చాలా మంది తమ పాపాలు క్షమించబడినందుకు సంతోషంగా ఉంటారు, అంతే. అలాంటి వ్యక్తులు యేసును తమ రక్షకుడిగా తెలుసుకోరు; వారు ఆయనను క్షమించే వ్యక్తిగానే తెలుసుకుంటారు.
కోపం మరియు లైంగిక కామపు ఆలోచనల పాపాలను మనం జాగ్రత్తగా పరిగణించాలి, తద్వారా మనం వాటి తీవ్రతను చూడటమే కాకుండా మనం వాటిని ఎలా అధిగమించవచ్చో కూడా అర్థం చేసుకుంటాము. యేసు కొండమీది ప్రసంగంలో మనిషి నరకానికి వెళ్లే అవకాశంతో అనుసంధానించిన రెండు పాపాలు ఇవే కావడం ద్వారా వాటి తీవ్రత కనిపిస్తుంది. నా పరిశీలనలో 99% మంది క్రైస్తవులు కోపం చాలా తీవ్రమైన పాపం అని భావించరు. కోపం తమను నరకానికి తీసుకెళ్లగలదని వారు ఖచ్చితంగా భావించరు. అందువల్ల వారు మత్తయి 5:22లో యేసు చెప్పిన దానిని నిజంగా నమ్మరు. యేసుక్రీస్తు చెప్పిన దానిని వారు నమ్మకపోతే వారు ఎలాంటి క్రైస్తవులు? కోపం గురించి ఆయన చెప్పిన దానిని మీరు నమ్ముతారా? లేదా మనస్తత్వవేత్తలను మీరు నమ్ముతారా? మనస్తత్వవేత్తలు మిమ్మల్ని పరలోకానికి నడిపించలేరు. అదే విధంగా, 99% క్రైస్తవులు నిజంగా మీ కళ్ళతో స్త్రీని మోహించటం మిమ్మల్ని నరకానికి తీసుకెళ్లేంత తీవ్రమైనదని నమ్మరు. చాలా మంది దాన్ని అంత తీవ్రంగా పరిగణించరు, ఇది అపవాది పాపాన్ని అంత తేలికైన, అప్రధానమైన విషయంగా చేసిందనడానికి రుజువు.
ఎయిడ్స్ లేదా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి గురించి ఆలోచించండి: ఎయిడ్స్ బారిన పడటం లేదా క్యాన్సర్ రావడాన్ని ఎంత మంది తేలికగా తీసుకుంటారు? అటువంటి వ్యాధులు ఏమి చేయగలవో పూర్తిగా తెలియని వ్యక్తులు మాత్రమే. మారుమూల గ్రామంలోని నిరక్షరాస్యురాలైన పేద స్త్రీకి క్యాన్సర్ వచ్చిందని మీరు చెబితే, ఆమె బాధపడదు, ఎందుకంటే ఆమెకు క్యాన్సర్ అంటే ఏమిటో తెలియదు. మరోవైపు, చదువుకున్న వ్యక్తికి క్యాన్సర్ తన శరీరం అంతటా వ్యాపించిందని డాక్టర్ చెబితే చాలా బాధపడతాడు. అతను ఎందుకు కలత చెందుతాడు? ఎందుకంటే అతను క్యాన్సర్ ప్రమాదాన్ని చూస్తున్నాడు.
అదే విధంగా, మీరు ఆధ్యాత్మికంగా నిరక్షరాస్యులుగా ఉన్నప్పుడు, మీరు కోపాన్ని తీవ్రమైన పాపంగా పరిగణించరు. మీరు ఆధ్యాత్మికంగా నిరక్షరాస్యులుగా ఉన్నప్పుడు, స్త్రీలను మోహించటం తీవ్రమైన పాపంగా పరిగణించరు. ఆ నిరక్షరాస్యురాలైన పేద స్త్రీకి క్యాన్సర్ ఎంత తీవ్రమైనదో తెలియనట్లే, అది మీ ఆధ్యాత్మిక నిరక్షరాస్యతకు గుర్తు. అదే విధంగా, ఆధ్యాత్మికంగా అక్షరాస్యురాలైన వ్యక్తి ఈ పాపాలను చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. అతనికి చెప్పడానికి దేవుని మాటలు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇవి తీవ్రమైన పాపాలు అని అతనికి సహజంగానే తెలుసు, ఎందుకంటే ఒకటి ఇతరులను బాధపెడుతుంది, మరొకటి తనను బాధపెడుతుంది. అందుకే మనం ఈ పాపాలను మరింత జాగ్రత్తగా పరిశీలించి, వాటిని ఎలా అధిగమించగలమో ప్రశ్నించుకోవాలి.
