వ్రాసిన వారు :   Joji Samuel విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

(భారతదేశంలోని కొట్టాయం CFC సంఘ పెద్దయైన జోజీ సామ్యూల్, 2015లో బెంగళూరులో జరిగిన CFC సంఘాల అఖిల భారత సమావేశంలో అందించిన వర్తమాన సారాంశం)

(ఈ వర్తమానమును నెమ్మదిగా, జాగ్రత్తగా చదవండి)

క్రీస్తు రాకడ వరకు మన సంఘాలలో దేవుని మహిమను మనము ఎలా కాపాడుకోగలము?

మన మధ్యలో దేవుని మహిమను కాపాడుకోవాలని మనము ఆశిస్తున్నామని చెప్పినప్పుడు, ప్రస్తుతం దేవుని మహిమ మన మధ్యలో ఉందని మనము నమ్ముతున్నాము. దానిని మనము ఎలా నిశ్చయంగా చెప్పగలము?

గడిచిన సంవత్సరాలలో మన మధ్యలో కొన్ని మహిమాన్వితమైన సత్యాలను మనము విన్నాము; అవి మనలను పాపము నుండి విడిపించి, మన మధ్యలోనికి గొప్ప విడుదలను తెచ్చాయి. దేవుడు మనతో ఉన్నాడని మనము తెలుసుకోవడానికి అది ఒక మార్గం - ఎందుకంటే సత్యము మనలను పాపము నుండి స్వతంత్రులనుగా చేసినప్పుడే మనము దేవుని సత్యములో ఉన్నామని తెలుసుకోవచ్చని యేసుప్రభువు సెలవిచ్చారు (యోహాను 8:32). అయితే ఇప్పుడు మనము ఈ స్వాతంత్ర్యములో ఎలా నిలకడగా ఉంటూ ముందుకు సాగాలో చూడాలి.

పౌలు తన జీవితపు చరమాంకంలో తిమోతికి రాస్తూ ఇలా హెచ్చరించాడు: "నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము. నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము" (1 తిమోతి 4:15, 16). ఆ విషయాలలో నిలకడగా ఉంటే, అతనికి మరియు అతని బోధ వినేవారికి రక్షణ నిశ్చయమవుతుందని పౌలు తిమోతితో చెప్పాడు. గడిచిన సంవత్సరాలలో మనలను స్వతంత్రులనుగా చేసిన ఆ సత్యాల వాస్తవికతను మనము అనుభవించాము, మన కూడికలలో మన మధ్యనున్న దేవుని సన్నిధిని మనము చవిచూశాము. దేవుని మహిమ మన మధ్యలో ఉందనడానికి ఇవి కొన్ని స్పష్టమైన రుజువులు.

నేను ఒక పెంతెకొస్తు కుటుంబంలో జన్మించి, పెంతెకొస్తు సంఘానికి వెళ్లేవాడిని. కానీ కొంతకాలం తర్వాత, నేను మాట్లాడుతున్న అనేక విషయాలు నా వ్యక్తిగత జీవితంలో వాస్తవాలు కావని నేను గ్రహించాను. నేను వెళ్లిన సంఘంలోని ఇతరుల జీవితాలలో కూడా ఆ సత్యాల వాస్తవికతను నేను చూడలేకపోయాను -కనీసం అక్కడి పాస్టర్లు, నాయకుల జీవితాలలో కూడా అది కనిపించలేదు. ఆ సమయంలోనే నేను "విజయవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలి (How to Live the Victorious Life)" అనే పుస్తకాన్ని చదివాను. అందులో పాపమును జయించే జీవితాన్ని జీవించే అవకాశం ఉందని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ పుస్తక రచయితను సంప్రదించాలని అనుకున్నాను. కానీ అందులో రచయిత పేరు "తెలియబడని క్రైస్తవుడు (An Unknown Christian)" అని మాత్రమే ప్రస్తావించబడింది. ఆ పుస్తకం చదివినప్పుడే నాకు మొదటిసారిగా జయజీవితం జీవించవచ్చనే నిరీక్షణ కలిగింది. కానీ నా చుట్టూ ఉన్న వారి నుండి దీని కొరకు ఎలాంటి సహాయమూ అందలేదు.

