మన ప్రభువిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞకు తప్పక లోబడుటకు, అభ్యాసము చేయుటకు శిష్యులకు బోధించవలెనని మత్తయి 28:20 చెప్తుంది. ఇదే శిష్యత్వపు మార్గము. అనేకమంది విశ్వాసులు లోబడుటకు పట్టించుకోని యేసు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలను మత్తయి 5,6,7వ అధ్యాయములను చదివినంత మాత్రమున చూడవచ్చును. శిష్యుడనగా నేర్చుకొనువాడు మరియు వెంబడించువాడు.
ఎవరైతే యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికి వారికి వారుగా విధేయత చూపుదురో ఎవరైతే యేసు యొక్క ఆజ్ఞలకు విధేయత చూపునట్లు ఇతరులకు బోధించు కోర్కె కలిగియుండి ఆ విధముగా క్రీస్తు శరీరమును కట్టుదురో, ఎవరైతే దేవుని సంపూర్ణ సంకల్పమును ప్రకటించాలనే పిలుపుతో పట్టబడుదురో అటువంటి వారి అవసరమున్నది.
ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగియుండుటను బట్టి తన శిష్యులందరు గుర్తింపబడెదరని యేసు చెప్పెను (యోహాను 13:35). అది గమనించండి! యేసు క్రీస్తు శిష్యులు వారి బోధలలో నుండిన నాణ్యత లేక వారి సంగీతము, ఇంకా వారు భాషలలో మాట్లాడుట లేక కూటములకు బైబిలు పట్టుకొని వెళ్ళుట, కూటములలో వారు చేయు శబ్దమును బట్టి గుర్తింపబడరు. వారు ఒకరిపైనొకరికుండిన తీవ్రమైన ప్రేమను బట్టి గుర్తింపబడెదరు.
క్రీస్తు యొద్దకు జనులను తీసుకువచ్చే సువార్త కూటము, ఒకరి నొకరు ప్రేమించుకొనే శిష్యులుగల సంఘము ఆ ప్రాంతములో స్థాపింపబడునట్లు వారిని నడిపించవలెను. అయినప్పటికిని విచారించాల్సిన విషయమేమిటంటే, సంవత్సరము తరువాత సంవత్సరము సువార్త కూటములుజరిగే అనేక స్థలములలో, ఒకరితో ఒకరు పోట్లాడుకొనుట లేక ఒకరి గూర్చి ఒకరు వెనుక మాట్లాడుకొనుట మొదలైనవి లేకుండా ఒకరి నొకరు ప్రేమించుకొనే సభ్యులు గల సంఘమని చెప్పబడే సంఘముండుటను చూచుట బహు కష్టము.
క్రొత్తగా మార్పు చెందిన వారు అటువంటి జయ జీవితమును జీవించ లేకపోవుటను అర్థము చేసుకొనవచ్చును. కాని మన దేశ సంఘములలో చివరకు పెద్దలు మరియు క్రైస్తవ నాయకులలో తగువులు, అపరిపక్వత ముఖ్య లక్షణముగా ఉంటే దానికి ఏమనాలి?
ఇది ’అప్పగింపబడిన గొప్ప పనిలో రెండవది మరియు ముఖ్య భాగము’గా ఉన్నది (మత్తయి 28:19,20 లో చెప్పబడినది). శిష్యత్వము మరియు యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికి లోబడుట అను దానిని పూర్తిగా పట్టించు కొనలేదను దానికి తేటయైన ఋజువుగా నున్నది.
సాధారణముగా మనకు అప్పగింపబడిన గొప్ప పనిలో (మార్కు 16:15 ) మొదటి భాగము మాత్రమే ప్రతి చోట వక్కాణించి చెప్పబడుతుంది. అందులో ప్రాముఖ్యమైనది సువార్తీకరణ, వర్తమానము దేవుని చేత సూచక క్రియలు అద్భుతములతో స్థిరపరచబడుటై యున్నది.
అదలా ఉండగా మత్తయి 28:19,20 శిష్యత్వము గూర్చి ప్రాధానంగా చెప్తుంది, అది యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికి పూర్తిగా విధేయత చూపు శిష్యుని యొక్క జీవితములో కనబడుతుంది. అనేక మంది క్రైస్తవులు మొదటి దానినే ముఖ్యముగా ఎంచుకొందురు, కాని చాలా కొద్ది మంది మాత్రమే తరువాత దానిని ఎంచుకొందురు. కాని ఇది లేకుండా మొదటిది కలిగియుండుట మానవ శరీరములో సగభాగము ఉన్నట్లుగానే ఏవిలువా లేనిదిగా నుండును. అయితే ఎంత మంది దీనిని చూస్తున్నారు?
యేసు యొక్క పరిచర్యలో ఆయన యొక్క సువార్త సేవను బట్టి, స్వస్థత పరిచర్యను బట్టి జన సమూహములు ఆయనను వెంబడించినట్లు చదువుదుము. అయితే ఆయన ఎప్పుడూ వారివైపు తిరిగి శిష్యత్వము గూర్చి చెప్తూ ఉండేవారు (లూకా 14:25,26). ఈనాటి సువార్తికులు అలా చేయగలుగుచున్నారా? అది వారు కాని, లేక సువార్తికులు మొదలు పెట్టిన పనిని, అపొస్తలులు, ప్రవక్తలు, బోధకుల మరియు కాపరుల సహకారముతో పూర్తి చేయగలుగుచున్నారా?
శిష్యత్వము గూర్చిన సందేశమును బోధించుటకు బోధకులు ఎందుకు వెనుకాడుదురు? అది వారి సంఘములో సంఖ్యను తగ్గించును కాబట్టి దానిని బోధించరు. కాని వారు అర్థము చేసికొననిదేమంటే అది వారి సంఘము యొక్క నాణ్యతను ఎంతగానో పెంచుతుందనేది!!
యేసు శిష్యత్వము గూర్చి జన సమూహములకు బోధించినప్పుడు, వెంటనే సంఖ్య పదకొండు శిష్యులకు తరిగిపోయినది (యోహాను 6:2ను 6:70 తో పోల్చి చూడండి). ఇతరులు ఆయన బోధ బహు కష్టమైనదని చెప్పి ఆయనను విడిచి వెళ్లిపోయిరి (యోహాను 6:60,66). అయితే ఆయనతో పాటుగా ఉండిన ఆ పదకొండు మంది శిష్యులతోనే చివరకు దేవుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాడు.
మొదటి శతాబ్దములో ఆ పదకొండు మంది శిష్యులు మొదలు పెట్టిన ఆ పరిచర్యను, ఈనాడు క్రీస్తు శరీరమైయున్న మనము కొనసాగించవలసియున్నది. జనులు క్రీస్తు యొద్దకు తీసుకురాబడిన తరువాత వారు శిష్యుత్వములోనికిని మరియు విధేయత లోనికి నడిపింపబడాల్సియున్నది. ఆ విధముగా మాత్రమే క్రీస్తు శరీరము కట్టబడుతుంది.
జీవమునకు వెళ్ళు మార్గము ఇరుకైనది, కొద్ది మంది మాత్రమే దానిని కనుగొందురు.
వినుటకు చెవి గలవాడు వినును గాక.