాపం చేయకుడి" (ఎఫెసీ 4:26) అని మనకు ఒక ఆజ్ఞ ఉంది. దాని అర్థం ఏమిటంటే, మీ జీవితంలో మీరు పాపం లేని కోపాన్ని కలిగి ఉండాలి. యేసు పాత నిబంధన ప్రమాణమైన "నరహత్య చేయవద్దు" అనే ఆజ్ఞను "కోపపడవద్దు" అనే స్థాయికి పెంచినప్పుడు, సరియైన కోపం ఏమిటి మరియు తప్పైన కోపం ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.

మనం ఒక వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోనప్పుడు మన ఆధ్యాత్మిక నిఘంటువును చూడాలి: అది వాక్యం శరీరధారియైన యేసుక్రీస్తు జీవితం. యేసు తనను తాను లోకానికి వెలుగు అని పిలుచుకున్నాడు మరియు "ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉంది" (యోహాను 1:4) అని ఆయన గూర్చి చెప్పబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితం లేఖనంలోని ప్రతి వచనాన్ని వివరించే వెలుగు. కాబట్టి మనం "కోపపడుడి, కానీ పాపం చేయకుడి" అని చదివినప్పుడు పాపకరమైన కోపానికి మరియు పాపం కాని కోపానికి మధ్య తేడాను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనం యేసు జీవితంలో ఉన్న వెలుగును చూడాలి.

యేసు ఎప్పుడు కోపపడ్డాడు? ఎప్పుడు కోపపడలేదు? మార్కు 3:1-5లో యేసు ఒక సమాజ మందిరంలో ఉన్నప్పుడు, ఊచ చేయి ఉన్న వ్యక్తి స్వస్థత పొందకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల వైపు కోపంతో చూశాడని మనం చదువుతాము. పక్షవాతం కలిగిన రోగిని స్వస్థపరచడం కంటే సబ్బాతు ఆచారాన్ని పాటించడం గురించి పరిసయ్యులు ఎక్కువ శ్రద్ధ వహించినప్పుడు ఆయన కోపపడ్డాడు. ప్రజల కంటే ఆచారాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉండి మరియు పక్షవాతానికి గురైన వారిని విడిపించడం కంటే కొన్ని ఆచారాలను పాటించడంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉండే మత నాయకులు మరియు మతపరమైన వ్యక్తుల పట్ల ఉండే కోపం సరైన కోపం.

ప్రజలు పాపం నుండి విముక్తి పొందటం కంటే వారు దశమభాగాలు చెల్లించుటలోనే ఎక్కువ ఆసక్తి ఉన్న మతపరమైన వ్యక్తులు మనకు ఉన్నప్పుడు నేడు పక్షవాతం పాపం ద్వారా ఓడిపోయిన క్రైస్తవులలో కనిపిస్తుంది. వారు ఊచ చేయి ఉన్న వ్యక్తిని స్వస్థపరచడానికి అనుమతించని మరియు ప్రజలు తమ దశమభాగాలు చెల్లించడం మరియు సబ్బాతును ఆచరించడంలో ఎక్కువ ఆసక్తి చూపే పరిసయ్యుల వర్గంలోనే ఉన్నారు. నేడు అలాంటి బోధకులు మరియు పాస్టర్లు చాలా మంది ఉన్నారు, వారు తమ మందను వారి జీవితంలో పాప శక్తి నుండి విడిపించడంలో ఆసక్తి చూపరు, కానీ వారు తమ దశమభాగాలు చెల్లించేలా చూసుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. యేసు నేడు అలాంటి వ్యక్తులను కోపంగా చూస్తాడు. ఎందుకంటే ఆయన భూమిపైకి ప్రజలు తమ దశమభాగాలు చెల్లించేలా చేయుటకు రాలేదు; ఆయన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు. ప్రజలు తమ దశమభాగాలు చెల్లించేలా చేయడానికి ఆయన సిలువపై మరణించలేదు; ఆయన మన పాపాల నుండి మనలను విడిపించడానికి సిలువపై మరణించాడు.

మన రక్షకుని పేరు యేసు మరియు ఆయన మనలను మన పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు (మత్తయి 1:21). ప్రజలు తమ పాపాల నుండి రక్షింపబడకుండా అడ్డుకుని, "ఈ వ్యక్తి పాపంపై విజయం ప్రకటిస్తున్నందున వెళ్లి అతని మాట వినకండి, కానీ నేను మీకు ఎలా దశమభాగాలు చెల్లించాలో చెబుతున్నాను కాబట్టి నా మాట వినండి" అని చెప్పినప్పుడు, యేసు అలాంటి వ్యక్తులపై కోపపడతాడని మనం ఖచ్చితంగా చెప్పాలి. మీరు యేసుక్రీస్తుతో సహవాసం చేస్తూ ఉంటే, దేవుని సేవకుడిగా ఇతరులను విడుదల చేయకుండా అడ్డుకునే అలాంటి వ్యక్తులపై మీరు కూడా కోపంగా ఉండాలి.

