భూమియొక్క సృష్టి మరియు సాతానుయొక్క ఆరంభము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   అన్వేషకుడు
Article Body: 

సాతాను సృష్టించబడిన వాడని ఆదికాండము 1:1లో "ఆదియందు" అని చెప్పబడినట్లుగా ఆదినుండి లేడని మనకు తెలుసు. "ఆదియందు" దేవుడు చేసిన కార్యమేమిటంటే భూమ్యాకాశములను సృష్టించడం (ఆదికాండము 1:1). కాని ఆదికాండము 3:1లో సాతాను అకస్మాత్తుగా రంగలోనికి ప్రవేశించడం మనం చూస్తాం. కనుక ఆదికాండము 1:1 మరియు ఆదికాండము 3:1 మధ్యలో సాతాను దేవుని చేత సృష్టించబడియుంటాడు. దుష్టసంబంధమైన దేనిని దేవుడు సృష్టించడు. కాబట్టి సాతాను మొదట్లో పరిపూర్ణంగా ఉండియుంటాడు. భూమి "నిరాకారము" ("టోహు"-హెబ్రీ) గా ఉందని ఆదికాండము 1:2లో మనం చదువుతాము. కాని భూమి "నిరాకారము" ("టోహు"-హెబ్రీ) గా నుండునట్లు యెహోవా దాని సృష్టింపలేదు అని యెషయా 45:18 లో మనం చదువుతాము. భూమి "నిరాకారము" (టోహు) గా నుండునట్లు సృష్టించబడలేదు అని దేవుని వాక్యం ఇక్క డ స్పష్టంగా తెలియజేసింది కాబట్టి ఆదికాండము 1:2లో భూమి "నిరాకారం" (టోహూ)గా మారియుండాలి. దేవుడు దేనిని కూడా అసంపూర్ణంగా లేక పరిణామక్రమంలో చేయడు. భూమి మొదట నిరాకారమైన ద్రవ్యరాశిగా చేయబడి ఆ తరువాత దేవుని చేత పరిపూర్ణం చేయబడిందని కొందరు చెప్తారు కాని ఆ విధంగా చేయబడలేదు. దేవుడు దేనినైనా సృష్టించిన వెంటనే దానిని పరిపూర్ణం చేస్తాడు (యాకోబు 1:17). కనుక భూమి పరిపూర్ణంగా సృష్టించబడింది. భూమి మొట్టమొదట అంధకార, అంధవిహీనమైన, నిరాకారమైన ద్రవ్యరాశిగా చేయబడి ఆ తరువాత కొంత కాలవ్యవధిలో అందంగా తీర్చిదిద్దబడింది అని నమ్మడం భూ పరిణామ క్రమమును నమ్మడమే అవుతుంది. అటువంటి "పరిణామక్రమ సిద్ధాంతం" అనేది ఇతర పరిణామక్రమ సిద్ధాంతముల వలె తప్పుడు సిద్ధాంతమే.

ఆదాము పాపము చేసినప్పుడు భూమి శపింపబడిందని మనకు తెలుసు. కనుక అంతకుముందు ప్రధాన దేవదూత పాపము చేసి సాతానుగా మారినప్పుడు కూడా భూమిమీద అతని పాపమే భూమి నిరాకారముగా, అంధకారముగా, శూన్యముగా (ఆదికాండము 1:2) అయ్యేటట్లు చేసింది. సాతానుయొక్క పతనము యెషయా 14లో మరియు యెహెజ్కేలు 28లో వివరించబడింది. యెహెజ్కేలు 28లో దేవుడు తూరు రాజుతోను మరియు అతనిలో నివసిస్తున్న సాతానుతోను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇది ఎలా ఉందంటే దయ్యం పట్టే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం ఆ వ్యక్తితో మాట్లాడుతాము అదే సమయంలో కొన్నిసార్లు ఆ వ్యక్తిలో నివసిస్తున్న దయ్యంతో మాట్లాడుతాం. ఆ వాక్యభాగంలో "తూరు రాజు" ఏదేనులో ఉన్నట్లు చెప్పబడింది. కాని మానవుడైన తూరురాజు ఏదేనులో ఎప్పుడు లేడు. కాబట్టి ఆ వాక్యభాగం తూరును పరిపాలిస్తున్న ఆత్మ-రాజును సూచిస్తుంది- అతడే సాతాను.

