మనం దైవజనులను అనుసరించాలా లేక యేసును మాత్రమే అనుసరించాలా?

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
Article Body: 

పాతనిబంధనలో, ఇశ్రాయేలీయులు మోషే మరియు ప్రవక్తల ద్వారా దేవుడు వారికి ఇచ్చిన 'వ్రాయబడిన వాక్యాన్ని' మాత్రమే అనుసరించగలిగారు. గొప్ప ప్రవక్తలైన మోషే, ఏలియా, బాప్తిస్మమిచ్చు యోహాను సహితం "నన్ను వెంబడించుడి" అని చెప్పలేకపోయారు. దేవుని వాక్యం మాత్రమే వారి త్రోవలకు వెలుగుగా ఉండెను (కీర్తనలు 119:105).

కాని యేసుప్రభువు వచ్చి క్రొత్తనిబంధనను ఆరంభించాడు. ఆయన కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే కాక, మనం వెంబడించుటకు తన స్వంత జీవితం ద్వారా ఒక మాదిరిని కూడా ఇచ్చాడు. "నన్ను వెంబడించుడి" అని బైబిల్లో చెప్పిన మొదటి వ్యక్తి ఆయనే (మత్తయి 4:19; యోహాను 21:19; లూకా 9:23). మనకు ఇప్పుడు క్రొతనిబంధనలో, 'వ్రాయబడిన వాక్యం' మరియు 'యేసులో శరీరధారియైన వాక్యం' రెండూ ఉన్నవి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనను నడిపించుటకు మానవ జీవితంలో కనిపించే వ్రాయబడిన వాక్యం.

పరిసయ్యులు కేవలం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఆయన దగ్గరకు రానందుకు ప్రభువు వారిని గద్దించాడు: "లేఖనాల్లో మీకు నిత్యజీవం ఉందనుకొని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు" (యోహాను 5:39,40).

ఇప్పుడు యేసుప్రభువు జీవితం మన మార్గాలకు వెలుగై ఉన్నది (యోహాను 1:4) - కేవలం వ్రాయబడిన వాక్యం మాత్రమే కాదు. మనం ఏదైనా విషయంలో స్పష్టమైన జవాబును కనుగొనలేకపోతే (పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలకు బయలుపరచిన) యేసు జీవితాన్ని చూడవచ్చు - మనం ఎల్లప్పుడు సమాధానాన్ని కనుగొంటాము.

ఇంకా ముందుకు చూచినట్లయితే: క్రొత్తనిబంధనలో "నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి" అని చెప్పుటకు పరిశుద్ధాత్ముడు పౌలును ప్రేరేపించాడు. పరిశుద్ధాత్ముడు, పౌలు ద్వారా ఆ మాటను మూడు సార్లు చెప్పించుట ద్వారా క్రీస్తు అడుగుజాడలలో నడచిన నిజమైన దైవజనుల మాదిరిని మనం వెంబడించాలని నొక్కి చెప్పుచున్నాడు (1కొరింథీ 4:16; 11:1, ఫిలిప్పీ 3:17).

ఒక నిజమైన క్రొత్తనిబంధన సేవకుడు వ్రాయబడిన దేవుని ప్రమాణాలను ప్రకటించుట మాత్రమే కాక, "నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి" అని చెప్పును.

కొందరు క్రైస్తవులు, "మనం ఏ మనిషిని వెంబడించకుడదు. కేవలం యేసుని మాత్రమే వెంబడించవలెను" అని చెప్పుదురు. అది ఒక ఆత్మీయమైన మాటగా కనబడును. కాని అది దేవుని వాక్యమునకు విరుద్ధం. ఎందుకనగా, మనం చూచినట్లు, పౌలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి తనను వెంబడించమని చెప్పెను.

