"మేము ఇతరులను క్షమించిన ప్రకారం మా పాపాలను క్షమించండి" అని ప్రతిరోజూ ప్రార్థించమని యేసు మనకు బోధించాడు. ప్రతిరోజూ క్షమాపణ కోసం ప్రార్థించాల్సిన అవసరం ఉందని మీకు తెలుసా? మనం ప్రతిరోజూ యేసు ప్రార్థనను పునరావృతం చేయకపోయినా, కనీసం మనం ప్రతిరోజూ క్షమాపణ కోసం ప్రార్థించాల్సిన అవసరం ఉందని మనం గుర్తించాలి. నేను ప్రతిరోజూ "ప్రభువా, నా పాపాలను క్షమించు" అని ప్రార్థిస్తాను. క్షమాపణ మనకు ప్రతిరోజూ అవసరమని మనకు ఎలా తెలుసు? ఎందుకంటే ప్రార్థనలోని మునుపటి మాట, "మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచేయండి" అని ఉంది (మత్తయి 6:11). కాబట్టి, ఇది రోజువారీ విషయం. ప్రభువా, నాకు ఈ రోజు నా రోజువారీ ఆహారం అవసరం, మరియు నా తదుపరి అభ్యర్థన ఏమిటంటే, ఈ రోజు నా పాపాలను కూడా క్షమించండి.
"నేను ప్రతిరోజూ పాపం చేస్తున్నానని చెప్తూ, పాపంపై విజయం సాధించానని మీరు ఎలా చెప్పగలరు?" అని మీరు అడగవచ్చు. మనం స్పృహతో(తెలిసి) పాపం చేయడం మరియు గుర్తెరుగని విషయాలలో తెలియకుండానే పాపం చేయడం మధ్య తేడా ఉంది. మన జీవితాల గురించి దాదాపు పది శాతం మాత్రమే మనకు నిజంగా తెలుసు. మనం మంచుకొండ యొక్క కొనను మాత్రమే చూడగలిగినట్లు, మన జీవితంలో పాపం యొక్క పైభాగాన్ని మాత్రమే చూడగలం. మన జీవితంలో పాపం మరియు క్రీస్తుకు విరుద్ధంగా ఉన్న వాటి గురించి మనకు తెలియని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలలో కూడా దేవుడు మనల్ని క్షమించాలని మనం ప్రార్థించాలి.
ప్రతిరోజు క్షమాపణ అడగడం యొక్క అర్థం అదే. అపొస్తలుడైన పౌలు వలె తెలిసిన పాపంపై పూర్తి విజయంతో మనం జీవించగలం. 1 కొరింథీ 4:4.లో, పౌలు, "నాలో నాకు ఏ దోషమూ కనిపించదు" అని అంటున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, "నేను తెలిసిన అన్ని పాపాలపై విజయంతో జీవిస్తున్నాను. నా జీవితంలో ఏ పాపం నాకు తెలియదు, కానీ దాని అర్థం నేను నిర్దోషినని లేదా అపరాధభావం నుండి పూర్తిగా విముక్తి పొందానని కాదు. నన్ను పరీక్షించేవాడు ప్రభువే, ఆయనకు నేను జవాబుదారీగా ఉన్నాను. నా జీవితంలో, నాలో నేను చూడని చాలా ప్రాంతాలను ఆయన చూస్తున్నాడు. అందుకే నేను నిర్దోషినని నిర్లక్ష్యంగా చెప్పలేను. నన్ను క్షమించమని నేను దేవుడిని అడగాలి. ఇంతకు ముందు నాకు తెలియని ప్రాంతాలపై ఆయన నాకు వెలుగు ఇచ్చినప్పుడు, నేను ఆ విషయాలలో అధిగమించడానికి ప్రయత్నించగలను." ఇదే పరిశుద్ధపరచుకొనుట.