కనుక సాతానుయొక్క సృష్టి మరియు పతనము కూడా ఆదికాండము 1వ అధ్యయములోని మొదటి రెండు వచనముల మధ్యే జరిగిందని మనం తేల్చాము. అతని పతనము గురించి అక్కడ వివరించబడలేదు ఎందుకంటే బైబిలు మానవుని కోసం వ్రాయబడింది గనుక మానవుని చరిత్రతో ప్రారంభమైంది.

ఆదికాండం 1:2లో "భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను" అనే వాక్యంలో "ఉండెను" అనే మాట హెబ్రీ భాషలో "హయహ్" అనే మాటనుండి తర్జుమా చేయబడింది. కాని ఇది నిజానికి "ఆయెను" అని తర్జుమా చేయబడాలి. క్రింది వచనములలో "ఆయెను" అని తర్జుమా చేయబడింది: "నరుడు జీవాత్మ ఆయెను (హయహ్)" (ఆదికాండం 2:7). "లోతు భార్య ఉప్పు స్తంభమాయెను" (ఆదికాండం 19:26). ఆమె అంతకుముందు ఉప్పుస్తంభముగా ఉండలేదు గాని ఒక రోజు ఉప్పు స్తంభమాయెను అలానే భూమికూడా నిరాకారముగా శూన్యముగా ఆయెను.

ఆ సమయంలో సాతాను "మూడవ ఆకాశము"(దేవుని యొక్క సన్నిధి-2కొరంథి 12:2) నుండి పడద్రోయబడెను. కాని ఎఫెసీ 6:12లో సాతాను మరియు దురాత్మల సమూహము "ఆకాశమండలము"లో నివసిస్తున్నారని మనం చెప్పబడ్డాం. మొదటి ఆకాశము మన కళ్ళతో మనం చూసే విశ్వం (కీర్తనలు 8:3). కాబట్టి సాతాను మరియు తన దూతలు నివసించే "ఆకాశమండలము" అనేది రెండవ ఆకాశమైయుండాలి. అది మనం చూడాలేము. ఒకానొకరోజు అతడు అక్కడినుండి భూమి మీదకు పడద్రోయబడతాడు (ప్రకటన 12:10). ఆకాశము విభజించబడినప్పుడు రెండవదినమున (ఆదికాండము 1లోని ఆరురోజులలో) "ఇది మంచిది" అని ప్రభువు చెప్పలేదు, బహుశా దీనికి కారణము సాతాను రెండవ ఆకాశములో నివసించడమే.

ఆదికాండం 1లో భూమిని "సృష్టించడం" మరియు "తిరిగిబాగుచేయడం" దీనికి సంబంధించి రెండు మాటలు ఉపయోగించబడ్డాయి. ఆదికాండం 1:1లో ఉపయోగించబడిన మాట "బారా" ('సృజించెను' అనే మాటకు హెబ్రీ పదం). ఆదికాండం 1:7లో ఉపయోగించిన మాట "ఆసా" ('చేసెను' అనే మాటకు హెబ్రీపదం). "సృజించెను" అంటే శూన్యంనుండి సృష్టించడం అని అర్థం. "చేసెను" అంటే అప్పటికే ఉన్న దాని నుండి చేయడం అని అర్థం. చేపలు మరియు పక్షులు సృష్టించబడ్డాయి (21వ వచనం), మానవుడు కూడా సృజింపబడ్డాడు (27వ వచనం). మానవుని శరీరం చేయబడింది కాని తన ప్రాణం సృజించబడింది. దేవుని యొక్క ప్రతి మాట కూడా దైవ పేరేపణ వలన కలిగినది కాబట్టి ఆదికాండం 1లో పరిశుద్ధాత్ముడు రెండు వేర్వేరు మాటలను ఉపయోగించడానికి ఏదో మంచి కారణమే ఉండియుండవచ్చు.

