WFTW Body: 

యేసుప్రభువు సంఘము గూర్చి రెండు సందర్భములలో మాత్రమే మాటలాడెను - మత్తయి 16:18 మరియు 18:17-20. ఈ రెండు సందర్భాలలో ఆయన సాతాను, సంఘమునకు విరోధముగా పోరాడుట గూర్చి మాటలాడెను. మొదటి సందర్భములో ఆత్మీయ మరణపు శక్తులద్వారా, దురాత్మల ద్వారా సాతాను ప్రత్యక్షముగా సంఘముపై దాడిచేయుట గూర్చి చెప్పెను. రెండవ సందర్భములో, సాతాను మోసగించి వశపరచుకొనుట వలన తనకు తెలియకుండా సాతానుకు ప్రతినిధిగా మారిన ఒక సహోదరుని ద్వారా సంఘమును పరోక్షముగా మోసగించి పాడుచేయుట గూర్చి మాటలాడెను. అయితే సాతాను ఎటువంటి పద్ధతులను ఉపయోగించినా, సాతాను యొక్క క్రియలను బంధించుటకు మరియు అతడిచే బంధింపబడు వారిని విడుదల చేయుటకు ప్రభువు మనకు అధికారము ఇచ్చెను (మత్తయి 16:19; 18:18; 2తిమోతి 2:26). మనము ఆ అధికారమును సంఘములో ధైర్యముతో ఉపయోగించవలెను.

యేసుప్రభువు తాను కట్టుచున్న సంఘమునకు ఒక గుర్తు "పాతాళలోక ద్వారములు (ఆత్మీయ మరణపు శక్తులు) దాని యెదుట నిలువనేరవు" అని చెప్పెను. వేరే విధముగా చెప్పవలెనంటే ఒక సంఘము ఆత్మీయ మరణపు శక్తులైన అసూయ, తగవులు, అవినీతి, ధనాశ, లోకానుసారత, నిష్టురత్వము, గర్వము, పరిసయ్యతత్వము మొదలైన వాటితో జయింపబడుచుండినట్లయితే, ఆ సంఘము యేసు ప్రభువు నిర్మించేది కాదని మనము రూఢిపరచుకొనవచ్చును.

సాతాను ఎడతెగక సంఘమును నాశనము చేయుటకు చూచుచుండును. దానిని తన ప్రతినిధులను సంఘములోనికి చొప్పించుట ద్వారా చేయుటకు ఎక్కువగా ప్రయత్నించును. "కొందరు సంఘములోనికి రహస్యముగా జొరబడియున్నారు" అని యూదా చెప్పుచుండెను (యూదా 1:4). గిబియోనీయులు యెహోషువాను మోసగించినట్లు (యెహోషువ 9) అనేకులు ఈనాడు పెద్దలను మోసగించి శిష్యులుగా నటించి సంఘములోనికి దొంగతనముగా ప్రవేశించుచున్నారు. అయితే వారు పెద్దలను ఏ విధముగా మోసము చేయగలిగిరి? బహుశా పెద్దలు వారి యొక్క సంపదను లేక లోకములో వారికున్న స్థానమును బహుగా గౌరవించుట వలన అయ్యుండవచ్చును. బబులోనుకు చెందిన సంఘములన్నిటిలో లోకములో ఉన్నత స్థానములో ఉండువారు లేక సంపదలు కలవారు, పెద్దలు కాకపోయినను వారి గుంపులలో తీసుకొను నిర్ణయములను ప్రభావితము చేయుదురు. కాని మన మధ్య ఎప్పుడు అట్లుండరాదు. మనము జాగ్రత్తగా ఉండనట్లయితే గిబియోనీయులు మన సంఘములోనికి కూడా వచ్చి చేరుదురు.

అటువంటి సాతాను యొక్క దాడులనుండి మనలను ఎల్లప్పుడు కాపాడుచుండుటకు ఆయన మనలను గమనిస్తున్నందుకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలెను. "యెహోవా పట్టణమును కాపాడనియెడల కావలియుండువారి ప్రయాస వ్యర్థము" (కీర్తనలు 127:1). ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగియుందురో అక్కడనే ఆయన ఆశీర్వాదముండును (కీర్తనలు 133:1-3) మరియు కేవలము ఐక్యతతో ఉండిన సంఘమే పాతాళలోక ద్వారములపై గెలుచును. గనుక మనము అటువంటి ఐక్యతలో నిలిచియుండునట్లు పరిశుద్ధాత్ముడు మన మధ్యను బలముగా పనిచేయుచున్నాడు.

