"మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి(ఒక్క) మాటవలనను జీవించును", కేవలం ఏ ఒక్క మాట ద్వారానో కాదు(మత్తయి 4:4). కాబట్టి, ఒక వాక్యాన్ని మాత్రమే లేఖనములలో నుండి తీసుకుని, దానిని ఇతర వాక్యాలతో పోల్చకుండా చూస్తే, తప్పుడు నిర్ణయాలకు వచ్చి, అసత్యాన్ని నమ్మే పరిస్థితి వస్తుంది. చాలా మంది బోధకులు మిగతా వాక్యాలను పట్టించుకోకుండా, ఒకే వాక్యాన్ని మాత్రమే చూపించి, ప్రజలకు తప్పుడు ఆశలు కలిగించి మోసం చేశారు.
బైబిలు సిద్ధాంతముల పట్ల అనేక అపార్థములు వచనమును వచనముతో పోల్చకపోవుట వలన కలుగుచున్నవి. సాతాను యేసుతో"వ్రాయబడియున్నది" అని ఒక వచనమును ఉదహరించినప్పుడు, యేసు దానికి సమతౌల్యమును చూపిస్తూ"ఈ విధముగా కూడా వ్రాయబడియున్నది" (మత్తయి 4:6,7) అని ప్రత్యుత్తరమిచ్చెను. పక్షులు నేరుగా ఎగురటకై దేవుడు వాటిని రెండు రెక్కలతో సృజించెను. అదే విధముగా బైబిలు సత్యమును కూడ సమతౌల్యముతో గ్రహింపవలెను.
నిత్య భద్రత సిద్ధాంతమును పరిశీలిస్తున్నప్పుడు, దేవుని సార్వభౌమాధికారమును మరియు మనుష్యుని స్వేచ్ఛా సంకల్పమును గూర్చిన ఈ రెండు మహత్తర సత్యముల మధ్య సమతౌల్యమును మనము కనుగొనవలెను.
దేవుడు మనుష్యునికి స్వేచ్ఛా సంకల్పమును అనుగ్రహించెను; తనను ఎంచుకోవాలని ఆయన ఎవరినీ బలవంతపరచడు. అయితే, ఆది కాలము మొదలుకొని ఎవరు తన్ను ఎంచుకొందురు, ఎవరు ఎంచుకొనరు అనేది ఆయనకు పూర్తిగా తెలిసియున్నది. అందుచేతనే, కొందరిని తన పిల్లలుగా ఎన్నుకొనుటలో ఆయన నిర్ణయం, యాదృచ్ఛికమైన ఎంపికమీద కాక, తన ముందస్తు జ్ఞానముపైనే ఆధారపడి యున్నది (1 పేతురు 1:1,2లో స్పష్టముగా తెలియజేయబడినట్లుగా).
దేవుడు గ్రహములను స్వేచ్ఛాసంకల్పము లేకుండనే సృజించెను. కనుక అవి వేల సంవత్సరములనుండి దేవుని నియమములను యథావిధిగా అనుసరించుచున్నప్పటికిని, అవి పరిశుద్ధముగా కానీ, పాపముగా కానీ లేక దేవుని సంతానముగా కాలేవు.
జంతువులను దేవుడు స్వేచ్ఛా సంకల్పముతో సృజించెను. అయితే వాటికి మనస్సాక్షి అనుగ్రహింపబడలేదు. అందుచేత అవి కూడ పరిశుద్ధముగా కానీ, పాపముగా కానీ లేక దేవుని సంతానముగా కాలేవు.
మనుష్యుని సృజించినప్పుడు దేవుడు అతనికి స్వేచ్ఛాసంకల్పమును, మనస్సాక్షిని కూడా అనుగ్రహించెను. అందుచేత మనుష్యుడు పరిశుద్ధునిగా కానీ, పాపిగా కానీ అవుతాడు; మరియు దేవుని సంతానమగుటకు తానే నిర్ణయము తీసుకోగలడు.