ప్రభువు మనకు "నన్ను వెంబడించండి" అనే సరళమైన ఆజ్ఞను ఇస్తాడు. తరువాత ప్రభువు మనకు అంతకంతకు పరిశుద్ధపరచబడే అద్భుతమైన జీవితానికి మార్గాన్ని చూపుతాడు. సామెతలు 4:18 ఇలా చెబుతుంది, "పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును". మనం తిరిగి జన్మించినట్లయితే, క్రీస్తు నీతి మనకు ఆపాదించబడింది కాబట్టి మనం నీతిమంతులుగా ప్రకటించబడ్డాము. మార్పుచెందిన క్షణం, చీకటిని తరిమివేస్తూ తెల్లవారుజామున క్షితిజంపై ఉదయించే సూర్యుడిలా ఉంటుంది. సూర్యుడు నెమ్మదిగా ఆకాశంలో పైకివెళ్ళినప్పుడు ప్రకాశవంతంగా మారుతూ, మధ్యాహ్నానికి అత్యంత ప్రకాశవంతమైన స్థాయికి చేరుకుంటాడు. అదేవిధంగా, మనం నీతిమంతులమైతే, మనం రోజురోజుకూ ఆచరణాత్మక నీతిలో ఎక్కువ స్థాయికి పురోగమించాలి. మన జీవితంలోని అన్ని రోజులలో సూర్యుడు క్షితిజం దగ్గరే ఉండకూడదు. అది ప్రకాశంలో వృద్ధిచెందాలి. నీతిమంతుల మార్గం క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకు మరింత ప్రకాశవంతంగా మారే వేకువజామున ప్రకాశించే వెలుగు లాంటిది. అప్పుడు మనం ఆయనవలె ఉంటాము.
ఆయన వచ్చినప్పుడు మాత్రమే మనం పూర్తిగా ఆయనలాగే ఉంటాము, కానీ నేడు ఆయనలాగే నడవగలం. 1 యోహాను 3:2 ఇలా చెబుతోంది, "ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము". 1 యోహాను 3:2లో చూపబడిన వ్యత్యాసాన్ని గమనించండి. మనం ఇప్పటికే దేవుని పిల్లలం, కానీ మనం ఏమి అవ్వబోతున్నామో ఇంకా తెలియపరచబడలేదు. మనం ఎలా ఉండబోతున్నాం? మనం పూర్తిగా యేసులా ఉంటాం. మన ఆలోచనలు, మాటలు, పనులు, వైఖరులు, ఉద్దేశ్యాలు, మన అంతర్గత జీవితంలోని ప్రతి ప్రాంతం మరియు మనకు తెలియని విషయాలతో సహా మన మొత్తం వ్యక్తిత్వం యేసులా ఉంటుంది.
ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయన ఉన్నట్లుగానే మనం ఆయనను చూస్తాము. కానీ ఆ రోజు వరకు, మనం ఏమి చేయాలి? ఒక రోజు మీరు పూర్తిగా యేసులా అవుతారనే ఆశ మీకు ఉంటే, మీరు ఆయన పరిశుద్ధతయొక్క ప్రమాణాన్ని చేరుకునే వరకు ప్రతిరోజూ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటూ ఉంటారని 1 యోహాను 3:3 చెబుతుంది. ఇది, కొంచెం ముందు 1 యోహాను 2:6 లో వ్రాయబడిన దానికి సమానంగా ఉంది, నేను క్రైస్తవుడిని అని చెబితే, నేను క్రీస్తు జీవించినట్లుగా జీవించాలి మరియు ఆయన నడిచిన విధంగా నడవాలి. ఆవిధంగా ఒక రోజు, నేను ఆయనవలె ఉంటాను.
1 యోహాను 2:6 మరియు 1 యోహాను 3:2 మధ్య తేడా ఉంది. 1 యోహాను 2:6 యొక్క సందేశం, యేసు తన భూసంబంధమైన జీవితాన్ని ఏ నియమాల ప్రకారం జీవించాడో మనం కూడా అదే నియమాల ప్రకారం నడుచుకోవాలి మరియు ఆయనను అనుసరించాలి. భౌతిక వస్తువులు, పురుషులు, స్త్రీలు, పరిసయ్యులు, మతపరమైన వేషధారులు మరియు శత్రువుల పట్ల యేసు కలిగి ఉన్న వైఖరినే మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు, తనను సిలువ వేసిన శత్రువుల కోసం యేసు ఇలా ప్రార్థించాడు, "తండ్రీ, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించండి".
పరిశుద్ధాత్ముడు మనకు తెలిసిన విషయాలలో యేసులా నడవడానికి సహాయం చేస్తాడు, అయితే అది మన పూర్తి జీవితాలలో పది శాతం మాత్రమే. మిగిలిన తొంభై శాతం మరుగై ఉంది. ఆ ప్రాంతాలలో మనం అధిగమించి, మనల్ని మనం మరింతగా పరిశుద్ధపరచుకునేలా దేవుడు ఆ మరుగైన ప్రాంతాన్ని మనకు మరింత వెల్లడిచేస్తాడు. దేవుడు మనల్ని పాపము నుండి కడిగివేస్తాడు (1 యోహాను 1:7), అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపమును విడిచిపెట్టడం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి (1 యోహాను 3:3).