ఆ తర్వాత నేను సహోదరుడు జాక్ పూనెన్‌ను మరింత దగ్గరగా తెలుసుకుని, ఆయన పుస్తకాలను చదవడం ప్రారంభించాను. పాపమును జయించే జీవితాన్ని గూర్చిన వర్తమానాన్ని ఆయన నుండి వినడమే కాకుండా, క్రీస్తు వంటి జీవితానికి ఒక మాదిరిని కూడా ఆయనలో చూశాను. యేసుప్రభువు మన మార్గదర్శకుడిగా మనలాంటి శరీరముతో ఈ లోకానికి వచ్చి, ప్రతి విషయంలోనూ మనలాగే శోధించబడి జయించారని ఆయన బోధించారు. ఇది క్రైస్తవ జీవితం పట్ల నాకు పూర్తిగా నూతనమైన దృక్పథాన్ని ఇచ్చింది; దాంతో నేను సహోదరుడు జాక్ గారి సంఘంతో (క్రైస్తవ సహవాస సంఘం - CFC) అనుబంధం కలిగి ఉండుట ప్రారంభించాను. ఆ తర్వాత అతి త్వరలోనే, నేను పరిశుద్ధాత్మలో నిజమైన బాప్తిస్మాన్ని కూడా అనుభవించాను.

పెంతెకొస్తు ఉద్యమం 20వ శతాబ్దపు ప్రారంభంలో దేవుని కార్యముగానే మొదలైంది. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ ఎన్నో శతాబ్దాలుగా పాతిపెట్టబడిన "విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడుట" అనే సత్యాన్ని ఎలా వెలికితీశాడో మనమందరము విన్నాము. ఆ తర్వాత అనాబాప్టిస్ట్ ఉద్యమం నీటి బాప్తిస్మపు సత్యాన్ని ముందుకు తెచ్చింది. ఆ పిమ్మట జాన్ వెస్లీ లోకము నుండి వేరుగా ఉంటూ పరిశుద్ధ జీవితాన్ని ఎలా జీవించాలనే సత్యంతో వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన పెంతెకొస్తు ఉద్యమం, మొదటి శతాబ్దంలో అపొస్తలులు ప్రకటించినట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చిన సత్యాన్ని పునరుద్ధరించింది.

అయితే పెంతెకొస్తు ఉద్యమాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తే, వారి నాయకులు పరిశుద్ధాత్మ కార్యమును కేవలం ఆయన వరాలను అనుభవించడంతో మాత్రమే సరిసమానంగా ఎంచారని మనము కనుగొంటాము. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని కనబరచిన పెంతెకొస్తు నాయకులను నేను చూడలేదు. వారి ప్రాధాన్యత అంతా ఆత్మీయ వరాలపైనే ఉండింది. వారు పరిశుద్ధాత్మ శక్తిని కోరుకున్నప్పటికీ, వారిలో దాదాపు అందరూ ధనాపేక్షతోను, ఘనతగల పదవుల కోసమే వెంపర్లాడటం నేను గమనించాను. వారిలో ఎవరూ జయజీవితం జీవించే క్రైస్తవులుగా ఎలా ఉండాలో మాట్లాడలేదు. ఇతరులు కూడా ఈ వైరుధ్యాన్ని గమనించారు - కానీ ఎవరూ దీనిని చూసి కలవరపడినట్లు కనిపించలేదు.

ఒకప్పుడు పెద్ద వ్యాపార కార్యనిర్వాహకుడిగా పనిచేసి, పదవీ విరమణ తర్వాత మానసిక స్థితి తప్పిన ఒక వ్యక్తి గురించిన కథ నాకు గుర్తుంది. అతడు ప్రతిరోజూ తన పాత కార్యాలయం పార్కింగ్ స్థలానికి నడుచుకుంటూ వెళ్లి, తాను ఇంకా కారు నడుపుతున్నట్లే ఊహించుకునేవాడు. నిజంగా కారు నడుపుతున్నట్లుగానే తన శరీరంతో అన్ని కదలికలు చేస్తూ - బ్రేకులు వేసి, ఒక ఖాళీ స్థలంలో తన ఊహాత్మక కారును పార్క్ చేసేవాడు. ఆ తర్వాత కారు తలుపు తీసి బయటకు వచ్చి, "తలుపు వేసి", అక్కడున్న సెక్యూరిటీ వ్యక్తి దగ్గరకు వెళ్లి "నా కారును జాగ్రత్తగా చూడు" అని చెప్పేవాడు!! కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడికి వచ్చి, కారు ఎక్కి, వెనకకు తీస్తునట్లుగా చేసి నడుపుతున్నట్లుగా నటిస్తూ వెళ్లిపోయేవాడు. అతని చేష్టలను గమనించిన కొందరు ఒకరోజు సెక్యూరిటీ వ్యక్తి వద్దకు వెళ్లి అతడేమి చేస్తున్నాడని అడిగారు. అప్పుడు ఆ గార్డు... అతడు పెద్ద అధికారిగా ఉన్నప్పుడు నిజమైన కారుతో ఇక్కడికి వచ్చేవాడని, కానీ ఇప్పుడు మానసిక స్థితి కోల్పోయాడని చెప్పాడు. "అయితే అతని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు; అతడు తన ఊహాత్మక కారును పార్క్ చేసి వెళ్తాడు, మళ్లీ వచ్చి నడుపుకుంటూ వెళ్ళిపోతాడు; కాబట్టి నేను అతన్ని ఏమీ అనను!" అని చెప్పాడు. అప్పుడు ప్రజలు... "మరి నువ్వు అతనికి నిజం చెప్పి ఎందుకు సరిదిద్దకూడదు?" అని అడిగారు. దానికి ఆ సెక్యూరిటీ గార్డు... "నేను ఎందుకు సరిదిద్దాలి? అతడు ప్రతి వారం నాకు క్రమం తప్పకుండా పార్కింగ్ ఫీజు ఇస్తున్నాడు, అంతేకాదు ఆ ఊహాత్మక కారును కడగడానికి ప్రతి రెండు వారాలకు వంద రూపాయలు అదనంగా ఇస్తున్నాడు; అలాంటప్పుడు నేను అతన్ని ఎందుకు ఆపాలి!" అని బదులిచ్చాడు!!