దేవుడు మనస్సాక్షిని తొలగించిన యెడల, మనుష్యుడు జంతువులవలె మారి, నైతిక నిర్ణయమును చేయలేని వాడై, పరిశుద్ధునిగా కానీ, పాపిగా కానీ అగుటకు శక్తి లేని వాడగును. దేవుడు స్వేచ్ఛాసంకల్పమును తొలగించినయెడల, మనుష్యుడు యంత్రమువలె మారి, మళ్ళీ పరిశుద్ధునిగా కానీ, పాపిగా కానీ అగుటకు శక్తి లేని వాడగును.
కాబట్టి విశ్వాసులైన తరువాత కూడా దేవుడు మన స్వేచ్ఛాసంకల్పమును ఎప్పటికిని తొలగించడు.
నిత్యభద్రత సిద్ధాంతమును సక్రమముగా అవగాహన చేసికొనుటకై, ఈ సత్యమును మనము గ్రహింపవలెను. విశ్వాసులు దేవుని నుండి ఎట్టి పరిస్థితులలోనూ తొలగిపోలేరని బోధించబడుచున్న ఉపదేశము, విశ్వాసులను స్వేచ్ఛాసంకల్పములేని యంత్రములవలె (మరమనుషుల) తగ్గించుచున్నది.
"దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును" (2 కొరింథీయులకు 9:7) — ఈ వాక్యము సమస్త విషయములలోను వర్తించును, విధేయత విషయములో కూడా వర్తిస్తుంది. ఆయన బలవంతపరచబడిన విధేయతను కోరడు. ఆ కారణముచేతనే ఆయన ఎప్పటికిని మన స్వేచ్ఛాసంకల్పమును తొలగింపడు. మనము క్రీస్తును అనుసరించుటకు ఎన్నుకొనగలము; అంతేకాక, మనకిష్టమైతే తరువాత ఆయనను విడిచిపెట్టుటకు కూడ ఎన్నుకొనగలము.
పాప క్షమాపణ దేవుని అద్భుతమైన, ఉచితమైన వరముగా నున్నది. అయితే దానిని పొందుటకు మనుష్యుడు దానిని స్వీకరించుటకు ఎన్నుకొనవలెను. దేవుడు దానిని ఎవరి మీదనైనను బలవంతపెట్టడు.ఒకవేళ దేవుడు పాప క్షమాపణను జనుల మీద బలవంతంగా పెట్టిన యెడల, లోకములో ఉన్న వారందరును క్షమించ బడి, రక్షింపబడి వుండే వారు.
అదేవిధంగా పరిశుద్ధాత్మతో నింపబడి యుండుటకు ఇదే వర్తించును. దేవుడు విశ్వాసులను తన ఆత్మతో నింపుటకు బలవంతపరచడు. వారు తాము దానిని కోరుకో వలెను (యోహాను 7:37-39లో స్పష్టముగా వ్రాయబడియున్నది).
దేవుని వాగ్దానములు ఎప్పటికీ స్వయముగా వాటంతట అవే నెరవేరవు. దేవుని వాగ్దానములు అన్నియు క్రీస్తునందు అవును అని నిశ్చయించబడి యున్నవి. అయితే మనము వాటిని అనుభవించుటకు, స్వీకరించుటకు మన స్వేచ్ఛా సంకల్పముతో మన "ఆమెన్"ను వాటికి జోడింపవలెను (2 కొరింథీయులకు 1:20 చూడండి).
దీనిని రుజువు చేసే ఉదాహరణ ఇక్కడ ఉన్నది. దేవుడు ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల పెద్దలతో రెండు వాగ్దానములు చేసెను:
వారిని ఐగుప్తులోనుండి తీసుకొని వస్తానని, మరియు వారిని కనాను దేశములోనికి ప్రవేశపెడతానని (నిర్గమకాండము 3:17).
ఈ రెండు వాగ్దానములలో మొదటిది మాత్రమే వారి జీవితంలో నెరవేరెను. ఎందుకంటే వారు మొదటి వాగ్దానమును మాత్రమే విశ్వసించారు; రెండవ వాగ్దానమును విశ్వసించలేదు (సంఖ్యాకాండము 14:22,23).
