WFTW Body: 

"మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" (మత్తయి 5:14-16).

వెలుగు అనేది యేసుప్రభువు ఉపయోగించిన మరొక ఉదాహరణ లేదా పదచిత్రం. యేసుప్రభువు కాలంలో, వారు దీపాలను ఉపయోగించారు. దీపం యొక్క వత్తి చాలా చిన్నది (నేటి బల్బు చాలా కూడా చిన్నది). కానీ అది మొత్తం గదిని వెలిగిస్తుంది! వత్తి పరిమాణం లేదా బల్బు పరిమాణం కాదు, కానీ దాని నుండి వచ్చే కాంతి తీవ్రత ముఖ్యం. మళ్ళీ ప్రాధాన్యత పరిమాణంపై కాదు, నాణ్యతపైనే. సున్నా వాట్ బల్బులు చాలా మసక కాంతిని విడుదల చేస్తాయి, వాటి వలన మీరు ఏమీ చూడలేరు, ఆపై దాదాపు అదే పరిమాణంలో శక్తివంతమైన బల్బుల ఉన్నాయి ఉదాహరణకు హాలోజన్ బల్బులు, ఇవి మొత్తం వీధిని వెలిగిస్తాయి. ఒక బల్బు చాలా తక్కువ వాటేజ్ లేదా చాలా ఎక్కువ వాటేజ్ కలిగి ఉంటుంది. ముఖ్యమైన విషయం దాని పరిమాణం కాదు, కానీ దాని శక్తి - దేనికైనా వెలిగునివ్వగల శక్తి యొక్క తీవ్రత. యేసుప్రభువు ఇలా చెప్పారు, "మీరు లోకానికి వెలుగై ఉన్నారు".

లోకం చీకటిలో ఉంది, ఆ చీకటి నాలో ఎంతమాత్రము ఉండకూడదు. నేను బల్బుగా ఉండి మరియు లోకపు చీకటి నాలో ఉంటే, నేను పగిలిన బల్బు లాంటివాడిని. చాలా సంఘాలలో పగిలిపోయిన బల్బుల లాంటి క్రైస్తవులు ఉన్నారు. ఒకప్పుడు మండుతున్న వారిగా ఉన్నారు, కానీ ఇప్పుడు వారు పగిలిపోయారు: వెనకకు దిగజారిపోయి వారి వెలుగు ఇక ప్రకాశించడం లేదు. ఆ వెలుగు ఏమిటి? "మనుష్యులు మీ మంచి పనులను చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరిచే విధంగా మీ వెలుగును ప్రకాశింపజేయండి" అని ఈ వచనం చెబుతోంది. ఆ రోజుల్లో, నిరంతరం నూనెతో మండుతున్న వత్తి ద్వారా దీపం నుండి వెలుగు వచ్చేది. నూనె వత్తి మండడానికి వీలు కల్పించింది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం.

పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తి యొక్క ఒక లక్షణం ఏమిటంటే అతను మంచి చేస్తాడు. అపొస్తలుల కార్యములు 10:38లో యేసుప్రభువు పరిశుద్ధాత్మతో మరియు శక్తితో అభిషేకించబడినప్పుడు, ఆయన మంచి చేస్తూ తిరిగాడని చెప్పబడింది. ఈరోజు ’అభిషిక్తులైన’ బోధకులు అని పిలవబడే చాలా మంది చేసినట్లుగా ఆయన తన పరిచర్య కోసం ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ తిరగలేదు. ఆయన దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన మంచి చేస్తూ తిరిగాడు, ఆయన దాని కోసం ఎప్పుడూ డబ్బులు వసూలు చేయలేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఆయన అడగకుండానే ఆయనకు బహుమతులు ఇచ్చినప్పుడు ఆయన వాటిని అంగీకరించాడు, కానీ ఆయన తన అవసరాలను ఎవరికీ తెలియజేయలేదు. ఆయన ఎటువంటి రుసుము లేకుండా మంచి చేస్తూ సంచరించాడు.

ఆయన ఇలా చెప్తున్నాడు, "మనుష్యులు మీ మంచి పనులను చూసి మిమ్మల్ని మహిమపరచకుండా, దేవుణ్ణి మహిమపరచడానికి మీ వెలుగు వారిపై ప్రకాశింపజేయండి!". మీరు మీ కోసం గౌరవం పొందడానికి, మీ కోసం మహిమ పొందడానికి మంచి పనులు చేస్తే, అది నిజానికి చీకటి. చాలా మంది క్రైస్తవులు చేసే చాలా మంచి పనులు వాస్తవానికి తమ కోసం, తాము గౌరవం పొందడానికి ప్రకటనలు. వారి సంస్థ లేదా వారి పరిచర్య నిజానికి చీకటి ఎందుకంటే పరలోకంలో ఉన్న తండ్రికి ఎటువంటి మహిమ వెళ్ళటం లేదు. బదులుగా, ఆ సంస్థకు లేదా ఆ వ్యక్తికి మహిమ వస్తుంది. అయితే, "ప్రజలు మీ మంచి పనులను చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరచనివ్వండి" అని యేసుప్రభువు చెప్పారు. అదే నిజమైన వెలుగు, ఇక్కడ ఒక వ్యక్తి మంచి చేస్తున్నాడు. దాని ఫలితంగా వ్యక్తి గాక, క్రీస్తు మహిమపరచబడతాడు.

