నేను అనుసరించే బోధకులు

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు
Article Body: 

ఉన్నత ప్రమాణాలు కలిగిన సంఘములను నిర్మించుటకు మనకు ఉన్నత ప్రమాణాలు కలిగిన బోధకులు అవసరం.

"నన్ను వెంబడించుడి" అని యేసుప్రభువు చెప్పాడు (లూకా 9:23).

"నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి" (1 కొరింథి 11:1, ఫిలిప్పీ 3:17) అని పౌలు చెప్పాడు.

భక్తిపరుడైన ప్రతి బోధకుడు కూడా తాను బోధించు వారితో ఏమి చెప్పగలిగియుండాలని పరిశుద్ధాత్ముడు ఆశిస్తున్నాడో పైన చెప్పబడిన పౌలు మాటలలో మనం చూస్తున్నాము.

"నన్ను వెంబడించవద్దు కాని క్రీస్తునే వెంబడించుడి" అని అనేక మంది బోధకులు చెప్తూ ఉంటారు. వినడానికి ఇది ఎంతో దీనత్వంతో కూడుకొనినట్లు అనిపిస్తుంది కాని వారి ఓడిపోయిన జీవితాలను కప్పుకోవడానికి ఇది ఒక సాకు మాత్రమే; ఇది పరిశుద్ధాత్మ యొక్క బోధకు పూర్తి వ్యతిరేకం.

"నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి" అని చెప్పగలిగిన బోధకులను మాత్రమే నేను గౌరవించి వెంబడిస్తాను. కాని అలాంటి బోధకులు మన రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారు అని చెప్పుటకు విచారిస్తున్నాను.

పౌలు మారుమనస్సు పొందక ముందు పూర్తిగా ఓడిపోయిన వాడుగా ఉన్నాడు. అతడు పరిపూర్ణుడుగా లేకపోయినప్పటికీ (ఫిలిప్పీ 3:12-14) అనేక మంది పౌలును వెంబడించునట్లుగా ఒక గొప్ప మాదిరిగా ఉండునట్లు దేవుడు అతణ్ణి మార్చాడు. ఈ ప్రపంచంలో అతి శ్రేష్ఠమైన క్రైస్తవుడు కూడా పరిపూర్ణుడు కాదు కాని పరిపూర్ణుడగుటకు సాగిపోవుచున్నవాడే.

గనుక గతంలో నీవు పూర్తిగా ఓడిపోయినవాడిగా ఉన్నాసరే, ఇతరులు నిన్ను పోలి నడుచుకొనునట్లు ఒక మాదిరిగా దేవుడు నిన్ను చేయగలడు.

ఒక బోధకుణ్ణి నేను గౌరవించి వెంబడించుటకు ఒక మాదిరిగా పెట్టుకొనుటకు ముందు ప్రాథమికంగా అతనిలో ఏడు లక్షణాలను నేను చూస్తాను.

1. అతడు దీనుడైయుండాలి మరియు ఇతరులు సులువుగా కలవగలుగుటకు అనుమతించాలి. యేసు దీనుడు మరియు ఆయనను ఇతరులు సుళువుగా కలవగలిగారు (మత్తయి 11:29). ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ప్రజలు ఆయనను కలవగలిగారు అర్థరాత్రి నికోదేము యేసు ఇంటికి వెళ్ళి ఆయనను దర్శించగలిగాడు. బహిరంగ ప్రదేశములలో ఏ సమయములోనైనా, ఎవరైనా యేసుతో మాట్లాడవచ్చు. యేసుప్రభువు దీనత్వము బీదలకు సువార్తను ప్రకటించునట్లుగా ఆయనను తొందరపెట్టింది (మనము లూకా 4:18లో చదివినట్లుగా). పౌలు ఎంతో దీనుడైన వ్యక్తి. తన తప్పులను వెంటనే గ్రహించి ఇతరులను వెంటనే క్షమాపణ అడిగేవాడు (అ.కా 23:1-5). ఎవరైతే ధనికులకు మరియు బీదవారికి ఎటువంటి వ్యత్యాసము చూపకుండా, తమ గురించి తాము "ఎక్కువగా ఊహించుకోకుండా", తమ తప్పులను తెలుసుకొని వెంటనే క్షమాపణ అడుగుతారో, ఎప్పటికీ సామాన్యమైన సహోదరులవలె ఉంటారో కేవలం అటువంటి బోధకులను మాత్రమే నేను వెంబడిస్తాను.