నిర్గమకాండం 20:11లో లేఖనము ఎంతో స్పష్టముగా (ఎటువంటి సందేహం లేకుండా) భూమ్యాకాశములను యెహోవా ఆరు దినములలో చేసెను (ఆసా-హెబ్రీ) అని తెలియజేస్తుంది. కాని ఎప్పుడు కూడా "చేసెను" అనే మాట వాడబడింది. భూమి ఆరు దినములలో "చేయబడెను" - ఆరు దినములలో సృజించబడలేదు. ఇదే నిర్గమకాండం 31:17లో కూడా ప్రస్తావించబడింది. మనము లేఖనాలను ఎత్తిచూపేటప్పుడు ఎంతో ఖచ్చితంగా ఉండాలి. మరియు దేవుని మాటలనే ఉపయోగించాలి కాని మన మాటలను కాదు.

భూమిని సృజించడం అనేది ఒకే ఒక్క క్షణంలో జరిగిన ప్రక్రియ (ఆది.కా. 1:1). కాని దేవదూతలు పడిపోయిన తరువాత మానవుని కోసం అది ఆరు రోజులలో మరలా బాగు చేయబడెను.

మరి ఆదికాండం 1:1కి 1:2కి మధ్య గల సమయమెంత? ఎవరూ చెప్పలేరు. ప్రతి అభిప్రాయం కూడా కేవలం ఊహాగానం మాత్రమే. అది ఒక రోజు అయ్యుండొచ్చు లేక కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యుండొచ్చు. మర్మములన్నీ యెహోవాకు సంబంధించినవి కేవలం బయల్పరచబడినవి మాత్రమే మనము తెలుసుకొనగలము (ద్వితీ.కా. 29:29).

మన ఆలోచనలను లేఖనాలకు అనుగుణంగా మార్చుకుందాం - ఒక వేళ ఎప్పటినుండో మనము కలిగియున్న అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చినాసరే.

లేఖనాలను ఎత్తిచూపించే విషయంలో కూడా మనం ఖచ్చితంగా ఉందాం.

--------------------------------------------------------------

బారా అనే మాట గురించి వివరణను క్రింద చూడండి:

హెబ్రీ భాషలో ఉన్న బారా (సృజించుట) అనే మాటకు అర్థము - డబ్ల్యు.ఈ. వైన్ (వైన్ యొక్క విశ్లేషణ, థామస్ పబ్లిషర్స్)

బారా, "సృజించుట, సృష్టించుట"

ఈ క్రియకు వేదాంతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దీని కర్త దేవుడే. "బారా" అనే మాట ద్వారా కలిగే అర్థము "సృష్టించుట" ఇది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. ఇక్కడ ఈ వాక్యభాగాలలో భావమును చూసినట్లయితే అంతరిక్షమునకు సంబంధించిన సృష్టి భావమును తెలియజేస్తుంది: "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను" ఆదికాండము 1:1; 2:3; యెషయా 40:26; 42:5. "సృజించుట" కు సంబంధించిన మిగిలిన క్రియారూపములన్ని కూడా విసృత అర్థములు ఇచ్చేవిగా ఉన్నాయి; అవి దేవుడు మరియు మానవుడు కర్తలనుగా కలిగియున్నాయి. అక్కడ ఒకరిని గాని లేక ఒక దానిని కాని ఉనికిలోనికి తీసుకురావడం అనేది ప్రధానమైనదికాదు.

బారా అనే క్రియారూపం ఇతర క్రియారూపాలతో తరచుగా సమాంతరంగా మనకు కనబడుతూ ఉంటుంది. అవేంటంటే ఆసా, "చేయుట" యెషయా 41:20; 43:7; 45:7,12; ఆమోసు 4:13, యట్సార్ "కలుగజేయుట" యెషయా 43:1,7; 45:7; ఆమోసు 4:13 మరియు కున్ "స్థిరపరచుట". ఈ మాటలన్నింటిని మనకు చూపించే ఒక వచనం యెషయా 45:18 "ఆకాశములకు 'సృష్టి'[బారా] కర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని 'కలుగజేసి'[యాట్సార్] దాని సిద్ధపరచి 'స్థిరపరచెను'[కున్]. నిరాకారముగానుండునట్లు ఆయన దానిని సృజింపలేదు[బారా] నివాస స్థలమగునట్లు దాని సృజించెను. ఆయన సెలవిచ్చునదేమనగా -యెహోవాను నేనే ఏ దేవుడును లేడు"

బారా ("శూన్యమునుండి సృష్టించుట") అనే అర్థం ఈ వాక్యభాగములలో అంత ఖచ్చితంగా స్పురించునట్లుగా వాడబడలేదు బహుశా కవితాత్మక పర్యాయపదముగా దీనిని వాడుటవలన ఈ పదము అనేకసార్లు ఈ వాక్యభాగములలో ప్రస్తావించబడింది.

