వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

బైబిల్‍లో ఒక దానికొకటి వ్యతిరేకముగా ఉన్న రెండు రకాల పరిచర్యలను మన కాలంలో చూస్తున్నాము.

దానియేలు పరిచర్య:

దానియేలు అతడి తరములో అన్యదేశములో దేవుడు వాడుకొన్న వారిలో ఒకడు. అతడు యౌవ్వనుడుగా, మిగిలిన యూదులతో కలిసి బబులోను చెరలో ఉన్నప్పుడు "తన్ను అపవిత్ర పరచుకొనకూడదని తన హృదయమందు ఉద్దేశించెను" (దాని 1:8).

ఎప్పుడైతే హనన్యా, మిషాయేలు మరియు అజర్యా చెరలో ఉన్న తమతోటి యౌవ్వనుడైన దానియేలు దేవుని కొరకు నిలువబడుటను చూచారో (దాని 1:11), వారికి వారుగా దానియేలుతో నిలువబడుటకు వారు కూడా ధైర్యము తెచ్చుకొనిరి. వారంతట వారు దేవుని కొరకు నిలువబడుటకు వారికి ధైర్యములేదు, కాని వారు దానియేలు నిలువబడుట చూచినప్పుడు ధైర్యము తెచ్చుకొనిరి. ఈనాడు దేవుని కొరకు వారికి వారుగా ధైర్యముగా నిలువబడలేని అనేకమంది, దానియేలు వంటివారు నిర్ణయము తీసుకొని నిలువబడుట కొరకు చూచుచున్నారు. అప్పుడు వారు కూడా అతడితో ఏకమగుదురు. ఈరోజు దానియేలుల కొరకు దేవుడు చూస్తున్నాడు.

ప్రభువు కొరకు నీవు అటువంటి దానియేలుగా యుందువా? "శిష్యత్వం గురించి దేవుని వాక్య బోధల విషయంలో కాని(లూకా 14:26-33), లేక కొండమీద ప్రసంగంలో యేసు బోధలలో కాని (మత్తయి 5-7 అధ్యా.), క్రొత్త నిబంధన గురించి కాని(రోమా 6:14), క్రీస్తు శరీరమును గురించి కాని (ఎఫెసి 4:11-16) లేక మరేదైనా దాని విషయంలో నేను రాజీపడను. రాజీపడే పాస్టర్ లేక పెద్దను లేక ఏ విశ్వాసినైనా సంతోషపర్చుటకు నేను చూడను. నేను దేవుని వాక్యము ఏమి చెప్తుందో అది చేయుటకు 100% నిలువబడుదును" అని నీవు చెప్పగలవా?

"అనేకులను నీతి మార్గములోనికి త్రిప్పు"(దాని 12:3) దానియేలు పరిచర్యకు, స్త్రీ పురుషుల అవసరత ఈనాడు మన దేశములో ఎంతో ఉన్నది. ఈ వచనము నీతిని గూర్చి బోధించే బోధకులగురించి చెప్పుటలేదు. కాని, వారి జీవితమే మాదిరిగా కలిగి బోధించి ఇతరులను నీతి మార్గములోనికి త్రిప్పు వారి గూర్చి చెప్పుచున్నది.

లూసిఫరు పరిచర్య:

మనము లేఖనములలో మరియొక పరిచర్యను గూర్చి చదువుదుము. అది దానియేలు పరిచర్యకు పూర్తిగా వ్యతిరేకమైన పరిచర్య.

అది "లూసిఫరు పరిచర్య"

ప్రకటన 12:4లో సాతానుగా మారిన లూసిఫరు(యెషయా 14:12) దేవదూతలలో(నక్షత్రములు) మూడవవంతును క్రిందికి ఈడ్చినట్లుగా చదువుతాము(యోబు 38:7లో దేవదూతలు "నక్షత్రములని" పిలవబడ్డారు, యెషయా 14:12లో లూసిఫరు "తేజోనక్షత్రమని" పిలువబడ్డాడు). దేవునికి విరోధముగా తిరిగుబాటు చేయుటకు తనను వెంబడించుటకు కోటానుకోట్ల దేవదూతలలో మూడవవంతు దేవదూతలను త్రిప్పుటలో లూసిఫరు విజయం సాధించాడు. తిరుగుబాటుచేయు దేవదూతలన్నియు లుసిఫరు ద్వారా సమకూడుటకు దేవుడు వేచియున్నాడు. అప్పుడు తన సన్నిధినుండి ఏకముగా వెళ్ళగొట్టాడు. భూమిమీద తిరుగుచు, ప్రజలను పట్టుచున్న దయ్యాలు ఇవే.

