WFTW Body: 

క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను" (ఎఫెసీ 5:25). సంఘమును కట్టుటకు, యేసు సంఘమును ఏ విధముగా ప్రేమించాడో అదేవిధముగా మనము ప్రేమించవలసి ఉన్నది. మన డబ్బును లేక మన సమయమును ఇచ్చినచో సరిపోదు. దాని కొరకు మనలను మనమే ఇచ్చుకొనవలెను.

మానవునియెడల తన ప్రేమను దేవుడు వివరించాలనుకున్నప్పుడు, భూమిమీద ఒకే ఒక ఉదాహరణ చెప్పెను- చంటిబిడ్డయెడల తల్లికున్న ప్రేమ (యెషయా 49:15). నీవు ఒక తల్లిని గమనించినట్లయితే, చంటిబిడ్డయెడల తల్లిప్రేమ పూర్తిగా త్యాగముతో నిండియుండును. ఉదయము మొదలుకొని రాత్రి వరకు మరియు రాత్రి అంతయు తల్లి బిడ్డకొరకు త్యాగములు చేస్తూ, చేస్తూ, చేస్తూనే ఉండును. త్యాగమునకు బదులు తిరిగి ఆమె ఏదియు పొందుకొనదు. ఎటువంటి ప్రతిఫలమును కోరక సంవత్సరము తరువాత సంవత్సరము సంతోషముతో ఆ బిడ్డ కొరకు బాధను మరియు ఇబ్బందులను భరించును. దేవుడుకూడా అదేవిధముగా మనలను ప్రేమించుచున్నాడు. అదే స్వభావమును మనలో కలుగజేయవలనని ఆయన కోరుచున్నాడు. కాని ఆవిధముగా యధార్ధముగా ఒకరినొకరు ప్రేమించుకొనే సహవాసము(సంఘము)ను ఈ లోకములో కనుగొనుట అసాధ్యము. వారితో ఏకీభవించి మరియు వారి గుంపులో చేరేవారిని ప్రేమించుట మాత్రమే అనేక విశ్వాసులకు తెలియును. అది కేవలము మానవ ప్రేమ మాత్రమే మరియు త్యాగముతో కూడిన తల్లుల ప్రేమకు ఆ మానవ ప్రేమ ఎంతో దూరముగా ఉన్నది. అయినను దైవికమైన ప్రేమను పొందటయే గురిగా మనము ప్రయత్నించవలెను.

ఒక తల్లి తన చుట్టుప్రక్కల ఉన్న వారు తమ బిడ్డలకు ఏదైన త్యాగము చేయుచున్నారా లేదా అనునది ఆమె లెక్కచేయదు. తనంతటతానే సంతోషముగా అంతయు త్యాగము చేయును. అదేవిధముగా సంఘమును తన స్వంత బిడ్డగా చూచిన వ్యక్తి, తన చుట్టు ప్రక్కల ఉన్నవారు సంఘమునకు త్యాగము చేయుచున్నారా లేదా అనునది లెక్కచేయడు. తనకుతానుగా సంతోషముగా త్యాగము చేయును మరియు తనకు ఎవరి మీద ఫిర్యాదు లేక ఎటువంటి డిమాండ్ ఉండదు. సంఘమునకు ఇతరులు త్యాగము చేయుట లేదని ఫిర్యాదు చేసెడివారు తల్లులు కాదు కాని జీతమునకు పనిచేయు నర్సులవలె ఉందురు. అటువంటి నర్సులు 8 గంటలు పని చేసిన తరువాత, తరువాత షిప్టు (8 గంటలు) పనిచేయు నర్సు, సమయానికి రానియెడల ఫిర్యాదు చేసెదరు.

కాని ఒక తల్లి ప్రతి రోజు 8 గంటలు (షిప్టు) మాత్రమే పని చేయదు. ఆమె ప్రతి రోజు 24 గంటలు పనిచేయును ఆ విధముగా అనేక సంవత్సరములు పనిచేయును. దానికి ప్రతిఫలముగా ఏమియు పొందదు. ఆమె బిడ్డకు 20 సంవత్సరములు వచ్చినను, ఆమె పని పూర్తి కాదు. తల్లులు మాత్రమే ప్రతి రోజు తమ బిడ్డలకు ఇచ్చుటకు పాలు కలిగియుందురు. వారు చూచుచున్న బిడ్డలకు నర్సులు పాలను తయారు చేయలేరు. అదేవిధముగా, సంఘములో తల్లుల వంటి వారికే ప్రతి కూటములో వారి ఆత్మీయబిడ్డలకు ఇచ్చుటకు వాక్యము కలిగియుందురు. అనేకమంది పెద్దలకు సంఘమునకిచ్చుటకు వాక్యములేదు ఏందుకనగా వారు తల్లులు కాదు కాని నర్సులు మాత్రమే.

ఒకతల్లి తన బిడ్డలనుండి జీతమును కోరదు. తల్లి చేసిన సేవకు ఏ బిడ్డకూడ జీతము ఇవ్వడు. నిజానికి, నర్సులకు వలె తల్లికి గంటకు 20 రూపాయలు చొప్పున లెక్కించినచో, బిడ్డకు 20 సంవత్సరముల వయస్సు వచ్చునప్పటికి ప్రతి బిడ్డ తల్లికి 30 లక్షల రూపాయలు చెల్లించవలసియుండును. ఏ బిడ్డయైన తన తల్లికి అంత సొమ్ము చెల్లించగలడా?

ఇప్పుడు ప్రశ్న ఏమిటనగా రోజు తరువాత రోజు, సంవత్సరము తరువాత సంవత్సరము యేసు ప్రభువు మరలా వచ్చువరకు జీతము తీసికొనకుండా తననుతానే ఇచ్చుకొనుచు, ప్రభువు కొరకు మరియు ఆయన సంఘము కొరకు పని(పరిచర్య) చేయువారెవరైనా ఉన్నారా? త్యాగము చేసే ఆత్మ లేకుండా ప్రభువును సేవించుటకు ప్రయత్నించే 10,000 మంది అర్థ హృదయముతో ఉన్న విశ్వాసులకంటే, త్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్న ఒక్క వ్యక్తిని దేవుడు ఎక్కడైనను కనుగొనినచో, తన సంఘమును కట్టుటకు ఆ వ్యక్తిని దేవుడు వాడుకొనును.

యేసు భూమిమీదకు తిరిగి వచ్చినప్పుడు, నీవు ఆయనముందు నిలబడినప్పుడు, నీవు జీవించిన విధానము గురించి నీవు చింతించుదువా లేక దేవుని రాజ్యము కొరకు ఉపయోగకరముగా గడిపిన జీవితమును నీవు వెనుకకు తిరిగి చూడగలవా? అనేకులు కొట్టుకొనిపోవుచు భూమి మీద తమ జీవితములను వృథా చేయుచున్నారు. ఆలస్యము కాకముందే మేల్కొని, ఆయన మార్గము త్యాగముతో కూడిన మార్గమని చూపించమని దేవుణ్ణి అడుగుము. వినుటకు చెవులు గలవాడు వినును గాక.