పెర్గెము ఎంత చెడ్డ పట్టణమంటే సాతాను తన భూలోక ప్రధాన కార్యాలయమును అక్కడ కలిగియుండెనని ప్రభువు చెప్పెను. ఇది 13వ వచనములో రెండు మారులు సూచించబడినది. అయితే సరిగ్గా ఈ పట్టణము మధ్యనే ప్రభువు తన సంఘము నుంచెను.
"మీరెక్కడ కాపురమున్నారో నేనెరుగుదును" అని ప్రభువు వారితో చెప్పెను. మనము ఎక్కడ నివసించుచున్నామో, ఎటువంటి పరిస్థితులలో నివసించుచున్నామో ఆయనకు ఖచ్చితముగా తెలియును. మనము నివసించు ప్రదేశములో సాతాను తన భూలోక సింహాసనమును కలిగియున్నప్పటికీ ఆయన మనలను పవిత్రులనుగాను, జయించువారినిగాను ఉంచగలడు. ఆత్మ ఖడ్గముతో మనముకూడా జయించగలము.
ఏ దీపస్థంభము కూడా ప్రకాశించుటకు పరిసరాలు చాలా చీకటిగా ఉన్నవని ఎన్నడూ ఫిర్యాదు చేయదు. ఒక దీపస్థంభము యొక్క ప్రకాశముకు దాని పరిసరాలతో ఎటువంటి సంబంధము లేదు. దాని కాంతి కేవలము దానిలోనున్న నూనెపైన ఆధారపడియుండును.
ఏ స్థానిక సంఘముతోనైనా ఆవిధముగానే ఉండును. పరిసరాలు చెడుగా ఉండవచ్చు. సాతానుకు ఆ పట్టణములో సింహాసనముండవచ్చు. కాని ఒక సంఘము పరిశుద్ధాత్మ అనెడి నూనెతో నింపబడినయెడల, దాని కాంతి బాగా ప్రకాశించును. నిజానికి, పరిసరాలు చీకటిగా ఉన్న కొలదీ, అటువంటి పరిసరాలలో ఏ కాంతియైన ఎక్కువ ప్రకాశవంతముగా కనబడును! నక్షత్రములు పగటి పూటకాక, రాత్రిపూటయే కనబడును.
ఆయన యందలి విశ్వాసమును హింసించబడిన సమయాలలో కూడ విసర్జించనందుకు, తన నామమును గట్టిగా చేపట్టినందుకు ప్రభువు ఈ సంఘమును మెచ్చుకొనెను. తన విశ్వాసము నిమిత్తము తన ప్రాణమునర్పించిన అంతిపయను నమ్మకమైన సాక్షిగా ఆయన ప్రత్యేకముగా పేర్కొనెను.
దేవుని సత్యముకొరకు ఒంటరిగా నిలబడవలసివచ్చినప్పటికీ అంతిప నిలబడెను. అతడు మనుష్యులను సంతోషపెట్టుటకు చూడని ఒక ధృడ నమ్మకము కలిగిన వ్యక్తి. దేవుని ఎరిగినవారు తాము నమ్మినవాటిని ఎంత మంది నమ్ముచున్నారో తెలుసుకొనుటకు తమ చుట్టూ చూడవలసిన అవసరము లేదు. అవసరమైతే, లోకమంతటిలో ఉన్నవారందరికీ వ్యతిరేకముగా ప్రభువుకొరకు నిలబడుటకు వారు సిద్ధముగానుందురు. అంతిప అటువంటి వ్యక్తి దాని ఫలితముగా అతడు చంపబడెను.
అతడు మనుష్యులను సంతోషపెట్టువాడైయుండినయెడల, అతడు మరణమును తప్పించుకొని యుండవచ్చును. దేవుడు బయలుపరచిన సత్యము కొరకు రాజీపడకుండా నిలబడుటచేత అతడు చంపబడెను. ప్రజలు బహుశా అతనిని సంకుచితమైన మనస్సు గలవాడని, మొండివాడని, ఇతరులతో కలవనివాడని, మతి చెలించిన వాడని అనియుండవచ్చును. కాని దానిని అతడు పట్టించుకొనలేదు. అతడు మాత్రము తన ప్రభువు నమ్మకముగా, పాపమునకు లోకానుసారతకు, సర్దుబాటుకు, దేవుని వాక్యము పట్ల అవిధేయతకు, అపవాదికి వ్యతిరేకముగా నిలబడెను. సాతాను రాజ్యమునకు ముప్పుగా ఉన్న మనుష్యుడు ఇక్కడొకడుండెను.
బహుశా అంతిప పెర్గెములో ఉన్నందుకే సాతాను తన సింహాసనము అక్కడుంచుటకు నిర్ణయించెనేమో. సాతాను కూడా అతడంటే భయపడినాడంటే అంతిప ఎటువంటి వ్యక్తి అయ్యుండెనో!
దేవునికి అంతిప వంటి వ్యక్తులు ప్రపంచములోని ప్రతి ప్రదేశములో కావలెను. మనము నమ్మినదాని కొరకు వెలచెల్లించవలసిన సమయమొచ్చుచున్నది. మన చుట్టూఉన్న బబులోను క్రైస్తత్వమంతాకూడా రాజీపడి క్రీస్తువిరోధికి మ్రొక్కును. ఆ రోజున మనము అంతిపవలె నిలకడగా నిలబడి యుందుమా? లేక మన జీవితమును కాపాడుకొనుటకు సాతానుకు మోకాలు వంచెదమా? దేవుని సత్యము నిమిత్తము మన జీవితాలు పొగొట్టుకొనుట తగినదే అని మనము ఒప్పించబడ్డామా?
ఈ రోజున దేవుడు మనలను చిన్న శోధనల ద్వారా పరీక్షించుచున్నాడు. మనము ఈ చిన్న శోధనలలో నమ్మకస్తులుగా ఉండినప్పుడే భవిష్యత్తులో రానున్న పెద్ద శోధనలలో నమ్మకస్థులుగా ఉండగలము. సాతాను తన రాజ్యమునకు నిన్నెంత ముప్పుగా ఎంచవలెనంటే అతడు తన సింహాసనమును నీవు నివసించు ప్రదేశమునకు మార్చునంత.
విషాదకరమైన విషయమేమిటంటే అంతిప చనిపోయిన తరువాత పెర్గెములో ఉన్న సంఘము ఆత్మీయముగా దిగజారిపోయెను. అంతిప బ్రతికియున్నప్పుడు అతడు బహుశా ఆ సంఘము యొక్క దూత అయియుండవచ్చును. అతడు చనిపోయిన తరువాత, వేరొకరు అతని స్థానమును తీసుకొనిరి మరియు ఆ సంఘము దిగజారిపోయెను. ఇది అనేక సంఘముల యొక్క విషాదకరమైన చరిత్ర.