ప్రకటన గ్రంథములో పరలోకము గూర్చి 7మార్లు మనకు ఇవ్వబడిన కొసమెరుపులలో, పరలోక వాసులు దేవుని ఎడతెగక గొప్ప స్వరముతో స్తుతిస్తూ ఉండుటను మనము చూచెదము. కొన్ని సార్లు ఉరుముల శబ్దమువలె మరియు జల ప్రవాహముల శబ్దమువలె స్తుతించుటను మనము చూచుదుము. ఇది పరలోకపు వాతావరణము. అది ఫిర్యాదులు మరియు కోర్కెలు లేని ఎడతెగని స్తుతులతో ఉన్న వాతావరణము. మరియు అటువంటి వాతావరణమును పరిశుద్ధాత్ముడు మన హృదయములలోనికి, మన ఇండ్లలోనికి మరియు మన సంఘములలోనికి తీసుకురావలెనని ఆశించుచున్నాడు. ఆ విధముగా ఈ ప్రదేశములన్నిటి నుండి సాతాను తరిమి వేయబడును.

క్రైస్తవులలో ఎంతోమంది వారి సహోదర సహోదరీలకు వ్యతిరేకముగా, వారి బంధువులకు మరియు పొరుగువారికి వ్యతిరేకముగా, పరిస్థితులకు వ్యతిరేకముగా మరియు చివరకు దేవునికి కూడా వ్యతిరేకముగా సణుగుకొను మరియు ఫిర్యాదు చేయు ఆత్మను సంక్రమించుకొనునట్లు సాతాను చేయుట వలన, వారు సాతానుకు వ్యతిరేకముగా చేయు పోరాటములో పనికిరాకుండా పోయిరి.

ప్రకటన గ్రంథము 12:8లో ఒక అద్భుతమైన మాట వ్రాయబడినది. అది "సాతానుకును మరియు అతడి దూతలకును పరలోకమందు స్థానము లేకపోయెను" అనునది. మన జీవితములలో కూడా అట్లే ఉండవలెను. మన హృదయములలో, మన గృహములలో మరియు మన సంఘములలో సాతాను మరియు అతడి దూతలు ఏ మాత్రము స్థలమును పొందుకొనకూడదు.

మనము క్రిందనున్న హెచ్చరికలకు విధేయత చూపినట్లయితే, మనము సాతానును జయించగలము. "క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి" (కొలస్సీ 3:15). "అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలెనని కోరుచున్నాను" (1 తిమోతి 2:1,2). "మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి" (ఎఫెసీ 5:20). ఇక్కడ మనము అన్నింటికంటె ముందు దేవుడు క్రీస్తుయొక్క శరీరములోనికి పిలిచిన వారి గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని చూచుదుము. ఈ విషయములో మన ఇష్టమునకు వదిలినట్లయితే దేవుడు పిలిచిన ఎంతో మందిని మనము పిలువము. ముఖ్యముగా మన సంఘమునకు సంబంధించని వారిని పిలవము. కాని భూమికంటె ఆకాశము ఎంత ఎత్తుగానున్నదో దేవుని జ్ఞానము మన జ్ఞానము కంటే అంత గొప్పది గనుక వారిపై మనకున్న అభిప్రాయము కంటె తప్పక వేరైన అభిప్రాయమును ఆయన కలిగియుండును మరియు మనము జ్ఞానము గలవారమైతే మన ఆలోచనలను దేవుని ఆలోచనలతో సమానముగా ఉండునట్లు వాటిని మార్చుకొందుము. ఒకమారు మనము క్రీస్తు శరీరములోనున్న సహోదర సహోదరీల కొరకు కృతజ్ఞత చెల్లించుట నేర్చుకొనినట్లయితే, అప్పుడు మనము మనుష్యులందరి కొరకు మరియు అన్ని పరిస్థితుల కొరకు కృతజ్ఞత చెల్లించుట నేర్చుకొందుము. మన పరలోక తండ్రియైన దేవుడు మనుష్యులందరిని మరియు పరిస్థితులన్నిటిని తన సర్వాధికారముతో అదుపు చేయుచున్నాడని మనకు తెలియును. మనము దీనిని నిజముగా నమ్మినట్లయితే, మనము తప్పక అన్నివేళలా దేవుని స్తుతించుదుము మరియు ఆ విధముగా మన రాజ్యము పరలోక సంబంధమైనదే కాని ఈ లోక సంబంధమైనది కాదని ఋజువు చేయుదుము. అప్పుడు మనపై సాతాను తన శక్తిని కోల్పోవును. అప్పుడు మాత్రమే మనము సాతానుతో సమర్థవంతమైన పోరాటము చేయగలము.