అంతమంది దేవదూతలను తప్పుదారి పట్టించునట్లు లూసిఫరును దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఎందుకంటే దానిద్వారా తిరుగుబాటు మరియు అసంతృప్తి కలిగిన దేవదూతల నుండి పరలోకము పవిత్ర పర్చబడినది. వారి మధ్య లూసిఫరు లేచి వారిని దేవునికి విరోధముగా తిరుగుబాటుకు రేపక పోయినట్లయితే వారి దుష్ట హృదయములు బయటపడి యుండేవికాదు.

అందుచేత ఈనాడు కూడా సహోదర సహోదరిలు సంఘములో లూసిఫరు పరిచర్య కలిగియుండునట్లు దేవుడు అనుమతించును. సంఘములో ఉన్న అధికారముపై తిరుగుబాటు స్వభావముకలిగినవారు(లూసిఫరు వంటి వారు) ఇంటింటికి వెళ్లి నేరారోపణ చేయునట్లును, కొండెములు చెప్పుకొనునట్లు, అబద్దములాడి చెడు మాట్లాడునట్లు, ఇమెయిల్స్‍ పంపునట్లును దేవుడు అనుమతించును. దానిని బట్టి సంఘములో నుండిన తిరుగుబాటు, అసంతృప్తి మరియు లోకతత్వపు విశ్వాసులు గుర్తింపబడి, బయట పెట్టబడి, అటువంటి వారందరు ఒకరి తరువాత ఒకరుగా లేక ఏకముగా సంఘము నుండి బయటకు వెళ్లిపోవుట ద్వారా క్రీస్తు శరీరమైన సంఘము పవిత్రపరచబడును.

దేవుడు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం పరలోకములో మొదట లూసిఫరును ఆపనట్లుగానే, సంఘములో తిరుగుతూ లూసిఫరు పరిచర్య చేయుచుండు వారిని దేవుడు ఆపడు. సంఘమును పవిత్రపరచుటకు అది దేవుని మార్గము.

కాని లూసిఫరు పరిచర్యలో పాల్గొనే వారి గురించి మనము విశ్వాసులను హెచ్చరించాలి. రోమా 16:17, 18లో పౌలు విశ్వాసులను ఇలా హెచ్చరించాడు "సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేధములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు".

మనం ఇటువంటి లూసిఫరులు చేసేవాటిని గూర్చి భయపడము. కనుక వారితో మనము పోరాడము. వారు సంఘమును చెడగొట్టలేరు. వారు దేవుని వనములోనుండి గురుగులను మాత్రమే తీసివేయగలరు. సంఘమును శుభ్రపరచుచు మనకు వారు సహాయపడుతున్నారు. దేవుడు తానే సంఘమును భద్రపర్చును.

"వారు మనలోనుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్ళిరి" అని 1 యోహాను 2:19లో అపొస్తలుడైన యోహాను చెప్పాడు.

తన సంఘమును అపవిత్ర పర్చువారిని దేవుడు నాశనము చేయును (1 కొరింథీ 3:17). దేవుడు ఎవరి నాశనమును కోరడు; మనము కూడా కోరుకోకూడదు. ఆయన దీర్ఘశాంతము గల దేవుడు మరియు ఎవరూ నశించిపోవుట ఆయన కిష్టములేదు కాబట్టి ఆయన తీర్పు తీర్చుటకు ముందు అనేక సంవత్సరములు వేచియుండును. ప్రతిఒక్కరు మారుమనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు; మనము కూడా కోరుకోవాలి.

నోవహు కాలములో, దేవుడు 120 సంవత్సరములు వేచియుండెను. కాని ఆయన తీర్పు తీర్చునప్పుడు, ఆయన తీర్పు తీవ్రముగా ఉండును.

విభజింపబడుటలో దేవుని ఉద్దేశం:

అందువలన సంఘము ఎప్పుడు చీలిపోలేదని అతిశయించుట బుద్ధిహీనతయై యున్నది. ప్రారంభములో పరలోకములోనే దేవదూతలలోనే చీలికవచ్చినది. అటువంటి చీలికలు అవసరము. ఎందుకంటే "మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు" (1 కొరింథీ 11:19).