దేవుని వాగ్దానములు మన జీవితంలో వాటంతట అవే నెరవేరవు. వాటిని పొందుటకు మనము విశ్వసించవలెను. యాకోబు గ్రంధములో చెప్పబడిన ప్రకారము, మనము ఎటువంటి సందేహం లేకుండా విశ్వాసముతో అడుగవలెను. ఎందుకనగా సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అటువంటి వంటి వ్యక్తి ప్రభువు యొద్దనుండి ఏదీ పొందలేడు (యాకోబు 1:6,7).
ఫిలిప్పీయులకు 2:12,13 లో మనకు ఆజ్ఞాపించబడినది:
"భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్య సిద్ధి కలుగజేసుకొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే"
ఇక్కడ మనము చూసే దేమనగా: దేవుడే మొదట మనలో తన చిత్తప్రకారము నడచుకొనుటకై సంకల్పమును, శక్తిని అనుగ్రహించుచున్నాడు. ఇది ఆ సత్యములోని ఒక భాగము. అయితే మనము ఆ రక్షణను"కొనసాగించాలి." ఇది ఆ సత్యములోని మరియొక భాగము. కొందరు క్రైస్తవులు ఒక "రెక్క"ను మాత్రమే ప్రధానముగా ఎత్తిచూపుదురు; మరి కొందరు మరియొక "రెక్క"ను మాత్రమే ప్రాధాన్యముగా పరిగణించుదురు. కానీ సంపూర్ణ సత్యమును పొందుటకై రెండు రెక్కలు అవసరము. ఒకే రెక్కను పట్టుకొనినవాడు ఒకే వృత్తములో తిరుగుతుంటాడు.
పై వాక్యములలో చెప్పబడిన రక్షణను మనము అనుభవించుటకు, దేవుడు మనలో కార్యముచేయుచున్నదానిని మనము కొనసాగించాలి.
దీనికి ఒక నిదర్శనం ఫిలిప్పీయులకు 2:15లో ఉన్నది. — “సణుగులను, సంశయములను మాని సమస్తము చేయుడి" అని చెప్పబడెను. "సమస్త సణుగులనుండి, సమస్త సంశయముల నుండి తాను రక్షింపబడినవాడనని ఎంతమంది విశ్వాసులు సాక్ష్యమివ్వ గలరు? మీరు సాక్ష్యమివ్వగలరా?" ఒకవేళ దానికి సమాధానము"లేదు" అయితే, అది దేవుడు మనలను ఆ పాపములనుండి రక్షించుటలోకార్య సిద్ధి కలుగజేయుట లేదని కాదు, మనము ఆయన ఆత్మతో సహకరింపక, రక్షణను కొనసాగించక పోవుట వలన జరుగుచున్నది. ఫిలిప్పీయులకు 2:15 ప్రకారము, సణుగులను, సంశయములను పూర్తిగా విడచిపెట్టినపుడే, మనము మూర్ఖమైన వక్రజనము మధ్య దేవుని పిల్లలమని రుజువు చేస్తున్నాము. ఆ ప్రమాణము ప్రకారము మీరు మీ చుట్టుపక్కల ఉన్న లోకమునకు దేవుని పిల్లల్లమని రుజువు చేస్తున్నారా?
మరొక విషయమును గమనించండి: ప్రజలు మారుమనస్సు పొందుటకు సామర్ధ్యమును అనుగ్రహించువాడు దేవుడే (అపొస్తలుల కార్యములు 11:18). అయితే దేవుడు సమస్త మానవులు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడు (2 పేతురు 3:9). అందువలన ఆయన అందరికీ మారుమనస్సు అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. అయినప్పటికిని అనేకులు (విశ్వాసులు కూడాను) పరిశుద్ధాత్మ ప్రేరణకు లోబడక మారుమనస్సు పొందకుండా ఉన్నారు.దేవుడు కార్యసిద్ధి కలుగజేసిన దానిని వారు కొనసాగించుట లేదు.
ఇంకొక విషయమును గమనించండి: మనలను రక్షించగలవాడు దేవుడొక్కడే. అయితే ఆయన అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు (1 తిమోతికి 2:4). కానీ ప్రజలు రక్షణ పొందకపోతే, అది దేవుడు వారి జీవితాల్లో పనిచేయాలని ప్రయత్నిస్తున్న దానికి వారు స్పందించకపోవడమే కారణం.వారు దేవుని కృపను నిరాకరిస్తారు. దేవుడు వారి లోపల పనిచేయాలని కోరుకుంటున్నదానిని వారు కొనసాగించుట లేదు.
