ఆదికాండము 13:7లో అబ్రహాము దాసులకు లోతు దాసులకు ఘర్షణ జరిగినట్లు మనం చదువుతాం. ఐగుప్తు ప్రయాణాన్ని బట్టి అబ్రహాము మరియు లోతు ఎంతో ఆస్తిని సంపాదించుకున్నారు. ఆ ఆస్తి ఇప్పుడు సమస్యలను కలిగించింది. ఆస్తి ఎప్పుడైనా సమస్యలను కలిగిస్తుంది. లోతు, అతని భార్య ఐగుప్తులో చూసిన వాటి చేత ప్రభావితం చేయబడ్డారు. వారు ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. అయితే అబ్రహాము ఎవరితోనూ పోట్లాడే వ్యక్తి కాదు. కానీ అతని దాసులు పోట్లాడిరి.
"అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. ఆ కాలములో కానానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి". ఈ ఆఖరి మాట ఎందుకు వ్రాయబడినది? ఎందుకంటే ఆ అన్యజనులు ఈ కలహమును చూస్తున్నారు. ఈ రోజున క్రైస్తవ లోకంలో ఉన్న పరిస్థితికి ఇది సంబంధించిన విషయం. దేశంలో నివసిస్తున్న అన్యులు ఏమి చూస్తున్నారు? క్రైస్తవ గుంపులు పొట్లాడుకోవడం. వీటి మధ్యలో, డబ్బును ప్రేమించే లోకానుసారుడైన లోతును పిలిచి "మనము సహోదరులము గనుక నాకు నీకు మధ్య కలహం ఉండకూడదు" (ఆది.కా. 13:8) అని చెప్పే అబ్రాహాము వంటి భక్తిపరుడుని ఈ రోజున మనము కనుగొనగలమా?. వారు సహోదరులు కాదు. అబ్రహాము పెదనాన్న; లోతు అతనికి కొడుకు వరుస(తమ్ముని కొడుకు). 35 ఏళ్ల వయస్సు గల తన కొడుకుపట్ల, 75 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి యొక్క కనికరము చూడండి. "మనము సహోదరులము!". ఒక దైవభక్తి గలవాడు దీనుడు. అతనికి 75 ఏళ్లు కానీ తన యవ్వన కుమారుడిని చూచి "మనము సహోదరులము. నీవు నాతో సమానుడవు. నేను నిన్ను మొదట ఎంచుకొనిస్తాను. నీకు కావలసిన దానిని ఎంచుకో" అని చెప్పగలిగాడు. యెరూషలేము అట్టి వారి చేత కట్టబడును. క్రైస్తవ లోకంలో అట్టి నాయకులు కావాలి. కానీ వారంత సులువుగా దొరకరు.
ఈరోజున తమ అధికారమును ప్రదర్శించి "నాకు 75 ఏళ్లు, నేను నీ పెదనానను. దేవుడు పిలిచినది నన్ను, నిన్ను కాదు. నీవేదో నాతో పాటు వచ్చావు" అని చెప్పే అనేక నాయకులు మనకు ఉన్నారు. కానీ అబ్రహాము లోతుతో అలా మాట్లాడలేదు. అతడు లోతుతో, "నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను. నీవు ఎడమకు వెళ్తే, నేను కుడికి వెళ్తాను. నీకు ఏది కావాలో ముందు నీవు తీసుకో" అని చెప్పాడు. అయితే లోభి అయిన లోతు బబులోను యొక్క ఆత్మతో మొదట లాక్కున్నాడు. అతడు సొదొమ యొక్క చక్కటి పొలాలను చూచి, అక్కడున్న ధనికులను చూచి, డబ్బు సంపాదించడానికి అక్కడున్న అవకాశమును చూసి, "నేను అక్కడకు వెళ్లి అక్కడ కూడా దేవుణ్ణి సేవించగలను" అనుకున్నాడు.
అనేకమంది క్రైస్తవ బోధకులు మరియు క్రైస్తవులు ధనిక దేశాలకు వలస వెళ్లుటకు ఇష్టపడతారు. కానీ తప్పకుండా వారు ఆత్మీయ విషయాలను పోగొట్టుకుంటారు. అబ్రహాము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు అతడు మరియు లోతు ఏం చేస్తున్నారో చూడడానికి బాబేలు సమయంలో వలె ప్రభువు దిగివచ్చెను. అబ్రహాము దైవభక్తితో వ్యవహరించిన తీరును ప్రభువు చూశాడు. లోతు అతన్ని విడిచి వెళ్లిన వెంటనే ప్రభువు అబ్రహాముతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు (ఆదికాండం 13:14).
