WFTW Body: 

ఒక విశ్వాసి నూతన సత్యంతో పట్టబడినప్పుడు, ఈ సత్యాన్ని సమతుల్యం చేయడానికి ఉద్దేశించిన ఇతర సత్యాలను విస్మరించేంతటి తీవ్రమైన స్థాయికి చాలా సులభంగా వెళ్ళగలడు. ముఖ్యంగా నిజమైన క్రైస్తవ విశ్వాసం విషయంలో ఇది నిజం.

పాత నిబంధన ప్రకారం, విశ్వాసం ముఖ్యమైనది కాదు క్రియలు మాత్రమే ముఖ్యమైనవి. దేవునిపై విశ్వాసం కలిగి ఉండటం గురించి మోషే ధర్మశాస్త్రం ఏమీ చెప్పలేదు. అయితే ధర్మశాస్త్రం, మనిషి దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే అతను పాటించాల్సిన పనుల పెద్ద జాబితా 613 ఆజ్ఞలను ఇచ్చింది.

కానీ మనం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు, "మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు" (ఎఫె. 2:8,9) అని చదువుతాము. ఆ వచనాన్ని మాత్రమే చదివి, చాలా మంది విశ్వాసులు తీవ్రమైన స్థాయికి చేరుకుని, (ఈ వచనం చెప్పినట్లుగా) క్రియలు ఒక వ్యక్తి తాను చేయగల దాని గురించి గొప్పలు చెప్పుకునేలా చేస్తాయి కనుక క్రియలు అస్సలు ముఖ్యమైనవి కాదని చెబుతారు.

కానీ కొత్త నిబంధన నిజంగా ఏమి బోధిస్తుంది? లేఖనంలోని ఒకే ఒక్క వచనంలో మీరు పూర్తి సత్యాన్ని కనుగొనలేరు. అపవాది అరణ్యంలో యేసుకు, "ఇది వ్రాయబడింది..." అని ఒక వచనాన్ని ఉటంకించినప్పుడు (మత్తయి 4:6)”, "మరోవైపు, ఇది కూడా వ్రాయబడింది..." అని యేసు చెప్పారు. కాబట్టి మనం పూర్తి సత్యాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే, లేఖనంలోని ఒక వచనాన్ని చాలా తరచుగా లేఖనంలోని మరొక వచనం (లేదా వచనాల) ద్వారా సమతుల్యం చేయాలి. లేఖనంలోని ఒక వచనంతో సాతాను ప్రభువైన యేసును కూడా మోసం చేయడానికి ప్రయత్నించినట్లయితే, నేడు లేఖనంలోని ఏదో ఒక వచనాన్ని మాత్రమే తీసుకొని విశ్వాసులను ఎంత ఎక్కువగా మోసం చేస్తాడు. కాబట్టి మనం మోసపోకుండా ఉండాలంటే లేఖనాన్ని అధ్యయనం చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్షుల మాదిరిగానే, సత్యానికి కూడా రెండు రెక్కలు ఉన్నాయి - మీరు నేరుగా ఎగరాలనుకుంటే మీరు రెండింటినీ ఉపయోగించాలి. ఒకే రెక్కతో, మీరు పూర్తిగా దారినైనా తప్పుతారు, లేదా వృత్తంలోనే తిరుగుతూ ఎప్పటికీ పురోగతి సాధించలేరు!

ఎఫెసీ 2లో మనం ఈ సమతుల్యతను చూస్తాము, అక్కడ అది ఒక పక్క ఇలా చెబుతుంది: "మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు". అయితే ఆ "ఒక్క రెక్క"పై మాత్రమే ఎగురుతూ ఎవరూ తప్పుదారి పట్టకుండా ఉండటానికి వెంటనే తరువాతి వచనం ఇలా చెబుతుంది: "వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము" (ఎఫె. 2:8-10). కాబట్టి: మనం మంచి పనుల ద్వారా రక్షింపబడలేదు కానీ మనం నడచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులను కోసం రక్షింపబడ్డాము.

ఫిలిప్పీ 2:12, 13లో కూడా మనం అదే సమతుల్యతను చూస్తాము. అక్కడ "భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి" అని మనకు ఉద్బోధించబడింది. అయితే ఇంకా ముందుకు చూచినట్లయితే, "ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే" అని చెప్పబడింది. దేవుడు మొదట మన అంతరంగంలో చేసిన పనిని మనం బాహ్యంగా అభ్యసించాలి (కొనసాగాలి).

యాకోబు 2:17,18, "విశ్వాసం క్రియలు లేనిది అయితే అది మృతమైనది" అని చెబుతుంది. ఆపై యాకోబు ఇలా చెప్పాడు, "ఎవరైనా ‘నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి’ అని అనవచ్చు. కానీ (పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడిన) యాకోబు ఇలా చెప్పాడు, "క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తాను". కాబట్టి "విశ్వాస సంబంధమైన క్రియలు" లేని విశ్వాసం మృత విశ్వాసం. మృత విశ్వాసానికి మరియు సజీవ విశ్వాసానికి మధ్య తేడా అదే.

నిజమైన క్రైస్తవ విశ్వాసం ఎల్లప్పుడూ విశ్వాస సహితమైన క్రియలను - పరిశుద్ధాత్మపై ఆధారపడి ఉత్పత్తి అయ్యే క్రియలను ఉత్పత్తి చేస్తుంది. ఫలాలను ఇవ్వడానికి కొమ్మ చెట్టుపై ఆధారపడినట్లే పరిశుద్ధాత్మపై ఆధారపడటమే విశ్వాసం. కాబట్టి, క్రొత్త నిబంధనలో కనిపించే సత్యంయొక్క సమతుల్యత మనకు నిజంగా ఉంటే, అది మన జీవితాలలోని క్రీస్తు పోలికలో - మన గృహ సంబంధాలలో మరియు మన పని ప్రదేశాలలో - విశ్వాసం ద్వారా (అంటే, ఆయనపై మనం ఆధారపడటం ద్వారా) పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉత్పత్తి చేయబడిన వాటిలో కనిపిస్తుంది.

క్రియలు లేని విశ్వాసం మృతమైన మేధో విశ్వాసం, ఇది ఒక వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఉత్పత్తి చేయబడిన నిజమైన విశ్వాసం కాదు. దేవునిపై పూర్తిగా ఆధారపడటమే నిజమైన క్రైస్తవ విశ్వాసం, ఇది ఎల్లప్పుడూ ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు పోలికను వృద్ధిచేసే ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, విశ్వాసం లేని క్రియలు అంటే ఒక వ్యక్తి తన స్వంత మానవ ప్రయత్నాల ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించడం, ఫలితంగా అది స్వీయ-నీతికి దారితీస్తుంది - దీనిని లేఖనం "మురికి గుడ్డలు" అని పిలుస్తుంది. ("మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను" - యెషయా 64:6).

నేను ఈ వ్యాసంలో పంచుకున్నది చాలా ముఖ్యమైన సత్యం - ఎందుకంటే మన నిత్యత్వపు గమ్యం దానిపై ఆధారపడి ఉంది - కాబట్టి ఈ విషయంలో మనం పొరపడకూడదు. కేవలం మేధోపరమైన నమ్మకంగా ఉన్న తప్పుడు "విశ్వాసం"తో అపవాది మిమ్మల్ని మోసగించనివ్వకండి, అది మనలో క్రీస్తు జీవాన్ని ఉత్పత్తి చేయదు.

వినుటకు చెవులు కలవాడు వినునుగాక. ఆమెన్.