2. తన కోసం కాని తన పరిచర్య కోసం కాని ఎవరిని ఎప్పుడూ డబ్బు అడగని వాడై యుండాలి మరియు తన జీవన విధానం సామాన్యంగా ఉండాలి. ఒకవేళ అతడు ఎవరిదగ్గరినుండైనా కానుకలను స్వీకరించినట్లయితే (పౌలు అప్పుడప్పుడూ స్వీకరించాడు - ఫిలిప్పీ 4:16-18) తన కంటే ధనవంతుల దగ్గరనుండే పొందుతాడు కాని తనకంటే బీదలైన వారి దగ్గర నుండి పొందడు. యేసుప్రభువు తన కోసం కాని తన పరిచర్య కోసం కాని ఎవరినీ డబ్బులు అడుగలేదు. తనకంటే ధనవంతుల దగ్గరనుండి మాత్రమే ఆయన కానుకలను స్వీకరించాడు (లూకా 8:3). యేసుప్రభువు మరియు పౌలు కూడా సామాన్యమైన జీవన విధానమును కలిగియున్నారు. ధనము పట్ల మరియు భౌతిక సంబంధమైన వస్తువుల పట్ల ఎవరైతే యేసు మరియు పౌలు కలిగియున్న వైఖరిని కలిగియుంటారో అటువంటి బోధకులనే నేను అనుసరిస్తాను.

3. అతడు దైవజనుడనే సాక్షమును కలిగియుండాలి. దైవికమైన వ్యక్తిగా, నీతిపరునిగా పేరు కలిగి పరిశుద్ధత పట్ల తీవ్రమైన కోరిక కలిగియుండాలి - ఏ విషయంలో కూడా తన స్వంతమును కోరుకోకూడదు, తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి (యాకోబు 1:26; ఎఫెసీ 4:26-31), పడిపోయినవారి మీద కనికరము చూపించాలి, తన ప్రార్థన గురించి, ఉపవాసం గురించి, తాను ఇచ్చే కానుకలను విషయంలో అతిశయించకూడదు (మత్తయి 6:1-18), తన శత్రువులను కూడా ప్రేమించగలిగి ఉండాలి. యౌవనస్తులు మరియు వృద్ధులైన స్త్రీల విషయంలో కూడా పూర్ణ పవిత్రతను కలిగియున్నాడనే సాక్షమును అతడు పొందియుండాలి (1తిమోతి 5:2). దైవభక్తి అనే అటువంటి పరిమళ సువాసన ఎవరి జీవితాలలో అయితే ఉంటుందో అటువంటి బోధకులను మాత్రమే నేను అనుసరిస్తాను.

4. తన పిల్లలను దైవికమార్గములో పెంచియుండాలి. ఒక తండ్రిగా తన పిల్లలు తనకు లోబడి ఉండాలి. ప్రభువుని ప్రేమించని, అవిధేయులైన పిల్లలు గల ఎవరినైనా సంఘములో నాయకునిగా నియమించవద్దని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు (1తిమోతి 3:4,5; తీతు 1:6). మన గురించి ఇతరులకంటే మన పిల్లలకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ వారు మనలను చూస్తుంటారు. ఇంట్లో మనము దైవిక విధానంలో జీవించడం వారు చూసినట్లయితే, వారు కూడా ప్రభువును వెంబడిస్తారు. తన పిల్లలను భక్తిపరులుగా, దీనులుగా మరియు మనుష్యులందరిని గౌరవించేవారిగా ఎవరైతే పెంచారో అటువంటి బోధకులను మాత్రమే నేను అనుసరిస్తాను.

