వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

"ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ మార్గము విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ మార్గము సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే" (మత్తయి 7:13-14).

నాశనము అనగా నిత్య నరకము. కొండమీది ప్రసంగంలో యేసుప్రభువు నరకం గురించి మాట్లాడారా? నిశ్చయముగా మాట్లాడారు. ఆయన మూడుసార్లు దానిని గూర్చి ప్రస్తావించారు. నాశనమునకు పోవు మార్గాన్ని ఒకసారి చూద్దాము. మత్తయి 5:22లో యేసుప్రభువు ఇలా సెలవిచ్చారు: "నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడును న్యాయసభకు లోనగును; తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును". మరల మత్తయి 5:28లో యేసుప్రభువు ఇలా చెబుతున్నారు: "మోహపుచూపుతో ఒక స్త్రీని చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము... నీ కుడిచేయి నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము" (మత్తయి 5:29, 30); లేనియెడల నీ శరీరమంతయు నరకములో పడవేయబడునని యేసు చెప్పారు. నాశనమునకు పోవు మార్గం ఇదే. అదుపులేని కోపము మరియు నియంత్రణ లేని కామవాంఛల మార్గమే ఆ విశాల మార్గము, మరియు లక్షలాది మంది ప్రజలు ఆ మార్గంలోనే నడుస్తున్నారు. కోపంతో, లైంగిక దురాశలతో, అదుపులేని పాపపు కామవికారాలలో జీవిస్తూ అమాయక స్త్రీలను పాడుచేసేవారితో ఈ లోకం నిండిపోయింది. నాశనమునకు నడిపించే విశాల మార్గం ఇదే.

ఒక వ్యక్తి తాను తిరిగి జన్మించిన క్రైస్తవుడినని చెప్పుకుంటూ, ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలను చూస్తే ఏమవుతుంది? (మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారిని దోపిడీ చేస్తున్నారు). లేదా ఆ క్రైస్తవుడు బాహ్యంగా తన కోపాన్ని ప్రదర్శిస్తే ఏమౌతుంది? అది నాశనమునకు పోవు మార్గమే. అతడు తనను తాను క్రైస్తవుడని పిలుచుకున్నా లేక క్రైస్తవేతరుడని పిలుచుకున్నా ఏ వ్యత్యాసమూ లేదు. అతడు నాశనపు మార్గంలోనే ఉన్నాడు. అది విశాలమైన మార్గం.

ఈ మార్గమును కొన్నిసార్లు బోధకులే విశాలం చేస్తుంటారు. మనము అంత సంకుచిత మనస్తత్వం కలిగి ఉండనవసరం లేదని, కేవలం వీటిని జయించిన వారు మాత్రమే నిత్యజీవములోనికి ప్రవేశిస్తారని చెప్పడం సరికాదని వారు అంటారు. లేదు, వారు యేసుప్రభువు బోధించిన ద్వారము కంటే మరింత వెడల్పయిన ద్వారముగా దానిని మారుస్తున్నారు. జీవమునకు పోవు మార్గము సూదిబెజ్జము వంటిదని యేసుప్రభువు సెలవిచ్చారు. ఒంటె సూదిబెజ్జములో దూరి పోగలదా? పోలేదు. ధనవంతుడు (తన సొంత జ్ఞానంలో ధనవంతుడైనవాడు) దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరి పోవుట సులభమని యేసు సెలవిచ్చారు. మనం ధనవంతులము అవ్వడం కేవలం డబ్బు విషయంలోనే కాదు; మన బుద్ధివిషయంలో కావచ్చు, వాక్యమును ధ్యానించేటప్పుడు మనము చేసే మేధోపరమైన వాదనలు కావచ్చు. అటువంటి వాదనలతో మనము దేవుని వాక్యము యొక్క తీవ్రతను నీరుగారుస్తుంటాము. నాశనమునకు పోవు ఆ విశాల మార్గం ద్వారా మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ మార్గము సంకుచితమునై యున్నది. కొండమీది ప్రసంగంలో యేసుప్రభువు ప్రకటించిన మార్గం ఇదే. యేసుప్రభువు చెబుతున్నది ఏంటంటే: "ఇప్పటివరకు నేను ఇక్కడ చెప్పినదంతా ఎంతో ఇరుకైన ద్వారము మరియు ఎంతో సంకుచితమైన మార్గము, కానీ అది జీవమునకు నడిపించే ఏకైక మార్గము. దానిని కనుగొనేవారు చాలా కొద్దిమంది మాత్రమే." కొండమీది ప్రసంగంలో వివరించబడిన ఆ మార్గాన్ని లక్షలాది మంది ఎన్నుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఎంతమాత్రం కాదు.