నిత్యభద్రత గూర్చిన తప్పుడు బోధనలు చాలావరకు"నిత్య జీవము" అనగా ఎప్పటికీ జీవించుట అనే భ్రమ నుండి వచ్చాయి. అయితే"నిత్య జీవము" అనగా అంతము లేని జీవమని కాదు. ఎందుకంటే, నరకమునకు పోవువారు కూడ నిత్యము జీవించుదురు, కాని వారియందునిత్య జీవము ఉండదు. యేసు తానే"నిత్య జీవము అనగా దేవునిని, ఆయన పంపిన యేసు క్రీస్తును తెలిసికొనుటయే" (యోహాను 17:3) అని నిర్వచించెను.ఆది లేని జీవము, అంతము లేని జీవమని అర్థము. ఇది దేవుని జీవమే. ఈ జీవము అనగా దేవుని స్వరూపమే. ఈ దేవుని స్వభావమును మనము క్రీస్తునందు ఇప్పుడు అనుభవించగలము (2 పేతురు 1:4).
ఈ నిత్య జీవము నిజముగా దేవుని ఉచితమైన వరముగా నున్నది (రోమా 6:23). అయినప్పటికిని, దాని ముందు వాక్యము (రోమా 6:22) ప్రకారము దేవుడు ఈ నిత్య జీవమును పాపమునుండి విమోచింపబడి, దేవునికి దాసులగుటకు కోరుకొనే వారికే అనుగ్రహించును. కాబట్టి నిత్య జీవము ఉచితమైన వరముగా నున్నప్పటికిని, దానిని స్వీకరించుటకు షరతులున్నవి.
నిత్య భద్రత అనే విషయములో, క్రింద చెప్పబడిన ఏడు వచనములను పరిశీలించవలెను. [ఈ వచనములను పరిశీలించునపుడు,, మన అభిప్రాయములను విసర్జించవలెను. ఈ వచనములు ఏమి చెప్పవలెనని మనము ముందుగానే అనుకొనుచున్నామో దానిని పక్కనపెట్టి, ఇవి నిజముగా ఏది చెప్పుచున్నవో దానిని వినుటకు మన మనస్సును పూర్తిగా తెరవవలెను. ఎందుకనగా ఇవి దేవుని వాక్యములు. అప్పుడు మనము సత్యమును గ్రహించెదము.]
1. "యోహాను 10:27-29 లో ప్రభువు వాక్యమును మనము పరిశీలించుచు ఉండగా, ఆ వాగ్దానమునకు సంబంధించిన షరతులను గమనించుట అవసరం. ప్రభువు చెప్పినది ఏమనగా, ‘నా గొఱ్ఱెలు నా స్వరము వినును; నేను వాటి నెరుగుదును; అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు; ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి ఎవడును వాటిని అపహరింపలేడు.’"
ఈ వాక్యములలో ఉన్న వాగ్దానమును పరిశీలించినప్పుడు, ఆ వాగ్దానము నెరవేరుటకు కొన్ని షరతులు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
చాలామంది క్రైస్తవులు ఆ షరతులను గమనించరు! అందువల్ల వారు ఒక తప్పుడు బోధను నమ్ముతారు. ఇక్కడ నిత్యభద్రత అనే వాగ్దానము యేసును అంతమువరకు అనుసరించువారికే ఇవ్వబడింది. మీ పేరుపై లేని చెక్కును మీరు నగదుచేయలేరు; అలాగే మీరు షరతులు నెరవేర్చకపోతే వాగ్దానమును కూడా పొందలేరు. మీరు యేసును అనుసరిస్తే, మీకు నిశ్చయంగా నిత్యభద్రత ఉంటుంది. కానీ మీరు ఆయనను అనుసరించకపోతే, మీకు నిత్యభద్రత ఉందని నమ్ముట వంచన మాత్రమే.ఎవరూ మిమ్మల్ని యేసు చేతిలోనుండి అపహరింపలేరు. కానీ మీరు మీ స్వేచ్ఛా సంకల్పం ప్రకారం ఆయన చేతిలో నుండి దూకి బయటకు రావచ్చు ఎందుకంటే దేవుడు మీ స్వేచ్ఛా సంకల్పమును ఎప్పుడూ తీసివేయడు.
