వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

క్రీస్తు శరీరాన్ని ఒక ఆసుపత్రితో పోల్చవచ్చు. ఒక రోగి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతనికి సహాయపడేందుకు అందులో ఆయా విభాగాలుంటాయి. ఆ రోగికి ఒక ఇంజక్షన్ అవసరం కావచ్చు, శరీర వ్యాయామ చికిత్స లేక శస్త్ర చికిత్సలాంటివి కూడా అవసరం కావచ్చు. అతడొక కంటి డాక్టరునో, చెవి డాక్టరునో సంప్రదించాల్సి ఉండవచ్చు. ఇలా ఆసుపత్రి ఆయా విభాగాలు కలిగి ఉంటుంది. కంటి డాక్టరు తన సమయమంతా రోగుల కళ్ళు పరీక్షించటంలోనే గడుపుతాడు, మరేదీ చేయడు. అంతమాత్రన అతడు శరీరంలోని ఇతర అవయవములను తేలికగా భావించడంలేదు. అతని ప్రత్యేకత కన్ను మాత్రమే. క్రీస్తు శరీరములో కూడా ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క వరము, పిలుపు ఉంది. విడివిడిగానైతే ఒక్కొక్కరు ఎటువంటి సమతుల్యత లేకుండా ఉంటారు. ఈ భూమి మీద ఎన్నడైనా నడచిన సంపూర్ణ సమతుల్యత సంతరించుకున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మనమందరమూ, మనలో శ్రేష్టులైన వారు కూడా సమతుల్యత లేనివారే. మనము ఇతర సహోదర, సహోదరిలతో కలసి పరిచర్య చేసినప్పుడు మాత్రమే మన సమతుల్యతను కనుగొంటాము. ప్రభువు ఆసుపత్రిలోని ఇతర విభాగాలతో కలసి పనిచేసినప్పుడు సమతుల్యత లభిస్తుంది. అందుచేత ఆసుపత్రిలో వ్యక్తిగతమునకు ఎటువంటి స్థానము ఉండదు.

ఒక మంచి ఆసుపత్రిలో రోగుల అవసరతలన్నీ తీర్చుటకు ఆయా విభాగాలుంటాయి. అదే విధంగా క్రీస్తు శరీరము కూడా ప్రజలందరికీ సహాయపడేందుకు ఆయా రకాల పరిచర్యలు, అనేకమైన ఆత్మ వరాలు కలిగివుంది. ఏ ఒక్క సంఘముగానీ, గుంపుగానీ ఆత్మ వరాలన్నిటినీ కలిగియుండలేదు. కానీ క్రీస్తు శరీరమంతటిలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. క్రీస్తు శరీరములో మన సొంత నిర్దిష్టమైన పిలుపు ఏమిటో మనము తెలుసుకోవాలి.

లోకమంతా ఆత్మీయముగా జబ్బుపడిన మానవులతో నిండి ఉంది. దానిలో ఎవ్వరూ నిరీక్షణారహితులు కానేకారు. ఎవరైనా ప్రభువుచేత సంపూర్ణ స్వస్థతపొందగలరు. మనము ప్రకటిస్తున్న సువార్త యొక్క శుభవార్త ఇదే. ఒక భయంకర పాపి, అతి భ్రష్టుడైన వాడు కూడా ప్రభువు ఆసుపత్రికి వచ్చి చికిత్సపొంది బాగుపడగలడు, తీవ్రమైన రోగంతో కృషించిపోతున్నవాడినైనా ఓ మంచి ఆసుపత్రి మేము చేర్చుకొనలేమని చెప్పదు. భయంకర రోగాలకు చికిత్స చేయడానికి సరైన పరికరాలు లేనందుచేత నాణ్యతలేని చిన్న ఆసుపత్రులు అటువంటి రోగుల్ని చేర్చుకొనవు. అదే విధముగా ఒక మంచి సంఘము తనను ఆశ్రయించినవాడు ప్రపంచంలోకెల్లా మహా గొప్పపాపి అయినప్పటికీ అతడు నిరీక్షణా రహితుడని చెప్పదు.