మత్తయి 1లో దేవదూత యోసేపు వద్దకు వచ్చినప్పుడు, అతను క్రొత్త నిబంధన యొక్క మొట్టమొదటి వాగ్దానాన్ని ఇచ్చాడు. మత్తయి 1:21లో ఇలా చెప్పబడింది, "యేసు తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు". యేసు పేరు యొక్క అర్థం అదే. యేసు పేరు పలికే చాలా మందికి ఆయన పేరుకు ఉన్న అర్థం ఏమిటో కూడా తెలియదు. యేసు అనే పేరుకు "తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించేవాడు" అని మత్తయి 1:21 అర్థం చెప్తుంది.
కోపం మరియు లైంగిక కామపు ఆలోచనా విధానాలకు సంబంధించి, మన పాపాల నుండి రక్షింపబడటానికి మరియు మన పాపాల నుండి క్షమించబడటానికి మధ్య తేడా ఏమిటి?
మీరు పాపపు రీతిలో కోపం తెచ్చుకుని, దాని గురించి పశ్చాత్తాపపడి ప్రభువును క్షమించమని అడిగితే, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. రేపు, మీరు మళ్ళీ పాపపు రీతిలో కోపం తెచ్చుకుని ప్రభువును క్షమించమని అడిగితే, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. వచ్చే వారం, మీరు అదే పని చేసి, ఆయనను క్షమించమని అడిగితే, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. అదే విధంగా, మీరు మీ కళ్ళతో ఒక స్త్రీని మోహించి, అది పాపమని గ్రహించి, ప్రభువును క్షమించమని అడిగితే, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు మీరు రేపు మళ్ళీ అలా చేసి, ఆయనను క్షమించమని అడిగితే, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు ఇంటర్నెట్‍లో అశ్లీల చిత్రాలను చూసినప్పుడు మీరు ప్రభువును క్షమించమని అడిగితే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు.
కానీ మీరు ఈ పాపాల నుండి రక్షింపబడ్డారా? లేదు. మీరు క్షమించబడ్డారా? అవును. మీ జీవిత విధానం పాపం చేయడం, ప్రభువును క్షమించమని అడగడం, మళ్ళీ పాపం చేయడం, ప్రభువును మళ్ళీ క్షమించమని అడగడం. ఇదొక అంతులేని వృత్తం. మీరు క్షమించబడ్డారా? అవును! మీరు వెయ్యి సార్లు పాపం చేసి ఉండవచ్చు, మరియు మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, కానీ మీరు మీ పాపం నుండి రక్షించబడ్డారా? లేదు, ఎందుకంటే మీరు దానిని చేస్తూనే ఉన్నారు! ఇది ఒక గుంట నుండి బయటకు వచ్చి మళ్ళీ గుంటలో పడటం లాంటిది; మీరు ఎవరినైనా బయటకు లాగమని అడిగితే, అతను మిమ్మల్ని బయటకు లాగుతాడు, ఆపై రేపు మీరు మళ్ళీ గుంటలో పడతారు. మీరు ఎవరినైనా బయటకు లాగమని అడిగిన ప్రతిసారీ, మీరు మళ్ళీ గుంటలో పడుతున్నారు. ఇది ఎప్పుడు ముగుస్తుంది?
ఇప్పటివరకు యేసు మీ కోసం ఏమి చేశాడు? యేసు మిమ్మల్ని క్షమించాడు. అప్పుడు నిజాయితీగా ఉండి ఇలా చెప్పండి, “నేను యేసును క్షమించేవాడిగా యెరుగుదును, కానీ నేను ఆయనను నా రక్షకుడిగా యెరగను. ఆయన నా పాపాలను క్షమించేవాడిగా నాకు తెలుసు, కానీ నా పాపాల నుండి నన్ను రక్షించేవాడిగా కాదు.” మనం నిజాయితీగా ఉండాలి. మనం మనతో నిజాయితీగా ఉండకపోతే, బైబిలు మనకు వాగ్దానం చేసిన పరిపూర్ణతను మనం ఎప్పటికీ పొందలేము. దేవుడు నిజాయితీపరులను ప్రేమిస్తాడు. దేవుని ముందు నిజాయితీగా ఉండి మరియు మీ హృదయం నుండి నిజాయితీగా ఆయనకు ఈ విధంగా చెప్పమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, “ప్రభువైన యేసు, నేను నిన్ను క్షమించేవానిగా మాత్రమే యెరుగుదును. నిన్ను నా రక్షకుడిగా యెరుగను.”