బారా అనే క్రియ ఉపయోగించబడిన పదములు

-భూమ్యాకాశములు. ఆది.కా. 1:1; యెషయా 40:26; 42:5; 45:18; 65:17

-నరుడు. ఆది.కా. 1:27; 5:2; 6:7; ద్వితీయో 4:32; కీర్తనలు 89:47; యెషయా 43:7; 45:12

-ఇశ్రాయేలు. యెషయా 43:1; మలాకీ 2:10

-ఒక నూతనమైన కార్యము. యిర్మీయా 31:22

-మేఘము మరియు ధూమము. యెషయా 4:5

-ఉత్తర దక్షిణములు. కీర్తనలు 89:12

-రక్షణ మరియు నీతి. యెషయా 45:8

-మాటలు. యెషయా 57:19

-అంధకారము. యెషయా 45:7

-గాలి. ఆమోసు 4:13

-నూతన హృదయము. కీర్తనలు 51:10

"బారా" అనే పదము ఉపయోగించిన వాక్య భాగములను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎక్కడైతే సాహిత్యపరమైన ఉద్దేశ్యముల కోసం ఉపయోగించలేదో (ప్రాముఖ్యంగా ఆదికాండం) అక్కడ రచయిత శాస్రీయంగా ఖచ్చితమైన భాషను దేవుడు శూన్యమునుండి సృష్టించాడని చెప్పడానికి ఈ పదమును వాడినట్లు మనకు తెలుస్తుంది.

ప్రత్యేకంగా యెషయా 40-65 అధ్యాయములో 'బారా' అనే పదము ఎక్కువగా ఉపయోగించబడింది. ఈ మాట పాతనిబంధనలో 49 సార్లు ఉపయోగించబడింది ఐతే 20 సార్లు ఈ అధ్యాయములోనే ప్రస్తావించబడింది. ఎందుకంటే యెషయా చెరలో ఉన్న యూదుల కోసం ప్రవచనాత్మకంగా వ్రాశాడు. దేవుడు గతంలో తన ప్రజలకు చేసిన మేలులు, ఆశీర్వాదములను ఆధారము చేసికొని, యెషయా ఆదరణతో కూడిన మాటలను మాట్లాడుతున్నాడు. యెషయా ప్రత్యేకంగా ఏమి చెప్పాలనుకున్నాడంటే, యెహోవా సృష్టికర్త గనుక తన ప్రజలను చెరలోనుండి విడిపించగలడు. ఇశ్రాయేలు దేవుడు సమస్తమును సృష్టించాడు: "భూమిని కలుగజేసిన['ఆసా'] వాడను నేనే దాని మీదనున్న నరులను నేనే సృజించితిని['బారా'] నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని" యెషయా 45:12. బబులోను దేవతలు కల్పితములు, అభావులు యెషయా 44:12-20; 46:1-7 కనుక దేవుడు నూతన సృష్టి ద్వారా 43:16-21; 65:17-25. వారిని విడిపించాలని ఇశ్రాయేలు ఆశిస్తున్నది.

'బారా' అనే పదం అంతరిక్షం, భౌతిక ప్రపంచ సృష్టి శూన్యమునుండి సృష్టించబడిందని తెలియజేయుటకు ఖచ్చితమైన పదముగా వాడినా, తన మహిమకొరకు సమస్తమును సృష్టించి, నియంత్రిస్తున్న దేవుని యొక్క సార్వభౌమాధికారమును మరియు తన అపరిమిత శక్తిని తెలియజేయుటకు వేదాంతపరమైన సాధనముగా కూడా 'బారా' ఉపయోగించబడింది.