హృదయరహస్యములు బయలుపరచబడును

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   Religious or Spiritual
Article Body: 

సుమెయోను ప్రభువైనయేసు గురించి ఇలా ప్రవచించాడు, "అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు" (లూకా 2:34).

ప్రభువైనయేసు ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని ప్రకటించినప్పుడు, అప్పటి ప్రజలు వారి క్రియలు మరియు మాటలను బట్టి, వారి అంతరంగములోని భ్రష్టత్వమును చూడలేక వారు ఆయనను విమర్శించి ఎదుర్కొన్నారు. ప్రభువైనయేసు వారి మధ్యలోనికి వచ్చియుండలేనట్లయితే వారు ఆ భ్రష్టత్వమును చూడగలిగియుండే వారు కాదు.

కపర్నహూములోని ఒక సమాజమందిరములో ప్రభువైనయేసు బోధించుచున్నప్పుడు అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు కేకలు వేశాడు. సమాజమందిరములో పరిసయ్యులు బోధించిన సంవత్సరాలన్నిటిలో అతనిలో ఉన్న అపవిత్రాత్మ మౌనముగా ఉండుట వలన అతడు సమాధానముగా ఉన్నాడు. కాని ప్రభువైనయేసు వచ్చి ప్రకటించిన వెంటనే అతని అంతరంగస్థితి బయలుపరచబడింది.

ప్రజల మధ్యలోనికి ప్రభువైనయేసు వచ్చినప్పుడెల్లను వారి యొక్క అంతరంగస్థితి మరియు వారి హృదయములో ఉన్న వైఖరి బయలుపరచబడును.

ప్రజల దృష్టిలో ఆ సమాజమందిరములో ఉన్న మత నాయకులందరు పరిశుద్ధులుగా కనబడేవారు. కాని ప్రభువైనయేసు వారి మధ్యలోనికి వచ్చినప్పుడు, వారి బాహ్యప్రవర్తన అంతయి చింపివేయబడి మరియు వారు వేషధారులనియు మరియు మోసగాళ్ళనియు బయలుపరచబడేవారు.

ఒకసారి ప్రభువైనయేసు వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టాలని కోరిన పరిసయ్యుల మధ్యకు వచ్చినప్పుడు వారి హృదయాంతరంగములో ఉన్న వైఖరి బయలుపరచబడింది (యోహాను 8:3-11). ప్రభువైనయేసును నిందించుటకు కారణము వెదకుచుండిరి (యోహాను 8:6). కాని మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమని ప్రభువైనయేసు చెప్పాడు. వెంటనే వారి హృదయస్థితి బయలుపరచబడింది. మరియు చిన్నవారు మొదలుకొని పెద్దవారివరకు వారందరు వెళ్ళిపోయారు!!. ఎల్లప్పుడు పెద్దవారైన పరిసయ్యులు ఎక్కువ వేషధారులైయున్నారు!!.

ప్రభువైనయేసు వారి మధ్యకు వచ్చిన వెంటనే ఆమెను నిందించిన వారి హృదయములోఉన్న దుష్టత్వాన్ని ఆ స్త్రీయొక్క పాపము ద్వారా దేవుడు బయలుపరిచాడు.

ఈనాడు ప్రభువైనయేసు మన హృదయములతో చెప్పుచున్నది మనము శ్రద్ధగా విననియెడల అనగా, "తీర్పు తీర్చకుడి", "మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయవలెను", మనం కూడా చివరికి పరిసయ్యుల వలె అవుతాము. మరియు పభువైన యేసు సన్నిధినుండి నిత్యత్వానికి వెళ్ళగొట్టబడుతాము. కాబట్టి ఎల్లప్పుడు తీర్పు తీర్చుట దేవునికి విడిచిపెట్టుట మంచిది - ఎందుకనగా ఆయనే నిజమైన తీర్పరి.

పిలాతు ఎవరికి భయపడని మరియు ఎవరి అభిప్రాయములను లెక్కచేయని పరిపాలకునిగా ఉన్నాడు కాని ప్రభువైనయేసు అతని యెదుట మాట్లాడినప్పుడు అతని యొక్క నిజస్థితి బయలుపరచబడింది. ప్రభువైనయేసు నిర్ధోషి అని అతనికి తెలిసినప్పటికిని, సిలువవేయుటకు ఆయనను ప్రజలకు అప్పగించాడు. ఆ విధంగా పిలాతు కూడా ప్రజల అభిప్రాయాలకు భయపడేవానిగా ఉన్నట్లుగా బయలుపరచబడ్డాడు.