నేడు అనేక పెంతెకొస్తు సంఘాలలో జరుగుతున్న దానికి ఇది ఒక స్పష్టమైన సాదృశ్యం: ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నటిస్తూ, రకరకాల విన్యాసాలు, విచిత్రమైన శబ్దాలు చేస్తుంటారు. ఈ చేష్టలన్నిటినీ చూసే వారి పాస్టర్లు... "మనమెందుకు వారిని ఇబ్బంది పెట్టాలి? వారు ప్రతి నెలా తమ దశమభాగాలను సరిగ్గా చెల్లిస్తున్నారు, మాకు క్రమం తప్పకుండా కానుకలు కూడా ఇస్తున్నారు; కాబట్టి నిజమైన పరిశుద్ధాత్మతో నింపబడిన జయజీవితం యొక్క వాస్తవికతను వారికి చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టాలి?" అని అనుకుంటున్నారు. నిజానికి, ఆ పాస్టర్ల జీవితంలోనే జయజీవితం లేదు! అనేక పెంతెకొస్తు సంఘాలలో జరుగుతున్న భ్రమ ఇదే.

అనేక సంఘాలలో ఉన్న ఇటువంటి దయనీయమైన పరిస్థితిని బట్టే, దేవుడు మన మధ్యలోనికి ఒక దైవజనుడిని పంపించారు - దేవుని సంఘములో వాస్తవికత కొరకు భారం కలిగిన వ్యక్తిని ఆయన పంపారు.

లూకా 12:56లో, పరిసయ్యులు తాము జీవిస్తున్న సమయమును వివేచింపలేకపోయినందుకు యేసుప్రభువు వారిని గద్దించారు. మనము కూడా మనము జీవిస్తున్న కాలాన్ని వివేచించాలి - మనము ఎక్కడ నిలబడి ఉన్నామో మనలను మనము పరీక్షించుకోవాలి. మనము ప్రభువుతో కలిసి ముందుకు సాగాలి. ఈ ప్రస్తుత కాలాన్ని వివేచించి, ఈ సమయము కొరకైన ప్రభువు భారాన్ని పొందుకుని, ఆ భారముతో ముందుకు సాగేవాడే నిజమైన ప్రవక్త.

బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు తాము జీవించిన కాలము కొరకైన భారాన్ని ప్రభువు నుండి పొందారు. బాప్తిస్మమిచ్చు యోహాను ఒక ప్రవక్త మరియు దేవుని చేత పంపబడిన వ్యక్తి. అతని జీవితాన్ని పరిశీలిస్తే, ఒక నిజమైన ప్రవక్త యొక్క విశిష్ట లక్షణాలను మనము చూడవచ్చు.