మొదటిరోజు దేవుడు వెలుగును సృష్టించినప్పుడు, "వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను". ఆ తరువాత చేసిన పని "దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను" (ఆ.కా. 1:4). దేవుడు తన సంఘములో ఆ పనినే చేస్తున్నాడు - ఎందుకంటే చీకటితో వెలుగు పొత్తు కలిగియుండలేదు. ఈనాడు సంఘములోని ప్రజలు ఆవిధముగా వేరుచేయబడనట్లయితే, భూమిపై దేవుని సాక్ష్యము అపవిత్రపరచబడును. కాబట్టి మనము పవిత్రమైన సంఘము కలిగియుండుటకు లూసిఫరు పరిచర్య చేయునట్లుగా వారిని అనుమతిస్తాము. దేవుని మార్గములు నిజముగా ఎంతో అద్భుతములు.

మనమందరము దానియేలు పరిచర్య కలిగియుండి సంఘములో ఐకమత్యమును మరియు సహవాసమును కట్టవచ్చును లేక లూసిఫరు పరిచర్య కలిగి విబేధమును విత్తవచ్చును (సామెతలు 6:16-19). మనము మధ్యస్థముగా ఉండలేము. ఆయనతో కలసి సమకూర్చనివాడు ఆయన దగ్గరనుండి ప్రజలను చెదరగొట్టు వాడని యేసు ప్రభువు చెప్పెను. సంఘములో రెండు పరిచర్యలేయున్నవి. అవి సమకూర్చుట మరియు చెదర గొట్టుట (మత్తయి 12:30).

మన సంఘములలో ఎవరైతే పదవిని లేక గౌరమును లేక తర్కించే ఆత్మ లేదా వారికంటే చిన్నవారు ఆత్మీయముగా ఎదుగుటను చూచి అసూయపడేవారు మొదలగువారిని దేవుడు బహిర్గతపరచి జ్ఞానులను మరియు సంఘములో గొప్పవారనుకొనువారిని వారి 'కుయుక్తి' లో పట్టుకొని (1 కొరింథీ 3:19) మరియు సంఘమును 'హైజాక్' చేయాలని వారు వేసే రహస్య ప్రణాళికను వమ్ముచేశాడు. ప్రభువు మన గూర్చి జాగ్రత్త వహిస్తున్నాడనటానికి అది ఋజువు మరియు మన దేశములో తన నామ మహిమకొరకు స్వచ్ఛమైన సాక్ష్యము ఉండాలని దేవుని బలమైన కోరిక అయిఉన్నది.

సైతాను యొక్క కుయుక్తులనుండి మనలను కాపాడుటకు ఎల్లప్పుడు ప్రభువు దృష్టి మనమీద ఉంటుంది కాబట్టి ప్రభువునకు స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించనియెడల దానికట్టువారి ప్రయాసము వ్యర్ధమే (కీర్తన 127:1). ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి నివసించెదరో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు (కీర్తన 133:1,3). ఐక్యత కలిగిన సంఘము మాత్రమే పాతాళలోక ద్వారములను జయించును. మన క్రైస్తవ సహవాస సంఘములలో పరిశుద్ధాత్మ బహుబలముగా పనిచేసి అటువంటి ఐక్యతను కలుగజేయునుగాక.

మనతో ఉన్నవారు కూడా గర్వించే అవకాశమున్నది కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభువు తనకార్యమును మనలో కొనసాగించునట్లు మనము ప్రార్ధించాలి. అయినప్పటికి మనకు దేవుని వాగ్ధానము ఉన్నది. " ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించువారిని నీలోనుండి వెళ్ళగొట్టెదను___ మరియు దు:ఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించువాని జనశేషముగా నీ మధ్యనుండనిత్తును" (జెఫన్యా 3:11,12). తమ్ముతాము తగ్గించుకొను వారితోను, దీనులతోను దేవుని సంఘము కట్టబడును.

ఆయన సంఘము పవిత్రమైనదై ఉండాలని దేవుడు కోరుచున్నాడు గనుక సరియైన సమయములో రూకలు మార్చువారిని దేవాలయములోనుండి పంపినట్లు స్వంతమును కోరువారిని ఆయనే స్వయముగా తన విధానములో మరియు తన సమయములో సంఘములోనుండి తోలివేయును.

ప్రతి స్థలములోను పవిత్రమైన క్రీస్తు సంఘమును నిర్మించునట్లుగా మరియు ఈ చివరి దినములలో దేవుడు కోరుకొనుట్లుగాను జీవించునట్లుగాను మనము కృపను జ్ఞానమును పొందుదుముగాక ఆమెన్.