కొండమీది ప్రసంగం క్రైస్తవేతరుల కోసం ఉద్దేశించినది కాదు. అది శిష్యులు కానివారి కొరకు కాదు. తమ జీవితంలో మారుమనస్సు మరియు క్రీస్తునందు విశ్వాసమనే పునాదిని వేసుకుని, నూతన జన్మ పొంది, దేవుని పిల్లలుగా మారినవారి కోసమే ఇది ఉద్దేశించబడింది. ఒక వ్యక్తి ఆ మొదటి అడుగు వేయకుండానే కొండమీది ప్రసంగాన్ని పాటించడానికి ప్రయత్నిస్తే, అతడు పునాది లేకుండా ఇల్లు కట్టే మనుష్యుని వలె ఉంటాడు. కానీ ఇక్కడ ప్రభువును వెంబడించాలని ఆశించే శిష్యుల గురించి చెప్పబడింది. ఇది చాలా ఇరుకైన ద్వారమని, దీనిని కనుగొనేవారు చాలా కొద్దిమందేనని వారు గ్రహిస్తారు. మత్తయి 5 నుండి 7 అధ్యాయాలలో వ్రాయబడిన వాటన్నిటికీ విధేయత చూపడానికి వేలాది మంది ఎగబడి వస్తారని నేను అనుకోవడం లేదు.

వేలాది మంది ప్రజలతో కిటకిటలాడే మెగా చర్చిలను చూసినప్పుడు, జీవమార్గమును కనుగొన్న ఆ "కొద్దిమంది" వీరేనా? లేదా తప్పుడు బోధకుల చేత మోసగించబడి, నాశనమునకు పోవు విశాల మార్గంలో నడుస్తున్న ప్రజలా వీరు? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మనము వారిలో ఎవరికీ తీర్పు తీర్చాలని అనుకోవడం లేదు. ఒక చిన్న ప్రాంతంలో ముప్పై వేల మంది ప్రజలు కొండమీది ప్రసంగానికి లోబడి యేసుప్రభువును వెంబడించాలని ఆశిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. క్రీస్తును వెంబడించాలని ఆశించే మూడు లక్షల మంది విశ్వాసులు గల సంఘం ఉంటే నేను ఆనందిస్తాను. కానీ ఈ భూమి మీద క్రీస్తును వెంబడించకుండా కేవలం చనిపోయాక పరలోకానికి వెళ్ళాలని ఆశించే 3 లక్షల మందిని చూసి నేను సంతోషించలేను. నేను గమనించినంత వరకు, చాలా సంఘాలలో కూర్చునే విశ్వాసులు ఈ భూమి మీద క్రీస్తును వెంబడించకుండానే పరలోకానికి వెళ్ళాలని ఆశిస్తున్నారు. అది యేసుక్రీస్తు యొక్క నిజమైన సంఘం కాదు. ఆ సంఘముపై పాతాళలోక ద్వారములు నిశ్చయముగా జయించును; ఎందుకంటే ఎటువంటి వెల చెల్లించకుండానే అనేకమంది ప్రజలు లోపలికి రావడానికి అక్కడి బోధకులు ద్వారమును వెడల్పు చేశారు. డబ్బును ప్రేమిస్తూనే, దేవుని కూడా ప్రేమిస్తున్నామని భ్రమపడేంత విశాలంగా ఆ ద్వారము మార్చబడింది. వారు ద్వారమును వెడల్పు చేసి, ఆ సంఘములో యేసుప్రభువుకు శిష్యులను తయారుచేస్తున్నామని తమను తామే మోసం చేసుకుంటున్నారు.

జీవమునకు పోవు ఆ ద్వారము ఎంతో ఇరుకైనదని, ఆ మార్గము ఎంతో సంకుచితమైనదని, దానిని నిజంగా కనుగొనేవారు అతి కొద్దిమంది మాత్రమేనని కొండమీది ప్రసంగం ముగింపులో యేసుప్రభువు వివరించారనే సత్యాన్ని మనము స్పష్టంగా గ్రహించాలి.