వెలుగును వ్యక్తపరచడం అంటే ఇదే. యోహాను 1:4లో, ఈ వెలుగును ఇలా వర్ణించారు: "యేసుక్రీస్తులో జీవముండెను, మరియు ఆ జీవము మనుష్యులకు వెలుగుగా ఉండెను." కాబట్టి వెలుగు ఒక సిద్ధాంతం, బోధన లేదా ఒక నిర్దిష్ట సందేశం కాదు -అది జీవం. అది పరిశుద్ధాత్మ ద్వారా మన నుండి ప్రవహిస్తున్న యేసుప్రభువు జీవం. మన నుండి ప్రవహిస్తున్న యేసుప్రభువు జీవం, నూనెతో వెలిగించి కాంతినిచ్చే పాత దీపం లాంటిది.

యోహాను 8:12లో యేసుప్రభువు చాలా స్పష్టంగా ఇలా చెప్పాడు, "నేను లోకానికి వెలుగును; నన్ను అనుసరించేవాడు ఎప్పటికీ చీకటిలో నడవడు." యోహాను 8:12 ప్రకారం, ఒక వ్యక్తి చీకటిలో నడుస్తున్నప్పుడల్లా, ఆ వ్యక్తి యేసుప్రభువును అనుసరించడం లేదని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. మీరు "సరే, నేను ఇప్పుడు కొంచెం చీకటిగా ఉన్నాను" అని చెబితే, దానికి కారణం మీరు యేసుప్రభువును అనుసరించకపోవటం కావచ్చు. దయచేసి చీకటిలో నడవటం దేవుని చిత్తం గురించి ఖచ్చితంగా తెలియకపోవటం మధ్య గందరగోళ పడకండి. గెత్సేమనే తోటలో యేసుప్రభువు కూడా తండ్రి చిత్తం గురించి గందరగోళానికి గురయ్యాడు, కలవరపడ్డాడు. అందుకే ఆయన ఒక గంట పాటు, "తండ్రీ, నీ చిత్తం ఏమిటి, నేను ఈ గిన్నె త్రాగాలా వద్దా?" అని ప్రార్థించాడు. అది చీకటి కాదు. గందరగోళం విశ్వాస జీవితంలో భాగం, కానీ చీకటి అనేది వేరే విషయం, యేసుప్రభువు జీవానికి విరుద్ధమైనది. ఆయన ఇలా చెప్పాడు, "నన్ను అనుసరించేవాడు చీకటిలో నడవడు, కానీ జీవపు వెలుగును కలిగి ఉంటాడు, ఎందుకంటే నేను లోకానికి వెలుగును."

తరువాత ఆయన తాను కొంత కాలం మాత్రమే లోకానికి వెలుగు అని చెప్పాడు. "నేను లోకంలో ఉన్నప్పుడు, నేను లోకానికి వెలుగును" (యోహాను 9:5). ఆయన లోకంలో ఎంతకాలం ఉన్నాడు? ఆయన ఈ లోకంలో 33 ½ సంవత్సరాలు ఉన్నాడు. అంతే.

ప్రజలు అతి ఆధ్యాత్మికంగా ఉండి, "క్రీస్తు ఇప్పుడు లోకంలో లేడా?" అని అనవచ్చు. సరే, మీరు యోహాను 17:11 చదివితే, ఆయన, "నేను ఇక ఈ లోకంలో ఉండను" అని అన్నాడు. మనం మన అతి ఆధ్యాత్మికతను వదిలించుకోవాలి. యేసుప్రభువు ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్ళే ముందు, సిలువకు ముందు రోజు, ఆయన ఇలా అన్నాడు, "నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ.. ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను". కాబట్టి ఆయన యోహాను 9వ అధ్యాయంలో, "నేను లోకంలో ఉన్నంత కాలం" అని చెప్పినప్పుడు, ఆయన జీవితాన్ని వ్యక్తపరిచిన 33 ½ సంవత్సరాల కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత, నేడు లోకానికి వెలుగు ఎవరు?

మత్తయి 5:14 ఇలా చెబుతోంది, "మీరు లోకానికి వెలుగై ఉన్నారు". ఎవరైనా నన్ను, "లోకానికి వెలుగు ఎవరు?" అని అడిగితే, లేఖనాధారమైన సమాధానం, "నేనే. యేసుప్రభువును అనుసరించే ఇతరులతో పాటు నేను లోకానికి వెలుగును" అని చెప్పడం అవుతుంది. మీరు ఎప్పుడైనా అలా ఆలోచించారా? "లోకానికి వెలుగు ఎవరు?" అనే ప్రశ్నకు "నేను మరియు యేసుప్రభువును అనుసరించే ఇతరులు" అని చెప్పడం ద్వారా సమాధానం చెప్పాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదే సరైన సమాధానం.

"నన్ను చూడకండి. యేసుప్రభువును మాత్రమే చూడండి" అని చెప్పడం చాలా సులభం. కానీ ఆయన భూమిపై లేడు!. ఆయన, "నేను లోకంలో ఉన్నంత కాలం మాత్రమే నేను లోకానికి వెలుగును" అని అన్నాడు. చాలా మంది క్రైస్తవులు లేఖనాలను సరిగ్గా చదవలేదు మరియు వారి స్వంత అవగాహన నుండి వచ్చిన మరియు పూర్తిగా తప్పుగా ఉన్న అనేక రకాల తప్పుడు ఆలోచనలు వారి తలలలో వస్తాయి. దేవుడు తన జీవాన్ని పరిపూర్ణంగా వ్యక్తపరచడానికి యేసుక్రీస్తుపై ఆ 33½ సంవత్సరాలు 100% ఆధారపడినట్లే, ఆయన ఇప్పుడు అదే వెలుగును పరిపూర్ణంగా వ్యక్తపరచడానికి తన సంఘంపై - భూమిపై ఉన్న తన శిష్యులపై - ఆధారపడి ఉన్నాడు.

"ప్రజలు మీ మంచి పనులను చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరచనివ్వండి".