అన్నిటికంటే మొదటిగా, యోహానుకు ఒకే ఒక్క వర్తమానం ఉండింది. అది - "మారుమనస్సు పొందుడి, మారుమనస్సు పొందుడి" - దానిని అతడు తీవ్రమైన భారముతో ప్రకటించాడు. యోహాను వర్తమానం సమతుల్యమైన వర్తమానమా? ఎంతమాత్రం కాదు. అతనికి ఉన్నది ఒకే ఒక్క సందేశం: మారుమనస్సు పొందుడి. ప్రతి నిజమైన ప్రవక్తకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన భారం ఉంటుంది - కాబట్టి అతని వర్తమానం ఎన్నడూ లోకం దృష్టిలో సమతుల్యంగా కనిపించదు. బాప్తిస్మమిచ్చు యోహాను దినాలలో "సమతుల్యమైన" సందేశాన్ని ఇచ్చినది ఎవరు? లేఖనాలను లోతుగా అధ్యయనం చేసిన పరిసయ్యులే. వారు తమ సమాజమందిరాలలో ఎంతో "సమతుల్యమైన" వర్తమానాలు బోధించారు, కానీ వారందరూ ఆత్మీయంగా చచ్చినవారు! సమాజమందిరాలలో కూర్చుని ఆ సమతుల్య బోధలను విన్న ప్రజలు కూడా వారితో సమానంగా చచ్చిన స్థితిలోనే ఉండిపోయారు. కానీ దేవుని పట్ల ఆకలి దప్పులు కలిగిన కొందరు మాత్రం దేవుని నిజమైన ప్రవక్తయైన యోహాను యొక్క ఆ తీవ్రమైన వర్తమానాన్ని వినడానికి అరణ్యములోనికి వెళ్లారు. ఆ విధంగా వారు ఆత్మీయ నాశనము నుండి తప్పించబడ్డారు.

యోహానులో మనము చూసే నిజమైన ప్రవక్త యొక్క రెండవ లక్షణం - అతని కఠినమైన భాష. చాలామంది బోధకులు ప్రజలను ఎంతో గౌరవప్రదంగా పలకరిస్తూ తమ ప్రసంగాలను ప్రారంభిస్తారు. కానీ యోహాను తన ప్రసంగాన్ని "సర్పసంతానమా!" అంటూ ప్రారంభించాడు!! అతడు ప్రజలను అలరించడానికి కాక, వారి పాపములను గూర్చి వారిని ఒప్పింపజేయడానికే బోధించాడు.

నిజమైన ప్రవక్త యొక్క మూడవ లక్షణం - అతడు ఎన్నడూ రాజీపడడు. రాజైన హేరోదు యోహాను బోధను వినడానికి ఎంతో ఇష్టపడేవాడు, దానిని ఎంతో మెచ్చుకునేవాడు. ప్రజలు మన బోధను మెచ్చుకుంటున్నప్పుడు, వారి ఆత్మీయ స్థితిని గూర్చిన కఠినమైన నిజాన్ని వారికి చెప్పడం చాలా కష్టం. కానీ యోహాను అలాంటి దాపరికం ఏమీ పెట్టుకోలేదు. అతడు హేరోదు ముఖం మీదే గద్దించి, తన సోదరుని భార్యను పెళ్ళాడటం వ్యభిచారమని నిర్భయంగా చెప్పాడు. యోహాను రాజీపడేవాడు కాడు, మనుష్యులను సంతోషపెట్టేవాడు అసలే కాడు. సత్యము మాట్లాడినందుకే అతడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు తనకు అప్పగించిన వర్తమానానికి అతడు చివరి వరకు నమ్మకంగా నిలిచాడు. ప్రతి నిజమైన ప్రవక్త అలాగే ఉంటాడు.

యోహాను దేవుని వర్తమానము కలిగిన నిజమైన ప్రవక్త అని గుర్తించిన కొద్దిమంది ఇశ్రాయేలీయులు అరణ్యములో అతనితో జతకలిశారు.

మన కాలమును, మనము భాగమైయున్న ఈ ఉద్యమమును (CFC - క్రైస్తవ సహవాస సంఘం) పరిశీలిస్తే, బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యలో మనము చూసిన వాటికి ఎన్నో సారూప్యతలు ఇక్కడ కనిపిస్తాయి.

మొదటిగా, యోహాను వలెనే మనము కూడా ఒకే ఒక ప్రాముఖ్య వర్తమానాన్ని ప్రకటిస్తున్నాము; అదేంటంటే - పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తు సారూప్యములోనికి మార్చబడుట. క్రొత్తవారు మన కూడికలకు వచ్చినప్పుడు, ప్రతి ఆదివారం ఎల్లప్పుడూ ఇదే విషయంపై ఎందుకు ప్రసంగిస్తున్నారని వారిలో కొందరు అడుగుతుంటారు. మనము సమతుల్యమైన సందేశాన్ని ప్రకటించడం లేదని వారు అంటుంటారు! కానీ ఈ కాలంలో తన ప్రజల కొరకు ప్రభువు హృదయంలో ఉన్న ప్రస్తుత భారం అదే. అయితే ఈ కాలానికి ఇది ప్రభువు వర్తమానమని - తన ప్రజల పట్ల ప్రభువుకు ఉన్న ప్రస్తుత భారమని గుర్తించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఆయన ప్రవక్తతో నిలబడటానికి "అరణ్యములోనికి" వెళ్ళడానికి సిద్ధపడే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు?