ఆ వెంటనే ఆయన చెప్పిన మాట: "అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి" (మత్తయి 7:15). ఈ లేఖన సందర్భంలో ఆ అబద్ధ ప్రవక్తలు ఎవరనేది మనము చూడాలి. ఈ అబద్ధ ప్రవక్తలు సంఘములోనికి వచ్చి వేరే మతం గురించి మాట్లాడేవారా, లేక వేరొక మత గ్రంథం నుండి బోధించేవారా? కాదు. అబద్ధ ప్రవక్తలు "గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వచ్చేవారు". గొఱ్ఱెల చర్మములు వేసుకోవడం అంటే పైకి యేసుక్రీస్తు దాసులుగాను, క్రీస్తు యొక్క గొఱ్ఱెలుగాను కనిపించడం. వారు గొఱ్ఱెల వేషంలో వస్తారు. చూడటానికి గొఱ్ఱెల్లాగే ఉంటారు. చేతిలో బైబిలు పట్టుకుని వస్తారు, కానీ మార్గాన్ని మాత్రం విశాలం చేస్తారు. లేఖనాలలో ఉన్న ఆజ్ఞలను నీరుగారుస్తూ... "ఈ ఆజ్ఞ అంత అవసరం లేదు" అనో, లేదా "దీని అసలు ఉద్దేశం ఇది కాదులే..." అనో వక్రీకరిస్తారు. లేఖనాలలో ఉన్న ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలను ఈ మనుష్యులు తారుమారు చేయడానికి ప్రయత్నించారు. ఫిలిప్పీ 4:4లోని "ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి" అనే వచనం దగ్గరకు రాగానే... "ఎల్లప్పుడూ అంటే 24 గంటలూ అని కాదు, సాధారణంగా ఎక్కువగా ఆనందంగా ఉండాలని అర్థం" అని చెబుతారు. ఫిలిప్పీ 4:6లో "దేనినిగూర్చియు చింతపడకుడి" అని ఉంటే... "దేనిని గూర్చియు అంటే పూర్తిగా చింత లేకుండా ఉండటం అని కాదు, సాధారణంగా ఆందోళనలను తగ్గించుకోవాలని అర్థం" అంటారు. 1 థెస్స 5:18లో "ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము" అని ఉంటే... "ప్రతి విషయంలో అంటే ప్రతి చిన్నదానికి కృతజ్ఞత చెప్పాలని కాదులే" అని తేలికగా తీసిపారేస్తారు.

దేవుడు ఏమి చెప్పారో ఖచ్చితంగా దాన్నే ఉద్దేశించారని అంత్యదినమున యేసుక్రీస్తు న్యాయపీఠం యెదుట నిలబడినప్పుడు మీరు గ్రహిస్తారు. క్రీస్తు ఏమి చెప్పారో ఖచ్చితంగా దాన్నే ఉద్దేశించి మాట్లాడారు. బైబిల్లోని ఈ మాటలను మీరు నమ్మకపోతే, యథార్థంగా ఆ పేజీలను బైబిలు నుండి చించి పారేయండి లేదా కొట్టివేయండి.

బైబిలు దేవుని వాక్యమని ఒప్పుకుంటూ, దానికి లోబడకపోతే మీరు నయవంచకులుగా, వేషధారులుగా మిగిలిపోతారు. దేవుడు ఈ వేషధారణకు తీర్పు తీర్చబోవుచున్నాడు. దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు. వేషధారులైన క్రైస్తవుల కంటే దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తాడని నేను నమ్ముతాను, ఎందుకంటే కనీసం వారు యథార్థంగా ఉంటారు. దేవుడు లేడని వారు నమ్ముతారు, దేవుడు లేనట్లే ప్రవర్తిస్తారు. లోకంలో ఉండే వ్యాపారస్తుడు డబ్బు తప్ప వేరే దేవుడు లేడని నమ్ముతాడు; అతడు డబ్బునే పూజిస్తాడు, ఆ విషయంలో అతడు యథార్థంగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తే నిజమైన దేవుడని, బైబిలే దేవుని వాక్యమని చెప్పుకుంటూ, లోకస్థుల వలె జీవించే క్రైస్తవులే అసలైన వేషధారులు. క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువగా ఆ వేషధారులనే ఖండించారని జ్ఞాపకముంచుకోండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ రక్షించబడింది, సిలువపై ఉన్న దొంగ రక్షించబడ్డాడు, నరహంతకుడు రక్షించబడ్డాడు; కానీ వేషధారులు మాత్రం నరకానికే వెళ్లారు.