చెట్టులో లేకపోతే ఒక కొమ్మ ఫలించదు మరియు ప్రతి కొమ్మ 50 సంవత్సరాలు ఆ చెట్టులో ఉన్న తర్వాత చెట్టుతో, “నువ్వు లేకుండా నేను ఫలించలేను; కానీ నేను నీలో ఉంటే ఫలించడం ఎంతో సులభం” అని చెప్పగలదు. కొమ్మ కష్టపడుతోందని మీరు అనుకుంటున్నారా? ఒక మామిడి చెట్టును చూడండి. మామిడి పండ్లను ఉత్పత్తి చేయడానికి కొమ్మ కష్టపడుతుందా? లేదు. కానీ మీరు ఆ చెట్టు నుండి ఆ కొమ్మను నరికివేస్తే, అది 50 సంవత్సరాలుగా మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, అది వెంటనే ఉత్పత్తిని ఆపివేస్తుంది, ఎందుకంటే అది ఎండిపోతుంది. అయితే, అది చెట్టులో ఉన్నంత వరకు, చెట్టు యొక్క సారం దానిలో ప్రవహిస్తుంది, ఆవిధంగా మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. పాపాన్ని అధిగమించే సూత్రం అదే మరియు ప్రతి దేశంలో శిష్యుడైన ప్రతి ఒక్కరికీ మనం బోధించాల్సినది అదే.
ప్రియ మిత్రులారా, క్రీస్తు లేకుండా మీరు ఏ పాపాన్ని కూడా అధిగమించలేరని మీరు అర్థం చేసుకోవాలి. అవును, మీరు బాహ్య పాపాలను అధిగమించవచ్చు. కానీ అది ఏమి నిరూపిస్తుంది? ప్రపంచంలో ఎవరినీ హత్య చేయని మరియు శారీరకంగా వ్యభిచారం చేయని నాస్తికులు చాలా మంది ఉన్నారు. గిన్నె వెలుపలి భాగాన్ని శుభ్రంగా ఉంచడానికి, మీకు యేసుక్రీస్తు అవసరం లేదు; మీరు మంచి పరిసయ్యుడిగా ఉండాలి. క్రైస్తవేతరులు, నాస్తికులలో కూడా ఎప్పుడూ మోసం చేయకుండా, నిజాయితీపరులుగా మరియు వారి బాహ్య జీవితం చాలా నిజాయితీగా ఉన్న వారున్నారు; కానీ అంతర్గత జీవితం విషయానికి వస్తే, వారు లోపల అవినీతిపరులు. అంతర్గత నిజాయితీ స్వీయ నియంత్రణ కంటే ఎక్కువ. మీరు యోగా శక్తులతో బాహ్యంగా కోపాన్ని వ్యక్తపరచకుండా ఉండగలరు, కానీ అది విముక్తి కాదు. అది విషం లోపల ఉండేలా సీసాను గట్టిగా మూసివేయడం లాంటిది; అది ఇప్పటికీ మిమ్మల్ని నాశనం చేస్తుంది. అది క్రీస్తు అందించే విముక్తి కాదు.
క్రీస్తు లోపల కోపం నుండి విముక్తిని అందిస్తాడు. నేను ఆ సీసా తెరవగలను, అక్కడ విషం ఉండదు. మీరు నా హృదయంలోకి చూస్తే, అక్కడ కోపం ఉండదు; నేను నోరు మూసుకుని ఉండటానికి మరియు నా కోపాన్ని అదుపు చేయటానికి గొప్ప ప్రయత్నం చేయడం లేదు - అది యోగా, కోపం నుండి విముక్తి కాదు. కోపం నుండి విముక్తి అంటే క్రీస్తు మన హృదయాలలోని కోపం నుండి మనలను విడిపించడం. అది పూర్తిగా తీసివేయబడింది. మీరు అలాంటి ఒక హృదయం లోపల చూస్తే, కోపం ఉండదు. మీరు ఆ హృదయం లోపల చూస్తే, స్త్రీల పట్ల మోహం ఉండదు. యేసు మాత్రమే అలా చేయగలడు.