అంతేకాదు: యోహాను పరిచర్య వలెనే, CFC లో మనము వినే బోధ కూడా ఎంతో సూటిగా, బలంగా మరియు రాజీలేనిదిగా ఉంటుంది.

యోహాను దినాలలో దైవభీతి గల ఆ కొద్దిమంది చేసినట్లుగానే, నేడు కూడా ప్రభువు తన ప్రజలను యేసుతో పాటు శిబిరము వెలుపలికి వచ్చి, ఆయన పొందిన నిందను భరించమని పిలుస్తున్నారు.

ఈ సమయంలో తన ప్రజల పట్ల ప్రభువుకు ఉన్న భారాన్ని మీరు "చూశారా"? అయితే, మీరు ప్రభువు పక్షమున నిలబడతారా - ప్రభువుతో కలిసి నిలుస్తారా? అయితే అందుకు మీరు తగిన వెల చెల్లించాల్సి ఉంటుంది

పక్షుల గుంపు ఆకాశంలో ఎలా ఎగురుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ముందు ఒక పక్షి ఆ గుంపును నడిపిస్తూ వెళ్తుంది - దాని వెనుక మిగిలిన పక్షులన్నీ బాణం ఆకారంలో అనుసరిస్తాయి. ముందున్న పక్షి ఆ గుంపు మొత్తాన్ని నడిపిస్తుంది. ఆ మార్గంలో విద్యుత్తు తీగలు, టవర్లు మరియు ఎన్నో ఇతర అడ్డంకులు ఎదురుకావచ్చు. ముందు వెళ్లే ఆ పక్షే ఈ ప్రమాదాలన్నిటినీ మొదటగా ఎదుర్కొంటుంది. అది వాటన్నిటినీ తప్పించుకుంటూ మార్గాన్ని సుగమం చేస్తుంది. అప్పుడు దాని వెనుక ఉన్న ఇతర పక్షులు సురక్షితంగా అనుసరిస్తాయి - ఆ విధంగా అవి ప్రమాదాల నుండి కాపాడబడతాయి. మన విషయంలో కూడా అంతే - ప్రభువు భారాన్ని మోస్తూ, ఆత్మీయ ప్రయాణంలో ఎదురయ్యే సకల ఆత్మీయ ప్రమాదాల నుండి మనలను తప్పిస్తూ నడిపించే ఒక దైవజనునితో సహవాసము కలిగియుండటం, అతని మాదిరిని అనుసరించడం మనకు దక్కిన గొప్ప ఆధిక్యత.

మన కాలంలో "ఆత్మ యొక్క ప్రస్తుత తరంగముతో" మనము ముందుకు సాగాలని వాచ్‌మన్ నీ ఒకసారి చెప్పారు. మనము మార్టిన్ లూథర్ కాలంలో జీవించి ఉంటే, లూథర్‌తో నిలబడటం సరైనదే. కానీ జాన్ వెస్లీ కాలంలో జీవిస్తూ, మార్టిన్ లూథర్ దేనికోసమైతే నిలబడ్డాడో దానితోనే సరిపెట్టుకోకూడదు. ఎందుకంటే అప్పటికే దేవుడు వెస్లీ ద్వారా సంఘానికి మరిన్ని ఉన్నత సత్యాలను బయలుపరిచారు. అప్పుడు మనము ఆ ఉన్నత సత్యాల కొరకు వెస్లీతో కలిసి నిలబడాలి. లేకపోతే ఆ సమయంలో మనము "ఆత్మ యొక్క నడిపింపుతో" సాగడం లేదని అర్థం.

20వ శతాబ్దపు ప్రారంభంలో, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నొక్కిచెప్పిన పెంతెకొస్తు ఉద్యమము ద్వారా దేవుని ఆత్మ కదలడం ప్రారంభించారు. కానీ ప్రభువు ఆత్మ ఇప్పుడు దేవుని ప్రజలను మరింత ముందుకు - అనగా జయజీవితమునకు మరియు పాపమును జయించుటలోనికి నడిపిస్తున్నారు. కాబట్టి మనమందరము ఆత్మ యొక్క ఈ ప్రస్తుత కదలికతో ముందుకు సాగాలి. ఆత్మ యొక్క ఈ ప్రస్తుత కదలికలో పాలుపంచుకోవాలని తీర్మానించుకున్నవారు దేవుని ప్రవక్తతో నిలబడతారు మరియు ఆదరణ పొందిన "మతపరమైన క్రైస్తవ శిబిరము" వెలుపల ఉండటం ద్వారా వచ్చే నిందను భరించడానికి సిద్ధపడతారు.