కాబట్టి ఈ విషయాలన్నిటిలో పైనున్న సుమెయోను యొక్క ప్రవచనముల నెరవేర్పుగా ప్రజలు వారియొక్క అంతరంగస్థితి బయలుపరచబడినప్పుడు వారు ప్రభువైనయేసును వ్యతిరేకించారు.

ఈనాడు క్రీస్తు శరీరములోని అవయవములుగా ప్రభువైనయేసు యొక్క పరిచారకులవలె ఈ పరిచర్యను కొనసాగించాలి.

ప్రభువైనయేసు ప్రకటించిన ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితాన్ని నామాకార్థ క్రైస్తవులకు మనం ప్రకటించినప్పుడు వారి హృదయ రహస్యములు బయలుపరచబడుతున్నవని వారు గుర్తించక వారు మనలను విమర్శిస్తున్నారు. మనం వారి మధ్య క్రొత్త నిబంధన స్థాయిని ప్రకటించనట్లయితే ఇది జరిగియుండేది కాదు.

ఒక ఉదహరణ: ప్రభువైనయేసుకాని అపోస్తలులుకాని ధనం విషయంలో మనకు మాదిరిగా ఉన్నారు. వారు పరలోక హుందాతనం కలిగి వారి వ్యక్తిగత మరియు పరిచర్య యొక్క అవసరం కొరకు ఒక్కసారి కూడా డబ్బును అడుగలేదు. బీదలకు సహయం చేయమని మాత్రమే విశ్వాసులను అడిగియున్నారు.

నామకార్థ బోధకులు మరియు పాస్టర్లు దేవుని వాక్యమును విని ఇలా ప్రశ్నించి మరియు పాత నిబంధనలోని లేవియుల గురించి చెపుతారు. ఆ విధంగా వారియొక్క హృదయ రహస్యములు బయలుపరచబడును: 1) సిరి విషయంలో క్రొత్త నిబంధన స్థాయికి వారి తృణీకారం. 2) దేవుడు వారి అవసరాలు తీరుస్థాడనే విశ్వాసం లేకపోవడం. 3) పాతనిబంధన కొట్టి వేయబడిందనియు మరియు ఇప్పుడు ప్రభువైనయేసు మరియు అపోస్తలులే మనకు మాదిరిలనియు మరియు లేవీయులు మనకు మాదిరి కాదనే విషయం వారు నిర్లక్షం చేస్తున్నారు. (హెబ్రీ 8:7-13, 1 కొరంథి 11:1, ఫిలిప్పీ 3:17).

ఇది ఒక ఉదాహరణ మత్రమే, ఇంకా అనేకమున్నవి. కాబట్టి ప్రభువైనయేసును వ్యతిరేకించినట్లే, మతనాయకులు మరియు బోధకులు మనలను వ్యతిరేకించినట్లయితే మనం ఆశ్చర్యపడనవసరం లేదు. 20 శతాబ్ధాల క్రితం క్రీస్తుయేసు శరీరం చేసిన పరిచర్యనే మనం కొనసాగిస్తున్నాము. మరియు ఫలితం కూడా అలాగే ఉంటుంది: వారి హృదయరహస్యములు బయలుపరచబడునట్లు మన వర్తమానమును ప్రజలు వ్యతిరేకించుటను దేవుడు వాడుకుంటాడు. కొన్నిసార్లు ప్రజలయొక్క శ్రమ ద్వారా కూడా ఇతరుల యొక్క హృదయాంతరంగ స్థితిని బయలుపరచుటకు వాడుకుంటాడు.

ప్రభువైనయేసు సిలువ మీద వేలాడుతూ శ్రమపడినప్పుడు అనేకుల హృదయరహస్యములు బయలుపరచబడియున్నవి. ప్రక్కగుండా వెళ్ళేవారు హస్యముచేసినప్పుడు వారి హృదయరహస్యములు బయలుపరచబడియున్నవి. మరొక వైపున, ప్రభువైనయేసు దేవుని కుమారుడని ప్రకటించిన రోమా సైనికుని యదార్థత బయలుపరచబడింది. సిలువమీద ఒక దొంగయొక్క హృదయం చెడిపోయినట్లు బయలుపరచబడింది. మరియు అతడు నరకానికి వెళ్ళాడు, సిలువ మీద మరియొక దొంగ మారుమనస్సుపొంది పరదైసులోనికి ప్రవేశించాడు.

