ఒకసారి యేసు దగ్గరకు వచ్చిన ఇద్దరు గ్రుడ్డివాళ్ల సంధర్భాన్ని పరిశీలించండి. మత్తయి 9:27లో, ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసును వెంబడించి, "మమ్ము కనికరించుమని" అడిగినట్లు మనం చదువుతాము. యేసు వారిని, "మీ కోసం నేను ఏమి చేయాలనుకుంటున్నారు?" అని అడిగాడు (మరొక సువార్తలోని సమాంతర భాగంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది). వారు, "మా కళ్ళు తెరవబడాలని మేము కోరుకుంటున్నాము!" అని అన్నారు, ఆపై ఆయన మత్తయి 9:28 లో వారిని ఒక ప్రశ్న అడుగుతాడు, "నేను మీ కోసం దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?"
అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రభువు తాను వాగ్దానం చేసిన ఏ విషయం గురించైనా మీరు దేవునికి విన్నవించేటప్పుడు అడిగే ముఖ్యమైన ప్రశ్న ఇది. "ప్రభువా, నా గుడ్డి కళ్ళు తెరవబడాలని నేను కోరుకుంటున్నాను," లేదా, "నాకు వ్యాధి నయం కావాలని నేను కోరుకుంటున్నాను," లేదా, "నేను ఒక నిర్దిష్ట పాపపు అలవాటు నుండి రక్షింపబడాలని కోరుకుంటున్నాను," లేదా, "ప్రభువా నాకు ఉద్యోగం రావాలని నేను కోరుకుంటున్నాను," లేదా, "నేను నివసించడానికి ఒక స్థలాన్ని కనుగొనాలనుకుంటున్నాను" అని మనం దేవుణ్ణి అడగగల చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు మన ఆధ్యాత్మిక మరియు భౌతిక అవసరాలన్నింటినీ తీరుస్తాడు, కానీ మనం దేవునికి నిర్దిష్టమైన విన్నపాలు చేసిన తర్వాత ప్రభువు మనల్ని అడిగే ప్రశ్న ఇది: "నేను మీ కోసం దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?". అది యేసుప్రభువు మాట్లాడటం.
ప్రభువు మన కోసం తన సామర్థ్యం ప్రకారం కాక మన విశ్వాసం ప్రకారం చేస్తాడని మీకు తెలుసా? మీకు ఒక దానిపట్ల విశ్వాసం లేకపోతే, ప్రభువు మీ కోసం అంతకంటే ఎక్కువ చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభువు మీ కోసం ఏమి చేయాలనుకుంటున్నాడో మీరు అనుభవించలేరు. మీరు మీ విశ్వాస స్థాయిని బట్టి మాత్రమే విడుదలను అనుభవిస్తారు.
ఒకవేళ మొదటి గ్రుడ్డివాడు ఇలా అనటం ఊహించుకోండి, "ప్రభువా, మీరు ఒక కన్ను తెరవగలిగితే నేను సంతోషిస్తాను. అది నాకు సరిపోతుంది. నేను ఈ భూమిపై ఒక కన్నుతో జీవించగలను, మరియు మీరు దానిని చేయగలరని నేను నమ్ముతున్నాను." మత్తయి 9:29 వచనంలో ప్రభువు అతనికి చెప్పినట్లుగానే, "నీ విశ్వాసం ప్రకారం నీకు జరగును గాక" అని చెప్పాడు. "నా సామర్థ్యం ప్రకారం" కాదు, "నీ విశ్వాసం ప్రకారం" అని ప్రభువు అంటున్నాడు. ఈ మనిషి ఒక కన్ను తెరవబడి, మరొక కన్ను ఇంకా గుడ్డిదిగా ఆ గది నుండి బయటకు వెళ్తాడు. అది చాలా మంచిదే; ఒక గ్రుడ్డివానికి ఒక కన్ను తెరవబడటం కూడా ఎంతో అద్భుతమైన విషయం.
ఇప్పుడు రెండవ గ్రుడ్డివాడు వచ్చాడని ఊహించుకోండి. ప్రభువు అతన్ని అదే ప్రశ్న అడుగుతాడు, "నేను నీ కోసం దీన్ని చేయగలనని నమ్ముతున్నావా?". అతను, "అవును ప్రభువా! నువ్వు నా రెండు కళ్ళు తెరవగలవని నేను నమ్ముతున్నాను! నీకు అసాధ్యమైనది ఏమిటి?" అని చెప్తాడు. అతని రెండు కళ్ళు తెరవబడెను. అతను (ఒక కన్ను మాత్రమే తెరవబడిన) మరొక గ్రుడ్డివాడిని కలిసినప్పుడు ఆ వ్యక్తి, "నీ రెండు కళ్ళు ఎలా తెరవబడ్డాయి?! ఇది ఏదో తప్పుడు బోధన అయి ఉండాలి!" అని అంటాడు. అది తప్పుడు బోధన కాదు; రెండవ గ్రుడ్డివానికి మొదటి వానికంటే ఎక్కువ విశ్వాసం ఉంది, అంతే.