గడిచిన తరాలలో దేవుడు నూతన రీతిలో కార్యము చేయడం ప్రారంభించినప్పుడల్లా, తీవ్రమైన విమర్శలతో ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించే ఇతర క్రైస్తవుల నుండి ఎల్లప్పుడూ వ్యతిరేకత ఎదురైంది. దేవుని ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రజలు ఉపయోగించే అత్యంత సాధారణ ఆయుధం - దానిని "దుర్బోధ" అని ముద్రవేయడమే. దురదృష్టవశాత్తూ చాలామంది క్రైస్తవులు ఘోరమైన పాపాలు చేయడానికంటే ఎక్కువగా దుర్బోధలకు భయపడుతుంటారు!! కాబట్టి మన కాలంలోని కొన్ని బైబిలు కళాశాలలు తమ విద్యార్థుల కొరకు "ఒక మతవిభేదం(cult)గా ఉన్న CFC సంఘాలు" అనే అంశాన్ని తమ పాఠ్యాంశాలలో చేర్చాయని విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలగనక్కర్లేదు!!

గత కాలాలలో కూడా క్రైస్తవ ప్రపంచంలో ఒక నిజమైన ప్రవక్త ఉద్భవించి, దేవుని నూతన కార్యమును ప్రారంభించినప్పుడల్లా ఆ ఉద్యమాన్ని ఒక తప్పుడు గుంపుగానే పరిగణించారు. కాబట్టి నేడు కూడా అదే జరగడం చూసినప్పుడు మనము ఆశ్చర్యపోనవసరం లేదు.

క్రీ.శ. 100 ప్రాంతంలో, అపొస్తలుడైన యోహాను దినాలలో క్రైస్తవ విశ్వాసమును గూర్చి రాయబడిన ఒక గ్రంథం, క్రొత్త నిబంధన కాలంలో అబద్ధ ప్రవక్తను గుర్తించడానికి మూడు ముఖ్య లక్షణాలను తెలియజేసింది.

అన్నిటికంటే మొదటిది - ఒక అబద్ధ ప్రవక్త ఎల్లప్పుడూ తన శ్రోతల నుండి తన సొంత ప్రయోజనాల కొరకు డబ్బు అడుగుతాడు. 1, 2 కొరింథీ పత్రికలలో పౌలు సంఘాలలో చందా పోగుచేయడం గురించి మాట్లాడినప్పుడు, అది ఎల్లప్పుడూ ఇతర సంఘాలలోని పేద విశ్వాసుల అవసరాల కొరకే తప్ప ఏనాడూ తన స్వప్రయోజనం కొరకు కాదు. ఎవరూ దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరని ప్రభువైన యేసు స్పష్టంగా సెలవిచ్చారు. ప్రతి క్రైస్తవుడు తాను ఎవరిని సేవించాలో తేల్చుకోవాలి - దేవునినా లేక ధనాన్నా? ఒకరిని పూర్ణహృదయంతో సేవిస్తూ, రెండవదానికి సేవ చేయడం పూర్తిగా మానేయాలి.

భారతదేశంలో క్రైస్తవ బోధకులు నిరంతరం డబ్బు కొరకు చేయిచాస్తూ దేవుని నామానికి ఎంతటి అవమానం తెస్తున్నారో మనందరికీ తెలుసు. సువార్త సేవ పేరుతో ఎంతో సంపదను కూడబెట్టుకున్న బోధకులు ఎందరో ఉన్నారు. లోకంలో ఒక సాధారణ ఉద్యోగం చేస్తే సంపాదించే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వారు దీని ద్వారా సంపాదిస్తున్నారు. అటువంటి బోధకులు ప్రకటించే సువార్తలో ఏదో తీవ్రమైన లోపం ఉందని ఇవన్నీ స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. సర్వలోక చక్రవర్తియైన దేవుని కుమారులుగా తాము భూసంబంధమైన రాజుల వలె విలాసవంతంగా జీవించాలని వారు బోధిస్తుంటారు!! ఆ బోధ భారతదేశంలో క్రీస్తు సాక్ష్యాన్ని నాశనం చేసి, దుర్గంధాన్ని వెదజల్లిన భయంకరమైన మోసం.