దేవుడతన్ని మొదట తన తండ్రి నుండి (మరణం ద్వారా) వేరుపరచాడు. ఆ తరువాత లోభత్వంతో అబ్రహాముకు ఆటంకముగా ఉన్న తన మరొక బంధువు నుండి వేరుపరచాడు. "ఇప్పుడు నీవు ఒక్కడివే ఉన్నావు. నువ్వు ఎక్కడకు వెళ్లాలని నేను కోరుకుంటున్నానో నేను అక్కడకు నిన్ను తీసుకు వెళ్ళగలను. జరిగినదంతా నేను చూశాను" అని దేవుడు అబ్రహాముతో చెప్పెను. మనుషుల మధ్య జరిగే లావాదేవీలన్నిటిని దేవుడు చూస్తున్నాడని మీకు తెలుసా? ఆయన మన వైఖరులను చూస్తున్నాడు. నీవు క్రైస్తవుడవైనందుకు ఏ విషయంలోనైనా నీ హక్కును వదులుకున్నావా? "నేను దాన్ని చూశాను" అని దేవుడు నీతో చెప్తున్నాడు.
అప్పుడు దేవుడు అబ్రహాముతో "ఇక్కడ నిలబడి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులలో చూడు నీవు చూసిన దేశం అంతా ఒకరోజు నీ సంతానానికి చెందుతుంది. నేను వాగ్దానం చేస్తున్నాను. అది లోతు సంతానానికి చెందదు" అన్నాడు. దేవుడు ఆ మాటను అబ్రహాముతో 4000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఆ దేశమును 4000 సంవత్సరాల తర్వాత ఈ రోజున మీరు చూచి, అక్కడ ఎవరు నివసిస్తున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అబ్రహాము సంతానమే కానీ లోతు సంతానము కాదు. దేవుడు తన మాటను నిలబెట్టుకొనును. వేల సంవత్సరాలు గడిచిపోవచ్చునేమో కానీ దేవుడు అబ్రహాముతో, "నేను ఈ దేశమును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను" అని చెప్తే (ఆదికాండం 13:15) ఖచ్చితంగా అలాగే ఉంటుంది.
ఆదికాండం 14వ అధ్యాయంలో లోతు ఎలా కష్టాల పాలయ్యాడో మనం చదువుతాము. మీరు దేవుని చిత్తము నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా మీరు కష్టాల పాలవుతారు. అతను శత్రువుల చేత చెరపట్టబడ్డాడు. "వాడు నా యొద్ద నుండి లాక్కున్నందుకు మంచి పని జరిగింది" అని అబ్రహాము చెప్పి ఉండవచ్చు. కానీ అబ్రహాము అలా స్పందించలేదు. మరొకసారి అబ్రహాము పరీక్షింపబడుటని మీరు ఇక్కడ చూస్తారు. తనను మోసం చేసిన వ్యక్తి కష్టాల పాలయ్యాడని అబ్రహాము వినినప్పుడు అతని వైఖరి ఎలా ఉంది? నిన్ను మోసగించిన వ్యక్తి కష్టాలపాలు అయితే నీవు దైవజనుడవో కాదో వెంటనే తెలుసుకుంటావు.
"నేను వెళ్లి లోతును ఆదుకుంటాను. లోతు నన్ను మోసగించిన మాట నిజమే కానీ ఏ విషయంలో నన్ను మోసగించాడు? భూసంబంధమైన ధనము అనే చెత్త విషయంలో. అది వట్టిది. నాకు పరలోక సంబంధమైన ధనము ఉన్నది. లోతు భూసంబంధమైన వాటి వెంట పరిగెత్తి కష్టాలపాలైనందుకు నేను చింతిస్తున్నాను. నేను వెళ్లి అతని సహాయపడతాను" అంటూ అబ్రహాము స్పందించాడు. అది దైవభక్తి గల వ్యక్తి యొక్క వైఖరి. అట్టివారే యెరూషలేమును కట్టగలరు.