మార్కు 3:2లో, ఒక రోజు ప్రభువైనయేసు సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, ఆయనను నిందించుటకు కారణము వెదకుటకు ఆయన శత్రువులు ఆయనను సన్నిహితముగా గమనించారు. ఈనాటి పరిసయ్యులు కూడా విమర్శించుటకు యదార్థవంతులైన విశ్వాసుల జీవితాలను చాలా దగ్గరగా ఉండి గమనిస్తారు.

ఒక వ్యక్తిమీద నీకు ఎంత కోపముండినట్లయితే లేక ఎంత అసూయ ఉన్నట్లయితే వారి పొరపాట్లను కనుగొనుటకు వారి జీవితాలను అంత దగ్గరగా గమనిస్తావు. వారి వ్యక్తిగత జీవితాలలోగాని కుటుంబ జీవితాలలోగాని లేక వారి ఇంటిలోగాని అందరివలెనే కొన్ని పొరపాట్లు జరుగవచ్చు. వారిని తీర్పు తీర్చేవారిలో దుష్టత్వాన్ని బయలుపరచుటకు దేవుడు వారి సేవకులలో ఉన్న ఈ పొరపాట్లను ఉపయోగిస్తాడు.

ప్రభువు ఇట్లనుచున్నాడు, "నా జనులు దుష్టులైయుండి పక్షులను పట్టుకొనే వేటగాండ్లవలె పొంచియుంటారు, వారి గృహములు చెడుతో నిండియున్నవి..... ఏమి జరుగనట్లుగా నేను కుర్చుండియుండగలనా? (యిర్మీయా 5:26-లివింగ్ బైబిలు).

ఒకసారి పరిసయ్యులు, "ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపి ఆయనను అరెస్టు చేయవలెనని, ఆయన నోటనుండి ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాలా సంగతుల గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి (లూకా 11:54-లివింగ్ బైబిల్). మరొకసారి "ఆయనతో మాట్లాడి ఆయనను పట్టుకొనుటకు వారు ఇతర మతనాయకులను ఆయన యొద్దకు పంపించారు (మార్కు 12:13-లివింగ్ బైబిల్). ఈనాడు కూడా వారిని పట్టుకొనుటకు దేవుని సేవకులను అనేక ప్రశ్నలడిగే పరిసయ్యులను క్రైస్తవ్యంలో చాలా ఎక్కువగా కనుగొనగలము. కాబట్టి మనము "పాములవలె వివేకులును, పావురములవలె నిష్కపటులవలె ఉండాలి" (మత్తయి 10:16).

"ఇతర విశ్వాసులను దగ్గరగా గమనించుటయే అతి త్వరగా పరిసయ్యులగుటకు మార్గమైయున్నది". నీవు పరిసయ్యుడవు కాకుండుటకు కోరుకొనిట్లయితే ఇటువంటి అలవాటును పూర్తిగా మానివేయాలి. ఎందుకనగా అది ఇతరులకు సహయపడుటకు కాక వారి పొరపాట్లను కనుక్కొవాలనే దురుద్ధేశముతో చేస్తారు.

పరిసయ్యతత్వానికి విరుగుడు కనికరమైయున్నది. కాబట్టి దేవుడు నీ యెడల కనికరముగల వాడైయున్నట్లు నీవును ఇతరుల యెడల కనికరము గలవాడవైయుండుము.

ప్రభువైనయేసు ఈ భూమిమీద నడచినప్పుడు, ఆయన తన జీవితము ద్వారా దేవునియొక్క ప్రేమను, కనికరమును మరియు భయమును బయలుపరిచాడు.

ఈనాడు మనము కూడా అటువంటి ప్రేమను కనికరమును భయాన్ని మన జీవితముల ద్వారా బయలుపరచుటకు మనము పరిశుద్ధాత్మతో (క్రీస్తుయొక్క ఆత్మతో) నింపబడవచ్చును (రోమా 5:5).

ఆ విధముగా మనలో జరుగునుగాక ఆమెన్.