2.మత్తయి 24:11-13 అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. అయితే అంతమువరకు సహించిన వాడు రక్షింపబడును.
అంతమువరకు సహించిన వాడు మాత్రమే రక్షింపబడతాడని ఇక్కడ యేసు ప్రభువే స్వయముగా చెప్తున్నాడు. సత్యమును తెలుసుకొనవలెననుకుంటే, మనము యేసు చెప్పిన మాటలను ఆయన చెప్పినట్లుగానే స్వీకరించవలెను.
3. మత్తయి 6:14-15 ప్రకారము: "మీరు మనుష్యుల అపరాధములను క్షమించియుంటే, మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మును క్షమించును. కానీ మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు."
యేసు తన మాటలలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడో గమనించాలి. ఇక్కడ ఆయన"పరలోకపు తండ్రి" అని ఉపయోగించినది, ఆయన అవిశ్వాసులతో కాకుండా దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడని స్పష్టముగా సూచిస్తుంది. నిజానికి ఈ వాక్యములు ఉన్న కొండమీద ప్రసంగము మొత్తం దేవుని పిల్లలకే ఉద్దేశించబడింది. ఇక్కడ యేసు దేవుని పిల్లలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నాడు. అదే ఇతరులను క్షమించకపోతే వారికీ దేవునిచేత క్షమాపణ ఉండదు.
అయితే ఒక "రక్షింపబడ్డ" వ్యక్తి ఇతరులను క్షమించకపోయి, తాను దేవునిచేత క్షమింపబడని స్థితిలోనే మరణిస్తే? అలాంటి వ్యక్తి క్షమింపబడని పాపముతో దేవుని సన్నిధికి ప్రవేశించగలడా? మరణించిన తరువాత పాపములకు క్షమాపణ పొందగలడా? లేదు. మరణానంతరం పాపములకు క్షమాపణ లేదు. కాబట్టి అలాంటి వ్యక్తి నిత్య శాపానికి లోనవుతాడు. అతడు ఒకప్పుడు నిజంగా"రక్షింపబడ్డ" వాడే అయినా, తన రక్షణను కోల్పోయినవాడవుతాడు.
దీనిని యేసు మత్తయి 18:23–35 లో చెప్పిన ఉపమానంలో స్పష్టంగా వివరించాడు. ఒక రాజు తన దాసుని మొత్తం అప్పు క్షమించాడు. కానీ ఆ దాసుడు తన సహదాసుని అప్పును క్షమించలేదు. దాంతో రాజు కోపించి అతని మీద అతని మొత్తం అప్పును తిరిగి మోపి, చెరసాలలో వేయించాడు.యేసు ఆ ఉపమానాన్ని ముగిస్తూ ఇలా అన్నాడు: "మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రి మీకును అట్లే చేయును" (మత్తయి 18:35).
దీని ద్వారా మనకు ఒక అతి ముఖ్యమైన ఆత్మీయ సత్యం స్పష్టమవుతుంది. మన పరలోకపు తండ్రి ఒకప్పుడు క్షమించిన మన పాపములన్నిటిని, మనం ఒక వ్యక్తిని అయినా క్షమించనప్పుడు, తిరిగి మన మీద ఉంచుతాడు. అలాంటి స్థితిలోనే మరణిస్తే, మనం క్షమింపబడని వారమై, నిత్య శిక్షకు లోనవుతాము.
4.రోమా 8:12-13 లో వ్రాయబడినదేమనగా: "సహోదరులారా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారైయుందురు."
ఈ హెచ్చరిక సహోదరులైన విశ్వాసులకు ఇవ్వ బడినది. పరిశుద్ధాత్మ విశ్వాసులకు ఇక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు(ఇక్కడ అస్పష్టత ఏమి లేదు), వారు ఒకప్పుడు జీవింపబడ్డవారై యున్నా శరీరప్రకారముగా జీవించుచుంటే వారు నిశ్చయముగా ఆత్మీయముగా మరణింతురు. అయితే అనేకమంది బోధకులు విశ్వాసులకు, వారు ఎప్పటికిని ఆత్మీయముగా మరణించరని చెప్పుచున్నారు.