ఆ గ్రంథములో చెప్పబడిన రెండవ లక్షణం ఏమిటంటే - (క్రొత్త నిబంధన కాలంలో) ఒక నిజమైన ప్రవక్త ఎల్లప్పుడూ ఒకే చోట స్థిరపడిపోకుండా, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. అయితే అబద్ధ ప్రవక్తలు ఒకే స్థలంలో ఎంతో సుఖంగా స్థిరపడిపోతారు. ఒకసారి ప్రజలు యేసుప్రభువును తమతోనే ఉండిపొమ్మని కోరినప్పుడు, తాను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలసియున్నదని ఆయన సెలవిచ్చారు (లూకా 4:42, 43). యేసు ఎల్లప్పుడూ "మేలుచేయుచు సంచరించెను" అని పేతురు సాక్ష్యమిచ్చాడు (అపొస్తలుల కార్యములు 10:38). ప్రతి నిజమైన ప్రవక్త అలాగే ఉంటాడు. ప్రభువు తనకిచ్చిన భారం అతన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లి ఆ సత్యాన్ని ప్రకటించేలా పురికొల్పుతుంది. అబద్ధ ప్రవక్తకు అటువంటి ఆత్మీయ భారం ఉండదు. అతడు ఒకే చోట స్థిరపడి, లోకం దృష్టిలో గొప్పగా కనిపించే రీతిలో తన పరిచర్య కొరకు భారీ ప్రధాన కార్యాలయాలను నిర్మించుకుంటాడు! కానీ నిజమైన ప్రవక్త... "నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు" అని సెలవిచ్చిన తన ప్రభువును వెంబడిస్తాడు (యోహాను 18:36).

ఆ గ్రంథం బయలుపరచిన మూడవ లక్షణం - అబద్ధ ప్రవక్త యొక్క మాటలకు, చేతలకు; అతని బోధనలకు, అతని జీవన విధానానికి మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది. యేసుప్రభువు జీవితంలో ఆయన మాటలు ఆయన జీవితంతో సంపూర్ణంగా ఏకీభవించాయి - అవి రెండూ కలిసి నడిచాయి. అపొస్తలుల కార్యములు 1:1లో, యేసు మొదట చేసి, ఆ తర్వాతే బోధించాడని మనము చదువుతాము. ఒక నిజమైన ప్రవక్త యొక్క వ్యక్తిగత జీవితమే అతడు ప్రకటించే వర్తమానానికి బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. నిజమైన ప్రవక్త తన జీవితంలో ఏ చిన్న వైఫల్యాన్ని చూసినా ఎంతో వేదన చెందుతాడు. యెషయా ప్రవక్త ఒకసారి ఇలా విలపించాడు: "అయ్యో, నేను అపవిత్రమైన పెదవులుగలవాడను... నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిని" (యెషయా 6:5). పౌలు సైతం... "అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?" అని రోదించాడు (రోమా 7:24). యేసుప్రభువు అడుగుజాడలను అనుసరించే ప్రతి నిజమైన ప్రవక్త, తాను బోధించేదానికి నూటికి నూరు శాతం సరిపోయే జీవితాన్ని కలిగి ఉండాలనే ఆత్మీయ దుఃఖాన్ని, దాహాన్ని తన హృదయంలో కలిగి ఉంటాడు. కానీ అబద్ధ ప్రవక్త తన జీవన విధానం తన బోధకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నప్పటికీ ఏమాత్రం కలవరపడడు. ఒక అబద్ధ ప్రవక్త ఆంతర్యం ఎలా ఉంటుందంటే: "బైబిలు అనేది నేను బోధించడానికి, మీరందరూ ఆచరించడానికి!"