5. అతడు దేవుని సంకల్పమంతటినీ భయము లేకుండా బోధించేవాడైయుండాలి. క్రొత్తనిబంధనలో వ్రాయబడిన ప్రతి ఆజ్ఞను మరియు ప్రతి వాగ్ధానమును ఏ మనుష్యుని కూడా సంతోషపెట్టుటకు ప్రయత్నించకుండా అతడు ప్రకటించాలి (అ.కా 20:27; గలతీ 1:10). ఒకవేళ అతడు పరిశుద్ధాత్మ ద్వారా నిరంతరం అభిషేకించబడుతున్నట్లయితే అప్పుడు యేసుప్రభువు మరియు పౌలు వలె అతని వర్తమానములు కూడా సవాలుకరముగా మరియు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఎవరైతే దేవుని అభిషేకం కలిగి మాట్లడుతారో అటువంటి బోధకులను మాత్రమే నేను అనుసరిస్తాను.

6. క్రీస్తుయొక్క శరీరమును వ్యక్తపరచే విధముగా స్థానిక సంఘములను నిర్మించాలనే అనురక్తి (తీవ్రమైన కోరిక) అతడు కలిగియుండాలి. యేసు ఈ భూమిమీదకు వచ్చింది కేవలం ప్రజలందరినీ పాపమంతటినుండి రక్షించడానికి మాత్రమే కాదు కాని తన జీవమును వ్యక్తపరిచే శరీరముగా తన సంఘమును నిర్మించడానికి కూడా వచ్చాడు (మత్తయి 16:18). కావున పౌలు ప్రతి చోట కూడా క్రీస్తు శరీరమువలె పని చేసే స్థానిక సంఘములను స్థాపించాలనే అనురక్తి (తీవ్రమైన కోరిక)ను కలిగియున్నాడు (ఎఫెసీ 4:15,16). దీనిని గురిగా పెట్టుకొని పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు (కొలస్సీ 1:28,29). క్రీస్తు శరీరమును వ్యక్తపరిచే స్థానిక సంఘములను ఎవరైతే నిర్మించడానికి చూస్తూంటారో అటువంటి బోధకులను మాత్రమే నేను అనుసరిస్తాను.

7. తన దర్శనం మరియు తన ఆత్మను కలిగియున్న జతపనివారిని కనీసం కొందరినైనా అతడు సిద్ధపరచియుండాలి. ఒక దైవికమైన బోధకుడు ఎప్పుడు కూడా తరువాత తరములో ప్రభువుయొక్క పవిత్రమైన సాక్షము పరిరక్షించబడాలనే పట్టింపును కలిగియుంటాడు. యేసు తన యొక్క 11 మంది శిష్యులకు తన ఆత్మను అనుగ్రహించి తన ప్రమాణాలతో వారు జీవించి తన తరువాత పరిచర్యను కొనసాగించునట్లు వారిని సిద్ధపరిచాడు. పౌలు వలె దీనత్వం మరియు నిస్వార్థము కలిగిన జీవితమును తిమోతి, తీతు కూడా జీవించి తన పరిచర్యను వారు కొనసాగించునట్లు పౌలు వారిని సిద్ధపరిచాడు (ఫిలిప్పీ 2:19-21; 2కొరంథీ 7:13-15). పైన చెప్పబడినట్లుగా ఎవరైతే ఈ లక్షణాలను కలిగియున్న జతపనివారిని కొందరినైనా సిద్ధపరుస్తారో అటువంటి బోధకులను మాత్రమే నేను అనుసరిస్తాను.

నీవు బోధకునిగా ఉండుటకు దేవుని చేత పిలవబడినట్లయితే, తన పరిశుద్ధాత్మతో ఆయన నిరంతరము అభిషేకించునట్లుగా మరియు పైన చెప్పబడిన లక్షణాలను నీకనుగ్రహించునట్లు నీవు ప్రార్థించాలి. ఆ విధంగా ఇతరులు నిన్ను అనుసరించునట్లు నీవు ఒక మాదిరిగా ఉంటావు.

రాజీపడిపోయి మరియు లోకతత్వంతో ఉన్న ఈనాటి క్రైస్తవ్యంలో, సంఘములో జీవితము మరియు పరిచర్యయొక్క ప్రమాణాలను పెంచుటకు మనము పిలువబడ్డాము.