దేవుడు ఆదామునకు ఆదికాండము 2:17 లో హెచ్చరించెను, నీవు అవిధేయత చూపినయెడల నిశ్చయముగా చనిపోవుదువు అని (రోమీయులకు 8:13 లో వ్రాయబడియున్నట్లే). కాని సాతాను ఆదికాండము 3:4 లో నీవు నిశ్చయముగా చనిపోవు అని చెప్పెను – ఈనాడు అనేకమంది బోధకులు విశ్వాసులకు చెప్పుచున్నట్లే..
ఏదెనులో యథార్థముగా ఎవరు ఉన్నారు? దేవుడా లేక సాతానా.
ఈనాడు యథార్థముగా ఎవరు చెప్పుచున్నారు ? దేవుడా లేక ఈ తప్పుడు ఉపాధ్యాయులా?
హెబ్రీయులు 3:12-14 ప్రకారం: సహోదరులారా (వీరు పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు వీరి ప్రధానయాజకుడు యేసు అని 1వ వచనంలో వ్రాయబడియున్నది), జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
పరిశుద్ధ సహోదరులు (విశ్వాసులు) కూడా సజీవుడైన దేవుని నుండి తొలగించు విశ్వాసము లేని దుష్ట హృదయమును కలిగి యుండగలరు అని ఇక్కడ మనము చదువుచున్నాము, మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.ఈ మాటలు ఏవిధమైన పూర్వాభిప్రాయములు లేని మనస్సులతో ఉన్నవారికి ఎంతో స్పష్టముగా ఉన్నవి.
హెబ్రీయులు 6:4-6 ప్రకారం: "ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు,తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము.
ఈ వచనములు స్పష్టముగా ఒకప్పుడు పరిశుద్ధాత్మలో భాగస్వాములైన విశ్వాసులనే సూచించుచున్నవి. అలాంటి విశ్వాసులుతప్పిపోగలరని మనకు ఇక్కడ చెప్పబడుచున్నది. అలాగే వారు తమ పాపములో నివసించుచు క్రీస్తును మళ్లీ సిలువవేయుచు ఉన్నంతకాలము వారిని మారుమనస్సు పొందునట్లు మళ్లీ నూతన పరచుట అసాధ్యమని కూడా చెప్పబడుచున్నది. పాపమును తేలికగా తీసుకునే ప్రతి ఒక్కరు క్రీస్తు సిలువను తృణీకరించుచు, ఒక విధముగా క్రీస్తును మళ్లీ సిలువవేయుచున్నారు. ఒక వ్యక్తి పాపమును అలా తేలికగా తీసుకునే మనస్తత్వములో ఉన్నంతకాలము అతడిని మారుమనస్సు పొందునట్లు నూతనపరచలేము. అతడు ఆ స్థితిలోనే నిలిచియుంటే, అతడు నిత్యత్వమునకు నశించును. అయితే అతడు పాపమును తీవ్రముగా తీసుకొనుటకు నిర్ణయించుకొని క్రీస్తును మళ్లీ సిలువవేయుట ఆపిన యెడల, అతనికి నిరీక్షణ యున్నది."
ప్రకటన 3:5 "జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవగ్రంథములోనుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రియెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును."
ఇవి యేసు ఒక సంఘపు దూతతో చెప్పిన మాటలు. ఆ సంఘంలోని విశ్వాసులందరికీ చెప్పబడిన మాటలు. యేసు ఎప్పుడూ వృథా హెచ్చరికలు చేయడు. క్రీస్తు యొక్క ఈ హెచ్చరికను విశాలమైన మనస్సుతో చదివి, నీకు నీవే ప్రశ్నించుకో: మనిషి పేరు జీవగ్రంథములోనుండి తుడిపి వేయబడగలదా? ప్రభువు ఎల్లప్పుడూ సత్యము మాత్రమే మాట్లాడుతాడా? యేసుకి మన కంటె జీవగ్రంథము గురించి బాగా తెలుసును. ఇక్కడ మనం తర్కమును వాడకూడదు; యేసు చెప్పిన మాటలను యథార్థంగా అంగీకరించాలి.