తుదిగా: ఒక ప్రవక్త చివరి వరకు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ, కొంతకాలం గడిచేసరికి అతని ఉద్యమం క్షీణించి, దిగజారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది; ఎందుకంటే ప్రారంభంలో గొప్ప యథార్థతతో ఆ ఉద్యమంలో చేరిన ప్రజలు కాలక్రమేణా రాజీపడటం ప్రారంభిస్తారు. దేవుని ఉద్యమాన్ని నడిపించే ప్రవక్త ఈ ప్రమాదాన్ని గుర్తించి, అటువంటి "దిగజారుడుతనాన్ని" సాధ్యమైనంతవరకు అడ్డుకోవాలనే తీవ్రమైన భారము కలిగి ఉంటాడు. కానీ ఆ పతనమును ఆపడంలో అతడు ఎల్లప్పుడూ విజయం సాధించలేకపోవచ్చు. పౌలుతో కలిసి పనిచేసిన దేమా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని మనము చదువుతాము (2 తిమోతి 4:10). దేమా పౌలును ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకంటే ఆ పరిచర్య ఎంతో పవిత్రంగా కొనసాగాలనే తీవ్రమైన భారం పౌలుకు ఉండింది. రాజీపడే స్వభావమున్న దేమాకు అది మోయలేని భారంగా అనిపించింది. ఆ తర్వాత ఆసియాలోని సంఘాలలో అనేకులు పౌలును విడిచిపెట్టారు (2 తిమోతి 1:15). ఒకప్పుడు ఒక నిజమైన ప్రవక్తతో కలిసి దేవుని ఉద్యమంలో అడుగుపెట్టినవారు ఆ తర్వాత ఎందుకు అతనిని విడిచిపెడతారు? ఎందుకంటే ఆ ప్రవక్త ఏమాత్రం రాజీపడకుండా, ఏ వెల చెల్లించైనా సరే కేవలం దేవుని మాత్రమే సంతోషపెట్టాలని ఆశిస్తాడు తప్ప, తన అనుచరులను గానీ, మరి ఏ మనుష్యుడిని గానీ మెప్పించడానికి ప్రయత్నించడు. ఆ తర్వాత అతని అనుచరులలో చాలామంది తాము కూడా అటువంటి వెల చెల్లించడానికి ఇష్టపడక వెనకడుగు వేస్తారు.

ఒక నిజమైన ప్రవక్త పెద్ద పెద్ద సమూహాలను పోగుచేయాలని ఆరాటపడడు - అలాగే తన బోధలో అందరినీ మెప్పించే రాజకీయ ధోరణిని ఏమాత్రం ప్రదర్శించడు. లోకరీతిగా ఆలోచించేవారే పెద్ద సమూహాలు రావాలని కోరుకుంటారు - తమ గుంపును ఎవరూ విడిచి వెళ్ళకూడదని ఆరాటపడతారు. యేసుప్రభువు ఎన్నడూ అలా ఉండలేదు. తనను విడిచి వెళ్ళిపోవాలని ఆశించేవారు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చని ఆయన స్పష్టంగా చెప్పారు. నిజమైన ప్రవక్త కూడా అదే రీతిగా పనిచేస్తాడు. ఆ ఆత్మీయ ఉద్యమము యొక్క నాణ్యత (ఆత్మీయ ప్రమాణం) ఏమాత్రం దిగజారకూడదనేదే అతని అంతరంగ భారము. అతని రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు - కాబట్టి కాపాడుకోవడానికి అతనికంటూ ఏ స్వంత సామ్రాజ్యమూ లేదు. మన కాలంలోని నిజమైన ప్రవక్తలను గుర్తించడానికి ఇది మరొక స్పష్టమైన గుర్తు.

మనము ఒక నిజమైన ప్రవక్తను చేర్చుకున్నప్పుడల్లా, వాస్తవానికి స్వయంగా యేసుప్రభువునే చేర్చుకుంటున్నామని ఆయన సెలవిచ్చిన మాటను జ్ఞాపకముంచుకోండి. కాబట్టి మన కాలంలో దేవుడు నిలబెట్టిన నిజమైన ప్రవక్తలను గుర్తించి, వారిని పూర్ణహృదయంతో అంగీకరించాలి. అంతేకాదు, నిజమైన ప్రవక్తను చేర్చుకునేవారు ప్రవక్త ఫలమును పొందుతారని యేసుప్రభువు సెలవిచ్చారు (మత్తయి 10:40, 41).

మనకందరికీ ప్రవక్తలుగా ఉండాలనే పిలుపు ఉండకపోవచ్చు. కానీ దేవుని నిజమైన ప్రవక్తను మనము చూసినప్పుడు, మనము అతని పక్షమున నిలబడి, అతనితో కలిసి శిబిరము వెలుపలికి వెళ్లి, క్రీస్తు నిందను మోయడానికి సిద్ధపడాలి. అప్పుడు మనము కూడా ఆ ప్రవక్త పొందే ప్రతిఫలాన్ని పొందుకుంటాము (హెబ్రీ 13:13).

కాబట్టి ఈ సత్యాలను మనము ఎంతో గంభీరంగా పరిగణించి, మన వ్యక్తిగత జీవితాలలో అన్వయించుకుందాము. తద్వారా మనము మోసపోకుండా మనలను మనము కాపాడుకోవడమే కాకుండా, మన చుట్టూ ఉన్న అనేకులను కూడా రక్షించగలుగుతాము.

అలాగు జరుగును గాక. ఆమేన్.

వినుటకు చెవులు గలవాడు వినును గాక.