WFTW Body: 

"అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా.. వారి జోలికి పోకుడి అనెను" (మత్తయి 15:12-14).

తల్లిదండ్రులను సన్మానించనక్కరలేదని పరిసయ్యులు చెప్పే బోధను గూర్చి వారిని సరిచేసినప్పుడు వారు అభ్యంతర పడ్డారు. పరిసయ్యులు ఒక పెద్ద సహోదరుని ద్వారా ప్రభువు ఇచ్చు గద్దింపు మాట లేక సరిచేయు ఏ మాటను బట్టియైనా సుళువుగా అభ్యంతర పడతారు. "అభ్యంతరపడుట" నుండి విజయము పొందుట అనేది క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకొనవలసిన పాఠములలో ప్రాథమికమై ఉన్నది. నీవు సరిచేయబడినప్పుడు అభ్యంతర పడుట నుండి పూర్తిగా విడుదల పొందుటకు నీవు వెదకనట్లయితే పరిసయ్యతత్వం నుండి ఎప్పటికైనా విడుదల పొందుదువన్న నిరీక్షణ ఉండదు.

మా సంఘములో, వారు పొందిన దిద్దుబాటును బట్టి అభ్యంతరపడి చివరకు సంఘమును వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు నాకు తెలుసు. ఈ రోజు వారిని చూచినట్లయితే అరణ్యములో తిరుగుతున్నారు. మరియు వారు నిత్యత్వాన్ని కోల్పోయే ప్రతి అవకాశమును కలిగియున్నారు. నీవు పొందిన దిద్దుబాటును బట్టి ఒకవేళ నీవు అభ్యంతర పడినట్లయితే, ఆ పరిసయ్యుల వలె నీవు కూడా నరకమునకు వెళ్ళే మార్గములో ఉన్నావని నిశ్చయముగా చెప్తున్నాను.

యేసుప్రభువు తన శిష్యులతో 'వారి జోలికి పోకుడి' అని చెప్పెను. అభ్యంతర పడిన పరిసయ్యులను తిరిగి సంఘమునకు తీసుకు వచ్చుటకు వారి వెంట మనం వెళ్ళకూడదు. మనం ప్రభువుకు విధేయత చూపించి వారి జోలికి పోకుడదు. ఒకవేళ వారు పశ్చాత్తాపం పొందినట్లయితే, మరల ప్రభువు యొద్దకు సంఘానికి రావచ్చు. లేకపోతే లేదు.

2తిమోతి 3:1-4లో నాలుగు రకాల ప్రేమికుల గూర్చి చెప్పబడింది: తమను తాము ప్రేమించుకొనేవారు, డబ్బును ప్రేమించేవారు, సుఖసంతోషాలను ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు. ఈ నాలుగు రకాల ప్రేమికులలో కేవలం ఒక్కరే సరియైన వారు. నిజమైన క్రైస్తవుడు తప్పక దేవుణ్ణి ప్రేమించేవానిగా ఉండాలి. ఒకవేళ అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాకపోతే, తనను తానే అనగా తన హక్కులు, తన కీర్తి, తన ఘనతను మొదలగునవి ప్రేమించుకొనే వాడవుతాడు.

దానికి ఉన్న ఒక రుజువు మనం సులువుగా అభ్యంతరపడతాము. తనను తాను ప్రేమించుకునే వాడు మాత్రమే అభ్యంతరపడతాడు. తనను ప్రేమించుకోకుండా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, వేరొక వ్యక్తి ఏమి చెప్పినా చెప్పకపోయినా, ఏమి చేసినా చేయకపోయిన అభ్యంతరపడడు.

మనం గాయపడటం వలన అభ్యంతరపడతాము. ఇతరులు మనల్ని చూచుకున్న(మనతో ప్రవర్తించిన) దాన్ని బట్టి, మన గూర్చి మన వెనుక ఎవరో చెప్పిన దాన్ని బట్టి మన స్వీయ జీవితం గాయపడుతుంది. మనల్ని మనం ఎంతగానో ప్రేమించుకుంటాము!.

మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అవిశ్వాసుల గురించా? లేదు! సిలువను ఎత్తుకోవటం, స్వయానికి చనిపోవటం అంటే ఏమిటో ఎప్పటికి అర్థంచేసుకోలేని విశ్వాసులని పిలువబడే వారిని గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే చివరి రోజులలో సిలువను గూర్చి, స్వంత జీవితానికి చనిపోవటం గురించి చాలా తక్కువ బోధ ఉంటుంది. ఈనాడు అనేక సంఘాలలో ఇది దాదాపుగా వినబడుట లేదు, క్రైస్తవ చానల్‍లో అయితే ఎప్పుడూ వినబడలేదు. స్వంత జీవితానికి చనిపోవటం గురించి బోధ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, అనేకమంది క్రైస్తవుల జీవితాలలో స్వయం వర్థిల్లుతుంది. వారిని వారు ప్రేమించుకుంటే యేసుప్రభువును వెంబడించలేరని కూడా వారికి తెలియదు. వారు, నిన్ను నీవు ప్రేమించుకొని యేసుని కూడా ప్రేమించవచ్చని అనుకుంటారు. అభ్యంతరపడి, గాయపరచబడి కనీసం అది పాపం అని కూడా తెలియని అనేకమంది క్రైస్తవులను చూడండి.

నీవు, 'అవును, కాని వారు నాకు ఘోరమైన దాన్ని చేశారు, నాకు గాయపడే హక్కు ఉంది' అని చెప్పవచ్చు. సరియే! నీవు అవిశ్వాసివి! యేసుప్రభువు శిష్యుడవు కావు కాబట్టి నీకు గాయపడే హక్కు ఉంది. నీవు యేసుప్రభువు శిష్యుడవు అయినట్లయితే, నీకు గాయపడే హక్కు లేదు. యేసుప్రభువును దయ్యాల అధిపతి అని పిలిచినప్పుడు, ఆయన ముఖంపై ఉమ్మి వేసినప్పుడు, ఇంకా అనేక చెడు పనులు ఆయనకు చేసినప్పుడు, ఆయన ఎప్పుడు గాయపడలేదు.

యేసుప్రభువు శిష్యునిగా ఉండటం అంటే ఏమిటి? చివరి రోజులలో, చాలా, చాలా తక్కువ మంది క్రైస్తవులు సిలువనెత్తుకొని ఆయనను వెంబడిస్తారు. నిజమైన క్రైస్తవునిగా ఉండుట ఎంతో కష్టం. ఎందుకంటే మేము క్రైస్తవులమని, ఆత్మతో నింపబడ్డామని, బాషలతో మాట్లాడుతున్నామని చెప్పుకొని గాయపడే, అభ్యంతరపడే ప్రజల మధ్య నివసిస్తున్నాము. వారి పేరు దుమ్ములోకి యీడ్చబడినదని కలవరపడే ప్రజల మధ్య ఉన్నాము.

"పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక" అని ప్రార్థించమని యేసుప్రభువు మనకు నేర్పించారు. నీ పేరు గురించి మర్చిపో అని దాని అర్థం!. కాని చివరి రోజులలో, క్రైస్తవులని పిలుచుకునే వారు కూడా వారి పేరు గూర్చి ఎంతో శ్రద్ధకలిగి ఉంటారు. ఉదాహరణగా, యేసుప్రభువు పేరు ఈ ప్రపంచంలో ఎంతగా అవమానపరచబడుతుందో నీకు తెలుసా? అయినప్పటికీ, క్రైస్తవులని పిలవబడేవారిని అది ఏ మాత్రము కలవరపెట్టదు. కాని ఒకేఒక్క సారి వారి పేరు బురదలోకి యీడ్చబడితే, అది వారిని నిజంగా కలవరపెడుతుంది. వారి చిన్న కుమార్తె పేరు దుమ్ములోకి యీడ్చబడితే, అది వారిని విపరీతంగా కలవరపెడుతుంది. కాని దేశమంతా యేసునామం అవమాన పరచబడనివ్వండి అది ఎంత మాత్రం వారిని బాధపెట్టదు. అటువంటి వారు యేసుప్రభువు శిష్యులని మీరనుకుంటున్నారా? లేదు! ఎంత మాత్రం కాదు!. కాని వారు సంఘాలలోనే కూర్చుంటారు. తిరిగి జన్మించామని చెప్పుకుంటారు. ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారు.

ఇది అపవాది చేసిన అద్భుతమైన పని - తలనుండి అరికాలి వరకు, పైనుండి క్రింది వరకు తమను తాము ప్రేమించుకుంటు, ఇంకా తాము యేసుప్రభువు శిష్యులమని అనుకునే విధంగా వారిని మోసం చేశాడు.

నేను కేవలం మిమ్మల్ని హెచ్చరించగలను. నీకు నీవుగా విడుదల పొందాలని కోరుకొనకపోతే, స్వయంను ప్రేమించుటనుండి ఎవ్వరు నిన్ను మార్చలేరు.