దేవుడు ఆది నుండి అంతమువరకు తెలిసినవాడు. ఆయనకు ఎవరు జయించుదురు, ఎవరు జయించరో తెలుసు. అయినా ఆయన మనుష్యుల భాషలో మాతో మాట్లాడుతున్నాడు. మన పేర్లు జీవగ్రంథములోనుండి తుడిపివేయబడే ప్రమాదాన్ని మనం గ్రహించుటకై.
అంతిమ తీర్పును గూర్చి ఈ విధంగా వ్రాయబడియున్నది:
ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.(ప్రకటన 20:15). దేవుడు తన వాక్యాన్ని తార్కికంగా ఆలోచించే తెలివిగలవారికి, జ్ఞానులకి దాచిపెడతాడు. కానీ పిల్లలవలె నిర్దోషమైన హృదయంతో ఆయన వాక్యాన్ని యథాతథంగా అంగీకరించే వారికి ఆయన ఈ సత్యాలను వెల్లడిస్తాడు.(మత్తయి 11:25).
అనేకులు బైబిల్ దేవుని తప్పులేని వాక్యమని నమ్ముతున్నామని అంటారు. కానీ వారు దానిలో తమకు నచ్చిన వాటిని మాత్రమే నమ్ముతారు, నచ్చని వాటిని తిరస్కరిస్తారు. వారు దేవుని స్పష్టమైన వాక్యాన్ని ఆధారపడకుండా, తమ తప్పులపాలైన మనస్సు చెప్పినదానిని ఆధారంగా తీసుకుంటారు. దీని ద్వారా వారు తమ అహంకారాన్ని మరియు గర్వాన్ని చూపిస్తున్నారు.
ఇవి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు, ఎందుకంటే ఇవి మన శాశ్వత గమ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల మనం మనుషులు నేర్పినదానిని గ్రుడ్డిగా నమ్మి మోసపోవడానికి వీల్లేదు. ఈ చీకటి ప్రపంచంలో మనకు ఉన్న ఏకైక వెలుగు దేవుని వాక్యమే కనుక, మనం దానినే నమ్మాలి.
క్రొత్త నిబంధనలో ఉన్న ఇతర వాక్యాలపై మీరు ఎలాంటి వ్యాఖ్యానాన్ని చేయగలిగినా, పై వాక్యాలలో స్పష్టంగా చెప్పబడిన సత్యాలను అది రద్దు చేయలేదు.
యూదా 24వ వచనంలో, ప్రభువు మనలను తొట్రిల్లకుండా కాపాడగలవాడని ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఇది నిజమే — ప్రభువు మనలను పడిపోకుండా కాపాడగల శక్తివంతుడే. కానీ మనం పూర్తిగా ఆయనకు లోబడి జీవించకపోతే, ఆయన మనలను కాపాడలేరు. ఎందుకంటే ఆయన తన చిత్తాన్ని ఎవరి మీదనూ బలవంతంగా విధించడు. అందుకే, ఆ వచనానికి మూడు వచనాలు ముందు, యూదా 21వ వచనంలో ఇలా చెప్పబడింది:"దేవుని ప్రేమలో నిలుచునట్లు మీరే కాచుకొనియుండుడి. మనం ఆయన ప్రేమలో నిలిచినప్పుడు, ఆయన మనలను అంతము వరకు కాపాడతాడు. ఇది ప్రభువుపై మాత్రమే ఆధారపడిన ఏక పక్ష వ్యవహారం కాదు — ఇందులో మన పాత్ర కూడా ఉంది.