యోహాను 2వ అధ్యాయంలో యేసు దేవాలయంలోకి వెళ్లి రూకలు మార్చేవారిని దేవాలయం నుండి వెళ్ళగొట్టడం యేసు కోపపడుటకు మరొక ఉదాహరణ. ఆయన కొరడాను చేసి రూకలు మార్చేవారి బల్లలను తిప్పికొట్టి, "వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి!" అని చెప్పాడు. ఆయన ఎంతో కోపపడ్డాడు, ఆయన శిష్యులు "నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని" వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసికొనిరి (యోహాను 2:15-17). ప్రజలు మతం పేరుతో లేదా క్రీస్తు పేరుతో డబ్బు సంపాదించడం, పావురాలు మరియు గొర్రెలను అమ్మేవారివలె, "మీ బలి కోసం మేము ఈ గొర్రెలను మరియు పావురాలను మీకు అమ్ముతాము, కానీ మేము మా లాభం పొందాలి కాబట్టి అది మీకు బజారులోకంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది" అని పేదలను దోపిడీ చేస్తూ డబ్బు సంపాదిస్తుండటం చూసినప్పుడు దేవుని ఇంటి పవిత్రత పట్ల ఉన్న ఆసక్తి మనకు కోపం తెప్పించాలి.

యేసు ఎప్పుడు కోపపడలేదు? ఒక ఉదాహరణ, ఆయనను బయెల్జబూలు (దయ్యాల రాజు) అని పిలిచినప్పుడు ఆయన కోపపడలేదు (మత్తయి 12:22-24). యేసు చెవిటి మరియు మూగ వ్యక్తి నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఇది జరిగింది. జనసమూహం దానిని చూసి ఉత్సాహంతో, "ఈయన దావీదు కుమారుడు. ఆయన ఎంత గొప్ప అద్భుతం చేశాడో చూడండి. ఈ మనిషిని విడిపించాడు!" అని చెప్పడం ప్రారంభించారు కానీ పరిసయ్యులు అసూయపడి వెంటనే, "ఈయన దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు" (మత్తయి 12:24) అని అన్నారు. వారు యేసును సాతాను అని పిలుస్తున్నారు. మీరు ప్రభువును సేవిస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని సాతాను అని పిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. కానీ యేసు ఇలా అన్నాడు, "నేను మనుష్యకుమారుడిని, నేను సాధారణ మనిషిని. మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే, మీరు క్షమించబడ్డారు; కానీ మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకుండా జాగ్రత్త వహించండి" (మత్తయి 12:32).

ప్రజలు ఆయనను అపవాది అని పిలిచినప్పుడు ఆయన కోపపడలేదు. ఆయన ఇలా అన్నాడు, "మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడినా పర్వాలేదు, నేను మనుష్యకుమారుడిని. మీరు క్షమించబడ్డారు". వారు ఆయనను అపవాది అని పిలిచినప్పుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన దానిని బట్టి కలతచెందలేదు. ఆయన వారిని క్షమించాడు. నిజమైన క్రైస్తవుడు తనను చెడ్డ పేర్లతో పిలవడం, అపవాది, పంది, కుక్క లేదా అలాంటిది ఏదైనా అని పిలవబడినప్పుడెప్పుడూ కలతచెందడు. అది ఎటువంటి వ్యత్యాసాన్ని కలిగించదు. అతను క్రీస్తులాంటి వ్యక్తి అయితే, అతను వారిని క్షమిస్తాడు మరియు కోపం తెచ్చుకోడు. తనను అటువంటి పేర్లతో పిలిచిన వారిపై అతనికి ఎలాంటి కోపం లేదా పగ ఉండదు.

చాలా తక్కువ మంది క్రైస్తవులు యేసుక్రీస్తులా ఉండాలని కోరుకుంటారు, కానీ వారందరూ చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్లాలని కోరుకుంటారు. ప్రతి క్రైస్తవుడు తాను చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్లాలని కోరుకుంటాడు, కానీ వారిలో ఎంతమంది పరలోకానికి వెళ్లే ముందు ఈ భూమిపై యేసుక్రీస్తులా జీవించాలని కోరుకుంటారు? చాలా తక్కువ. అదే సమస్య. ఈ వ్యక్తులలో చాలామంది నిజంగా క్రైస్తవులు కాదు. వారు క్రైస్తవ కుటుంబంలో జన్మించినందున వారు పేరుకే క్రైస్తవులు, కానీ వారు తమ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు లోబడలేదు. అందువల్ల దేవుని విషయానికొస్తే, వారు క్రైస్తవులు కాదు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు వారు క్రైస్తవులు కాదని కనుగొని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు క్రైస్తవ కుటుంబంలో జన్మించడం ద్వారా క్రైస్తవులు కాలేరు. మీరు వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవాలి.

ఇది మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎఫెసీ 4:26 యొక్క అర్థం ఇదే, "కోపపడుడి, కానీ పాపం చేయకుడి". ఐదు వచనాల తరువాత ఎఫెసీ 4:31 లో "సమస్త కోపాన్ని విడిచిపెట్టండి" అని చెప్పబడింది. ఈ రెండు వచనాలు ఒకదానికొకటి విరుద్ధంగా కనిపిస్తాయి. ఒక చోట "కోపపడుడి, కానీ పాపం చేయకుడి" అని చెప్పబడింది మరియు మరొక చోట "సమస్త కోపాన్ని విడిచిపెట్టండి" అని చెప్పబడింది. మనం ఏ కోపాన్ని విడిచిపెట్టాలి? స్వార్థపూరితమైన, స్వీయసంబంధమైన మరియు పాపపు కోపాన్ని విడచిపెట్టాలి. మనకు ఉండవలసిన కోపం ఏమిటి? దేవుని కేంద్రీకృతమైన, దేవుని నామ మహిమకు సంబంధించిన కోపం కలిగి ఉండాలి. నేడు భూమిపై దేవుని నామం గౌరవించబడటం లేదనే భారం కలిగి ఉండాలి.