ఒక మంచి సంఘము అత్యంత భ్రష్టులైన పాపులను కూడా చికిత్స పొందుటకు ఇష్టపడితే మహాగొప్ప పరిశుద్ధులుగా మార్చగలదు. సంఘాన్ని ఒక మానవ శరీరముతో కూడా పోల్చవచ్చు. మానవ శరీరములోని ప్రతి అవయవము ఒక్కొక్క పని కలిగి ఉంటుంది. ఆ అవయవము తన పని నెరవేర్చటం మీదనే లక్ష్యముంచుతుంది. అయినప్పటికీ అది వేర్వేరు పనులు కలిగియున్న ఇతర శరీర భాగాలకు తగిన విలువనిస్తూ, అభినందిస్తూ సహకరిస్తుంది. క్రీస్తు శరీరములోని ఇతర పరిచర్యలతో మనము కలసి పని చేసేటప్పుడు ఈ విధముగానే చేయాలి. క్రీస్తు శరీరములో ఆత్మ వరాలు పనిచేసే తీరును చిత్రీకరించుటకు ఉదాహరణగా 1 కొరింథీ 12వ అధ్యాయములో పరిశుద్ధాత్ముడు కళ్ళు, చెవులు, చేతులు, పాదాలను ప్రస్తావించాడు.

నేను బైబిల్లోని కొన్ని విషయాలను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పుతాను. ప్రభువు నాకిచ్చిన భారమే దీనికి కారణం. ప్రభువు నన్ను పిలిచి అప్పగించిన పరిచర్యను నేను హత్తుకొన్నాను. ఎందుకంటే ఈ పరిచర్యలో మాత్రమే నేను ప్రభువుకు ప్రయోజనకరంగా ఉండగలను, ఇది నాకు తెలుసు. దీనికి భిన్నమైన పని ఏదైనా నేను చేస్తే నా విషయంలో దైవ సంకల్పాన్ని నేను భంగం చేసినవాడనవుతాను. కానీ ఇతర పరిచర్యలకు నేను విరోధముకాదు. వాటిని నేను ఉన్నతముగా పరిగణిస్తాను. చేయి చేసే పనిని కడుపు ఘనపరుస్తుంది, కానీ కడుపు ఎన్నటికీ చేయి చేసే పని చేయుటకు ప్రయత్నించదు. ఉదాహరణకు, కడుపు ప్లేటులో ఉన్న ఆహారమును తీసుకొనుటకు ఎప్పుడూ ప్రయత్నించదు. చేతిని ఆ పనిని చేయుటకు అనుమతించి, తన స్వంత పనియైన చేయి తీసిచ్చిన ఆహారమును జీర్ణము చేసుకొంటుంది. క్రీస్తు శరీరములో ఉన్న మనము పరస్పరము ఏ విధముగా ఘనపరుచుకోవాలో దానికిది సాదృశ్యము. శరీరములో ఇమిడియున్న ఈ వివిధ పరిచర్యల సత్యాన్ని చాలా మంది విశ్వాసులు చూడలేదు. మీరు ఈ సత్యాన్ని గమనించకపోతే దేవుడు నెరవేర్చాలని సంకల్పించిన కార్యమును మీరెన్నడూ సాధించనేరరు. దేవుడు మనల్ని దేనికొరకు పిలిచాడో అను విషయమును మన మనసుల్లో స్వష్టముగా అర్థము చేసుకొనుట మంచిది. సాధారణంగా ప్రభువు మన హృదయాల్లో పెట్టిన భారమే తన శరీరములో మనము చేయవలసిన పరిచర్యను సూచిస్తుంది. మరెవ్వరూ సాధించలేని వ్యత్యాసమైన, అసాధారణ పరిచర్య నీకు క్రీస్తు శరీరములో ఉందనే విషయాన్ని నీవు స్పష్టముగా అవగాహన చేసుకోవాలి. అంతేగాక ఆ పరిచర్య ఎన్నటికీ సమతుల్యత కలిగియుండదు. శరీరములో వేరే ఇతర పరిచర్యలు కలిగియున్న సహోదరులతో సహవాసము చేస్తూ పనిచేయుట ద్వారా మాత్రమే నీ సమతుల్యతను కనుకొనగలవు. ఈ విధముగా ఇతరులపై ఆధారపడేలా చేస్తూ దేవుడు మనల్ని దీనులుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం! ఒక విద్యార్థి ఇంగ్లీషులో తెలివిమంతుడై గణితంలో మందబుద్ధియై ఉన్న విధముగా మన జీవితములో కొన్ని విభాగాల్లో మనము బలవంతులము, మరికొన్నిటిలో బలహీనులము. అయితే మనము ఎక్కడ బలహీనులమో తెలుసుకొని ఆ ప్రాంతాలను బలపర్చుకోవాలి. మీ సంఘము సువార్తను గూర్చి చెప్పే విషయములో బలముగా ఉండవచ్చు. కాని పరిశుద్ధతను గూర్చి చెప్పే విషయములో బలహీనముగా ఉండవచ్చు. అటువంటప్పుడు మీ సంఘము ఎటువంటి పరిచర్యను చేపట్టవలసివుందో నీకు తెలుస్తుంది.