ఈ రెండు కళ్ళు మన పాపాలు క్షమించబడటం మరియు మన పాపాల నుండి రక్షించబడటం అని మనం అనుకోవచ్చు. ఒక వ్యక్తికి రెండూ లభిస్తాయి; మరొక వ్యక్తికి మొదటిది మాత్రమే లభిస్తుంది. ఎందుకు? దేవుడు ఆ వ్యక్తి పట్ల పక్షపాతం చూపినందుకా? ఆ వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టా? లేదు. క్రీస్తు తన కోసం చేస్తానని వాగ్దానం చేసిన ప్రతిదానికీ అతనికి విశ్వాసం ఉంది. ఒక వ్యక్తికి క్రీస్తు తన పాపాన్ని క్షమించగలడని మాత్రమే విశ్వాసం ఉంది, అందుకే అతను దానిని పొందాడు. మరొక వ్యక్తికి క్రీస్తు తన పాపాన్ని క్షమించగలడని కూడా విశ్వాసం లేదు, కాబట్టి అతను క్షమాపణ కూడా పొందడు.
లోకంలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒకరికి క్రీస్తు తన పాపాన్ని క్షమిస్తాడనే విశ్వాసం ఉంది, అతను క్షమాపణ పొందుతాడు. మరొకరికి "రెండు కళ్ళకు", క్రీస్తు నన్ను క్షమించడమే కాకుండా, ఆ పాపపు అలవాటు నుండి నన్ను కూడా విడిపించగలడనే విశ్వాసం ఉంది. అతనికి రెండూ లభిస్తాయి. ఒక వ్యక్తి రెండింటినీ, క్రీస్తు మనలను క్షమించడమే కాకుండా మనలను విడిపించగలడని కూడా ప్రకటించినప్పుడు, క్షమాపణను మాత్రమే అనుభవించిన వ్యక్తులు ఆ గొప్ప విమోచనను తప్పుడు బోధన అని పిలుస్తారు. వారు దానిని స్వయంగా అనుభవించలేదు కాబట్టి, వారు అది అసాధ్యం అని అంటారు. ఏ మానవుడు పాపం నుండి విముక్తి పొందడం అసాధ్యం అని వారు అంటారు. కానీ ప్రశ్న ఏమిటంటే అది మానవులకు అసాధ్యమా కాదా అనేది కాదు, అది దేవునికి అసాధ్యమా అనేదే?
దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని యేసు చెప్పాడు. మనిషికి చాలా విషయాలు అసాధ్యమైనవే. దేవుని శక్తి లేకుండా మనిషి పాప క్షమాపణ పొందడం కూడా అసాధ్యం. కానీ దేవునికి ఏదీ అసాధ్యం కాదు. మీరు వేరొకరు అనుభవించినట్లు ఏదైనా అనుభవించకపోతే, అది తప్పనిసరిగా అతనికి ఏదో తప్పుడు బోధన ఉందని కాదు; మీరు అతనిలాగా నమ్మకపోవడం వల్ల కావచ్చు అని దయచేసి గుర్తుంచుకోండి.
మరో ఉదాహరణ చెప్పాలంటే, పట్టణంలో నీటి కొరత ఉందని మరియు అందరి ఇంటి బయట సమానంగా వర్షం పడుతునట్లు ఊహించండి. ప్రజలు వర్షపు నీటిని సేకరించడానికి బయట పాత్రలు పెట్టారు. ఒక వ్యక్తి తన ఇంటి బయట ఒక చిన్న కప్పు పెడితే, అతడు ఎంత నీరు పొందుతాడు? కేవలం ఒక పూర్తి కప్పు. మరొక వ్యక్తి తన ఇంటి బయట ఒక పెద్ద డబ్బా పెడితే, అతడు ఎంత నీరు పొందుతాడు? పూర్తి డబ్బా!. నిండైన డబ్బాకు మరియు నిండైన కప్పుకు మధ్య తేడా ఉందా? ఖచ్చితంగా ఉంది! కప్పు ఉన్న వ్యక్తి ఇలా అనవచ్చు, "నీకు పూర్తి డబ్బా నీరు ఎలా వచ్చింది? దేవుడు నీ పట్ల పక్షపాతం చూపించాడు, నీ ఇంటి ముందు ఎక్కువ వర్షం కురిపించాడు!" డబ్బా ఉన్న వ్యక్తి ఇలా ప్రతిస్పందిస్తాడు, "లేదు సోదరా, నీ ఇంటి బయట కూడా అంతే వర్షం కురిసింది, కానీ నీవు బయట ఒక చిన్న కప్పు మాత్రమే ఉంచావు! అది నీ విశ్వాసం యొక్క స్థాయి, కాబట్టి నీకు అంతే లభించింది."
మన విశ్వాసం యొక్క పరిమాణం ప్రకారం మనం దేవుని నుండి పొందుతాము. దేవుని ఆశీర్వాదం అపరిమితంగా ఉంటుంది. మన పూర్వీకుడైన ఆదాము నుండి మనకు వారసత్వంగా వచ్చిన ప్రతి దుష్టమైన పాపపు అలవాటు నుండి మనలను విడిపించడానికి ఆయన "పరలోక స్థలాలలో ప్రతి ఆత్మీయ ఆశీర్వాదముతో", పరిశుద్ధాత్మ యొక్క ప్రతి ఆశీర్వాదంతో మనలను ఆశీర్వదించాడని ఎఫెసీ 1:3 చెబుతుంది. అయితే నేడు ప్రభువు మనలను అడిగే ప్రశ్న ఇదే: "నేను మీ కోసం దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?"