కొరింథీలోని క్రైస్తవులకు పౌలు తనను వెంబడించమని మరియు అనుకరించమని చెప్పుటకు కారణం - అతడు వారికి ఆత్మీయ తండ్రియై ఉండెను. పౌలు, "క్రీస్తులో మీకు బోధకులు పదివేల మంది ఉన్నా, అనేకమంది తండ్రులు లేరు. క్రీసుయేసులో సువార్త ద్వారా నేను మిమ్ముల్ని కన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్ముల్ని వేడుకుంటున్నాను" (1కొరింథీ 4:15,16). ఒకరు బైబిలు బోధకుని అనుసరించలేరు - ఎందుకంటే అతని బోధ మంచిగా మరియు సరిగా ఉన్నప్పటికిని, అతని జీవితము ద్వారా అతను సరియైన మాదిరిని కనుపరచకపోవచ్చు. పై వచనం ప్రకారం, క్రైస్తవులకు పదివేల మంది బైబిలు బోధకుల కంటే ఒక ఆత్మీయ తండ్రి ఉండుట ఎంతో శ్రేష్ఠం.

తనవలె క్రీస్తు మాదిరిని వెంబడించు ఇతర దైవజనులను కూడా వెంబడించమని పౌలు క్రైస్తవులను కోరాడు. "మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మా మాదిరిని వెంబడించు వారినుండి నేర్చుకొనండి" అని చెప్పాడు (ఫిలిప్పీ 3:17 ఆంగ్ల లివింగ్ తర్జుమా).

మన నాయకులకు లోబడాలని మరియు వారి మాదిరిని వెంబడించాలని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది.

"మీ నాయకులకు విధేయులుగా ఉండండి. వారికి లోబడి ఉండండి" (హెబ్రీ 13:17).

"మీకు దేవుని మాటలు చెప్పిన వారిని మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి" (హెబ్రీ 13:7).

మనం ఒక వ్యక్తియొక్క పరిచర్యను అనుసరించడానికి పిలవబడలేదు, ఎందుకంటే దేవుడు తన ప్రతి బిడ్డకు ఇతరులకు లేని ప్రత్యేకమైన పరిచర్యను ఇస్తాడు. మన మానవ శరీరానికి ఉన్నట్లే క్రీస్తు శరీరంలో కూడా వేర్వేరు విధులు ఉండే అవయవములు ఉండును. తనను వెంబడించమని యేసు ప్రజలను పిలిచినప్పుడు, వారు అద్భుతాలు చేయాలని లేదా తాను చేసినట్లు బోధించాలని కూడా ఆయన ఆశించలేదు. అది ఆయన పరిచర్య. ఆయన ప్రజలను పిలిచినప్పుడు, వారు తన జీవితం యొక్క మాదిరిని అనగా ఆయన ఏ ప్రమాణాలతో జీవించాడో ఆ ప్రమాణాలతో వారు జీవించుటకు పిలిచాడు. అదేవిధంగా పౌలు, తాను క్రీస్తును వెంబడించినట్లు తనను వెంబడించమని చెప్పినప్పుడు, వారిని అపోస్తలులుగా ఉండమని లేదా రోగులను స్వస్థపరచమని చెప్పలేదు కాని తాను జీవించిన ప్రమాణాల ప్రకారం జీవించమని అడుగుతున్నాడు.

దైవజనుల యొక్క మాదిరిని వెంబడించమని పై వచనాలలో చెప్పినది పరిశుద్ధాత్ముడు. దైవజనుల మాదిరిని వెంబడించుటకు గర్వంగా ఉన్నవారు, చివరకు శరీర సంబంధులైన వారిని లేదా వారి స్వచిత్తము యొక్క ప్రేరేపణలను అనుసరిస్తారు. అప్పుడు ఫలితాలు ఎంతో ఘోరంగా ఉండును.

ఫిలిప్పీయులను తన మాదిరిని, ఇతర దైవజనుల మాదిరిని వెంబడించమని (ఫిలిప్పీ 3:17) చెప్పిన వెంటనే, మరికొందరి మాదిరిని వెంబడించవద్దని హెచ్చరించాడు: "చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దు:ఖంతో చెబుతున్నాను" (ఫిలిప్పీ 3:18).

అయితే వారు పౌలు మాదిరిని అనుసరిస్తే, దైవభక్తిలేని వారి ద్వారా మోసపోకుండా రక్షింపబడతారు.

ఒక వ్యక్తి నిజంగా దైవజనుడేనా, అతని వెంబడించుటకు అర్హుడేనా అని పరీక్షించుటకు ఇక్కడ ఏడు పరీక్షలు ఉన్నాయి.