విశ్వాసులుగా, మన సంబంధం క్రీస్తుతో నిశ్చితార్థమైన కన్యక వివాహం కోసం ఎదురుచూస్తున్నట్లు గా పోల్చబడింది — (2 కొరింథీయులకు 11:2; ప్రకటన గ్రంథం 19:7). తరువాతి వాక్యంలో (2 కొరింథీయులకు 11:3), పౌలు ఇలా అంటాడు: సాతాను హవ్వను మోసగించినట్లే, మనలను కూడా మోసగించి క్రీస్తు పట్ల ఉన్న సరళమైన భక్తి నుండి దూరం చేయవచ్చునని భయపడుతున్నాను. హవ్వ పరదైసులో ఉండి, సాతాను చేత మోసపోయింది — దాంతో దేవుడు పరదైసు నుండి బయటకు పంపాడు. నేడు, మనం క్రీస్తుతో నిశ్చితార్థమైనవారిగా పరదైసు వైపు ప్రయాణిస్తున్నాం. కానీ మనం సాతాను మనలను మోసగించుటకు అనుమతిస్తే, మనం పరదైసులోకి ప్రవేశించలేము.
దేవునితో నిశ్చితార్థమైన కన్యక అయిన సంఘం, ఈ లోకంతో మరియు పాపంతో వ్యభిచారంలో పడితే, ఆమెను పెండ్లి చేసుకోవడానికి ఆమె వరుడు నిరాకరిస్తాడు. ఇదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం లో"బబులోను" అని పిలువబడిన వేశ్య సంఘం — చివరకు ప్రభువు చేత తిరస్కరించబడుతుంది.
మీరు ప్రభువును ప్రేమిస్తే, ఆయన కొరకు మిమ్మును మీరే పవిత్రంగా కాపాడుకుంటారు — చుట్టూ ఉన్న ఇతర విశ్వాసులు లోకంతో మరియు పాపంతో వ్యభిచారంలో పడుతున్నా కూడా. యేసు హెచ్చరించినట్లు, చివరి దినాలలో"అనేకుల ప్రేమ చల్లారిపోతుంది." (ఈ వాక్యం విశ్వాసుల గురించి మాత్రమే చెప్పబడింది, ఎందుకంటే ప్రభువును ప్రేమించేవారు వీరే). కానీ అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు (మత్తయి 24:11,13).
సాతాను మనందరిని మోసగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ బైబిల్ హెచ్చరిస్తున్నది — మనం రక్షణ పొందుటకు సత్యవిషయమైన ప్రేమను స్వీకరించకపోతే, దేవుడు మనలను మోసపోవడానికి అనుమతిస్తాడు, తద్వారా మనం అబద్ధాన్ని నమ్ముతాము (థెస్సలొనీకయులకు 2:10,11). మనము దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యాన్ని అంగీకరిస్తే, పరిశుద్ధాత్మ మన జీవితంలోని పాపాలను చూపినప్పుడు వాటిని నిజంగా ఎదుర్కొంటే, అలాగే ఆ పాపాలన్నిటి నుండి రక్షించబడేందుకు మనము ఆసక్తి కలిగి యున్నట్లైతే, అప్పుడు మనం ఎప్పటికీ మోసపోము.
కానీ మనము దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడినదాన్ని అంగీకరించకపోతే, లేదా పాపం నుండి రక్షించబడాలని మన హృదయంలో కోరిక లేకపోతే, అప్పుడు దేవుడు మనలను మోసపోవడానికి, అబద్ధాన్ని నమ్మడానికి అనుమతిస్తాడు — ఇది నిత్యా భద్రత విషయములో మాత్రమే కాక, ఇతర విషయాలలో కూడా జరుగుతుంది.
ఈ సంగతుల సారాంశము:
మనము ప్రభువును ప్రేమించుచున్నాము, ఎందుకంటే ఆయన ముందుగా మనలను ప్రేమించాడు మరియు మన పాపములన్నిటిని క్షమించాడు. కాబట్టి, ఆయన కృపవలన, మన మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్మలముగా ఉంచుకుంటూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను అనుసరిస్తూ చివరి వరకు నడుస్తాము. అందువల్ల మనము నిత్య భద్రతను కలిగి యున్నాము.
యేసును వెంబడిస్తున్న ప్రతి శిష్యుడునిత్య భద్రతలో ఉన్నవాడే.
"తాను నిలుచున్నానని తలంచుకొనువాడు జాగ్రత్తగా చూచుకొనవలెను" (1 కొరింథీ 10:12).
"వినుటకు చెవులు గలవాడు వినునుగాక."