1. అతను దీనుడైన వ్యక్తియై ఉన్నాడా? - సులభంగా దగ్గరకు చేరగలిగి సులభంగా మాట్లాడగలమా?. తన నుండి దీనత్వమును నేర్చుకొనమని యేసుప్రభువు చెప్పెను (మత్తయి 11:29). ఒక దైవజనుడు యేసుప్రభువు నుండి దీనత్వమును నేర్చుకుంటాడు.

2. అతడు ధనాపేక్షనుండి విడుదల పొందాడా మరియు నీకు తెలిసినంత వరకు ఎవ్వరిని ఎప్పుడూ డబ్బు అడగని వ్యక్తియై ఉన్నాడా? దైవభక్తి గల వ్యక్తి యేసుప్రభువు యొక్క మాదిరిని అనుసరిస్తాడు, యేసుప్రభువు ఎవ్వరిని తన పరిచర్య కోసం డబ్బు అడగలేదు. దేవుని ప్రేమించువారు ధనమును ప్రేమించలేరని, దేవునిని హత్తుకొనువారు డబ్బును తృణీకరించుదురని యేసుప్రభువు చెప్పారు (లూకా 16:13).

3. అతని జీవితం పవిత్రంగా ఉన్నదా - మీకు తెలిసినంత వరకు ముఖ్యంగా స్త్రీలతో అతను సరియైన విధంగా వ్యవహరిస్తున్నాడా?. దైవభక్తిగల వ్యక్తి కేవలం లైంగిక శోధనకు దూరంగా ఉండటం మాత్రమే కాదు, దానినుండి పారిపోతాడు (2తిమోతి 2:20-22).

4. అతనికి పెళ్ళయి పిల్లలు ఉన్నట్లయితే, అతడు తన పిల్లలను దైవిక మార్గాల్లో పెంచాడా? ఒక దైవభక్తిగల వివాహితుడైన వ్యక్తి ఎవరనగా, క్రమశిక్షణలో పెంచబడిన విశ్వాసులైన పిల్లలు గల వ్యక్తి (1తిమోతి 3:4; తీతు 1:6).

5. అతని సన్నిహిత సేవకులు అతనితో సహవాసం ద్వారా దైవభక్తి గల వ్యక్తులుగా మారారా?. దైవభక్తిగల మనుష్యులు ఇతర దైవభక్తిగల మనుష్యులను తయారుచేస్తారు. తిమోతి తన ఆత్మీయ తండ్రియైన పౌలుతో కలిసి ఉండటం ద్వారా దైవభక్తిగల వ్యక్తి అయ్యాడు (ఫిలిప్పీ 2:19,20).

6. అతను స్థానిక క్రొత్తనిబంధన సంఘమును నిర్మించాడా? (లేక నిర్మించేవారితో కలిసి చురుకుగా పాల్గొన్నాడా?). యేసుప్రభువు తన సంఘమును నిర్మించడానికి భూమిపైకి వచ్చాడు (మత్తయి 16:18). సంఘమును నిర్మించుటకు ఆయన తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు (ఎఫెసీ 5:25). దైవభక్తిగల వ్యక్తి ప్రజలను క్రీస్తు యొద్దకు తెచ్చుట మాత్రమే కాక వారిని స్థానిక సంఘముగా కూడా కట్టును.

7. అతను మిమ్మల్ని తనతో కాకుండా క్రీస్తుతో కలుపుతున్నాడా?. దైవభక్తిగల వ్యక్తి మిమ్మును క్రీస్తుతో కలుపుతాడు. ఆ విధంగా మీరు ఇతరులకు మాదిరిగా ఉండవచ్చు (ఎఫెసీ 4:15; 2కొరింథీ 4:6).

మనము చాలా మంది క్రైస్తవ నాయకులను అనుసరించలేము, ఎందుకంటే వారు పైన పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిలో విఫలమయ్యారు.

అయితే, పైన పేర్కొన్న లక్షణాలను కలిగి ఉన్న దైవభక్తిగల నాయకుడిని మీరు కనుగొంటే, మీరు అతనిని ఆత్మీయ తండ్రిగా అనుసరించడం మంచిది. ఎందుకంటే అతను ప్రభువుకు దగ్గరగా రావడానికి మీకు సహాయం చేస్తాడు. తద్వారా పాపం మరియు తప్పుడు బోధనుండి మీరు రక్షించబడతారు.

వినుటకు చెవులుగల వాడు వినునుగాక.